24, ఆగస్టు 2026, సోమవారం

 :: విభీషణ శరణాగతి :: 

     ఉన్నదంతయు త్యాగముచేసి, నీతి, న్యాయము, ధర్మముల నాచరించు వారి పక్షమందుండవలెనని దృఢముగా నిశ్చయించుకుని ఆర్తితో ఒక మహనీయుని ఆశ్రయించుటను తెలియజెప్పునట్టి నానుడి " విభీషణ శరణాగతి ". శ్రీరామాయణమందలి యుద్ధకాండ మందు ప్రముఖమై ప్రకాశించునట్టి ఈ విభీషణ శరణాగతి యను ఘట్టము భారతీయ సంస్కృతి యందు శరణాగతి తత్త్వమునకు, భగవానుని అభయప్రదానమునకు మహోన్నతమగు నిదర్శనమునై నిలుచుచున్నది. 

     రావణాసురుడు సీతామాతను అపహరించి లంకకు కొనితెచ్చి బంధితురాలుగా నొనర్చిన తదనంతరము రావణుడు జరిపిన రాక్షస సభలో అతని కనిష్ట సోదరుడైన విభీషణుడు అన్నకు పలురీతుల హితవును బోధిస్తూ పరస్త్రీని చెరబట్టుట పూర్తిగా అధర్మమని , సీతాదేవి భర్త అయిన శ్రీరామచంద్రుడు సామాన్య మానవుడు కాడని, సాక్షాత్తూ ధర్మస్వరూపుడైన వాడని, పరాక్రమవంతుడని చెప్పి, సీతను సగౌరవముగా ఆమె భర్తకు అప్పజెప్పి లంకా నగరమును, రాక్షస వంశ వినాశమును తప్పింపజేయుమని నీతిపూర్వక అభ్యర్థన చేసినంత, అహంకారాంధకారమున మునిగి ఉన్న లంకేశుడు సోదరుని హితవాక్కులను తృణీకరించి, సభయందుననే విభీషణుని తీవ్రముగా అవమానించి లంకానగరము నుండి బహిష్కృతుని చేసినాడు. 

    నీతి, ధర్మము తప్పి చరిస్తున్న అన్న పక్షమును త్యజించి, విభీషణుడు తన అనుయాయులైన ఓ నలుగురు మంత్రులతో సహా సముద్రమును దాటి ఆవలనున్న శ్రీరాముని చెంతకేగి శరణము నర్థించినాడు. శత్రువు యొక్క సోదరుడు ఈరీతి వచ్చి శరణాగతి కోరుటను రావణుని కుట్రగా మదిలో శంకించి సుగ్రీవాది వానర వీరులు శ్రీరామునికి ఆరీతి విన్నవించినారు. హనుమయ్య మాత్రము విభీషణుడు కపటబుద్ధి కలవాడు కాదని, ధర్మాచరణ పరాయణుడని , పరిపూర్ణముగా నిన్ను నమ్మి పరిశుద్ధ మనస్సుతో అభయమడుగుచున్న వాడని రామునకు తెలియజేసెను. 

    నన్ను ఆశ్రయించి, నేను నీవాడనని, ఆదుకొమ్మని శరణు కోరినప్పుడు అతడు శత్రువైనను, ఒకవేళ రావణుడే స్వయముగా వచ్చి నన్ను శరణు వేడినను నేను తప్పక అభయమొసంగుదును. శరణు కోరిన వారికి శరణమీయకుండుట అధర్మమైనదని శ్రీరాముడు విభీషణునకు శరణాగతినిచ్చి ఆ వెంటనే సముద్ర జలములతో అతనిని లంకా రాజ్యమునకు రాజుగా ప్రకటించి పట్టాభిషేకమొనర్చినాడు. 

    ఈ " విభీషణ శరణాగతి " ఘట్టము ద్వారా ఎంతటి ఆప్త బంధువులైనను, ఆత్మీయులైనవారైనను అధర్మ మార్గమందు సంచరించునప్పుడు వారికి మద్దతు పలుకరాదని , సత్యము, ధర్మము, నీతి, న్యాయములను అలవరచుకుని ఎల్లప్పుడు నిర్భయత్వముతో మెలగవలెనని మనకు తెలియుచున్నది. తమ తప్పులను, దోషములను గ్రహించి లేదా శరణు కోరి మన చెంతకు చేరిన వారికి తగిన రక్షణను, ఆశ్రయమును యిచ్చుట మన విధియై యున్నది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

  ద్రౌపది నవ్వు       శ్రీమహాభారత కథాగమనమును మలుపు త్రిప్పిన సంఘటనలందు " ద్రౌపది నవ్వు" ప్రముఖమైనదిగా చెప్పబడుతుంది. మన కెదురుగ ను...