25, అక్టోబర్ 2025, శనివారం

:: స్వామి అవతరణ ::  

    గణాధిపత్య పట్టాభిషేకానికి పార్వతి ధగధగ మెరిసే రంగుబట్టల్ని ఎన్నిక చేసింది. కాని, విఘ్నేశ్వరుడు తెల్లని వస్త్రాలు ధరించాడు. 

    " మంచి బట్టలు వేసుకోవలసిన సమయంలో శుక్లాంబరధరుడు అనిపించుకున్నావేమయ్యా " అంది పార్వతి. 

    " మంచి బట్టలు కదమ్మా వేసుకోవాలి? అవే వేసుకున్నానమ్మా! తెలుపు మంచితనాన్ని, వివేకాన్ని తెలుపుతుంది " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    పట్టాభిషేకం జరిగింది. విఘ్నేశ్వరుడు గణనాథుడు అయ్యాడు. జయలక్ష్మి పేరుగల సిద్ధి, విద్యావతి పేరుగల బుద్ధి విఘ్నేశ్వరుణ్ణి వరించి ఇరుప్రక్కలా చేరారు. గణనాథుడు సిద్ధిబుద్ధి వినాయకుడు అనిపించుకున్నాడు. అదే సమయంలో ఎనిమిది దిక్కులనుండి అష్ట సిద్ధులు ఎనమండుగురు చక్కని కన్యలై వచ్చి వకుళమాలలు వేసి వినాయకుణ్ణి వరించారు. విఘ్నేశ్వరుడు సిద్ధివినాయకుడు అనిపించుకున్నాడు. కళ్యాణమహోత్సవాలు వైభవంగా జరిగాయి. 

    విష్ణువు మహేశ్వరుడితో " కోటి విఘ్నాలు వచ్చినా వినాయకుడి పెళ్ళి ఆగదు అనే కొత్తసామెత అమలుజరిగింది. ఓ కళ్యాణ గణేశా! ఇక నీ చేతి మీదుగా కళ్యాణాలు జరగాలి. అలా జరిగిన కళ్యాణ ఫలంగా అవతరించిన జన్మే జన్మ! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " అలాగే జరుగుతుందిలే. కౌసల్యకు రాముడివై అవతరించి రావణ దశ అంతం చేద్దువుగాని " అని అన్నాడు. 

    మళ్ళీ విష్ణువు " గజాననా! నీ ప్రసన్న వదనం చూస్తూంటే ఏనుగు అంటే మక్కువగా ఉందోయ్ " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " మొసలి బారినుండి గజేంద్రుణ్ణి రక్షించి కరివరదుడు అనిపించుకుందువులే " అన్నాడు.  

    ఎనమండుగురు సిద్ధి కన్యలు చామర వింజామరాలు వీస్తూండగా, సింహాసనంపై సిద్ధిబుద్ధులతో చుక్కల్లో చంద్రుడిలాగ విఘ్నేశ్వరుడు ప్రకాశిస్తున్న ఆ సమయంలో, లక్ష్మి ముఖం తిప్పుకొని వెళ్ళిపోబోతూంటే  విష్ణువు ఆమెను ఆపి, విఘ్నేశ్వరుడితో " సిద్ధివినాయకా! లక్ష్మి స్థిరమైనది కాదు అని వాదు పడుతున్నది. నీ ఒడిలో కాస్త కూర్చుండనియ్యి. లక్ష్మికి స్థిరత్వం సిద్ధిస్తుందని ఆశిస్తున్నాను " అని అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు మహానందంతో " తల్లీ! మహాలక్ష్మిని ఒడి పట్టే నా అదృష్టం ఎంత గొప్పది " అని అంటూ లక్ష్మి పాదాలను తొండంతో చుట్టి తన కుడి తొడమీద కూర్చుండ బెట్టుకున్నాడు.

    అప్పుడు విష్ణువు " ఇప్పుడు విఘ్నేశ్వరుడు " లక్ష్మీగణపతి " . తల్లి కుమారుణ్ణి ఏ విధంగా కనిపెట్టుకుని ఉంటుందో అలాగే విఘ్నేశ్వరుడి అనుగ్రహం ఉన్నచోట లక్ష్మి స్థిరంగా ఉంటుంది " అని చెప్పాడు. 

    నారదుడు " ఓహో! విఘ్నేశ్వరుడికి ఎన్ని పేర్లు? సిద్ధివినాయకుడు, లక్ష్మీగణపతి, శుక్లాంబరధరుడు - ఇంకా...ఎన్నో ఎన్నో ! " అని అంటూ మహతివీణను వాయిస్తూ " జయజయ గణనాయక జయహే " అని గానంచేస్తూ లోకాలన్నీ తిరిగాడు. 

    ఒకనాడు విఘ్నేశ్వరుడు ఎలుక వాహనంపైన ఆకాశమార్గంలో పయనిస్తూ వింధ్య పర్వతశ్రేణిని దాటి ఇంకా దక్షిణంగా వెళ్ళి ఒక పెద్ద నల్లని కొండగగ్గర దిగాడు. కొండ దిగువనే శబరులు డోళ్ళు, డప్పులూ కోలాహలంగా వాయిస్తూ పెద్ద సంబరం జరుపుకుంటున్నారు.

    విఘ్నేశ్వరుడు తన రూపాన్ని ఉపసంహరించుకొని అందమైన కుర్రవాడి రూపంతో ఉత్సవాన్ని సమీపించాడు. 

    శబరులు కుర్రవాణ్ణి చుట్టుముట్టి " దేవర తనకోసం మంచి చిన్నోడిని పంపినాడు " అంటూ ఎత్తుకుపోయి ఉత్సవం మధ్యలో దింపారు. 

    అక్కడ రక్తచారలతో పెద్ద నల్లని గండశిల ఉన్నది. ఎదురుగా ఒక పసివాడు మూగగా ఏడుస్తూ ఉన్నాడు. ఆ పిల్లవాడి ఒంటినిండా పసుపురాసి, మొలకు నల్లని గుడ్డ కట్టి, ఎర్రని మందారమాలతో అలంకరించారు. 

    విఘ్నేశ్వరుడు శబర నాయకుడితో " మీ దేవరతో నేను మాట్లాడాలి. నన్ను అతని దగ్గరకు తీసుకు వెళ్ళండి " అన్నాడు. 

    శబర నాయకుడు పకపకా నవ్వుతూ " బలే చిన్నోడివే. మా స్వామితోనే మాటాడతావా? మా స్వామి కారుచీకటిలాగ మహా భీకరంగా ఉంటాడు. ఎవరూ చూళ్ళేరు. చూస్తే రక్తం కక్కుకొని చచ్చిపోతారు." అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నవ్వి, తటాలున వెళ్ళి గండశిలను సమీపించి  " మీ భయాన్నే మీ స్వామికి అంటగట్టి భయంకరంగా ఉంటాడని అనుకుంటున్నారు. భయాన్నే భక్తి అనుకుంటున్నారు. మీలో ఉండే క్రూర స్వభావమే బలిగా తయారయింది.  ఇదంతా తప్పు. మీరెవ్వరూ మీ స్వామిని చూసి ఎరుగరు. మీ స్వామి ఎన్నడు ఇలాంటి ఉత్సవాన్ని, బలినీ కోరలేదు. మీ స్వామి ఎంతో అందంగా ఇలాగ ఉంటాడు " అని చెబుతూ అరచేత్తో రాతిని తట్టాడు. నల్లని బండరాయి తెల్లని అరటి దవ్వలాంటి అందమైన స్వామి విగ్రహంగా మారింది. ముణుకులపై చేతులుచాచి కూర్చున్న స్వామి విగ్రహం నవ్వు ముఖంతో మనోహరంగా కనిపించింది. విఘ్నేశ్వరుడు పసివాడి తల నిమిరాడు.

    ఆ పిల్లవాడు గొంతెత్తి " స్వామీ! నీవే శరణం " అంటూ విగ్రహం ముందు మోకరిల్లి స్తోత్రం మొదలుపెట్టాడు. 

    నల్లరాయి స్వామి విగ్రహంగా మారడం, మూగపిల్లవాడు గొంతెత్తి మాటలు పలకడమూ రెప్పపాటున జరిగాయి. 

    అద్భుతాలకు శబరులు నివ్వెరపాటుతో చేతులెత్తి, భయం భయంగా విఘ్నేశ్వరుడికి మ్రొక్కారు. 

    కుర్రవాడి రూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు వారిస్తూ " నన్ను కాదు మీరు మ్రొక్కవలసింది మీ స్వామిని. భయాన్ని విడిచి ప్రేమతో కొలవండి. మీరు నమ్మిన దేవరను తండ్రిలాగ, అన్నలాగ, స్నేహితుడిలాగ చూసుకోండి. బలులు మొదలైన చెడ్డపనులు మానేసి ఫల పుష్పాలతో, అరటి తోరణాలతో ఆనందంగా పండుగలు చేసుకోండి. ఈ మాటలు వచ్చిన పిల్లవాడె మీకు గురువుగ, స్వామి పూజారిగా ఉంటాడు. నేను మీ స్వామి దగ్గరకు వెడుతున్నాను. మీ స్వామి మీకు దర్శనమిస్తాడు " అని చెప్పి చరచరా కొండను ఎక్కుతూ వెళ్ళాడు. 

    శబరులు కొంతవరకు అతనిని అనుసరించి వెళ్ళి ఆగిపోయారు. 

    విఘ్నేశ్వరుడు కుర్రవాని రూపంతోనే పర్వతాగ్రానికి చేరాడు. అక్కడ భైరవస్వామి తలవాల్చుకొని విచారంగా కూర్చొని ఉన్నాడు. అతని శరీరం కారునల్లగా ఉన్నది. 

    విఘ్నేశ్వరుడు పరుగున వెళ్ళి భైరవుణ్ణి రెండు చేతులా చుట్టి ఆలింగనం చేసుకున్న క్షణంలో భైరవుడి శరీరం తెల్లగా వెన్నెలకాంతితో ప్రకాశించింది. 

    దివ్యమంగళరూపాన్ని పొందిన భైరవుడు కుర్రవాణ్ణి ఆనందంతో కౌగలించుకొని " నీవు విఘ్నేశ్వరుడివి. నాకు తెలుసు. నీ అనుగ్రహంతో నా కారుదనం పోయి దైవత్వం సిద్ధిస్తుందని నేను అవతరించినపుడు ఆకాశవాణి చెప్పింది. ఈ కొండ ఎక్కడానికి ఎవ్వరూ సాహసించరు. నన్ను చూసి పక్షులుగూడా ధ్వని చెయ్యవు. నన్ను నేనే అసహ్యించుకొంటూ నీకోసం ఎంతకాలం నుంచో నిరీక్షిస్తూ ఉన్నాను. నీ నిజరూపంతో నా కన్నులకు విందు చెయ్యి " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు నిజరూపాన్ని పొంది అతనితో " ఇకనుండి నీవు దైవంగా ఆరాధింపబడే స్వామివి. శివకేశవులిద్దరూ నీలో ఉన్నారు. నీ గురించి అమ్మ చెప్పినప్పట్నుంచి నిన్ను కలుసుకోవాలని తహతహ పడుతూనే ఉన్నాను. మోహం చీకటి లాంటిది. శివుడు మోహపరవశుడై జగన్మోహినీ రూపం ధరించిన విష్ణువు వెంట బడ్డాడు. శివ, విష్ణువుల తేజస్సులు ఒకటిగా కలిసి నీ అవతరణం జరిగింది. అందువలన నీకు నల్లని రూపు వచ్చింది. ఇప్పుడు నీ అంత దివ్య మంగళ సుందరుడైన స్వామి వేరొకడు లేడు. శబరులకు ఒకసారి కనిపించు " అన్నాడు. 

    తరువాత కుర్రవాని రూపంతో శబరుల దగ్గరకు వచ్చి " మీ స్వామి విగ్రహం ముందు మోకరిల్లి ఏకకంఠంతో " స్వామీ శరణం " అని పిలవండి. మీ స్వామి మీకు కనిపిస్తాడు. పిలిచినప్పుడల్లా పలుకుతాడు. పంటలు పండించండి. ఇళ్ళు వాకిళ్ళు పల్లెలు కట్టుకొని సుఖంగా మనుష్యుల్లా జీవించండి. మీ స్వామి అండదండలెప్పుడూ మీకు రక్షగా ఉంటాయి, వెళ్ళండి " అని చెప్పి అదృశ్యమయ్యాడు. 

    శబరులు నివ్వెరపోయి దండాలు పెట్టి, విగ్రహం దగ్గరకు చేరుకొని స్వామిని నోరారా పిలుస్తూ మ్రొక్కారు. దివ్యసుందర రూపంతో స్వామి వారికి సాక్షాత్కరించి చిరునవ్వులతో అభయముద్ర పట్టి వారిని ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. 

    అప్పటినుంచి శబరులు ఏటేటా మార్గశిరమాసంలో అరటిచెట్టు బోదెను, లేత ఆకును అనేక విధాలుగా ఉపయోగించి స్వామికి మంటపాలనూ, పందిళ్ళనూ అలంకరణచేసి, బలులు మొదలైనవి మాని సాత్వికారాధనతో స్వామిని భయంలేని భక్తితో అర్థిస్తూ, నాగరికులై, విద్యావంతులై ఉన్నత మానవత్వాన్ని సాధించారు. స్వామి నివసించిన కొండపై గొప్ప ఆలయాన్ని శిల్పకళానిలయంగా నిర్మించి సంగీతనృత్యకవితలతో అలరించి గర్వించదగ్గ మానవజాతిగా రూపొందారు. 

    కుర్రవాని రూపంలో వచ్చినదెవరో శబరులకు తెలియదు. వారి దేవర స్వామియే ఆ రూపంలో వచ్చి తమ అజ్ఞానాన్ని తొలగించి అనుగ్రహించాడని అనుకున్నారేగాని, విఘ్నేశ్వరుని లీల అని ఎరుగరు. విఘ్నేశ్వరుడు అలా ఎరుకపడి ఉంటే విఘ్నేశ్వరుడే దేవుడని ఆరాధనలు మొదలుపెట్టి  తమ స్వామినే విస్మరించుతారని విఘ్నేశ్వరుడు అజ్ఞాత బాలకుడిగానే ఉండిపోయాడన్న సంగతి స్వామి పదే పదే తలచుకొని మనసారా విఘ్నేశ్వరుణ్ణి స్మరిస్తూండే వాడు. కైలాసానికి వెళ్ళి విఘ్నేశ్వరునితో, కుమారస్వామితో  ఆనందం పంచుకోవాలని ఉవ్విళ్ళూరేవాడు. 

    విఘ్నేశ్వరుడు శబరులను సంస్కరించి మూషికవాహనుడై ఆకాశమార్గంలో క్రిందకు చూస్తూ ఉత్తరదిశగా తిరుగు ప్రయాణం చేస్తున్నాడు. కొండచరియలన్నీ కీకారణ్యములతో నిండి ఉన్నాయే గాని, భూమి అంతా బీడుపడిన మైదానంలా కనిపించింది. జలసమృద్ధి ఉంటే కనులపండుగగా పైరుపచ్చగా ఉండవలసిందిగాని, నీటి కొరత తీర్చే నదులు లేక సౌభాగ్యశూన్యంగా భూములు వెలవెల పోతున్నవి. ప్రజలు ఆకాశాన్ని మబ్బుల్ని నమ్ముకొని ఏదోఒకలాగ జీవయాత్ర సాగిస్తున్నారు. 

    గంగమ్మలాంటి నది కలిగిన ఉత్తరదేశ ప్రజలు ఎంత పుణ్యం చేసి పుట్టారో! అంత గంగ మనకు లేకపోయినా అందులో ఒక పాయ మనకు ఏ దేవుడైన్నా కనికరించి ఇవ్వకూడదా? ముక్కోటి దేవుళ్ళున్నారంటారు, ఎందుకు? ఒక్కరికీ జాలిలేదు " అంటూ సామాన్య ప్రజలు అనుకుంటున్న మాటలు వినిపిస్తూనే ఉన్నాయి విఘ్నేశ్వరుడి పెద్ద చెవులకు. 

    అటు పడమటి దిక్కున ఎత్తైన పర్వత శ్రేణులు, ఇటు తూర్పున చిన్న చిన్న కొండలబారుతో నిండిఉన్న భూభాగాలు విశాలంగా తూర్పు సముద్రం వరకూ ఊరికే ఉన్నాయి. ఎక్కువమంది జనులు జంతువుల్ని, పక్షుల్ని వేటాడి తింటూ ఆటవిక జీవనం సాగిస్తున్నారు. సేద్యం మీద ఆధారపడ్డ వారు అగచాట్లు పడుతూనే ఉన్నారు. సముద్రంమీద ప్రాణభీతి విడిచి చేపలుపట్టే జాలరులు విశేషంగా కనిపించారు. చాలీచాలని మేతతో పశుగణాలు బక్కచిక్కి దీనంగా కనిపించాయి. తూర్పుతీరం పొడవునా జాలరిపల్లెలే కనిపించాయి గాని మంచి ఊళ్ళు లేవు. 

    ఉత్తరభూమితో పోల్చి చూస్తే విఘ్నేశ్వరుడికి చాలా విచారం కలిగింది. హిమాచలసీమలో ఎటు చూసినా సుందరజలపాతాలతో, రమణీయ సరోవరాలతో, నదీనదాలతో మనోహరంగా కనిపించే పచ్చని ప్రకృతి కళకళలాడుతూ ఆనందదాయకంగా ఉంటుంది. ఇక్కడ పడమటి పర్వతాలు దిష్టిబొమ్మల్లాగా బోడిగా ఉన్నాయి.

    ఆ పర్వతశ్రేణి నడుమ సహ్యాద్రి చేరువనున్న లోయలో గౌతముని ఆశ్రమం మసిబొగ్గుల్లో మరకతంలాగా ఆకుపచ్చగా మెరుస్తున్నది. విఘ్నేశ్వరుడికి ఏదో ఆలోచన వచ్చినట్లుగా తలపంకించాడు. ఎలుకను వేగం పెంచమని హెచ్చరికగా తట్టి దక్షిణాదిని, వింధ్యను దాటి ఉత్తరాది చేరుకున్నాడు. ఉత్తరభూమి దూరానికి అంతా ఏదో కొత్తగా ఉన్నట్టు కనిపించింది. 

    సమీపించేసరికి అక్కడ అంతా అయోమయంగా ఉంది. 

( సశేషం. తరువాత విఘ్నేశ్వరుడేం చేశాడన్నది వచ్చే వారం. అంతవరకు శలవు. ) 

18, అక్టోబర్ 2025, శనివారం

:: ప్రమథగణాధిపత్యం :: 

    కుమారస్వామికి తన పెళ్ళి ఆగిపోవడానికి కారణమైన విఘ్నేశ్వరుడి మీద గుర్రుగా ఉంది. 

    ఒకనాడు అతడు తల్లితో " వాజమ్మ గాక జేజెమ్మ ఎలాగౌతాడమ్మా! అన్న. నలుగుముద్ద తిండిముద్దకే గాని ఘనకార్యం చేయగలడా? " అన్నాడు ఎకసెక్కెంగా. 
    
    వినాయకుడు గుడ్ల నీరు బెట్టుకొని " చూడమ్మా! తమ్ముడు ఎంతలేసి మాటలంటున్నాడో " అంటూ ఏడ్చినంత పని చేశాడు. 

    పార్వతికి కూడా కోపం వచ్చింది. వినాయకుణ్ణి అక్కున చేర్చుకొని బుజ్జగిస్తూ " నాన్నా! నేను చేసిన బొమ్మవని వీళ్ళకు అక్కసురా! తండ్రి చంపనే చంపేశాడు. తమ్ముడు ఇలాగ దెప్పుతున్నాడు. పోనీలే. వాళ్ళ అజ్ఞానం వాళ్ళకే తలవంపు " అంది. 

    " తమ్ముడు అజ్ఞాని అయితే అవుతాడు గాని, నాన్నకు అజ్ఞానం ఏమిటమ్మా! నీ పిచ్చిగాని....." అన్నాడు గణపతి ఆశ్చర్యంగా. 

    పార్వతి ఏదో తలంచుకొని " నాకు కాదురా పిచ్చి, ఆ శంకర మహాదేవుడికే పిచ్చి ఎక్కి విష్ణుదేవుడి జగన్మోహిని అవతారం వెంటబడి నవ్వులపాలవలేదా ఏమిటి? " అన్నది.

    " ఆ తర్వాతేం జరిగిందమ్మా? " అన్నాడు గణపతి. 

    " ఏదో ఘోరమే జరిగింది. వాళ్ళిద్దరి మధ్యా ఒక భైరవుడనే కారుచీకటిలాంటి భూత పిల్లడు పుట్టాడుట " అంది తల్లి.

" భైరవు డెక్కడుంటాడమ్మా? వాణ్ణి చూడాలని ఉంది " అన్నాడు కొడుకు. 

    " ఎక్కడో ఉంటాడు. నల్లటి బట్టలు కడతాడట. వాడి దగ్గరకు పొరబాటున కూడా వెళ్ళకుసుమీ! " అంది పార్వతి. 

    " ఝడుసుకోవడమంటే ఏమిటమ్మా? అదికూడా తెలుసుకోవద్దూ? " అన్నాడు గణపతి. 

    " పెళ్ళాడితే తెలుస్తుంది " అంది పార్వతి. 

    " అదీ సంగతి. భార్యా రత్నాలు అంటే అంత భయంకరం అన్నమాట. అందుకే నేను పెళ్ళిచేసుకోనమ్మా! " అన్నాడు గణేశుడు. 

    కుమారస్వామి అందుకొని " అదే నీ ఘనకార్యం. నేను యిప్పుడే పోయి సూర్యుణ్ణి చుట్టి వస్తాను " అంటూ నెమలినెక్కి తుర్రుమన్నాడు. 

    విఘ్నేశ్వరుడు తిన్నగా వెళ్ళి మేరుపర్వతం ఎక్కి చిట్టచివర శిఖరాగ్రం మీద కూర్చున్నాడు. 

    మేరుపర్వతం చుట్టూరా సూర్యుడు తిరుగుతూంటాడు. అక్కడ సూర్యాస్తమయం అనేది ఉండదు. 

    కుమారస్వామి శ్రమపడి సూర్యుడి చుట్టూరా ప్రదక్షిణం చేసి వచ్చి అన్న మేరుపర్వతం ఎక్కి కూర్చున్నాడని తెలుసుకొని, విచారంగా ముఖం వేలవేసి ఊరుకున్నాడు. 

    " ఏం కుమారా! అలా తల వేలాడదీసుకున్నావు? " అని పార్వతి ఆశ్చర్యపోతూ అడిగింది. 

    " అమ్మా! నేను సూర్యుడి చుట్టూరా తిరిగితే, అన్న సూర్యుణ్ణి తన చుట్టూరా త్రిప్పుకొంటున్నాడమ్మా! నిజం చెప్పాలంటే అన్న చేసినదే ఘనకార్యం " అన్నాడు కుమారస్వామి. 

    కొద్దిరోజుల తర్వాత పార్వతి మళ్ళీ పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. 

    " అమ్మా! సౌందర్యంలో నీకు సమఉజ్జీ అయిన సుందరి కనిపిస్తే పెళ్ళాడాలని ఉందమ్మా! " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    పార్వతి చురక తగిలినట్లు పెదవి కరచుకొని " అలాగైతే ఇంటి మొగసాల కూర్చొని, దారివెంట వచ్చి పోయేవాళ్ళను చూస్తూండరా, కుంకా! " అంటూ కదిలింది. 

    " అలాగే తల్లీ! నీ ఆజ్ఞ " అని వినాయకుడు వీధిలో కూర్చొని, కొంతసేపు తూర్పుకి, మరికొంతసేపు ఉత్తరంగా, అలాగా ఎనిమిది దిక్కులకూ ముఖం పెట్టి చూడసాగాడు. 

    పార్వతి అతని వింత చేష్టకు వింతగా చూసి, " ఏం నాయనా! కనిపించిందా? " అని అడిగింది. 

    విఘ్నేశ్వరుడు " అమ్మా! ఏ దిక్కు చూచినా నాకు మరేమీ కనిపించలేదు. జగజ్జననివైన నీవే ఎనిమిది చేతులతో ఎనిమిది దిక్కులా కనిపిస్తున్నావమ్మా! " అన్నాడు. 

    పార్వతి ఆనందంతో మైమరచిపోయింది. " నాయనా! విఘ్నరాజా! అందరు దేవుళ్ళూ తూర్పుముఖంగా ఉండి పూజలందుకోవాలని నియమం ఉందిగాని, నీవు ఎటు ముఖం పెట్టి ఉన్నా ఆరాధనీయుడివే! " అని వరం యిచ్చింది. అతని పెళ్ళిమాటే మర్చిపోయి, ముద్దుల కొడుకు మురిపెంపు మాటలు శివుడితో ఒకటికి రెండుసార్లు చెప్పిచెప్పి ఆనందించింది. 

    చివరకు పార్వతి పట్టుబట్టి పెళ్ళి ప్రస్తావన తెచ్చింది. " అమ్మా! తమ్ముడు దేవసేనాధిపతి పదవిలో ఉన్నాడు. అతను యిద్దర్ని పెళ్ళాడినా తగును. నేను ఊరికే తింటూ కూర్చున్నాను. ఎలా పెళ్ళి చేసుకునేది? " అన్నాడు విఘ్నరాజు. 

    శివుడు " నువ్వు నా ప్రమథగణాలన్నిటికీ గణనాథుడివిగా ఉండు " అన్నాడు. 

    " నాన్నగారూ! ఉండమంటే సరా? అర్హత ఉండాలికదా! తమ్ముడు ఎలాగూ సేనాధిపత్యంలో ఆరితేరి ఉన్నవాడు, ఉండనే ఉన్నాడు గదా! " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    ప్రమథులు కుమారస్వామినే అభిమానించారు. శివుడు " లేదు నా గణాలకు గణనాథుడుగా విఘ్నేశ్వరుడే ఉండాలి. కుమారస్వామికి దేవసేనాధిపత్యం ఉండనే ఉంది. అదీగాక రెండు పనులు చూసుకోవడం శ్రమకూడా! " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " నాన్నగారూ! ఏదైనా పరీక్షపెట్టి నెగ్గిన వారికే గణనాయకత్వం యివ్వడం సమంజసంగా ఉంటుందిగదా! " అన్నాడు. 

    దేవతులు, ప్రమథులు కలిసి ఒక పందెం పెట్టారు. ఈ భూమ్మీదున్న అన్ని క్షేత్రాల్ని, తీర్థాల్ని ఎవరు ముందు సేవించి తిరిగి వస్తారో వారు గెల్చినట్టు అని. 

    కుమారస్వామి నెమలిమీద ఎగిరి వెళ్ళాడు. వినాయకుడు చక్కా చతికిలబడి కూర్చున్నాడు. 

    అప్పుడు విష్ణువు అతణ్ణి ఏకాంతానికి తీసుకువెళ్ళి, " నాయనా! మేము నిన్ను అభిమానిస్తున్న వాళ్ళం. నీ ఓటమి మా దేవతలందరికీ ఓటమి అవుతుంది. మాకు తలవంపులు తేవడం నీకు భావ్యంకాదు. అదీగాక, తండ్రి గొప్పదనం తనయుడు నిరూపించితేనే జన్మ సార్ధకత అవుతుంది. నువ్వేమీ తిరగనక్కరలేదు. నేను చెప్పినట్టు చేస్తే చాలు " అని విఘ్నేశ్వరుడి చెవిలో రహస్యం ఉపదేశించాడు. 

    పార్వతి " హమ్మయ్య " అనుకుంటూ విష్ణువును కృతజ్ఞతగా చూసింది. 

    విఘ్నేశ్వరుడు మఠం వేసి కన్నులు మూసి శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు. 

    కుమారస్వామి వెళ్ళినచోటల్లా అంతకంటే ముందే విఘ్నేశ్వరుడు ఎలుకమీద వచ్చి తీర్థమాడి సేవించి వెళ్ళినట్లు తెలుసుకొని ఆశ్చర్యపడుతూ హతాశుడై తిరిగి వస్తూనే తాను ఓడిపోయినట్లూ, విఘ్నేశ్వరుడిదే విజయమని చెప్పాడు. 

    విఘ్నేశ్వరుడు తమ్ముడితో చేతులు కలిపి శివుడి వద్దకు తీసుకెళ్ళి " తమ్ముడూ ! నేను జయించనూ లేదు, నీవు ఓడనూ లేదు. మనం యిద్దరం నిమిత్తమాత్రులం. జయించింది నాన్నగారే! శివపంచాక్షరీ మహిమ అలాంటిది. గెలిచినది శివనామం. గెలిపించింది విష్ణువు " అని జరిగింది చెప్పాడు. 

    విఘ్నేశ్వరుడు, కుమారస్వామి చెరో పాదం పట్టుకొని తండ్రికి మ్రొక్కారు. 

    కుమారస్వామి అందరి మధ్య నిలబడి " విఘ్నేశ్వరుడికి ప్రమథగణాధిపత్య పట్టాభిషేకం సత్వరమే జరగాలి. శివుని ఆజ్ఞ అందరికీ శిరోధార్యం " అని నొక్కి చెప్పాడు. 

    దేవతలు సంతోషించారు. సిద్ధ, సాధ్య, యక్ష, భూత గణాల వారంతా హర్షం ప్రకటించారు. ప్రమథగణ ప్రముఖులైన భృంగీశ్వర, శృంగీశ్వర, చండీశ్వర, నందీశ్వరులు మాత్రం వ్యతిరేకించారు. లోగడ పుత్రగణపతి రూపంలో వాళ్ళకు విఘ్నేశ్వరుడు శృంగభంగం చేశాడు. 

    ఆ అక్కసుతో వారు " కుమారస్వామికి తన బలాలు అంటూ దేవగణసేనలు ఉన్నాయి. మేము శివుని నమ్మినబంట్లుగా శివగణంగా మొదటినుంచీ పరిగణింపబడుతున్నాం. అటువంటప్పుడు విఘ్నేశ్వరుడు మాకు అదిపతి ఎలాగ అవుతాడు. గణపతి అనిపించుకోవడానికి కూడా అతనికి తనది అంటూ ఎలాంటి బలగమూ లేదు. గణాధిపత్య పట్టాభిషేకం దేనికి? " అని కుళ్ళు వెళ్ళబోసుకున్నారు. 

    శివుడు కళ్ళెర్రజేశాడు. " నా నిర్ణయాన్నే అధిక్షేపించగలంతగొప్పవారై పోయారా మీరు? " అని ప్రమథనాయకుల్ని ఈసడించుకున్నాడు.

    విఘ్నేశ్వరుడు శాంతంగా " ఔను ఔను నిజమే! నా గణాలు ఎక్కడ? ఏవీ? లేవు. లేవు కాబోలు! అన్నట్టు పుత్రగణపతిగా ఉన్నప్పుడు నాకూ కొంత బలగం ఉన్నట్లు అనుమానం. ఆ గణాలు ఎక్కడ? ఎక్కడ? అని అరిచాడు. 

    అప్పుడు కోటానుకోట్ల విఘ్నేశ్వరుడిలాంటి వారు దిక్కులు ఈనినట్లు పుట్టుకొచ్చి దిక్కులు పిక్కటిల్లేలాగా జయజయధ్వానాలు చేస్తూ విఘ్నేశ్వరుడి బలాలుగా వచ్చి నిలుచున్నారు. 

    వారందరికీ తలా నాలుగు చేతులున్నాయి. నాలుగు చేతుల్లో అనేక ఆయుధాలు, పరికరాలు, చిత్రవిచిత్ర వస్తుజాలమూ ఉన్నాయి. కొందరి చేతుల్లో గంటాలు, లేఖినులు, కుంచెలు, రంగులు ఉంటే మరికొందరి చేతుల్లో శూలాలు, విల్లమ్ములు, కత్తులు, గదలు ఉన్నాయి. కొందరు కొడవళ్ళు, సుత్తులు, కత్తులు, రంపాలు, ఉలులు, శేనాలు పట్టుకొని ఉన్నారు. మరికొందరు వీణలు, మృదంగాలు, వేణువులు, డప్పులు వాయిస్తున్నారు. మూలికలు, ఔషధాలు, పానీయాలు, నాగళ్ళు, రాట్నాలు, నవరత్నాభరణాలు, పూలమాలలు, పండ్లు, తినుబండారాలు మొదలైన వెన్నెన్నో పట్టుకొని ఉన్నారు. వారిమధ్య దేవుళ్ళూ, దేవతలూ, ప్రమథాదిగణాలవాళ్ళు, బియ్యం రాశిలో రాళ్ళలా అక్కడక్కడ కనిపించారు. 

    విఘ్నేశ్వర రూపులు కొందరు ఆకాశంలో ఎగురుతూ అంతరిక్షానికి దూసుకుపోతున్నారు. ఆ గణాధిప గణాల చేతుల్లో ఛత్రచామరాలు, వీవనలు, వింజామరలు, ఆడుతున్నవి. ఆకాశంలో రెపరెపలాడుతున్న అరుణారుణ పతకాల్ని, ఇంకా అనేక రంగురంగుల ధ్వజాల్ని పట్టుకొని ఉన్నారు. వారు రత్నభూషితమైన పెద్ద భద్రసింహాసనాన్ని తెచ్చారు. విఘ్నేశ్వరుణ్ణి దానిపై కూర్చుండబెట్టి ఛత్రచామరాలు పట్టారు. శ్వేతఛత్రం ముత్యాల జాలరులతో ప్రకాశించింది. చిట్టెలుక సింహాసనం క్రింద చిందులు వేసింది. 

    పార్వతి మరొకసారి మళ్ళీ మైమరచి భద్రసింహాసనాశీనుడైన విఘ్నేశ్వరుడికి నమస్కరించబోయింది. " అమ్మా! అమ్మా! వద్దు. నీ ముద్దుల కుమారుణ్ణి " అని విఘ్నేశ్వరుడు వారిస్తూ చేతులూపేసరికి అంతా అదృశ్యమై విఘ్నేశ్వరుడు ఒక్కడూ వినయంగా తల్లికి ప్రణమిల్లాడు. 

    " విఘ్నేశ్వరా! " అన్న పిలుపు శంఖధ్వనిలా వినిపించింది. ఆ పిలిచింది విష్ణువు. విఘ్నేశ్వరుడు అటు చూడకుండానే " నువ్వు చెప్పబోయేది నాకు తెలుసు " అన్నాడు 

    " నీకు తెలిసినా అది అందరకూ కూడా తెలియాలి కదా! అదే చెబుతున్నాను " అంటూ విష్ణువు " విఘ్నేశ్వరుడి పెళ్ళి వేయి విఘ్నాల సామెతగా విఘ్నేశ్వరుడు కల్పించుకొన్న విఘ్నాలు ఇప్పటికి వెయ్యీ పూర్తయ్యాయి. ఇటు పైని విఘ్నం కల్పించుకోవడానికి వీల్లేదు. కల్పించుకున్నా చెల్లదు " అని గట్టిగా పలికాడు. 



11, అక్టోబర్ 2025, శనివారం

:: వెయ్యివిఘ్నాలు ::  

    ఒకనాడు నారదుడు కైలాసానికి వెడుతున్న దారిలో కంటకముఖి అనే ఒక యక్షిణి పరిహాసంగా " నన్ను పెళ్ళాడవయ్యా నారదా! బ్రహ్మచెర తప్పించుకోవయ్యా బ్రహ్మకొడుకా! " అని అన్నది

    నారదుడు " నేను కలహభోజనుడను. కలహం వండి పెట్టగలిగింది దొరకాలిగదా! " అన్నాడు. 

    " నేను నీకంటే జగడాలమారిని " అంది యక్షిణి. 

    ఆ సమయంలో విఘ్నేశ్వరుడూ, కుమారస్వామీ చెట్టాపట్టాలేసుకొని వస్తున్నారు. నారదుడు " ఆ వస్తున్న అన్నదమ్ములమధ్య జగడం తేగలవా? " అన్నాడు. 

    " ఓష్! అదెంత! " అని కంటకముఖి పక్కనున్న దళసరోవరంలోకి దూకి బంగారు తామరపువ్వుగా మారి, " పార్వతీపరమేశ్వరుల సుపుత్రుడి కోసం వికసించాను " అంటూ కిన్నర మీటుతున్నట్లు పాట మొదలుపెట్టింది. అన్నదమ్ములిద్దరూ దాన్ని పట్టుకొని నాది, నాది అని వాదులాడుతూ " అమ్మ చేసిన బొమ్మవు నీవు, మురికి ముద్దవు " అని కుమారస్వామి విఘ్నేశ్వరుణ్ణి ఆక్షేపిస్తే, " నువ్వు మురికిగుంట శరవణ సరస్సులోంచి వచ్చావు " అని విఘ్నేశ్వరుడు కుమారస్వామిని ఎత్తిపొడిచాడు. 

    కుమారస్వామి పిడికిలి బిగించి పొడవబోయాడు. విఘ్నేశ్వరుడు తొండంతో అతని చేతి మణికట్టు బిగించాడు. ఇద్దరూ కలబడ్డారు. వినాయకుడు కుమారస్వామి నడుము తొండంతో బిగించి పైకెత్తాడు. కుమారస్వామి పైనుంచి బళ్ళాన్ని విఘ్నేశ్వరుడి బొజ్జకు గురిపెట్టాడు. 

    నారదుడు పరుగు పరుగున వచ్చి వారి కలహాన్ని నివారించి " మీరిద్దరూ ఏదైనా పందెం పెట్టుకోండి " అన్నాడు. 

    కుమారస్వామి ఆలోచించి " ఎవరు విశ్వాన్ని చుట్టి ముందువస్తే వారిదీ స్వర్ణకమలం " అన్నాడు. 

    " బాగుంది " అన్నాడు నారదుడు. 

    కుమారస్వామి వెంటనే నెమలిమీద విశ్వప్రదక్షిణానికి ఎగిరి వెళ్ళాడు. 

    విఘ్నేశ్వరుడు చతికిలబడి నిట్టూర్చగా, నారదుడు " ఏం విఘ్నేశా! నీ సంగతేమిటి? " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు " ఎవరికెంత ప్రాప్తో అంతేకాని, స్వర్ణకమలం నాకు రమ్మంటే వస్తుందా? నారదా! నా బొజ్జతో, చిట్టెలుక వాహనంతో నేనెక్కడ? విశ్వప్రదక్షణ ఎక్కడ? తమ్ముణ్ణే తీసుకోనీ కమలం " అన్నాడు.

    నారదుడు " విఘ్నపతీ! విశ్వ జననీ జనకులైన పార్వతీ పరమేశ్వరులను దర్శిద్దామని వచ్చాను గానీ మళ్ళీ వస్తాను. అని చెప్పి వెళ్ళాడు. 

    విఘ్నేశ్వరుడు చప్పున లేచివెళ్ళి, ఒక తిన్నెపై కూర్చున్న పార్వతీశివుల చుట్టూరా ముమ్మారు ప్రదక్డణచుట్టి తమ్ముడి రాకకు ఎదురుచూస్తూ నిలబడ్డాడు. 

    చాలాసేపటికి ముప్పుతిప్పలుపడి విశ్వప్రదక్షణం చేసిన కుమారస్వామి నెమలివాహనం దిగాడు. విఘ్నేశ్వరుడు తమ్ముణ్ణి కౌగలించుకొని, " తమ్ముడా! పాపం చాలా శ్రమపడి విశ్వం చుట్టి వచ్చావు. స్వర్ణకమలం నువ్వే వెళ్ళి తీసుకో. గెలవడం నేనే గెల్చాను గాని, నాకది అక్కర్లేదులే! " అన్నాడు. 

    కుమారస్వామి నివ్వెరబోతూ, " అదెలాగా? " అన్నాడు. 

    " నీకంటే ముందు నేనే ముమ్మారు విశ్వ ప్రదక్షణ చేసి నిలబడ్డాను. ఎవరి నడుగుతావో అడుగు " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    " విఘ్నేశ్వరుడే గెల్చాడు " అని ఆకాశవాణి ముమ్మారు పలికింది. 

    కుమారస్వామి నిజం తెలుసుకొని వినాయకుడి ముందు మోకరిల్లి, " అన్నా! నేను పెద్ద తపస్సుచేసి బ్రహ్మజ్ఞానం పొందానేగానీ, చిన్న విషయంలో అజ్ఞానంలోనే పడ్డాను. నువ్వు కుశాగ్రబుద్ధివి. నీముందు నేనెంత? నీ తరువాత వాణ్ణే గదా! తారకాసురుడుపై యుద్ధానికి వెడుతున్నాను. నన్ను ఆశీర్వదించు " అన్నాడు. 

    విఘ్నేశ్వరుడు కుమారస్వామిని లేవదీసి " తమ్ముడూ! నేను పెద్ద అనీ, నీవు చిన్న అనీ అనుకోవద్దు. నీవు కారణ జన్ముడవు. నీవు అన్నట్లుగా అమ్మ ఏదో ఆటగా చేసిన బొమ్మనే నేను. నీ కోసమే పార్వతీశివుల కళ్యాణం జరిగింది. వారి అనురాగ ఫలానివి. నీకు విజయం ఎప్పుడో రాసిపెట్టే ఉంది. తారకాసురుడు నీచేతనే చావాలని వరం కోరుకున్నాడు. నీవు సుబ్రహ్మణ్యేశ్వరుడవు. నాకు అన్నిచోట్లా మామూలు గుళ్ళు ఉంటాయిగాని, నీకు కొన్ని ప్రాంతాల్లో గొప్ప క్షేత్రాలు, పెద్దపెద్ద ఆలయాలు, గోపురాలు ఉంటాయి. ప్రముఖ దైవమూర్తిగా ఆరాధింపబడతావు. శీఘ్రంగా వెళ్ళి తారకాసురుడి బెడద వదిలించు " అన్నాడు.

    యక్షుల అధిపతి కుబేరుడు కంటకముఖిని పట్టి తెప్పించి " ఓసీ! మాయలమారి పాపిష్ఠిదానా! శివుడి కుమారులకే కలహం పెట్టావు. పల్లేరువై పడియుండు " అని శపించాడు. 

    కంటకముఖి ప్రాధేయపడగా, విఘ్నేశ్వరుడి అనుగ్రహంవల్లనే శాపం తొలగుతుంది. అని చెప్పాడు కుబేరుడు. కంటకముఖి పల్లేరు ముళ్ళడొంకగా భూమ్మీద మొలిచింది. 

    కుమారస్వామి దేవతలకు సేనానాయకుడై తారకాసుర నిర్మూలన చేశాడు. అతనికి దేవేంద్రుని కూతురు దేవయానను యిచ్చి వివాహం జరిపించడానికి సర్వ సన్నాహాలు చేయబడ్డాయి గాని, అన్నకు కానిదే తమ్మునికెలాగ చేయడం అన్నారు. 

    పార్వతి విఘ్నేశ్వరుడితో " ప్రియనందనా! తమ్ముడి పెళ్ళి జరగాలంటే, నువ్వు పెళ్ళిచేసుకోవడం నీ ధర్మం " అన్నది.

    " ఎందుకమ్మా! ఇలాంటి అర్థంలేని నియమాలు? ఎవరి యిష్ఠానుసారం వారు చేసుకోకుండా తోక తెగిన నక్క సామెతగా నాలాంటి ఏకదంతుల్ని రొంపిలోకి దింపటం మంచిది అనిపించుకోదు " అన్నాడు విఘ్నేశ్వరుడు తొలివిఘ్నంగా.

    విఘ్నేశ్వరుడు ఇలా ఎన్నో సాకులూ, విఘ్నాలు కల్పించుకుంటూ వచ్చాడు. 

    ఒకసారి చాలా పట్టుదలతో పార్వతి పెళ్ళిచేసుకోమని తొందరపెట్టింది. " అమ్మా! నేను తపస్సు చెయ్యాలి. తమ్ముడు చేశాడుగాని నేను చేయలేదుగా " అని విఘ్నేశ్వరుడు తపస్సుకు బయలుదేరాడు. 

    ఇంద్రుడు అప్సరసలందర్నీ విఘ్నేశ్వరుడి తపోభంగం చేయండని పంపాడు. అర్క అనే అప్సరస నిరాకరించింది. ఇంద్రుడు " నువ్వు మాలకాకివి. అంటరాని జిల్లేడువై భూమ్మీద మొలు " అని శపించాడు. 

    విఘ్నేశ్వరుడు తపస్సు చేయడానికి అనువైన చోటు వెతికివెతికి ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశంలో పల్లేరు డొంకలు నేలంతా విస్తరించి ఉన్నాయి. జిల్లేడు పొదలు మొగ్గలు నిండుగా తొడిగి విచ్చుకుంటూ ఉన్నాయి. విఘ్నేశ్వరుడు తపస్సు సాగిస్తున్నాడు. అప్సరసలు అక్కడకు చేరి నాట్యం మొదలుపెట్టారు. వాళ్ళ కాళ్ళకు పల్లేరుకాయముళ్ళు గుచ్చుకొని పడిపోతూంటే ఒంటినిండా పల్లేరుముళ్ళు గుచ్చుకుంటూంటే మూలుగుతూ ఆర్తనాదాలు చేశారు. విఘ్నేశ్వరుడికి ధ్యానభంగమై జరిగింది చూశాడు. పల్లేరుతీగపట్ల అభిమానం కలిగింది. అప్సరసలు భయంతో పడుతూలేస్తూ కుంటుకుంటూ పారిపోయారు. పల్లేరుగా మొలచిన యక్షిణి కంటకముఖి " స్వామీ! మీ అన్నదమ్ములకు తగువుపెట్టి కుబేరుడి శాపం పొంది ఇలా పడి ఉన్నాను. అనుగ్రహించు " అని వేడుకుంది. 

    ఆరోజు సరిగా భాద్రపద శుక్లచవితి.  వినాయకచవితి రోజే. విఘ్నేశ్వరుడు కంటకముఖి శాపం తొలగించి " వినాయక చవితినాడు నీ పల్లేరుముళ్ళ కాయలను వికట వినోదంగా ఉపయోగిస్తారులే " అని చెప్పాడు. 

    యక్షిణి అలకాపురి చేరుకుంది. అప్పుడు జిల్లేడు " స్వామీ! నన్నుగూడా అనుగ్రహించండి. ఇంద్రుడి ఆజ్ఞ నిరాకరించి శాపం పొంది అంటరాని దానిగా ఇలాపడి ఉన్నాను. నేనెందుకూ కొరగాని దాన్ని. అర్క అనే అప్సరసను. నీయందు భక్తి శ్రద్ధలు గలదాన్ని " అంది. 

    విఘ్నేశ్వరుడు జిల్లేడుతో " అంటరానితనం అంటూ ఏదీ సృష్టిలో లేదు. నీ మొగ్గల్ని, పువ్వుల్ని నేను ప్రీతితో మాలగా ధరిస్తాను. నీవు ద్వాపరయుగంలో కుబ్జవై పుడతావు. కృష్ణుడు నిన్ను ఏలుకుంటాడు. నీ శాపం పోయింది. సుఖంగా స్వర్గం వెళ్ళు. ఇంద్రుడి వల్లగాని, మరెవ్వరి వల్లగాని నీకెటువంటి భయమూ ఉండదు. ఏ శాపమూ తగులదు. జిల్లేడు వ్రేళ్ళు  ఆయుర్వేద ఔషధాలకు ఉపయోగపడతాయి. జిల్లేడు ఆకులు సూర్యుడికి ప్రీతిగా ఉంటాయి " అని చెప్పాడు. 

    అర్క అప్సరస రూపంలో స్వర్గాన్ని చేరుకుంది. 

    విఘ్నేశ్వరుడు కైలాసానికి తిరిగి వెళ్ళాడు. " నాయనా! తపస్సు ముగిసిందికదా! " మరి పెళ్ళి .... అని పార్వతి అంటూండగా " ముగియడమేమిటి? అసలు జరుగనే లేదు. తిరిగి తపస్సు కెడుతున్నా! " అని చెప్పి విఘ్నేశ్వరుడు మరోచోటు ఎన్నుకున్నాడు. ఆ ప్రదేశమంతా పాములపుట్టల మయంగా ఉంది. చుట్టూ వలయంగా పుట్టలున్నట్టు చూసుకొని తపస్సు మొదలుపెట్టాడు. పుట్టల్లోంచి పాములు నిటారుగాలేచి పడగలువిప్పి బుసలుకొడుతూ కాపలా కాయసాగాయి. ఇంద్రుడు మూషికాసురుడి అనుచరులైన రాక్షసులకు " మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు మిమ్మల్నందరినీ నిర్మూలించడానికి తపస్సు చేస్తున్నాడు. పగతీర్చుకోండి " అని కబురుపెట్టి ఉసిగొల్పాడు. 

    రాక్షసులు వినాయకుడిమీద దాడి చేయగా మహాసర్పాలు పాతాళంనుంచి కట్టలుగావచ్చి వాళ్ళ పొగరు అణచాయి. చచ్చినవాళ్ళు చావగా మిగిలిన వాళ్ళు తమ తెలివితక్కువను నిందించుకుంటూ ఇంద్రుణ్ణి తిడుతూ అక్కడినుంచి పారిపోయారు. 

    ఇంద్రుడు మంచి ఉల్లాసవంతులైన దేవతా పురుషుల్ని, వారితో అప్సరసలను కలిపి పంపుతూ " విఘ్నేశ్వరుడికి రాగోదయం కలిగేలా మీ ప్రతాపం చూపండి " అని ఆజ్ఞాపించాడు. వాళ్ళ వెనుకనే వజ్రాయుధం పట్టి వెళ్ళాడు. 

    దేవతలు అప్సరసలతో జంటజంటలుగా సుర సేవిస్తూ కోలాహలం చేస్తూ ఆటాపాటా మొదలుపెట్టారు. నాగులు బుసకొడుతూ విరుచుకుపడి వాళ్ళను చుట్టుకొని కోరలతో కాట్లు వేయసాగాయి. ఇంద్రుడు నాగులపై వజ్రాయుధాన్ని ఝళిపించాడు. నాగులకోపం రెచ్చిపోయింది. నాగలోకం నుంచి బిలబిలమని మహాసర్పాలన్ని వచ్చి దేవతల్ని స్వర్గానికి తరిమాయి. దేవతలకు నాగులకూ చిన్న యుద్ధం లాంటిది జరిగింది. ఇంద్రుడి వజ్రాయుధాన్నే లక్ష్యపెట్టకుండా నాగులు స్వర్గాన్ని ముట్టడించి గగ్గోలు పుట్టించి మరీ వెళ్ళాయి. విఘ్నేశ్వరుడు నాగుల సహాయానికి సంతసించి పాములను ఎత్తుకొని ముద్దాడి అలంకారాల్లా మీద వేసుకొని కైలాసానికి వెళ్ళాడు. 

    పార్వతి అతని పాములవాడి వాలకం చూసి నివ్వెరపోయింది. " అమ్మా! తండ్రి సొత్తు తనయుడికి సంక్రమించడం సహజమైనదే కదా! శంకరాభరణాలు నాకూ భూషణాలే. అదీగాక పాములు నాకు ప్రాణ మిత్రులై ప్రాణాలకు తెగించి కాపుకాసాయి. ఆప్తమిత్రుల అండదండలే కదా నిజమైన దండకడియాలూ, అమూల్యాభరణాలూనూ! అందుకే నాగభూషణుడు అనిపించుకున్నాను " అని విఘ్నేశ్వరుడు చెప్పాడు. 

    శివుడు చిరునవ్వులు ఒలికించాడు. పార్వతి వినాయకుడి వింత చేష్ఠకు విసుక్కుంది. ఈ విధంగా వినాయకుడు విఘ్నాలు తెచ్చిపెట్టుకుంటూ వచ్చాడు. 

    పార్వతి మళ్ళీ మరొకసారి బలవంతపెట్టింది. " అమ్మా! ఏదైనా ఘనకార్యం చేస్తేనేగదా సమర్థుడని పించుకుంటారు. నేనేదైనా చేసి తమ్ముడిలాగా ఘనుడిననిపించుకోనిదే ఎలాగ పెళ్ళి చేసుకోమంటావు? " అన్నాడు విఘ్నేశ్వరుడు. 

    " నీకేం తక్కువ నాయనా? సమర్థుడివి కాక వాజమ్మవా ఏమిటి " అంది పార్వతి. 

    

  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...