:: వృషభాసుర సంహారము ::
అందరకు నమస్కారం! ఈ వారం మనం శ్రీకృష్ణ లీలలలో భాగంగా వృషభాసుర సంహార ఘట్టాన్ని తెలుసుకుందాము. శ్రీకృష్ణ భగవానుడి దివ్య లీలలలో "వృషభాసుర సంహారము" అత్యంత విశిష్టమైనది. . రేపల్లెలో నందకిశోరుడు గోపబాలురతో, పశువులతో కలసి లీలలు సలుపుచుండగా, కంసుని పంపకమున అరిష్టాసురుడు అనే రాక్షసుడు భయంకరమైన ఎద్దు (వృషభము) రూపమును ధరించి ఆకస్మికముగా మందపై పడ్డాడు. ఆ రాక్షసుని భయంకర రూపమును, అతని పరాక్రమమును పోతనగారు అత్యద్భుతముగా వర్ణించినారు.
ఆ వృషభాసురుని ఆకారము ఎంత ప్రాంశువుగా, భయానకముగా ఉందంటే — ఆ రాక్షసుని పీట లాంటి వీపు భాగాన్ని అదే మూపురాన్ని చూచి ఆకాశములోని మేఘములు కూడా అది ఏదో పర్వత శిఖరమని పొరబడి దానిని ఆశ్రయించాయట. భయంకరమైన దేహము అతనిది. అతడు పెట్టిన ఘోరమైన ఱంకె చెవుల పడగానే గర్భవతులైన స్త్రీలకు గర్భస్రావము సంభవిస్తున్నదట. . అతడు నేలను కాళ్లతో ద్రవ్వునప్పుడు పైకి లేచు ధూళి సూర్యభగవానుని కాంతిని సైతము కప్పివేస్తున్నదట. తన పదునైన కొమ్ములతో ఎదురొచ్చిన పర్వతములను పొడిచినచో అవి కూడా పెళ్లగించుకొని నేలకూలుతున్నాయట. అట్టి రాక్షసశ్రేష్ఠుడు అహంకారముతో తోకను పైకెత్తి, గగనమంతటా మారుమోగునట్లు పెద్ద ఱంకె వేసి, కాలు దువ్వుతూ, పదునైన కొమ్ములను ముందుకు సాచి పశువుల మందపైకి ఉగ్రరూపముతో విరుచుకుపడ్డాడు.
ఎవ్వని మూపుర మీక్షించి మేఘంబు లద్రి శృంగంబని యాశ్రయించు
నెవ్వని ఱంకె కర్ణేంద్రియంబులు సోక గర్భ పాతంబగు గర్భిణులకు
నెవ్వని పదహతి నెగయు పరాగంబు లంధకారారాతి నావరించు
నెవ్వడు గొమ్ముల నెదిరించి చిమ్మిన బృద్థ్వీధరంబులు పెల్లగిల్లు
నట్టి వృషభాసురేంద్రు డహంకరించి, వాల లతయెత్తి పెనుఱంకె వైచి నేల
గాలు ద్రవ్వుచు నిశిత శృంగములు సాచి, మంద బెగడంగ గవిసె నమంద గతిని
ఆ ఘోర రాక్షస రూపమును చూచి గోకులమంతయూ తీవ్ర భయాందోళనలకు గురయింది. ఆ భయానక వాతావరణమును పోతనగారు అత్యంత దయనీయముగా, కంటికి కట్టినట్లు వర్ణించారు. ఆ పెనుఱంకెలకు గడగడలాడి లేగదూడలు చెల్లాచెదరై పరుగెత్తాయి. గోవులు, ఆబోతులు ఒకదానిపై నొకటి పడుతూ దిక్కుతోచక పరుగెత్తసాగాయి. లేగలు, ఆవులు, ఆబోతులు, గోపకులు అంతా విచ్ఛిన్నమై చెల్లాచెదరై ప్రాణభయముతో పరుగెడుతూండగా ఆ వృషభాసురుడు వారిని వెంటబడి తరుముతున్నాడు. గోపాలురకు అభయమిచ్చు గోపచమూ విభుడైన శ్రీకృష్ణభగవానుడు ఆ అరిష్టాసురుడు వారిని వెంటాడటాన్ని గమనించాడు.
క్రేపులు వాఱె గోవులకు, గ్రేపులు గోవులు గోవృషంబులం
బైపడె; వత్సధేను వృషభంబులు గోపకులందు జొచ్చె; నా
గోపకులా వృషేంద్రములు గోవులు లేగలు విచ్చి పాఱగా
గోప చమూ విభుండు గనె గోవృష దైత్యుడు వెంట నంటగన్
దీనులైన గోపకులను, అమాయక పశువులను రక్షించుటకై శ్రీకృష్ణుడు ముందుకు వచ్చి ఆ అసురుని గర్జించి సవాలు విసురుతూ "ఓ అరిష్టాసురా! దిక్కుతోచక పరుగెత్తుచున్న లేగదూడలను, గోవులను, అబలలైన స్త్రీలను, పసిబాలురను భయపెట్టి తోలుటయేనా నీ శౌర్యము? నీ ప్రతాపము చూపుటకు ఇది భయస్తులైన గోపాలుర మందకాదురా! ముందుకు వచ్చి నాపై పడితివేని, ప్రచండమైన శార్దూలము (పులి) వంటి ఈ కృష్ణుడు నేడు నీ కంఠమును త్రెంపి, నిన్ను చంపక వదలిపెట్టునా?" అని సింహనాదము చేసెను.
బాలుర నింతులం బసుల బాఱగ దోలుట బంటు పంతమే
చాలు, వృషాసురేంద్ర! బల సంపద జూపగ నెల్ల బోటి గో
పాలుర మందగాదు; చను పైబడితేని బ్రచండ కృష్ణ శా
ర్దూలము నేడు నీ గళము ద్రుంపక చంపక పోవనిచ్చునే?
కృష్ణుని ఆక్షేపణ విన్న వృషభాసురుడు మరింత క్రోధావిష్టుడాయెను. తన గిట్టలతో నేలను త్రవ్వుచు, తోకను వేగముగా ఊపుచు గాలి విసరగా ఆ ధాటికి ఆకాశమున మేఘములు విరవిరబోయి చెల్లాచెదరాయెను. భయంకరమైన పదునైన కొమ్ములను ముందుకు ఒడ్డి, కన్నుల నుండి నిప్పులు చెరుగుచు, దుస్తరమైన రూపముతో ఆ రాక్షసుడు శత్రువుల అహంకారమును అణచు పద్మలోచనుడైన శ్రీకృష్ణుని పైకి ఉగ్రముగా దాడికి దిగినాడు.
ఖురముల నేల ద్రవ్వుచు నకుంఠిత వాల సమీరణంబులన్
విరవిరబోయి మేఘములు వివ్వ విషాణము లొడ్డి కొంచు దు
స్తరమూర్తియై వృషభ దైత్యుడు కన్నుల నిప్పు లొల్కగా
దురదుర వచ్చి తాకె రిపు దుర్మద మోచను బద్మలోచనున్
ఆవిధముగా ఉగ్రముగా డీకొనవచ్చిన రాక్షసుని యాదవకుంజరుడైన శ్రీకృష్ణుడు అప్రమత్తుడై ఎదుర్కొన్నాడు. మదగజము మరొక ఏనుగును తోసివేసినట్లు, కృష్ణుడు ఆ వృషభాసురుని రెండు కొమ్ములను పట్టుకొని అష్టాదశ పదాంతర దూరము (పద్ధెనిమిది అడుగుల దూరము) వెనుకకు నెట్టివేసాడు. ఆ దెబ్బకు ఆ రాక్షసుడు మైకము ముసరి, ఒళ్లంతా చెమటలు పట్టి నేలకొరిగినాడు. అయినను ఆ అసురుడు మరల లేచి, తీవ్రమైన దుర్మదముతో, గర్వముతో సకల మదాంధులను అణచు జనార్ధనుడైన కృష్ణునిపైకి తిరిగి డీకొనుటకు దూసుకొని వచ్చినాడు.
యాదవ కుంజరుండు వృషభాసురు కొమ్ములు రెండుబట్టి య
ష్టాదశ పాద మాత్రము గజంబు గజంబును ద్రొబ్బు కైవడిన్
ఖేదిల ద్రొబ్బ నయ్యసుర బిమ్మిటి నొంది చెమర్చి మ్రొగ్గి దు
ర్మాదము తోడ డీకొనె బ్రమత్త విమర్దను నా జనార్దునున్
అట్లు తిరుగబడిన అరిష్టాసురుని కృష్ణుడు లీలగా పట్టుకొని, అతని కొమ్ములను విరిచి, నేలకేసి కొట్టి, త్రొక్కి సంహరించాడు. రాక్షసుని ప్రాణములు ఆకాశమున కలసిపోగా, గోపాలురు, దేవతలు హర్షధ్వానములు చేసి పుష్పవర్షము కురిపించినారు. ఆవిధముగా శ్రీకృష్ణభగవానుడు వృషభాసుర సంహారము ద్వారా గోకులమును ఘోరమైన ఆపద నుండి రక్షించి తన అభయప్రదాతృత్వమును చాటినాడు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి