:: సూక్తిముక్తావళి ::
శ్లో.
కాంతాకటాక్షవిశిఖా న లునంతి యస్య,
చిత్తం న నిర్దహతి కోపాకృశానుతాప:,
కర్షంతి భూరివిషయాశ్చ న లోభపాశై:,
లోకత్రయం జయతి కృత్స్న మిదం స ధీర:. (భర్తృహరి
సుభాషితం)
భావము: ఎవని మనస్సు తరుణుల చూపుతూపులచే తూట్లుపడలేదో, ఎవని మనస్సు కోపాగ్నికీలలచే దహించబడదో, ఎవని మనస్సు అనేకములైన విషయసుఖవాంఛలచే
ఆకర్షింపబడదో వాడే ఈ లోకములను జయించినవాడు; వాడే మహాధీరుడు.
పద్యము:
ఉత్పలమాల: (భ ర న
భ భ ర ల గ – 10)
కాంతల చూపులందు
గల కాముక శక్తికి లొంగకుండగన్
సుంతయు నీసు లేక
పరిశుద్ధపు డెందముతో చరించుచు
న్నెంతగ
మభ్యపెట్టినను నీప్సలకున్ వడిచిక్కకుండగన్
సంతతమున్
బ్రమోదగుణ సాధువుగా మనువాడె ధీరుడౌ.
4. శ్లో. పరాధీనం
వృథా జన్మ, పరస్త్రీషు వృథా
సుఖం,
పరగేహే వృథా లక్ష్మీ:, విద్యా యా పుస్తకే వృథా.
భావము: పరాధీనమైనట్టి
బ్రతుకు, పరస్త్రీవలని సుఖము, పరుల యింటనున్న ధనము, పుస్తకములయందలి జ్ఞానము అక్కరకు వచ్చునవిగావు.
పద్యము:
కలమతల్లికా ( నర
నర నర ర – 13 )
పరుల యాశ్రయంబున వసించుచున్ పరగు
జీవితంబంతయున్,
పర వధూటిచే కలుగు సౌఖ్యమున్, పరుల యింటి భాగ్యోన్నతుల్,
వరుసగా ప్రశస్తమగు పొత్తముల్ పలుకు
సూక్ష్మశాస్త్రార్థముల్,
తరుణ మందునన్ మనకు నెవ్విధిన్ దరికి రానివై
నెక్కొనున్.