14, ఆగస్టు 2026, శుక్రవారం

:: కృష్ణుడు భగవద్గీతను అర్జునిడికే ఎందుకు చెప్పాడు? ::     

 కురుక్షేత్ర సంగ్రామానికి ముందు, ఇరుపక్షాల సైన్యాల మధ్య రథాన్ని నిలిపి, సొంత బంధువులను చంపడానికి మనస్కరించక శోకసముద్రంలో మునిగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. అయితే, యుద్ధరంగంలో భీష్ముడు, ద్రోణుడు, యుధిష్ఠిరుడు వంటి ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ, కృష్ణుడు పరమ పవిత్రమైన ఈ గీతోపదేశాన్ని అర్జునుడికే ఎందుకు చేశాడనేది అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న.

    దీనికి ప్రధానమైన కారణాలను తెలుసుకుందాం. 

    యుద్ధంలో మోహంలో పడిన అర్జునుడు తన జ్ఞానమంతా కోల్పోయి, శ్రీకృష్ణుడిని కేవలం తన బావగానో, మిత్రుడిగానే కాక జగద్గురువుగా భావించి పూర్తిగా శరణు వేడాడు.  "నేను నీ శిష్యుడను, నిన్నే శరణువేడుతున్నాను, నాకు శ్రేయస్కరమైన మార్గాన్ని బోధించు" అని ఆత్మసమర్పణ చేసుకున్నాడు. ఒక జ్ఞానాన్ని గ్రహించడానికి కావలసిన ప్రాథమిక అర్హత 'వినయం మరియు పూర్ణ శరణాగతి'. అర్జునుడిలో అది పరిపూర్ణంగా ఉంది.

    భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడే స్వయంగా ఈ రహస్యాన్ని బయటపెట్టాడు. "నువ్వు నా ప్రియమైన మిత్రుడివి, పరమ భక్తుడివి. అందుకే అంత్యంత గూఢమైన, ఉత్తమమైన ఈ పురాతన యోగాన్ని నీకు ఉపదేశిస్తున్నాను" అని స్పష్టం చేశాడు. భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి పాండిత్యం కంటే 'నిష్కల్మషమైన భక్తి' ముఖ్యం.

    గీతలోని అత్యంత గూఢమైన రాజవిద్యను బోధించే ముందు కృష్ణుడు అర్జునుడిని నీవు  అసూయ లేనివాడవు గనుక నీకు ఈ పరమ రహస్యాన్ని చెప్తున్నానని అన్నాడు,  ఇతరుల  గుణాలను చూసి ఓర్వలేని మనస్తత్వం అర్జునుడికి లేదు. గురువు ఇచ్చే ఉపదేశాన్ని శంకించకుండా, యథాతథంగా గ్రహించే పవిత్రమైన హృదయం అతనిది.

    అర్జునుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, సంసార బంధాల్లో, కర్తవ్య సమ్మోహంలో చిక్కుకునే సగటు మానవుడికి ప్రతిరూపం . అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని, రాబోయే తరాల మానవాళి అంతటికీ జీవిత కర్తవ్యాన్ని, కర్మయోగాన్ని బోధించడమే భగవంతుని సంకల్పం.

    అర్జునుడిలోని పట్టుదల, ధర్మనిష్ఠ, వినయం, ఉపాసనా బలమే ఆయనను భగవద్గీత అనే అమృత జ్ఞానాన్ని స్వీకరించడానికి అత్యంత అర్హుడిగా చేశాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  ద్రౌపది నవ్వు       శ్రీమహాభారత కథాగమనమును మలుపు త్రిప్పిన సంఘటనలందు " ద్రౌపది నవ్వు" ప్రముఖమైనదిగా చెప్పబడుతుంది. మన కెదురుగ ను...