:: ఆకలికవిత్వం ::
కవిత్వమంటే చెవికోసుకునే భోజరాజు పరిపాలనలో కవిపండితులకు తప్ప మరెవరికీ రాజాదరణ లభించేది కాదు. వేదవేదాంగాలు వల్లెవేసినవారికి కూడా తిండి దొరకని పరిస్థితి ఏర్పడింది. అందుచేత కొందరు వేదాధ్యయనపరులైన ఛాందసబ్రాహ్మణులు, ఎలాగైనా ఒక శ్లోకం అల్లి, భోజరాజుకు నివేదించి, కొంత బహుమానం సంపాదించి పొట్టపోసుకుందామని నిశ్చయించుకున్నారు. ఎందుకంటే భోజరాజు దగ్గరికి యాచనకు వెళ్ళినా కవిత్వంతోనే యాచించాలి.
ఒకరోజున ఆబ్రాహ్మణులు ధారానగరంలోని భువనేశ్వరీ ఆలయానికి వెళ్ళి శ్లోకం అల్లటానికి కూచున్నారు. పంక్తికి ఎనిమిదేసి అక్షరాల చొప్పున నాలుగు పంక్తులు అల్లగలిగితే ఒక శ్లోకమవుతుంది. ఆ సంగతి వాళ్ళకు తెలుసు. కాని విషయం ఎంత ఆలోచించినా తట్టలేదు. వాళ్ళను బాధిస్తున్నదల్లా ఒకటే సమస్య. అది భోజనం సమస్య.
" భోజనం దేహి రాజేంద్ర " అని అడుగుదామనుకున్నాడు ఒక బ్రాహ్మణుడు. " భేష్, బాగుంది " అన్నారు మిగిలినవాళ్ళు. శ్లోకంలో ఒకపాదం పూర్తి అయింది కూడానూ.
ఇంకా మూడు పాదాలు పూర్తికావాలి.
" రాజుగార్ని భోజనం పెట్టమని అడిగేటప్పుడు, నెయ్యి, పప్పు వేసి పెట్టమనటం ఉచితంగా ఉంటుందికదా! ' ఘృతసూప సమన్వితం ' అని చేర్చుదాం, " అన్నాడు యింకో బ్రాహ్మణుడు.
" భేష్! చాలా బాగుంది, " అన్నారు మిగతావాళ్ళు.
" భోజనం దేహి రాజేంద్ర
ఘృత సూప సమన్వితం "
సగం శ్లోకం అయిపోయింది. ఇంకా సగం ఉంది. కాని, పాపం, బ్రాహ్మణులకు ఇంకేమడగాలో తెలియలేదు. వాళ్ళు రాజుగారిని అడగదలచిన పప్పుకూడు రెండు పాదాల్లోనే అడిగేశారు. ఇంకా మిగిలివున్న రెండుపాదాలు ఎలా పూర్తి చెయ్యాలి? అందులో రాజుని ఏమడిగేట్టు?
ఈ సమస్య తేలక బ్రాహ్మణులు తికమక పడుతున్న సమయంలో మహాకవి కాళిదాసు అక్కడికి వచ్చాడు. శ్లోక పాదాలు రెండు కుదిరి మరి రెండు కుదరక నానా అగచాట్లూ పడే బ్రాహ్మణులను చూశాడు. కాళిదాసుకు వాళ్ళను చూస్తే జాలివేసింది. వాళ్ళు అల్లిన కవిత్వానికి భోజుడు కానీ కూడా యివ్వడు.
" అయ్యా! మీకభ్యంతరం లేకపోతే మిగిలిన శ్లోక పాదాలు నేను పూర్తిచేస్తాను. పూర్తి శ్లోకం భోజరాజుకి సమర్పించి ఏమైనా దొరికితే పుచ్చుకోండి, " అన్నాడు కాళిదాసు.
" అంతకంటేనా, బాబూ! సమయానికి నీవు దేవుడల్లే యిక్కడికి వచ్చావు. మిగిలిన రెండు పాదాలూ రాసిపెట్టు. నీ మేలు చెప్పుకుంటాం, " అన్నారు బ్రాహ్మణులు.
" భోజరాజును మీరు నెయ్యి పప్పులతో సహా భోజనం అడగనే అడిగారు. శరత్కాలపు చంద్రుని వెన్నెలవలె తెల్లనైన గేదె పెరుగుతోకూడా భోజనం పెట్టమని అడగండి, " అన్నాడు కాళిదాసు.
బ్రాహ్మణులు గేదెపెరుగు మాట చెవిని పడగానే పరమానందభరితులై, " ఏదీ? ఎలా? " అన్నారు ఆత్రంగా.
" మాహిషంచ శరచ్చంద్ర
చంద్రికా ధవళం దధి " .
- అని కాళిదాసు వారి శ్లోకాన్ని పూర్తిచేశాడు. అందులోగల కవిత్వం వారికి అర్థం కాకపోయినా, శ్లోకం పూర్తయి, తమ పని ముగిసిందన్న సంతోషంలో ఆబ్రాహ్మణులు కాళిదాసుకు ధన్యవాదాలు తెలిపి అక్కడినుంచి వెళ్ళిపోయారు.
వారు మర్నాడు రాజసభకు వెళ్ళారు. అతికష్టంమీద రాజదర్శనం లభించింది. ఆ సమయంలో భోజరాజు కవిపండితులమధ్య సుఖాశీనుడై ఉన్నాడు. మంత్రిసామంతులతో, ప్రజలతో సభ కిక్కిరిసివున్నది.
పండితులు భోజరాజుకు ఎదురుగా నిలబడి కంఠస్థం చేసిన శ్లోకం -
" భోజనం దేహి రాజేంద్ర
ఘృతసూప సమన్వితం
మాహిషంచ శరచ్చంద్ర
చంద్రికాధవళం దధి "
- అని చదివారు.
ఈ శ్లోకం వింటూనే భోజరాజు, " యీ శ్లోకం మొదటి రెండు పాదాలు రాసిన వారికి కవిత్వం రాదు. అయితే, మిగిలిన రెండు పాదాలూ రాసినది కాళిదాసు తప్ప మరొకరై ఉండరు! ఆ రెండు పాదాలకు అక్షరలక్షలిచ్చి ఈ ఛాందసపు బ్రాహ్మణులను పంపివేయండి " అన్నాడు.
బ్రాహ్మణులు నిర్ఘాంతపోయి సభచుట్టూ కలయచూసేసరికి వారికి కాళిదాసు కనిపించాడు. ఆయనే తమకు భిక్ష పెట్టాడని తెలుసుకుని, దొరికిన సొమ్ము తీసుకుని తమ దారిన వెళ్ళిపోయారు.