15, ఫిబ్రవరి 2026, ఆదివారం

:: చివరి క్షణంలో ఆలోచనే భవిష్యత్తు ::  


    దేశానికే పేరుతెచ్చిన చక్రవర్తి జింకగా ఎందుకు పుట్టాడు? 

    మనదేశానికి భారతదేశం అని పేరు రావడానికి కారణమైన ఆ చక్రవర్తి, అంతటి రాజ్యాన్నీ వదిలేసి అడవికి వెళ్ళాడు. కానీ, చనిపోయే ముందు ఆయన చేసిన ఒకే ఒక చిన్న ఆలోచన ఆయనను మళ్ళీ జంతువుగా పుట్టేలా చేసింది. ఆ పొరపాటు ఏమిటో తెలుసా? 

    ఋషభదేవుని కుమారుడైన భరత మహారాజు సమస్త భూమండలాన్ని పాలించిన ఉత్తమ చక్రవర్తి. భోగభాగ్యాలన్నీ తృణపాయంగా భావించి, వృద్ధాప్యంలో తన కుమారులకు రాజ్యాన్ని అప్పగించి గండకీ నదీ తీరంలోని పులహాశ్రమంలో తపస్సు చేసుకోవడానికి వెడతాడు. 

    ఆయన అక్కడ కఠోరమైన తపస్సుచేస్తూ, ఇంద్రియాలను జయించి భగవంతుని ధ్యానంలో మునిగిపోయేవాడు. కానీ, ఒకరోజు ఒక సంఘటన జరిగింది. 

    నదిలో నీరు త్రాగుతున్న ఒక గర్భవతి అయిన జింక, సింహ గర్జన విని భయంతో నది దాటబోయి పడిపోతుంది. ఆ కంగారులో అది ఒక పిల్ల జింకకు జన్మనిచ్చి మరణిస్తుంది. ఆ అనాథ జింక పిల్లను చూసి భరతుడి మనసు కరిగిపోయింది. " అయ్యో! దీనికి ఎవరూ లేరే " అని జాలితో ఆశ్రమానికి తెచ్చి పెంచుకోవడం మొదలుపెట్టాడు. 

    తపస్సు చేసేటప్పుడు ఆ జింక వచ్చి ఒళ్ళో కూర్చుంటే మురిసిపోయేవాడు. ధ్యానం ప్రక్కనపెట్టి, దానికి గడ్డివేయడం, పులులనుండి రక్షించటం పైనే దృష్టి పెట్టేవాడు. చివరికి తన మరణ సమయం ఆసన్నమైనప్పుడు కూడా - భగవంతుని స్మరించాల్సింది పోయి, " నేను పోతే ఈ జింకపిల్ల ఏమైపోతుందో? " అని కళ్ళల్లో నీళ్ళతో ఆ జింకను చూస్తూనే ప్రాణాలు వదిలాడు. 

    భాగవతం ఏమి చెబుతుందంటే, " యం యం వాపి స్మరన్ భారం త్రజత్యంతే కనే వరమ్ " అంటే., మరణ సమయంలో మనసులో ఏ ఆలోచన ఉంటే, ఆ జీవి అదే రూపంలో మరుజన్మ ఎత్తుతుంది అని. అందుకే అంతటి రాజర్షి అయిన భరతుడు మరుజన్మలో జింకగా జన్మించాల్సి వచ్చింది. 

    ఈకథ మనకు ఇచ్చే పాఠం ఒక్కటే. మనం దేనిని అతిగా ప్రేమిస్తామో, దేనిమీద అతిగా మోహం పెంచుకుంటామో అది మనల్ని భగవంతుడికి దూరం చేస్తుంది. చివరి క్షణంలో మన ఆలోచనే మన భవిష్యత్తు. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంటు చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలకోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  :: ఉపమన్యువు కథ - ఆకలి తీర్చిన పరమశివుడు ::      జీవితంలో ఒక్కోసారి మనకు చాలా చిన్న కోరికలు ఉంటాయి. కానీ అవి తీరనప్పుడు కలిగే బాధ వర్ణనాతీ...