4, మార్చి 2023, శనివారం

 శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఒక సీసపద్యం: 

'ఉత్తారణా' యంచు నుగ్గడించగ నిన్ను / వర్తకమ్మున లబ్ది వశము చెందు 

'అచ్యుతా' యంచు నిన్నామతించిన యంత / ఆరోగ్యమెంతయు నడరు చెందు 

'బలభద్ర' యని నిన్ను బాగుగా పిలిచిన / ధనముతో మనుగడ తళుకు చెందు 

'నరసింహ' యను నీదు నామమ్ము జపియించ / భీతి పోవగ మది బిట్టు చెందు 


పేరుకొక్క మేలిమి గూర్చి వెలుగు చుండి / భక్తులందరి బ్రోచుచు పరగు వాడ 

విశ్వ రక్షణ దక్షాయ! విమల చరిత / వేంకటేశాయ తే! నమో వేదవేద్య! 

                                                                  రచన: క్రొవ్విడి వేంకట రాజారావు 


3, మార్చి 2023, శుక్రవారం

మనసులో అనుకున్న అంకెను చెప్పడం:

మీరు పైకి చెప్పకుండా మనసులో ఒక అంకెను అనుకోండి. దానిని 2 తో హెచ్చవేయండి. వచ్చినదానికి 2 కలపండి. ఆ మొత్తాన్ని 5 తో హెచ్చవేయండి. వచ్చిన విలువకు మరల 5 కలపండి. ఆ మొత్తాన్ని 10 తో హెచ్చించండి. తరువాత 10 కలిపి వచ్చిన అంకెను నాకు చెబితే మీరు మనసులో అనుకున్న అంకెను నేను చెప్పగలను. ఎట్లా అంటారా?

ఉదాహరణ చూడండి: నేను మనసులో 2 అనుకున్నాను. దానిని 2 తో హెచ్చించండి. 4 వచ్చింది. దానికి 2 కలపండి. 6 అయింది. దానిని 5 తో హెచ్చవేయండి. 30 వచ్చింది. దానికి 5 కలపండి. 35 అయింది. దానిని 10 తో హెచ్చించండి. 350వచ్చింది. (వచ్చిన మొత్తానికి పక్కన 0 పెడితే 10 తో గుణించిన ఫలితం వస్తుంది కదా!) దానికి 10 కలిపితే 360.

( 2 X 2 = 4 + 2 = 6 X 5 = 30 + 5 = 35 X 10 = 350 + 10 = 360 ) ఇది లెక్క. మీరు కళ్ళుమూసుకుని ఒక్క క్షణం ఆలోచించినట్లు నటించి వెంటనే 2 అని చెప్పండి.

ఇందులో ఉన్న రహస్యం:

  1. ఎవరు ఏ అంకెను కోరుకున్నా, పైవిధంగా లెక్కించినప్పుడు చివరి రెండు అంకెలు తప్పనిసరిగా 60 తో అంతమవుతాయి. వారు చెప్పిన దాంట్లో చివరకు 60 రాకపోతే వాళ్ళు లెక్కించడంలో తప్పుచేసినట్లే!
  2. మీరు చేయవలసింది - ఆ చివరి 60 ని వదిలి మిగిలి యున్న అంకెలో నుండి 1 తీసివేస్తే ఎదుటి వారు అనుకున్న అంకె వస్తుంది.
  3. పై ఉదాహరణలో - చివరకు వచ్చినది 360. ఇందులో చివరి 60 ను వదిలివేసి మిగిలిన 3 నుండి 1 తీసివేయగా మనసులో అనుకున్న 2 వస్తుంది. ( 3(60) = 3-1=2 )
  4. అలాగే 460 కు 3; 560 కు 4; 1060 కు 9; 5660 కు 55; -అలా అన్నమాట.
  5. ఈ విధంగా మీరు కూడా చేసి ఎదుటి వారిని ఆశ్చర్యపరచండి.

 సమస్యాపూరణలు:  దత్తపదులు: 

(1). " పేపరు - పెన్ను - బుక్ - ఇంకు " - పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో నచ్చిన

          ఛందస్సులో పద్యం.

ఉ.     బుక్కుపేపరున్ తెఱచి పొందగు రీతిని నింకు పెన్నునన్ 

          చక్కగ నింపి యర్జునుని సాహసకృత్యము లేర్చి కూర్చుచున్

          చొక్కమునైన పద్ధతిని సూతసుతుండగు కర్ణు నాజిలో

          చక్కడగించు ఘట్టమును చందుగ వ్రాసె నతండు జూడుమా! 


(2).  " అల - కల - వల - నెల " - పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ రామయణార్థంలో 

          నచ్చిన ఛందస్సులో పద్యం. 

చం.   వలపును వీడి దాశరథి పత్నిని వేగమె పంపకుండుచో 

           అలకను జెంది రాముడు వినాశమొనర్చును లంకకెంతయున్ 

           కలహమునందు నీక్షణమె గావున యా నెలతన్ త్యజించుచున్ 

           నిలుపుము శాంతి నో యనుజ! నీవుగ నంచు విభీషణుండనెన్. 

                                                                      పూరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 



2, మార్చి 2023, గురువారం

సమస్యాపూరణలు: 


(1).  " ఏన్గు చంపనోప దెలుకనైన "

ఆ.వె.   కాలుడు పొలయుచు మృకండు కుమారుని 
            పట్టబోయి వచ్చి భంగ పడెను 
            బాలుడైన నేమి భగుని భక్తుడు గదా! 
            యేన్గు చంపనోపదెలుకనైన. 

(2).  " ఏనుగు చంపజాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్ " 

ఉ.       పూనిన భక్తి నాహరుని పుల్కలు జెందెడి తీరు నాదటన్ 
            థ్యానమొనర్చుచున్ సతము దాస్యము జేయు మృకండు సూనునిన్ 
            జానుగ పట్టబోయి శని స్రగ్గిన తెన్నును జూడ నెంచుచో 
            నేనుగు చంపజాలదుగదే యెలుకన్ గడు విక్రమించినన్. 

                                                              పూరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

 తెలివి ఒకరి సొత్తా.........? 

    ఒక ఊరిలో ఒక పేద పండితుడు ఉండేవాడు. ఒకసారి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు సంచారం చేస్తూ ఆ పండితుడు ఉన్న గ్రామం వచ్చాడు. పండితుడు తన పాండిత్యంతో ఆ రాజుని మెప్పించాడు. ఆయన వెంటనే ఆ ఊరి కరణంతో ఆ పండితుడికి ఊరి సమీపంలో ప్రవహిస్తున్న వాగు ఒడ్డున సాగు చేసుకోవడానికి భూమిని ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కరణానికి తనను ఏమాత్రం లెక్కచేయని పండితుడంటే ఒళ్ళుమంట.  అతడు వాగు వెంబడి ఉన్న భూమిని మొత్తం పరికించి సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేని పనికిమాలిన అయిదెకరాల భూమిని ఎన్నిక చేసి సాగు చేసుకొమ్మని ఆ పండితుడి పేర ఇనాం రాయించి యిచ్చేశాడు.  

    ఇనాం పట్టా పుచ్చుకొని పొలం లోనికి అడుగు పెట్టిన పండితుడికి, ఆ భూమిని చూడగానే ఏడుపు వచ్చినంత పనైంది. అది తొండలు సైతం గుడ్లు పెట్టని భూమి. ఎందుకూ పనికి రానిది. కరణం చేసిన మోసానికి లోలోపల కృంగి పోయాడు. వాగుకు అటువైపు చూశాడు. చక్కని సారవంతమైన నేల. తనకిచ్చిన ఇనాం పట్టాలో హద్దులు చూశాడు. "ఉత్తరం వాగు" అని రాసి ఉంది. అదిచూడగానే మెరుపు మెరిసినట్లుగా అతనికొక ఆలోచన వచ్చింది. దానిని వెంటనే అమలుపెట్టి, వాగుకు అటు వైపున్న సారవంతమైన భూమిని సాగుచేయడం మొదలుపెట్టాడు. 

    కరణానికి అది తెలిసి ఒళ్ళు మండిపోయింది. వెంటనే రాజు సముఖానికి వెళ్ళి " ఆ పండితుని పొగరుబోతుతనం తమరే వచ్చి స్వయంగా చూడండి " అని ఫిర్యాదు చేశాడు. వెంటనే రాజుగారు హుటాహుటిని కదలి వచ్చారు. పండితుడు సాగుచేస్తున్న భూమిని చూసి కారణం అడిగాడు. 

    పండితుడు అమాయకంగా మొహం పెట్టి " ప్రభూ! పట్టాలో 'ఉత్తరం వాగు' అని రాసి ఉంది. వాగుకు ఉత్తరంగా ఉన్న భూమి అనుకొని దీనిని సాగుచేసుకున్నాను. తప్పయితే మన్నించండి " అన్నాడు. రాజు వాస్తవంగా పండితుడికిచ్చిన భూమిని చూశాడు. అది వ్యర్థమైనదని ఆయనకు అర్థమయింది. అంతలో కరణం చావు తెలివినీ, దానిని చక్కని సమయస్ఫూర్తితో తిప్పికొట్టిన పండితుడి తెలివినీ, అర్థంచేసుకొని, నవ్వుతూ " అదీ...ఇదీ...రెండూ నీకే! దున్నుకో " అన్నాడు ఆనందంగా. కరణానికి నోట మాట రాలేదు. 

                                                                  సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

1, మార్చి 2023, బుధవారం

 1వ తేదీన పుట్టినవారు: 


    ఏ నెలలోనైనా 1వ తేదీన పుట్టిన వారికి దృఢమైన ఇచ్ఛాశక్తి, స్వతంత్రమైన కల్పనాశక్తి, స్వతంత్ర స్వభావం, సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ తేదీలో పుట్టినవారు ప్రతి పనినీ ప్రారంభిస్తారేగాని, దానిని తుదముట్టించేందుకు యిష్టపడరు. వీరు తమ మనోభావములను బయటపెట్టరు. కానీ, సానుభూతి, ప్రశంస, ప్రోత్సాహములను అభిలషిస్తారు.  వీరికి తెలివితేటలు మిక్కుటంగా ఉంటాయి. కాబట్టి, వీరు ఏదో ఒక విషయంలో ప్రత్యేకమైన కృషి చేయడం కంటే పెక్కు విషయాలలో కృషిచేయుట లాభదాయకము. ఏదో ఒక వృత్తితో బాటు ఒక వ్యాపారాన్ని గూడా చేస్తూ ఉండాలి. అనుమానము, అధికారం చెలాయించే స్వభావాలను విడనాడాలి. మనోవికారాలకు వశపడని సునిశితమైన వివేచనాశక్తి గలిగిన వారు వీరు. వీరి వ్యక్తిత్వము ఆదర్శవంతమైనదిగా ఉంటుంది. వీరు ఆచరణతో గూడిన శక్తి సామర్థ్యములు కలిగిన వారుగా ఉంటారు. చూపులకు వీరు ప్రేమగలవారుగా కనిపించరు. కానీ వీరు యితరుల సహవాసమును అభిలషింతురు. వీరికి దయారసము మెండు. ధైర్యము, చొరవ, నాయకత్వ లక్షణములు వీరికి సమృద్ధిగా ఉంటాయి. ఉపాధ్యాయులుగను, పరిశోధకులుగను, వస్తు విక్రేతలుగను, ఇంజనీరులుగను, నూతన కల్పనలు చేయువారిగాను లేదా సృజనాత్మకమగు కల్పనాశక్తితో కూడిన ఏ వృత్తిలోనైననూ వీరు రాణించగలరు. 

                                                                                  సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 


 సమస్యా పూరణలు: 

(1).  " హారము గొలిచిన నది పది యామడ లుండెన్ " 

కం.  శ్రీరాముని నర్చించుచు 

          పారమ్యముగా జరిగిన పౌషము నందున్ 

          పోరామిని నిలిచిన జన 

          హారము గొలిచిన నది పది యామడ లుండెన్. 

(2).  " కవియే మఱి పతనమునకు కారణమగురా " 

కం.   పవిదిని నీతిని జెప్పెడు 

          కవియే మనుజుల పెనుపుకు కారణమగుచో 

          అవినీతిని బోధించెడు 

          కవియే మఱి పతనమునకు కారణమగురా! 

                                                              పూరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...