శకుని పాచికలు
తెలుగు భాషలో "శకుని పాచికలు" అనే నానుడి అత్యంత ప్రసిద్ధమైనది. ఈ మాట వినగానే సామాన్య పాఠకునికి ముందుగా స్ఫురించేది మహాభారత ఇతిహాసంలోని శకుని పాత్ర. బాహ్య దృశ్యానికి అది కేవలం ఒక పాచికల ఆటే అయినప్పటికీ, ఆ క్రీడ వెనుక దాగి ఉన్నది ఒక మహత్తరమైన కుట్ర, ప్రతీకార పన్నాగము. అందుకే లోకవ్యవహారంలో ఎవరైనా పైన ఒక రకమైన ఆత్మీయతను నటిస్తూ, లోపల అనర్థకరమైన ఉద్దేశంతో వ్యూహాలు పన్నుతుంటే, దానిని "శకుని పాచికల వ్యవహారము" అని అభివర్ణిస్తుంటారు.
గాంధార రాజైన శకుని, గాంధారికి సోదరుడు కావడం చేత కౌరవులకు మేనమామ. దుర్యోధనునికి పాండవుల పట్ల ఉన్న ద్వేషాగ్నిని పదేపదే రగిల్చి పోషించినది శకునే. పాండవుల ధర్మబలాన్ని, పరాక్రమాన్ని ప్రత్యక్ష యుద్ధంలో జయించడం సులభసాధ్యం కాదని గ్రహించిన అతడు, వారి స్వభావాన్నే బలహీనతగా మలచుకుని దెబ్బతీయాలని తలంచాడు. ధర్మరాజుకు ఉన్న జూదప్రియత్వాన్ని ఆసరాగా చేసుకుని, దుర్యోధనుని ప్రోత్సహించి మాయాజూదానికి నాంది పలికాడు. హస్తినాపుర సభలో ధర్మరాజు పక్షాన పందెములు కాచగా, దుర్యోధనుని తరఫున శకుని పాచికలు వేయడానికి సిద్ధమయ్యాడు. ఆ సభలోనే పాండవుల భాగ్యరేఖను తిరగరాసిన కపట క్రీడ ప్రారంభమైంది.
పాచికల ఆట ముసుగులో శకుని తన నిపుణతను, కపట కౌశలాన్ని ప్రదర్శిస్తూ ఆటను తనకు అనుకూలంగా తిప్పుకున్నాడు. ధర్మరాజు వరుసగా తన సంపదను, రాజ్యాన్ని, సోదరులను, చివరికి తననూ, ధర్మపత్నియైన ద్రౌపదిని కూడా పణంగా పెట్టి ఓడిపోయేలా చేశాడు. ఇక్కడ "శకుని పాచికలు" అనే నానుడి యొక్క నిజమైన అంతరార్థాన్ని సునిశితంగా పరిశీలించవలసి ఉంది. ఇది కేవలం మహాభారత ఘట్టానికి పరిమితమైన నిరూపణ కాదు; వ్యాపార, రాజకీయ, సామాజిక రంగా లలో ఒక కార్యం పైన అత్యంత సహజంగా, ఉపకారప్రదంగా కనిపిస్తున్నప్పటికీ, దాని వెనుక ఎదుటివారిని మోసగించే కుతంత్రం కానీ, స్వార్థపూరితమైన పన్నాగం కానీ ఉంటే దానిని శకుని పాచికలతో పోల్చడం పరిపాటి.
మన నిత్య జీవితంలోనూ ఇటువంటి సందర్భాలు తరచూ ఎదురవుతుంటాయి. ఒక వ్యక్తి మనతో అత్యంత మైత్రితో, ఆత్మీయంగా సంభాషిస్తూ మనకు మేలు చేస్తున్నట్లుగానే నటిస్తుంటాడు. కాని కాలక్రమేణా ఆ లాలన వెనుక అతని వ్యక్తిగత స్వార్థం, మనల్ని మోసగించే ఉద్దేశం దాగి ఉన్నాయని బోధపడతాయి. అటువంటి తరుణంలోనే "ముందు నుంచీ శకుని పాచికలు వేస్తున్నాడన్నమాట" అని లోకం వ్యాఖ్యానిస్తుంది. ఎదుటివారి ముఖాముఖి మాటలనే కాక, వారి అంతర్గత ఉద్దేశాలను కూలంకషంగా గమనించాలనే హెచ్చరికను ఈ నానుడి మనకు అందిస్తోంది. ప్రతి ఆహ్వానం వెనుక స్నేహమే ఉండదని, ప్రతి చిరునవ్వు వెనుక అనురాగమే ఉండదని, తెలియని మాయాజూదంలో మనమూ ఒక పావుగా మారే ప్రమాదం ఉందనే వివేకాన్ని ఇది నొక్కిచెబుతుంది.
అదే సమయంలో మహాభారతేతిహాసం మనకు మరొక శాశ్వతమైన పరమసత్యాన్ని బోధిస్తోంది. కపటత్వంతోనూ, కుట్రలతోనూ సాధించే విజయాలకు ఆయుష్షు ఉండదు; అవి తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చినా అంతిమంగా వినాశనాన్నే మిగుల్చుతాయి. శకుని వేసిన పాచికలు ఆ నాడు కౌరవులకు తాత్కాలిక విజయాన్ని అందించినట్లు కనిపించినప్పటికీ, చివరికి ఆ మాయాజూదమే కురువంశ సర్వనాశనానికి ప్రధాన కారణమైంది. కాబట్టి, "శకుని పాచికలు" అనే ప్రయోగం కేవలం ఒక వ్యక్తి పేరు మీదుగా వచ్చిన నానుడి మాత్రమే కాదు. వంచనతో వేసే ఎత్తులకు, ఎదుటివారిని అజ్ఞానంలో ముంచి అగాధంలోకి నెట్టే పన్నాగాలకు, క్రీడ వంటి బాహ్య సౌమ్యత వెనుక దాగున్న ద్రోహ బుద్ధికి ఇది నిత్య ప్రతీక. పాచికలు పరిమాణంలో చిన్నవే కావచ్చు, కాని వాటి వెనుక ఉన్న ఆలోచన దుష్టమైనదైతే, దాని పరిణామాలు ఎంతటి మహానాశనమునకు దారితీస్తాయో తెలియజెప్పడమే ఈ నానుడిలోని సందేశం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి