30, ఆగస్టు 2026, ఆదివారం

 శ్రీమతి వేదాల గాయత్రి గారి 27వ అష్టావధానము - ఆదివారము (30-08-2026)

1. నిషిద్ధాక్షరి: శ్రీమతి వెలగపూడి భారతిగారు 
 
అంశము:  రాఖీ పండుగను పురస్కరించుకుని సోదర సోదరీమణుల అనుబంధాన్ని కందపద్యంలో చెప్పాలి. 

శ్రీ(మ)న(గ)వ్యం(వ)బై(ప)కాం(క్ష)తల్ 
 (క)మేనన్ స(ప)రి(గ)పు(ణ)ట్టు(క)వై(న)సుమే(ద)డ్యన్(బ)గా(వ)చన్
పూనిక సోదరులకు , విధి 
మానితముగ కట్టుచుంద్రు మహిలో రక్షల్ 

2.  సమస్య: శ్రీ క్రొవ్విడి వెంకట రాజారావు 

" వడ్డీకట్టగ డబ్బులేని యతడే వర్షించు నైశ్వర్యముల్ " 

ఉడ్డీనంబుగ దేవతాళి మది తా నొప్పారు దైవంబిలన్ 
వడ్డీకాసులు తెచ్చెనంత మది నుద్వాహంబునే గోరుచున్ 
లడ్డూభక్తులు పంచిపెట్ట మురియన్ రాజిల్లు శ్రీవాసుడే 
వడ్డీకట్టగ డబ్బులేని యతడే వర్షించు నైశ్వర్యముల్ 

3. దత్తపది: శ్రీమతి ఉప్పలపాటి కుసుమకుమారి 

అంశము:  " తెలుగు - వెలుగు - జిలుగు - కలుగు " - ఈ పదములను ఉపయోగిస్తూ తెలుగు భాషా ఔన్నత్యం  విషయమై స్వేచ్ఛావృత్తం. 

(తెలుగే) మంజుల మాధురీ భరితమై దీపించు సద్భావనల్ 
(వెలుగుల్) చిందుచు మానసంబు మురియన్ విఖ్యాతి నందించెడిన్ 
(జిలుగే) పద్యము నేర్వగా సుహితమౌ శ్రేయంబునే గూర్చెడిన్ 
(కలుగున్) దివ్యవధానకేళి నలరన్ కామ్యార్థ సంధాయియై. 

4.  న్యస్తాక్షరి:  శ్రీమతి హట్టి భానుమతి 

పదం: పద్యకేళి - 1వ పాదం మొదటి అక్షరం " ప "; 2వ పాదం రెండవ అక్షరం " ద్య "; 3వ పాదం నాలుగవ అక్షరం " కే "; 4వ పాదం (19)వ అక్షరం " ళి ". 

(ప)ద్యము భారతీ హృదయపద్మము దివ్య రసాభిషేక సం 
వే(ద్య)ము శబ్దభావలయవిస్తృత వాద్యము శారదాంబకున్ 
పాద్యము (కే)ళియౌనుగద భవ్యవధాన మనోజ్ఞపీఠికిన్ 
హృద్యము నన్నయాది కవిరీతులు తెల్పెడి సూత్రపా(ళి)కిన్ 

5.  వర్ణన: శ్రీ వెంకట్ కొత్తూరు 

అంశము: నేపాల్ వరదలు - ప్రాణనష్టం ( కరుణరస ప్రధానంగా చంపకమాల వృత్తంలో ) 

వరదుని ముక్తినాథుగన భక్తవరేణ్యులు చేరిరంతటన్ 
కరకు కఠోరశక్తులకు కమ్రహిమమ్మది జాలువారగా 
వరదలు ముంచివేసెనట వైభవమంత వినాశనమయ్యె 
సరణిని మానవాళిగని సంతపమందితి శోకమగ్నతన్. 

6. ఆశువు: శ్రీమతి క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి 

(1). బాలకృష్ణుని విశ్వరూప దర్శనము: 

మ.   కనగా బాలుని సుందరాస్యమున తత్కైలాసమే పర్వగా 
         మునిముఖ్యుల్ రవిచంద్రతారగణముల్ మోదంబుతో యాడగా 
        జననీచిత్తము సంభ్రమించి యెదలో శంకించి దైవమ్ముగా 
        తనపట్టింగని దృష్టిదోషమనుచున్ తాన్ దృష్టి తీసెన్ గదా! 

(2). హైదరాబాద్ లో గణేశ నిమజ్జనమునకు వెడుతూ ట్రాఫిక్ జాం లో ఇరుక్కున్న వినాయకుడి మనోభావన 

కం.  తొమ్మిది దినముల నిచ్చట 
        కమ్మగ నే పూజలంది ఘనముగ పోవన్ 
        క్రమ్మిన ట్రాఫిక్ జామున 
         నెమ్మదిగా నణుగునగుచు నేను చరింతున్ 

(3). భిన్నత్వంలో ఏకత్వం 

తే.గీ.   వివిధ మతముల ధర్మముల్ వెలుగు భూమి 
           నవనవోన్మేషికన్ ................... నడచు భూమి 
           యైకమత్యంబు సౌధాన యలరు భూమి 
           భవ్యమైనది మాతల్లి భరతభూమి 

7.  శ్రీ పోణంగి త్యాగరాజు 

(1).  ఉ.  ఓ మహనీయ ధీమణిరొ యోరిమి నీకెటులబ్బె జెప్పుమా! 
               రాముని పాదసేవనము రమ్యగుణార్ణవమందు ముంగుటన్ 
               రాముని గాక యందు మిము రమ్యతగొల్పు విశేషమేమియో? 
               రాముని కష్టనసష్టములె లక్షణమొప్పగ కోరుకొందునేన్ 

(2).  ప్రేమయే భక్తియన్న మీరేమనెదరు? 
          గోపకాంతల భక్తియే ప్రాపుసుమ్ము 
          ప్రేమలో భక్తి నింపు.................
           సత్వగుణమది పెంపొంద సాధ్యమగును

(3).  అవధానంబులు ............విధాన 
         సవనమ్ముగనేదల్చితి కవివరు రచనలు చదువుచు గడియించితి నే 

ప్రశంసా పద్యములు: 

(1). క్రొవ్విడి వెంకట రాజారావు: 

భాసురంబగు రీతి నల్లిన పద్యరత్నములన్నియున్ 
వాసికెక్కినతీరు నొప్పెను భావసోయగమిచ్చుచున్ 
లేసటెంతయులేక వాణియె లెస్సగా నిను మెచ్చగా 
రాసియౌ తగు దీవెనల్ గొని రాణకెక్కుము సోదరీ! 

(2). క్రొవ్విడి వెంకట సుబ్బలక్ష్మి: 

రాయంచ నడక తోడన్ 
గాయత్రీ! వాణి నీదు కంఠమునందే 
పాయక నిలిచెను లెస్సగ 
మాయక నీ కీర్తి నిలుచు మహిలో సతమున్  
     

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  శ్రీకృష్ణుని రాసక్రీడా వర్ణన – ప్రాకృతాతీత దివ్యానందం      శ్రీమద్భాగవతం దశమ స్కంధం పూర్వభాగంలోని 33వ అధ్యాయంలో వర్ణితమైన "రాసక్రీడ...