:: హరిద్వార్ - దేవలోకపు వాకిలి ::
భారతీయ ఆధ్యాత్మిక భూపటంలో 'హరిద్వార్' ఒక అద్భుతమైన అధ్యాయం. హరిద్వార్ అంటే 'హరి' (విష్ణువు) కు దారి లేదా 'హర' (శివుడు) కు ద్వారం అని అర్థం. ఏడు పుణ్య క్షేత్రాలలో (సప్తపురులు) ఒకటిగా పేరుగాంచిన ఈ నగరం, వేల ఏళ్లుగా భక్తులకు మోక్షద్వారంగా నిలుస్తోంది. నేటి 'యాత్రాసుధ'లో గంగా తరంగాల మధ్య హరిద్వార్ ఆధ్యాత్మిక వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు చూద్దాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలొ నెలకొన్న ఈ పట్టణం సముద్రమట్టానికి సుమారు 314 మీటర్ల ఎత్తులో ఉంది.గంగానది పర్వతాలను వీడి మైదాన ప్రాంతంలోకి ప్రవేశించే తొలి ప్రదేశం. అందుకే దీనిని 'గంగాద్వార్' అని కూడా పిలుస్తారు. భౌగోళికంగా ఇది డెహ్రాడూన్ మరియు రిషికేశ్‌లకు సమీపంలో ఉండి, ఉత్తర భారత యాత్రలకు ప్రధాన ద్వారంగా నిలుస్తోంది. భారతీయ సనాతన సంస్కృతిలో 'మోక్షపురి'గా పిలవబడే ఈ నగరం, కేవలం ఒక పర్యాటక ప్రాంతం కాదు; అది వేల ఏళ్ల విశ్వాసం, కోట్లాది మంది భారతీయుల ఆత్మగౌరవం. . ఇక్కడికి రాగానే గాలిలో వినిపించే శంఖారావాలు, గంగా నదీ ప్రవాహ సవ్వడి పర్యాటకుడిని భౌతిక ప్రపంచం నుండి ఆధ్యాత్మిక లోకానికి తీసుకెళ్తాయి.
హరిద్వార్ చరిత్ర సముద్ర మథన కాలం నాటి అద్భుత ఘట్టాలతో ముడిపడి ఉంది. అమృత భాండం కోసం దేవదానవులు ఆకాశంలో పోరాడుతున్నప్పుడు, నాలుగు అమృత బిందువులు భూమిపై రాలాయి. అందులో ఒక బిందువు ఇక్కడి 'బ్రహ్మకుండం'లో పడిందని పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే ఇక్కడ గంగా స్నానం అంటే కేవలం నీటిలో మునగడం కాదు, ఆ సాక్షాత్ అమృతాన్ని స్పృశించడమే! భగీరథుని తపస్సుకు మెచ్చి దివి నుండి భువికి దిగివచ్చిన గంగమ్మ, తన పూర్వీకుల పాపాలను కడిగివేసినట్లే, ఇక్కడ స్నానమాచరిస్తే మన జన్మజన్మల కల్మషాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
హరిద్వార్ శీతోష్ణస్థితి కూడా ప్రకృతి వింతే. వేసవిలో సూర్యకిరణాలు సుర్రుమంటున్నా, గంగానది ఒడ్డున నిలబడితే హిమాలయాల నుండి వచ్చే చల్లని గాలులు మనసును కుదుటపరుస్తాయి. శీతాకాలంలో (అక్టోబర్ నుండి మార్చి వరకు) ఇక్కడి వాతావరణం పట్టువస్త్రంలా మెత్తగా, హాయిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు 6°C కి పడిపోతాయి. యాత్రకు ఇదే అత్యంత అనుకూలమైన సమయం.వేసవిలో (ఏప్రిల్ నుండి జూన్ వరకు) ఉష్ణోగ్రతలు 35°C నుండి 40°C వరకు ఉండవచ్చు.. వర్షాకాలంలో గంగానది ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి పర్యటనకు కొంత ఇబ్బందిగా ఉంటుంది అయితే, ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి జరిగే 'కుంభమేళా' సమయంలో హరిద్వార్ ఒక జనసముద్రమై పోతుంది. ఆ సమయంలో ఇక్కడ గంగా స్నానం చేయడం అనేది ప్రతి హిందువు జీవితకాల స్వప్నం.
హరిద్వార్ గుండెకాయ వంటిది 'హర్ కీ పౌరీ'. అంటే 'ఈశ్వరుడి పాద ముద్రలు' అని అర్థం. ఇక్కడే బ్రహ్మకుండం ఉంది. . ఇక్కడి గంగానదిలో స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని కోట్లాది మంది భక్తుల ప్రగాఢ విశ్వాసం. గంగామాత నిర్మలమైన జలధారలు ఇక్కడ భక్తుల మనసులను పవిత్రం చేస్తాయి. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రంవేళ జరిగే గంగా హారతిని చూడకుండా ఎవరూ తిరిగి రాలేరు. వేల సంఖ్యలో వెలిగే నెయ్యి దీపాలు నదిలో తేలుతుంటే, ఆకాశంలోని నక్షత్రాలన్నీ గంగమ్మ ఒడిలోకి దిగివచ్చాయా అన్నట్లుగా ఉంటుంది.
హరిద్వార్ కేవలం నదీ తీరమే కాదు, శక్తి పీఠాల నిలయం కూడా. శివాలిక్ పర్వత శ్రేణిలోని 'బిల్వ పర్వతం' పై కొలువైన మానసా దేవి, 'నీల పర్వతం' పై వెలసిన చండీ దేవి ఆలయాలు క్షేత్రానికి రక్షణ కవచాల్లా ఉంటాయి. భక్తులు ఈ కొండలపైకి రోప్‌వే ద్వారా వెళ్తూ, హరిద్వార్ నగరం మొత్తాన్ని పక్షి కన్నుతో చూస్తూ పొందే అనుభూతి వర్ణనాతీతం. ఇక్కడ అమ్మవారిని దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని ప్రతీతి. శివుని మామగారైన దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన 'కన్ఖల్' ప్రాంతం, కళాత్మకమైన భారత్ మాతా మందిర్ ఇక్కడి మరిన్ని విశేషాలు. అద్దాల పనితనంతో నిర్మించిన పవన్ థాం చూడదగ్గ శిల్పకళతో అలరారుతూ ఉంటుంది.
హరిద్వార్ అంటేనే ఉత్సవాల నిలయం. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహా కుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. కోట్లాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానమాచరిస్తారు. అలాగే ప్రతి ఆరు సంవత్సరాలకూ అర్థ కుంభమేళా జరుగుతుంది. శ్రావణ మాసంలో జరిగే కాన్వడ్ యాత్రలో శివభక్తులు గంగాజలాన్ని కావళ్లతో తీసుకెళ్లి శివునికి అభిషేకం చేస్తారు.
హైదరాబాద్ నుండి ఈ మోక్షపురికి చేరుకోవడం ఇప్పుడు చాలా సులభమైంది. విమానంలో రావాలనుకునే వారు శంషాబాద్ నుండి డెహ్రాడూన్ చేరుకుని, అక్కడి నుండి కేవలం ఒక గంట ప్రయాణంతో హరిద్వార్ చేరుకోవచ్చు. రైలు ప్రయాణాన్ని ఆస్వాదించే వారు ఢిల్లీ మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక వసతి విషయానికి వస్తే, గంగా తీరాన ఉన్న శాంతికుంజ్ వంటి ఆశ్రమాలు మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. లగ్జరీ కావాలనుకునే వారికి అత్యాధునిక హోటళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. కేవలం భక్తి కోసమే కాదు, భారతీయత ప్రాభవాన్ని కళ్లారా చూడటానికైనా జీవితంలో ఒక్కసారైనా హరిద్వార్ వెళ్లాల్సిందే. ఆ గంగానది పిలుపు మీకోసం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది!
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి