:: వాతాపిగణపతి ::
పాండవులు నారదుడు చెప్పిన విధంగానే విఘ్నేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో అర్చిస్తూ, ధౌమ్యుడు పురోహితుడుగా గణేశవ్రతాన్ని చేసి, మారు వేషాలతో విరాటురాజు కొలువులో అజ్ఞాతవాసం జయప్రదంగా ముగించారు.
కృష్ణుని అండతో పాండవులు కౌరవులతో యుద్ధంచేసి విజయం పొందారు. హస్తినాపురంలో ధర్మరాజు పట్టాభిషిక్తుడై రాజ్యపాలన చేస్తూ, అశ్వమేధ యాగాన్ని చేయడానికి తలపెట్టాడు.
యాగాశ్వం వెంట సైన్యసమేతంగా అర్జునుడు బయలుదేరాడు. పాండవుల పురోహితుడైన ధౌమ్యుడు కూడా అతనితో ఉన్నాడు.
యాగాశ్వం అనేక రాజ్యాల మీదుగా వెళ్ళింది. రాజులనేకులు ధర్మరాజు పాలనకు వినయ విధేయతలు ప్రకటించారు. గుర్రం వెడుతూ వెడుతూ ఓ ప్రాంతంలో ఆగిపోయి మరి ముందడుగు వేయలేదు. అర్జునుడు ఆశ్చర్యపోయి ధౌమ్యుణ్ణి ఎందుకిలా జరిగిందని అడిగాడు. ధౌమ్యుడు 'చెబుతా పద' అన్నట్లు చూసి దారితీశాడు. కొంచెం దూరం వెళ్ళగా ఒక మహానగరం కనిపించింది. ఆ నగరం మధ్యలో బ్రహ్మాండమైన విఘ్నేశ్వరుని విగ్రహం ఉన్నది. ఒక పెద్ద కొండరాతిని మలచిన శిల్పం అది. అత్యంత కళాశోభితమై విరాజిల్లుతున్నది.
" అర్జునా! విఘ్నేశ్వర దేవుణ్ణి అర్చించి ప్రణామములు అర్పించు. తరువాత వాతాపి గణపతిగా పేరుపొందిన ఈ దేవుని గురించి, వాతాపి నగరం గురించి సవిస్తరంగా చెబుతాను " అని అన్నాడు ధౌమ్యుడు.
అర్జునుడు పూజాక్రమం జరిపి, వాతాపి గణపతిని భక్తి ప్రపత్తులతో ఆరాధించాక, ధౌమ్యుడు వాతాపి నగరంలోకి దారితీశాడు. అతని వెనుక అర్జునుడు వెళ్ళి నగరాన్ని చూశాడు. ఒకప్పుడు ఆ నగరం మహా వైభవంతో వెలిగిన ఛాయలు గోచరించాయి. కాని, ఇప్పుడు నగరం ఆలనా పాలనా లేక బీడుపడి ఉన్నది. లెక్కకురాని కొద్దిమంది పౌరులు కనిపించారు. అర్జునుడి రాకకు వారు సంతోషంతో స్వాగతం పలికి, పాలనా వ్యవస్థ ఏర్పరచి నగరాన్ని పునరుద్ధరణ చేయమని ప్రార్థించారు.
" అర్జునా! ఇది వాతాపి నగరం. నగరం మధ్యలో విఘ్నేశ్వరుడు అగస్త్యమహామునిచే నెలకొల్పబడిన అద్భుత శిల్పం. ఇది వాతాపి గణపతి క్షేత్రంగా పిలువబడుతున్నది. విశేషాలు చెబుతాను, విను " అంటూ ధౌమ్యుడు చెప్పడం ప్రారంభించాడు.
గంగ, కవేరుడు అనే రాజర్షి కమండలువులో పడి కావేరిగా రూపుధరించి, అతని కుమార్తెగా ఆశ్రమంలో పెరిగింది. అగస్త్యుడు ఆ కన్యను చూసి వివాహం చేసుకుంటానని కవేరుడితో చెప్పాడు.
కవేరుడు తన సమ్మతిని తెలిపి, " అగస్త్యా! కావేరి అభిమతం కూడా తెలుసుకుంటే మంచిదికదా! " అన్నాడు.
అగస్త్యుడు ఆశ్రమంలో కావేరితో చనువుగా ఉంటూ ఉండగా ఒకనాడు కావేరి అతనితో సహ్యపర్వతం మీద వనవిహారం చేయాలని ఉందని చెప్పింది. అగస్త్యుడు కావేరిని తీసుకువెళ్ళాడు.
వనవిహారం చేస్తూ ఒక చిన్న మడుగులో తామరపువ్వును చూసి ముచ్చటపడుతూ, కావేరి చరచరా వెళ్ళి, దానిని తీసుకోవడానికి మడుగులో అడుగు పెట్టింది. నీటి తాకిడితో ఆమె అమాంతంగా జలరాశిగా మారిపోయి, వరదలా పొంగి సహ్యపర్వత శిఖరాలనుండి జలజలా జారుతూ కావేరి నదిగా పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహించింది.
అగస్త్యుడు కావేరినే తలచుకుంటూ చాలాకాలం బ్రహ్మచారిగానే ఉండిపోయి, గొప్ప తపస్సు చేసి ఋషిశ్రేష్ఠుడు అనిపించుకున్నాడు. ఒకనాడతడు అరణ్యంలో చెట్టుకొమ్మకు తలక్రిందులుగా వ్రేలాడుతున్న పితృదేవతలను చూసి, ఎవరు మీరు? ఎందుకిలా ఉన్నారని అడిగాడు.
వారు నిట్టూర్పులు విడుస్తూ " మా వంశీకుడు అగస్త్యుడు ఒక ఇంటివాడై సంతానం కనేవరకూ ఇలాగే ఉంటాము " అని చెప్పారు.
అగస్త్యుడు తన దివ్యదృష్టితో విదర్భరాజుకు కావేరి అంశతో కుమార్తె పుట్టి, లోపాముద్ర పేరుతో పెరిగి యుక్తవయస్కురాలై ఉన్నట్లు తెలుసుకుని వెళ్ళి, ఆమెను తనకిచ్చి వివాహం చేయవలసిందని విదర్భరాజుని కోరాడు.
కందమూలాలు తింటూ నారకట్టుకు తిరిగే మునికి సుకుమారి రాకుమారిని ఎలా యివ్వడం? యివ్వకపోతే, శపిస్తాడేమో అని రాజు సంశయపడుతూ వ్యాకులచిత్తుడై ఉండగా, లోపాముద్ర అగస్త్యుడితో నిరభ్యంతరంగా వెంటనే తన వివాహం జరిపించమని చెప్పింది.
విదర్భరాజు ఆవిధంగానే లోపాముద్రను అగస్త్యమహర్షికిచ్చి అతనితో పంపాడు.
అగస్త్యుడు లోపాముద్రతో తన ఆశ్రమానికి వచ్చాక ఒకనాడు " నా పితృ దేవతలను పున్నామ నరకం నుండి తరింపజేయడానికి నీవలన సంతానం కనాలని నిన్ను వివాహం చేసుకున్నాను " అని లోపాముద్రతో అన్నాడు.
అప్పుడామె తన ముతక చీర చూసుకొని విచారిస్తూ " వివాహం చేసుకోగానే సరా? నేను రాజపుత్రికగా పుట్టి పెరిగిన దానను. నాకు తగ్గ మంచి బట్టలు, రత్నాభరణాలు సమకూర్చడం నీ విధి. అందుకు కావలసినంత ధనం సంపాదించుకు రావడం నీ కర్తవ్యం " అన్నది.
అగస్త్యుడు భార్య మాటల్లోని వాస్తవాన్ని గ్రహించి, ధనసేకరణకు బయలుదేరాడు. అతడు చాలామంది రాజుల వద్దకు వెళ్ళి , రాజ్యపాలనకు సరిపడగా మిగిలిన ధనాన్ని తనకిమ్మన్నాడు. ఏ రాజూ కూడా మిగులు చెప్పలేదు సరికదా, ఎంతో లోటు పడుతూన్నట్లుగా చెబుతూ, తమకుకూడా ఏమైనా ధనలాభం కలిగే మార్గం చూపమని వేడుకున్నారు.
అగస్త్యుడు హతాశుడై అరణ్యమార్గంలో వెడుతూ, ఒకచోట ఉన్నతమైన ఒక మహాశిలను చూశాడు. ఆ రాయి లంబోదరుడైన విఘ్నేశ్వరుని పోలినట్టుగా కనిపించింది. ఆ మహాశిలనే విఘ్నేశ్వరుడిగా భావిస్తూ, అగస్త్యుడు నమస్కరించి " గణపతీ! తపస్సు తప్పితే రెండో ధ్యాస లేనివాడను. ధనసంపాదనకు విద్యలేవీ నాకు తెలియవు. ధనం నాకు ఎలాగ లభిస్తుంది? నీవైనా నాకు ఒకదారి చూపవా? " అంటూ వేడుకొన్నాడు.
అప్పుడు, " ఏమిటి మహర్షీ! శిలతో మంతనాలాడుతున్నావు? " అంటూ విఘ్నేశ్వరుడు సాక్షాత్కరించాడు.
అగస్త్యుడు ప్రణమిల్లి, మ్రొక్కి తన మొర వినిపించాడు.
విఘ్నేశ్వరుడు " అగస్త్యా! రావలసిన చోటుకే వచ్చావు. రావలసిన వాడివే వచ్చావు. కొంచెం సేపట్లో ఇల్వలుడు నిన్ను భోజనానికి పిలుస్తాడు. వెళ్ళు. ఇల్వలుడి దగ్గర అంతులేని ధనరాశి మూలుగుతూ ఉంది. నీవలన కాగల కార్యంకూడా ఉంది " అన్నాడు.
అగస్త్యుడు, " గణపతీ! ఈ మహాశిలలో నీ పోలికలు నాకు కనిపించాయి. అందుచేత ఈ శిల అపూర్వ గణపతి విగ్రహంగా రూపొందాలనే నా కోరికగూడా సఫలం చెయ్యి " అని కోరాడు.
విఘ్నేశ్వరుడు " అలాగే అవుతుందిలే " అని చెప్పి అంతర్ధానమయ్యాడు.
అగస్త్యుడు చాలా అలసి ఉన్నాడు. ఆకలిగా కూడా ఉంది. ఆయాసంగా మహాశిలను ఆనుకొని కూర్చొని అలా చూస్తూండగా, అతిథులను వెంటబెట్టుకొని వస్తున్న ఇల్వలుడు కనిపించాడు. అగస్త్యుడికి విషయమంతా తృటిలో తెలిసిపోయింది.
ఆ అరణ్యంలో వాతాపి, ఇల్వలుడు అనే గొప్ప మాయావులైన రాక్షసులు ఋషులను, యాత్రికులను, బాటసారులను చంపి, ధనాన్ని దోచుకొని, పెద్ద రాతిదుర్గంలో పోగుచేస్తున్నారు. ధర్మం మూర్తీభవించిన మహారాజు వేషంలో ఇల్వలుడు ఆతిథ్యానికి తీసుకువచ్చిన వారికి వినయ విధేయతలతో మర్యాదలు, కుశల ప్రశ్నలు జరుపుతున్న సమయంలో, వాతాపి బాగా కొవ్వుపట్టిన మేకపోతుగా మారతాడు. ఇల్వలుడు ఆ మేకను తెచ్చి చంపి, వండించి మేకమాంసంతో భోజనం పెడతాడు. అతిధులు భుక్తాయాసంతో విశ్రమిస్తున్న సమయంలో ఇల్వలుడు గొంతెత్తి, " వాతాపీ! " అని పిలుస్తాడు. వాతాపి అతిథుల పొట్టలను చీల్చుకొని వస్తాడు. ఆ దుర్మార్గులు చేస్తున్న పనికి అగస్త్యుడి ఒళ్ళు మండిపోయింది.
ఇల్వలుడు అగస్త్యుణ్ణి సమీపించి, వీడెవడో గొప్ప ఋషిలాగా ఉన్నాడు. ఇలాంటి వాళ్ళను ఎంతమందిని హతమార్చితే అంతమంచిది అని అనుకుంటూ సవినయంగా భోజనానికి ఆహ్వానించాడు.
అగస్త్యుడు ఆకలితో అలమటించి పోతున్న వాడిలాగా పరమానందం కనబరచి, " ఓ ధర్మదాతా! నీలాంటి వాళ్ళుండబట్టే ఈ భూమండలం అనంతాకాశంలో యిలా నిలిచి ఉంది. పద " అంటూ ఇల్వలుడి వెంట రాతిదుర్గానికి వెళ్ళి, " ఓ అన్నదాతా! చాలారోజులుగా తిండి లేదు. ఆకలి దహించేస్తున్నది. వెయ్యి యజ్ఞాలను జరిపించిన వాడిని కావటం వల్ల, మేకమాంసం తప్పితే మరేదీ అరగని రోగం ఒకటి పట్టుకొన్నది. అంచేత, ముందు నాకు ఆ మాంస భోజనం పెట్టి నన్ను పంపించు " అన్నాడు.
ఇల్వలుడు " స్వామీ! మీకోసమే రాసిపెట్టి ఉన్నది కాబోలు, మా యింట చిరకాలం నుంచీ ఒక మేకపోతు పెరుగుతూ బాగా కొవ్వుపట్టి ఉన్నది " అని చెబుతూ వెంటనే మేకరూపంలో ఉన్న వాతాపిని చూపించాడు.
అగస్త్యుడు మేకను చూసి " ఆహా! ఏం మేక, ఏంమేక! వెయ్యి యాగాలు చేయించానన్నమాటే గానీ, ఇలాంటి మేకను రుచి చూడలేదు. నాయనా! ముందు దీని గుండెకాయ మొదలైన మేలు ముక్కలన్నీ నాకు పెట్టి, ఆ తర్వాత మిగతాది అతిథులకు పెట్టు. ముందే చెబుతున్నాను, మరేం అనుకోకు. మాంసం తప్ప మరేదీ నేను తినలేనుసుమా! నేను తినగలిగినదంతా నాకు వడ్డించాలి. మర్చిపోకు " అన్నాడు.
ఇల్వలుడు అగ్నిలో మేకను కాల్చి, మాంసం వండించి అగస్త్యుడికి పెట్టాడు. ఎంత వడ్డించినా తినేస్తూ అగస్త్యుడు పూర్తి మేకపోతు మాంసం ఆరగించి త్రేన్చాడు. ఇల్వలుడు ఆశ్చర్యంతోబాటు కొంచెం భీతికూడా పడుతూ, " స్వామీ! తమరు మంచి ఘనాపాఠీల్లాగున్నారే? " అన్నాడు.
అగస్త్యుడు చిరునవ్వు నవ్వి " ఘనాపాఠీల్లో ఘనాపాఠీగా మనపేరు ముల్లోకాలకూ తెలుసునోయీ! ఏదీ, కాస్త మద్యం తెప్పించు. ఒక గుండెడు చాల్లే " అన్నాడు.
ఇల్వలుడు మరింత నివ్వెరపోతూ, " గుండెడు మద్యం తాగుతారా స్వామీ! " అన్నాడు.
అగస్త్యుడు " మనపొట్టకు సముద్రాలే చాలవు " అన్నాడు.
ఇల్వలుడు " అలాగే తాగుదురుగాని, మావాడు వాతాపి తెప్పిస్తాడు " అని చెబుతూ, "వాతాపీ! " అంటూ గొంతెత్తి కేకవేశాడు.
అగస్త్యుడు నెమ్మదిగా, " ఇంకెక్కడి వాతాపి. వాతాపి మరిరాడు. జీర్ణం, జీర్ణం వాతాపి జీర్ణం " అంటూ కడుపు నిమురుకుంటూ, " వాతాపి హరించిపోయాడు " అన్నాడు.
ఇల్వలుడు ప్రాణభీతితో గజగజ వణికిపోతూ, జాడలేకుండా పారిపోయాడు. ఆ విధంగా వాతాపి ఇల్వలుల దారుణ హత్యాకాండల మాయా నాటకం అంతమయింది.
ఆ తరువాత అగస్త్యుడు మిగతా అతిథులకు జరిగిందంతా చెప్పి, రాతిదుర్గంలో కుప్పతెప్పలుగా పడిఉన్న అస్తిపంజరాల్నీ, కపాల రాసులనూ చూపించాడు. వారంతా గుండెలు బాదుకొంటూ బ్రతికి బయట పడ్డందుకు అగస్త్యుడికి ప్రణమిల్లి మ్రొక్కారు.
ఆ దుర్గంలో పదిలంగా భద్రపరచి ఉన్న ధనరాసుల్ని అగస్త్యుడు చూశాడు. తనకు కావలసినది పోగా, మిగిలిన ధనంతో ఒక మహానగరం నిర్మించవచ్చు. వేలాదిమంది సుఖంగా జీవించవచ్చని ఆయనకు తోచింది.
వెంటనే అగస్త్యుడు అందరికీ ధనాన్ని పంచటం మొదలుపెట్టాడు. ఆ సంగతి విని, సమీప రాజ్యాలనుండి ఎంతోమంది ప్రజలు అక్కడకు చేరుకొని, అగస్త్యు డిచ్చిన ధనంతో ఇళ్ళు కట్టుకొని స్థిరపడ్డారు.
అగస్త్యుడికి విఘ్నేశ్వరుడి ఆకారంలాగ కనిపించిన మహాశిల కేంద్రంగా చుట్టూరా ఒక మహానగరం తయారయింది. వాతాపి జీర్ణంతో ఏర్పడిన ఆ నగరం వాతాపి నగరంగా పేరుపొందింది. అగస్త్యుడు స్వపరిపాలనా సూత్రాలను శిలాఫలకాలమీద చెక్కించి నగరంలో పెట్టించాడు. ప్రజలే పాలకులుగా ఆదర్శప్రాయమైన ప్రజారాజ్యం ఏర్పడింది.
( సశేషం. మిగిలిన కథాభాగం వచ్చే వారం. అంతవరకూ శలవు. సర్వేజనా సుఖినోభవంతు!! స్వస్తి!!)