19, ఫిబ్రవరి 2026, గురువారం

:: మరుద్గణాలు :: 


    నమస్కారం! హిందూపురాణాల్లో ఎన్నో వింతలు, విశేషాలు ఉన్నాయి. కానీ, ఒకే గర్భం నుండి 49మంది దేవతలు ఉద్భవించడం గురించి మీరెప్పుడైనా విన్నారా? వారు ఎవరో కాదు... "మరుద్గణాలు". 

    ఇంద్రుడికి అత్యంత సన్నిహితంగా ఉండే ఈ వాయుదేవతలు అసలు ఎలా పుట్టారు? ఒక తల్లి కఠిన తపస్సు,  ఒక దేవుడి భయం, వజ్రాయుధపు దెబ్బ ...ఇవన్నీ కలిస్తేనే మరుద్గణాల జననం. ఈ రోజు ఈ వీడియోలో మరుద్గణాల పుట్టుక వెనుక ఉన్న ఆసక్తికరమైన రహస్యాలను తెలుసుకుందాం. 

    కథలోకి వెడితే.... కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలు ఉండేవారు. అదితి మరియు దితి. అదితి సంతానం దేవతలుకాగా, దితి సంతానం దైత్యులు (రాక్షసులు). దేవతలకు, రాక్షసులకు మధ్య జరిగిన యుద్ధాల్లో దితి కుమారులు అందరూ ఇంద్రుడి చేతిలో హతమవుతారు. తన బిడ్డలను కోల్పోయిన దితి పుత్రశోకంతో రగిలిపోతుంది. తన కుమారులను చంపిన ఇంద్రుడిని అంతం చేయగల అజేయుడైన కుమారుడు తనకు కావాలని ఆమె కోరుకుంటుంది. దీని కోసం ఆమె తన భర్త కశ్యప ప్రజాపతిని ఆశ్రయిస్తుంది. ఆమె పట్టుదలను చూసిన కశ్యపుడు ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. కానీ, దానికి ఒక కఠినమైన నిబంధన విధిస్తాడు. 

    కశ్యపుడు దితితో ఇలా అంటాడు: " దేవీ! నీవు కోరుకున్నట్లే ఇంద్రుడిని జయించగల కుమారుడు నీకు కలుగుతాడు. కానీ, నీవు వెయ్యి యేళ్ళపాటు అత్యంత పవిత్రంగా, కఠినమైన నియమాలతో గర్భాన్ని ధరించాలి. పొరపాటునకూడా అపవిత్రంగా ఉండకూడదు. అలా ఉంటేనే నీకోరిక నెరవేరుతుంది. 

    దితి ఆ నియమాలకు అంగీకరించి తపస్సు మొదలుపెడుతుంది. రోజులు గడుస్తున్నాయి. ఆమె గర్భంలోని పిండం తేజస్సుతో పెరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడికి భయం పట్టుకుంది. ఆ శిశువు పుడితే తన పదవి ఊడిపోతుందని, తన ప్రాణాలకు ముప్పు అని గ్రహించాడు. 

    ఇంద్రుడు చాలా తెలివైనవాడు. దితిని నేరుగా ఎదుర్కోలేక, ఆమెకు సేవకుడిగా వెడతాడు. " అమ్మా! నీ గర్భాన్ని కాపాడటంలో నేను నీకు సహాయం చేస్తాను " అని నమ్మిస్తాడు. దితి కూడా తన సవతి కొడుకు కదా! అని నమ్మి దగ్గరకు రానిస్తుంది. ఇంద్రుడు లోపల కుట్రతో, పైకి భక్తితో ఆమె అలసట కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా, దితి తీవ్రమైన అలసటవల్ల కాళ్ళు కడుక్కోకుండానే, జుట్టు విరబోసుకుని నిద్రపోతుంది. ఇది శాస్త్ర విరుద్ధం మరియు అపవిత్రం. ఇంద్రుడికి కావల్సిన అవకాశం దొరికింది. తక్ష్ణణమే తన సూక్ష్మరూపంతో దితి గర్భంలోకి ప్రవేశిస్తాడు. 

    గర్భంలో ఉన్న ఆ తేజోమయమైన పిండాన్ని చూసి ఇంద్రుడు భయపడతాడు. తన వజ్రాయుధంతో ఆ పిండాన్ని ఏడు ముక్కలుగా నరుకుతాడు. అప్పుడు ఆ ఏడు ముక్కలు బిగ్గరగా ఏడవడం మొదలుపెడతాయి. అవి ఏడిస్తే దితికి మెలకువ వస్తుందని భయపడి, ఇంద్రుడు ఆ ఏడు ముక్కలను మళ్ళీ ఒక్కొక్క దానిని ఏడు ముక్కలుగా నరుకుతాడు. మొత్తం 49 ముక్కలయ్యాయి. ఆ ముక్కలు రోదిస్తుంటే, ఇంద్రుడు గర్జిస్తూ " మా రుద " ( ఏడవకండి...ఏడవకండి ) అని అంటాడు. సంస్కృతంలో " రుద " అంటే ఏడవటం.  " మా రుద " అంటే ఏడవ వద్దు అని అర్థం. ఆ మారుద అనే పదం నుండే " మరుత్తులు " అనే పేరు వచ్చింది. 

    చివరికి దితికి మెలకువ వస్తుంది. జరిగిన విషయాన్ని గ్రహించిన ఇంద్రుడు ఆమె కాళ్ళమీద పడి క్షమాపణ కోరతాడు. దితి కూడా తన తప్పును తెలుసుకుంటుంది. ఆ 49 ముక్కలు ప్రాణం పోసుకుని 49 మంది మరుద్గణాలుగా అవతరిస్తారు. వీరు ఇంద్రుడిని చంపే రాక్షసులుగా కాకుండా, ఇంద్రుడికి తోడుగా ఉండే దేవతలుగా మారిపోతారు. వీరే ప్రకృతిలో వీచే రకరకాల గాలులకు (వాయువులకు) అధిపతులు. 

    ఇదీ మరుద్గణాల పుట్టుక కథ. మీకు ఈ కథ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన పురాణ కథలకోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. స్వస్తి! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...