30, జనవరి 2025, గురువారం

 గాయత్రీమాత

    ఒకప్పుడు బ్రహ్మదేవుడు లోకక్షేమం కోసం  పుష్కర తీర్థంలో  తానుగా ఒక మహాయజ్ఞాన్ని నిర్వహిద్దామని  నిశ్చయించాడు. వెంటనే ఆ విషయాన్ని శివకేశవులకు తెలియజేశాడు. వారిరువురూ తాము బాధ్యత వహించి దగ్గర ఉండి నిరాటంకంగా యాగం పరిసమాప్తి అయ్యేటట్లు చూసే బాధ్యతను చేపడతామని బ్రహ్మదేవునకు హామీ యిచ్చారు. ముహూర్తం నిశ్చయమైంది. సర్వులకూ ఆహ్వానపత్రికలు పంపబడ్డాయి. ముహూర్త క్షణానికి సరస్వతీదేవిని తీసుకురమ్మని బ్రహ్మ ఇంద్రదేవుడిని పంపాడు. పిలిచిన వారందరూ వచ్చిన తరువాత వస్తానని సరస్వతి ఇంద్రునితో చెప్పింది. వెంటనే అతడు బ్రహ్మ దగ్గరకు వచ్చి ఆ సంగతి తెలియజేసి కూర్చున్నాడు. ముహూర్తపు వేళ సమీపిస్తున్నా సరస్వతి రాకపోవటం చేత బ్రహ్మ ఇంద్రుని పిలిపించి  ముహూర్త లగ్నం దాటి పోరాదు కాబట్టి నీవు వెంటనే వెళ్ళి ఒక కన్యను చూచి తెచ్చినట్లయితే, నేను ఆమెను భార్యగా గ్రహించి యజ్ఞ సంకల్పం చేస్తానని చెప్పాడు.  బ్రహ్మదేవుని ఆజ్ఞను శిరసావహించి ఇంద్రుడు భూలోకానికి పోయి, అక్కడ పెరుగు అమ్ముకుంటున్న గాయత్రి అన్న కన్యను, ఆమె దు:ఖిస్తున్నా వినకుండా బ్రహ్మ చెంతకు తెచ్చి అప్పజెప్పాడు. ఆయనను చూడగానే గాయత్రి తన లోకాన్ని, తన తల్లిదండ్రులను పూర్తిగా మరచి పోయింది. ఆ వెనువెంటనే శివకేశవులు ఆధ్వర్యం వహించి ఆమెతో బ్రహ్మకు  గాంధర్వ వివాహం జరిపించారు. తరువాత సంకల్పం చెప్పుకొని బ్రహ్మ యాగాన్ని ఆరంభించాడు.

    ఈ తతంగాలన్నీ ముగిసాక, తీరికగా సరస్వతి, లక్ష్మీ పార్వతులతోనూ, యితర సఖులతోనూ అక్కడకు వచ్చి జరిగిన విషయాలను విని మహోద్రేకంతో గట్టిగా మండిపడింది. ఆమె కోపాన్ని చూసి అందరూ భయ కంపితులయ్యారు. ఉక్రోషం పట్టలేక  ఆమె అక్కడున్న వారినీ, తనతో వచ్చిన వారిని కూడా  శపించింది. కార్తీక పౌర్ణమి నాడు తప్ప మరెప్పుడు నిన్నెవరు పూజించరని బ్రహ్మకు శాపమిచ్చింది. విష్ణువు వంక తిరిగి, నీవు రామావతారం చేపట్టినప్పుడు భార్యా వియోగాన్ని అనుభవిస్తావని, ఆ తరువాత కృష్ణావతారంలో పశువులను కాస్తూ జీవనాన్ని సాగిస్తావని శపించింది. దారుకావనంలో నీ లింగము భూపతనమై, నీవు నపుంసకుడువుగా మారతావని శివునికి శాపమిచ్చింది. అగ్నిని చూచి నీవు సర్వమల భక్షకుడవై, రుద్ర వీర్యము త్రాగుతావని, అలాగే ఇంద్రుణ్ణి ' నీవు శత్రువుల చేతిలో ఓడి అనేక అవమానాలు పొందుతావంటూ శాపాలిచ్చింది. తరువాత అక్కడున్న బ్రాహ్మణులను చూచి, ' మీరంతా పరాన్న భోజనులై, తీర్థక్షేత్రాలలో దుర్దానాలను గ్రహిస్తూ, అనర్హులైనవారిచేత యజ్ఞ యాగాదులు చేయిస్తారని, చివరకు ప్రేతాత్ములై తిరుగుతారని తీవ్రంగా శపించింది. నా ఆలశ్యానికి మీరంతా కారకులంటూ, పార్వత్యాదులను, దేవతా స్త్రీలను అందరనూ గొడ్రాళ్ళుగా మారతారని. శచీదేవిని,  నీవు నహుషునివలన బాధలనుభవిస్తావని శపించి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయింది. 

    బ్రహ్మదేవుని చేపట్టి యజ్ఞమునందు యజమానురాలయి యుండుటచేత, గాయత్రికి దేవతా మహిమలన్నీ కలిగాయి. శాపముల బాధతో కుములుతున్న అక్కడి వారి నందరినీ చూచి, నేడు నేను బ్రహ్మకు భార్య నగుట వలన నాకు కలిగిన సర్వశక్తి సామర్థ్యాలతో మీ కందరకూ శాప విమోచనా వరాలను యిస్తానని చెబుతూ, బ్రహ్మను పూజించిన వారు ఇహ పర సౌఖ్యముల నన్నింటినీ పొందగలరని, ప్రత్యేకించి కార్తీక పౌర్ణమినాడు పూజిస్తే మోక్షార్హులగుదురనీ చెబుతూ, విష్ణువు వంక జూసి కేశవా! నీవు రామావతారంలో నీ భార్యను వెరజిన రాక్షసుని సమూలంగా నాశనం చేయగలవు, కృష్ణుడవై పుట్టి సర్వలోక పూజ్యుడవవుతావు; శంకరా! నీ లింగం పూజార్హమై అభిషేకించబడుతుంది. భక్తుల కోర్కెలను తీర్చగలవు; అగ్నిదేవా! వేనిని భక్షించిననూ నీవు పరిశుద్ధంగా ఉంటూ, దేవతలకు హవిస్సులను అందజేస్తూంటావు; దేవేంద్రా! నీకు తాత్కాలికముగా శత్రుబాధ కలిగిననూ మరల త్రిలోకాధిపత్యమును వహించెదవు; బ్రాహ్మణులారా! మీరు నన్ను తలచుకున్నంతనే పాప విముక్తులవుతారు. ఎన్ని దుర్దానాలను పట్టినా, గాయత్రీ మంత్ర జపంతో దోషాలు నశించి పవిత్రులవుతారు; పార్వత్యాది దేవకాంతలారా! మీకు సంతానం లేకపోయినా, ఆ దు:ఖము మీకు బాధ కలిగించకుండును - అంటూ అందరకూ వరాల నిచ్చి అందరిచేత పరదేవతగా కీర్తించబడింది. 

    యజ్ఞము పరిసమాప్తమయిన తరువాత బ్రహ్మ శివకేశవులను పిలిచి సరస్వతిని ప్రసన్నురాలను చేసి నా సముఖమునకు రప్పింపుమని కోరగా, వారిద్దరూ భార్యలతో సహా వెళ్ళి సరస్వతిని వేనోళ్ళ కీర్తించగా ఆమె, శ్రీహరీ! లక్ష్మి ఎల్లప్పుడూ నీ హృదయం మీద స్థిరమై ఉంటుందని, ఏ అవతార మెత్తితే ఆ అవతారంలో నిన్ను అనుసరిస్తుందని చెప్పి, శంకరా! పార్వతి నీ అర్థ శరీరమై ఉంటుందని,  మీరిద్దరూ అందరకూ సర్వ శుభాలను కలుగజేస్తూంటారని పేర్కొంది. ఆ తరువాత వారితో కలిసి బ్రహ్మ సముఖానికి వచ్చి బ్రహ్మకు నమస్కరించి, గాయత్రిని ఆలింగనం చేసుకొని, సోదరీ! మనమిరువురమూ మన నాథునికి ఇరువైపులా ఉంటూ భక్తులను రక్షిస్తూ సృష్టి ఉన్నంతవరకూ ఈ పుష్కర క్షేత్రంలో విలసిల్లుదామని చెప్పగా గాయత్రీదేవి గూడా అందుకు తన సమ్మతిని తెలిపింది. 


29, జనవరి 2025, బుధవారం

గరుత్మంతుని కథ  

    కశ్యపప్రజాపతికి కద్రువ, వినత అనేవారు యిద్దరు భార్యలు. భర్త వలన కద్రువ వేయిమందినీ, వినత యిద్దరు కొడుకులను వరాలుగా పొందారు. 1500 సంవత్సరాలు గడచిన తరువాత కద్రువ పెట్టిన గ్రుడ్లనుండి వేయి పాములు పుట్టాయి. వినత గ్రుడ్లు పిగలలేదు. ఆమె అసూయతో ఒక గ్రుడ్డును పగులగొట్టింది. అందులోనుండి సగం శరీరంగల అరుణుడు పుట్టి, తల్లి తొందరపాటుకు కోపించి, ఆమె కద్రువకు దాసి అయ్యేటట్లు శపించాడు. ఆ తరువాత అయిదువేల సంవత్సరాలకు రెండవ అండం నుండి మహాబలవంతుడు పుట్టి, తల్లికి దాస్య విముక్తి చేస్తాడని అనుగ్రహించాడు. గరుత్మంతుడు మహాబలశాలిగా పుట్టి స్వేచ్ఛగా అంతరిక్షంలో తిరుగుతూ బ్రహ్మ సూచించిన ఆహారాన్ని గ్రహిస్తూ ఉన్నాడు. అరుణుడు సూర్యుని సేవించటానికి వెళ్ళాడు. 

    ఒకనాడు కద్రూవినతలు విహారార్థం సముద్రతీరానికి పోయి అక్కడ ఉచ్చైశ్రవాన్ని చూచారు. ధవళకాంతులతో వెలుగొందుతున్న ఆ ఇంద్రాశ్వాన్ని చూచి వినత ఆశ్చర్యాన్ని ప్రదర్శించింది. కద్రువ ఆ గుర్రం తోక నల్లగా ఉన్నది కదా! అని అన్నది. వినత దానికి అంగీకరించలేదు. తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేసేటట్లు పందెం వేసికొన్నారు. ఆనాడు పతిసేవకు సమయం కావటంతో ఇంటికి వెళ్ళి, మరునాడు ఉదయం వచ్చి సత్యాసత్యాలు నిరూపించుకొనాలని నిశ్చయించుకొన్నారు. ఆ రాత్రి కద్రువ కుటిలబుద్ధితో తన కొడుకులతో కుతంత్రం చేసింది. కొడుకులను తోకకు వ్రేలాడి అది నల్లగా తోచేట్టు చేయండని అడిగింది. చాలామంది అది అన్యాయమని భావించి తల్లి ఆనతిని తిరస్కరించారు. వారిని జనమేజయుడు చేయబోయే సర్పయాగంలో హతులయ్యేటట్లు కద్రువ నిర్దాక్షిణ్యంగా శపించింది. ఆ శాపానికి భయపడిన కొందరు నాగులు తల్లి మాటను పాటించి ఉచ్చైశ్రవ వాలానికి నల్లగా వ్రేలాడి నిలిచారు. వినత కద్రువకు దాసిగా ఉండవలసి వచ్చింది. సవతిని హీనంగా చూస్తూ దాస్యవృత్తిని చేయించుకొనేది కద్రువ. వినత గరుత్మంతుడి వలన తనకు దాస్య విముక్తి కలుగుతుందని ఆశతో కాలం గడపసాగింది. 

    ఒకనాడు నారదుని వలన ప్రబోధితుడై గరుత్మంతుడు మాతృ దాస్యాన్ని తొలగించటానికి పూనుకొని కద్రువ వద్దకు వచ్చి వేడుకొన్నాడు. అమృతాన్ని తెచ్చి మాతృదాస్య విముక్తి చేసికొమ్మని కద్రువ గరుత్మంతుడిని ఆజ్ఞాపించింది. అమృతాన్ని తెస్తానని శపథం చేసి గరుత్మంతుడు వెంటనే కశ్యపప్రజాపతి వద్దకు వెళ్ళి ఉపాయాన్ని కోరుకొన్నాడు. 

    ఇంద్రుడు అమృతాన్ని భద్రంగా రక్షిస్తుంటాడు. జలం మధ్య అగ్ని మండుతూ ఉండగా తీవ్రమైన ఆయుధాలతో భయంకర రాక్షసులు రక్షిస్తుండగా ఇనుప వలలో అమృతం సురక్షితంగా ఉంటుంది. దానిని సాధించటం దేవతలకైనా సాధ్యం కాదు. దానిని సాధించాలంటే గరుత్మంతా!  తూర్పు సముద్రం చెంత ఉండే మహాపర్వతం మీద రెండు గజకచ్ఛపాలున్నాయి. ఆ రెండూ పూర్వ కాలంలో మధుకైటభులు. పరస్పరం ఘర్షణ పడుతూంటాయి.  ఆ రెండింటినీ పట్టి భక్షిస్తే కలిగే బలం వలన నీవు అమృతాన్ని హరించ గలవని కశ్యపుడు గరుత్మంతునకు సూచించాడు. వెంటనె గరుత్మంతుడు బయలుదేరి  వాడి గోళ్ళతో ఆ గజకచ్ఛపాలను పట్టి ఆకాశానికి ఎగిరి, అయిదు యోజనాల పొడవున ఉన్న ఒక మహావృక్ష శాఖమీద వాలాడు. ఆ బరువుకు ఆ కొమ్మ విరిగింది. ఆ కొమ్మ మీద మహామునులు తపస్సు చేసుకొంటున్నారు. అందువలన ఆ కొమ్మ కిందపడకుండా ముక్కుతో పట్టుకొని గరుత్మంతుడు ఎగిరాడు. మునులు ఆ మహాత్ముడి మహిమను చూచి కొమ్మనుండి దిగిపోయారు. ఆ కొమ్మను దురాచారంతో అపవిత్రమైన కులించ దేశ సముద్రప్రాంతంలో వదలమని చెప్పారు. గరుత్మంతుడా పని చేసి, ఒక మహా గిరిశిఖరం మీద విశాల ప్రాంతంలో గజకచ్ఛపాలను భక్షించి మహాబలోపేతుడై అమృతమున్న స్థానానికి చేరాడు. దానిచుట్టూ మండుతున్న అగ్నిని దాటటానికి ఉపాయం కొరకు బ్రహ్మను ఆశ్రయించాడు. కొండంత వెన్నను అగ్నిపై ఉంచమని పితామహుడు ఉపాయం చెప్పాడు. సప్రయత్నంగా వెన్నను సంపాదించి అగ్నిపై ఉంచి, దాని ఉధృతి తగ్గడంతో అమృతభాండంపై లంఘించాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించినా అది విఫలమై పోవటంతో అతడు విముఖుడయ్యాడు. గరుత్మంతుడు అమృతాన్ని తెచ్చి కద్రువ ముందు పెట్టి తల్లి దాస్యానికి విముక్తి కలిగించాడు. అమృతం తేవడమే నియమం కాబట్టి తెచ్చి కద్రువకు చూపించి, మరల ఆ అమృతాన్ని ఇంద్రుడికి ఒప్పగించి గరుత్మంతుడు దేవతల మన్ననలను పొందాడు. పాములపై పగ సాధించాడు. ఇంద్రుడు గరుత్మంతుడిని సాక్షాత్ విష్ణువుగా కీర్తించి, భవిష్యత్కాలంలో యదువంశంలో శ్రీకృష్ణుడిగా అవతరించి లోకకల్యాణం నిర్వహిస్తాడని ప్రకటించాడు. 

28, జనవరి 2025, మంగళవారం

 అజామిళోపాఖ్యానము

    కన్యాకుబ్జపురంలో అజామిళుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు పూర్వజన్మ సంస్కారం వల్ల వేదశాస్త్రాలను గురుసేవలో, ఇంద్రియ నిగ్రహంతో అభ్యసించాడు. పెద్దలను, జ్ఞానులను సేవించాడు. సకల ప్రాణులయందునూ సమదృష్టి కలిగి, మంత్రానుష్ఠానంతో సిద్ధులు పొందాడు. సత్యవ్రతం, నిత్య నైమిత్తికాది కార్యాలు నిర్వహించాడు. లోభాది దుష్టవర్తనలను వదలి సద్గుణవంతుడైనాడు. నిత్యం ఆచార నిష్ఠ కలవాడై, జ్ఞానాన్ని సముపార్జించే సరైన సమయంలో ఒకనాడు అతడు తన తండ్రి ఆజ్ఞానుసారం దర్భలు, సమిధలు, పుష్పాలు, పండ్లు తీసుకొని  రావటంకోసం తోటలోనికి వెళ్ళి తిరిగి వస్తున్న సమయంలో అతడు నిర్లజ్జగా వేశ్యను ఆలింగనము చేసుకొని యున్నట్టి ఒక శూద్రుణ్ణి చూసాడు. కామోన్మత్తుడైన ఆ శూద్రుడు వేశ్యతో చుంబనాది కలాపాలను చేస్తున్నాడు. ఈ సన్నివేశాన్ని చూడగానే సద్బ్రాహ్మణుడైన అజామిళుని మనస్సులో పతనం ఆరంభమయింది. అతనిలో కామవాంఛ పెల్లుబికింది. ఆమె చూపులనే మోహ పాశాలలో చిక్కుకున్నాడు. నిత్యకృత్యములైన వైదిక కర్మలను, శాస్త్ర పాఠాలను, జప తపాలను మరచిపోయాడు. అతడి మనస్సనే అరణ్యంలో కామోద్రేకమనే కార్చిచ్చు చెలరేగింది. నియమబద్ధమైన అతడి చిత్తం పట్టు తప్పిపోయింది. కొంతకాలానికి ఆ వేశ్యను ఇంటికి తెచ్చుకున్నాడు. కులాచార మర్యాదలను కూలద్రోశాడు. తండ్రిగారు సంపాదించిన ఆస్తి నంతటినీ ఆమె పాలు చేశాడు. సాధు లక్షణాలయిన సద్గుణాలను విడనాడాడు. బాగా రుచి మరిగి ఆ వాలుగన్నుల ఇంతి అందచందాలకు లొంగిపోయాడు. నిండు యవ్వనం కలిగి, సుగుణ సంపత్తి కలిగి, అతనికి అన్ని రకాలా అనుకూలవతిగా ఉన్న భార్యను ఇంటిలోనే వదలి, తన గౌరవాన్ని పోగొట్టుకొని, నీచుడై ఆ స్త్రీ తోనే కాపురం మొదలుపెట్టాడు. చుట్ట పక్కాలను దూషించాడు. సజ్జనులను ద్వేషించాడు. దిక్కులేని దీనులను చిక్కులపాలు చేసాడు. చిట్టచివరకు ధనం కోసం దారులను కాచి వచ్చేపొయ్యే జనాన్ని దోచుకున్నాడు. దొంగతనంలో  ఆరితేరాడు. ఎవరు ఏమనుకున్నా, ఎన్ని తిట్టినా లెక్కచేయకుండా సంపాదించిన ధనమంతా ఆ సుందరి చేతుల్లో పోసి, దాసుడై, ఆమె దయాదాక్షిణ్యాలపై జీవింపసాగాడు. 
    
    ఈ విధంగా అతనికి ఎనభై ఏళ్ళు గడిచిపోయాయి. వేశ్య వలన అతనికి పదిమంది పుత్రులు పుట్టారు. వారిలో చిన్నపిల్ల వానికి నారాయణుడనే పేరు పెట్టాడు. వృద్ధాప్యంలో పుట్టిన ఆ పిల్లవాని పట్ల అజామిళునికి అమితమైన అనురాగం ఉండేది. ఆ పిల్లవాని ఆలనా పాలనా చూస్తూ, అతని బాల్య చేష్టలకు అజామిళుడు ఆనందించేవాడు. తాను భోజనం చేసేటప్పుడు పిల్లవానిని భోజనానికి పిలిచేవాడు. తాను పానీయాలు త్రాగేటప్పుడు తన చెంతకు అతనిని చేరబిలిచేవాడు. ఆ విధంగా ప్రతిమారు. ప్రతిక్షణం ఆ పిల్లవానినే పేరుపెట్టి ' నారాయణా! ' అని పిలుస్తూ పుత్రరతుడయ్యాడు. ' నారాయణా! ', ఇది తిను, ' నారాయణా! ' పాలుత్రాగు,  ' నారాయణా! ' ఇటురావయ్యా అంటూ తనకు తెలియకుండానే అతడు నారాయణ నామంలో మునిగాడు. 

    చివరికి అతని మరణం దగ్గర పడినప్పుడు యమదూతలు అతడిని తీసుకువెళ్ళడానికి వచ్చారు. అజామిళుడు ఆ సమయంలో భయంతో ' నారాయణా! ' అని తన కుమారుడిని పిలిచాడు. అయితే, ' నారాయణ ' అన్న పేరులోని పవిత్రత కారణంగా, ఆ శబ్దం విష్ణుమూర్తిని చేరింది. అప్పటికి విష్ణుదూతలు అక్కడకు వచ్చి యమదూతలను ఆపారు. తరువాత విష్ణుదూతలు యమదూతలతో మాట్లాడుతూ అజామిళుడి పాపాలు ఎంత ఎక్కువయినా, చివరి సమయంలో ఆయన నారాయణుడి నామస్మరణ చేశాడు కాబట్టి, అతనికి విమోచన లభించాలి అని తెలిపారు. యమదూతలు వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఈ ఘటన తరువాత, అజామిళుడు తన పాపకర్మల పట్ల పశ్చాత్తాపం చెందాడు. అతడు తన జీవితం మిగతా భాగాన్ని నారాయణుడి సేవలో గడిపి, విష్ణు భక్తుడిగా మారి మోక్షాన్ని పొందాడు. మనం ఎన్ని తప్పులు చేసినా, పశ్చాత్తాపంతో మంచిదారి పట్టి భగవంతుని ఆశ్రయిస్తే మోక్షం పొందవచ్చు. భగవన్నామాన్ని జపించడం ఎంత ముఖ్యమో ఈ అజామిళుడి కథ ద్వారా నిరూపితమయింది. 

24, జనవరి 2025, శుక్రవారం

: ముద్గలోపాఖ్యానము :: 

    పూర్వం కురుక్షేత్రంలో ముద్గలుడనే విప్రుడు ఉంఛవృత్తితో జీవించేవాడు. ఆ పుణ్యాత్ముడు అతిథిప్రియుడు. అతడు పక్షోపవాస వ్రతం చేపట్టాడు. పాడ్యమి మొదలు పదునాల్గు రోజులు ఒక్కొక్క గింజగా తూమెడు వడ్లు సమకూర్చేవాడు. పర్వదినాన అంటే, అమావాస్య పూర్ణిమలలో ఆ బియ్యాన్ని పాకంచేసి, దేవ పితృ పూజలు చేసి, పుత్ర కళత్రాదులతో భుజిస్తూ దేహయాత్ర సాగిస్తూ ఉండేవాడు. 

    ఒక పర్వదినాన ముద్గలుడి ఇంటికి దుర్వాసమునీంద్రుడు అతిథిగా వచ్చాడు. ముద్గలుడతనిని పూజించి అన్నం వడ్డించాడు. దుర్వాసుడు వండిన అన్నమంతా తిన్నంత తిని మిగిలిన దానిని దేహమంతా పులుముకొని వెళ్ళాడు. ముద్గలుడికి తినటానికి ఏమీ మిగులలేదు. అయినా, అతడు నిర్వికారంగా పక్షోపవాస వ్రతం సాగిస్తూనే ఉన్నాడు. దుర్వాసుడు, ఆరు పర్వాలు వరుసగా వచ్చి ముద్గలుడిని పరీక్షించాడు. కాని, అతడిలో ఎటువంటి అసహనం కనబడలేదు. దానవ్రతంలో దీక్ష తగ్గలేదు. దుర్వాసుడతని దానశీలతకు మెచ్చి బొందితో స్వర్గం పొందే వరం ప్రసాదించి వెళ్ళాడు. ఆ తరువాత దేవదూత దివ్య రథాన్ని తెచ్చి ముద్గలుడిని స్వర్గానికి రమ్మని ఆహ్వానించాడు. ముద్గలుడు స్వర్గలోకం లోని గుణ దోషాలను తెలుపమని దేవదూత నడిగాడు. అతడీ విధంగా చెప్పాడు. 

    స్వర్గం, ఈ లోకానికి పైగా ప్రకాశమానంగా ఉంటుంది. అది దివ్య దృష్టితో చూడగలిగింది. దేవయానంతో చేరగలిగింది. తపస్వులు, సోమయాజులు, సత్యసంధులు, ఉత్తములు, జితేంద్రియులు, సమబుద్ధి గలవారు, దానపరులు, రణశూరులు - ఆ లోకంలో నివసిస్తారు. అందులో అప్సరసలు, సాధ్యులు, దేవమునులు వేరువేరుగా తగినచోట్ల ఉంటారు. ముప్పదిమూడువేల యోజనముల విస్తీర్ణంగల మేరుపర్వత శిఖరం మీద ఆ లోకం ఉంటుంది. నందనవనోద్యాలు పుణ్యాత్ముల విహారస్థలాలు. అక్కడి వారికి ఆకలిదప్పులు, శీతోష్ణబాధలు, జరారోగ బాధలు ఉండవు. మనస్సు కాహ్లాదం కలిగించే ప్రకృతి సౌందర్యం అక్కడ ఉంటుంది. ఆ లోకవాసులు దివ్యదేహాలతో, దివ్యభోగాలను అనుభవిస్తూ ఉంటారు. దివ్య విమానాలలో తిరుగుతూంటారు. ఆ లోకం మీద బ్రహ్మలోకం ఉన్నది. అందులో శోక మనేది ఉండదు. మానవులు, బ్రహ్మలు, మునులు అందులో వసిస్తారు. లోభం, క్రోధం, పాపం, అపకీర్తి, దు:ఖం, మరల పుట్టడం అనేవి అక్కడి వారికి ఉండవు. ప్రళయం తరువాత కూడా ఆ లోకం నిలిచి ఉంటుంది. ఇంద్రాదులు కూడా ఆ లోకాన్ని పొందాలని అనుకుంటారు. 

    స్వర్గంలో ఉండే దోషాలను కూడా వినుము. జీవులాలోకంలో పుణ్యఫలాలను అనుభవిస్తారే కాని, పుణ్యం చేసికొనలేరు. పుణ్యఫలానంతరం మరల భూమిపై జన్మలెత్తుతూ ఉంటారు. స్వర్గ సుఖం నిత్యం కాదు. అందులోని వారు అసూయలకు పాల్పడతారు. అయినా, బ్రహ్మలోకం తరువాత స్వర్గమే ఉత్తమం - అని దేవదూత వివరించాడు. ముద్గలుడు పునర్జన్మలేని బ్రహ్మలోకాన్ని పొందగోరి స్వర్గలోక భోగాన్ని త్యజించాడు. ఉంఛవృత్తి మాని జ్ఞానయోగంతో సమత్వాన్ని సాధించి మోక్షాన్ని పొందాడు. 


20, జనవరి 2025, సోమవారం

  :: సర్పయాగం

    మహాభారత యుద్ధానంతరం కౌరవ వంశానికి అంకురంగా నిలచిన వాడు ఉత్తరాభిమన్యులపుత్రుడు పరీక్షితుడు. పాండవుల తరువాత హస్తినాపుర సింహాసనమెక్కి అరవైయేడేళ్ళు నిరాఘాటంగా పరిపాలించాడు. ఒకనాడు పరిక్షిన్మహారాజు వేటకు వెళ్ళాడు. ఒక మృగంమీద బాణం వేశాడు. అది ఆ గుచ్చుకున్న బాణంతోనే పరుగెత్తడం మొదలుపెట్టింది. రాజు దాని వెంట పడ్డాడు. అది కనుమరుగైపోయింది. ఆ అరణ్యంలో శమీకుడనే ముని కనబడ్డాడు. అతడిని మృగాన్ని గురించి అడిగాడు. ఆ ముని ధ్యానంలో మౌనవ్రతంలో ఉండటంచేత మాట్లాడలేదు. పరీక్షిత్తుకు కోపం వచ్చింది. ప్రక్కన చచ్చిపడి ఉన్న ఒక పామును వింటి కొప్పుతో ఎత్తి ఆ ముని మెడలో వేసి హస్తినాపురికి తిరిగి వెళ్ళాడు. 

    శమీకుడు సమాధిలో ఉండటంచేత పాము మెడలో పడ్డా ఒళ్ళు తెలియలేదు. అతనికి శృంగి అనే కుమారుడున్నాడు. అతడు తపస్వి అయినా మహాకోపి. తండ్రికి జరిగిన అవమానాన్ని ఒక ముని వలన విని, ఆగ్రహోదగ్రుడై  " ఏడు రోజుల్లో తక్షక విషాగ్ని దగ్ధుడై పరీక్షిత్తు ప్రాణాలు కోల్పోవు గాక " అని శపించాడు. 

    శృంగి తండ్రి వద్దకు వచ్చాడు. పామును తండ్రి మెడ నుండి తొలగించాడు. శాపాన్ని తండ్రికి తెలియజెప్పాడు. శమీకుడు కోపం వలన ఎన్నో అనర్థాలు కలుగుతాయనీ, క్షమాగుణం తపస్వికి అలంకారమని కొడుకునకు బోధించి శాపాన్ని క్రమ్మరించుమని కోరాడు. శృంగి దానికి అంగీకరించలేదు. శమీకుడు విచారపడ్డాడు. ఒక శిష్యునితో శాప వృత్తాంతాన్ని రాజుకు తెలియపరిచాడు. 

    శాప వృత్తాంతం విని పరీక్షిత్తు భయపడ్డాడు. మంత్రులతో మంతనాలు సలిపి ఒంటి కంబపు మేడ కట్టించుకొని అందులో విషాన్ని విరిచే మహామంత్రాలు జపిస్తూ రాత్రింబవళ్ళు వైద్యులు, భటులు కాపలా కాస్తూ ఉంటే, వారం రోజుల గడువును కంటికి కూరుకు లేకుండా సాగిస్తూ ఉన్నాడు. 

    పూర్వం బ్రహ్మదేవుడు కశ్యపుడనే బ్రహ్మర్షికి " సంజీవని " ని ఉపదేశించాడు. పరీక్షిత్తును తక్షకుడు కాటేసి చంపితే అతనిని తిరిగి బ్రతికించి తన విద్యా బలాన్ని ప్రభువు ముందు వెల్లడించాలని కశ్యపుడు బయలుదేరాడు. అతన్ని త్రోవలో తక్షకుడు కలిసికొన్నాడు. కశ్యపుని శక్తిని పరీక్షించటానికి తక్షకుడు ఒక మఱ్రిచెట్టును కాటేసి దగ్ధం చేశాడు. వెంటనే కశ్యపుడు ఆ చెట్టును బ్రతికించాడు. అతని విద్యాబలం తెలిసికొని ఎంతో ధనాన్ని అతనికి పారితోషికంగా ఇచ్చి హస్తినాపురం చేరకుండా అతడిని తిరిగి పంపించి వేశాడు. పరీక్షిత్తుకు మృత్యువు తథ్యమని తేలింది. 

    తక్షకుడు నాగ కుమారులతో కలిసి బ్రాహ్మణ వేషాలతో వెడలి ఏకస్తంభ హర్మ్యానికి చేరుకున్నాడు. వేదఘోషతో వచ్చిన ఆ విప్రులను రాజు పూజించాడు. ఏడవరోజున సూర్యాస్తమయం అవుతున్నది కదా అని, ఆ విప్రులు తెచ్చిన పండ్లలో ఒక దానిని తినటానికి పరీక్షిత్తు ఉద్యుక్తుడైనాడు. ఆ పండులో క్రిమిగా తక్షకుడు తలయెత్తి విషాగ్నిని గుప్పించాడు. మేడతో సహా పరీక్షిత్తు దగ్ధుడైపోయాడు. 

    పరీక్షిత్తు చనిపోయే నాటికి అతని కుమారుడు జనమేజయుడు బాలుడు. పిన్ననాటనే రాజ్యభారాన్ని స్వీకరించవలసి వచ్చింది. అలా ఆ బాధ్యతను అద్భుతంగా నిర్వర్తిస్తున్న కాలంలో ఒక రోజు పైలుడు అనే మహర్షికి శిష్యుడైన ఉదంకుడు జనమేజయుని వద్దకు వచ్చి వాని తండ్రి పరీక్షిత్తు తక్షకుని విషాగ్నికి బలి అయిన సంగతి గుర్తుచేసి సర్పయాగం చేయమని ప్రోత్సహించాడు. ఆ ప్రోత్సహించటంలో ఉదంకుని స్వార్థం కూడా ఉన్నది. ఉదంకునికి కూడా తక్షకునిపై కోపం ఉన్నది. అతడు ఒకసారి గురుపత్ని కోరికపై మహిమాన్వితమైన కుండలాలు తీసుకొని వెడుతూండగా వాటిని తక్షకుడు అపహరించుకొని పోవటం వలన నాటినుండి ఉదంకుడు తక్షకునిపై కోపాన్ని పెంచుకొని ప్రతీకారంకోసం ఎదురుచూస్తూ సమయోచితంగా జనమేజయునకు వాని తండ్రి మరణ వృత్తాంతాన్ని సాక్ష్యాలతో సహా తెలియజేసి తక్షకునిపై కోపాన్ని రగిలింపజేసి సర్పయాగానికి అనుజ్ఞనివ్వజేసాడు. యాగం ఆరంభమయి తీవ్రంగా సాగింది. హోతలు మంత్రోచ్ఛారణ చేస్తుంటే ఎక్కడెక్కడి నాగులు హోమంలో పడి తగులబడిపోసాగాయి. కాని తక్షకుడు ఇంద్రుని ఆశ్రయించి ఉన్నాడు. " సహేంద్ర తక్షక స్వాహా! " అని హోతలు విధివిహితంగా మంత్రోచ్ఛారణ చేయగానే తక్షకునితోపాటు ఇంద్రుడు కూడా యజ్ఞగుండం వైపు జారిపోనారంభించాడు. నాగముఖ్యుడైన వాసుకి సోదరి జరత్కారువు. ఆమె భర్త జగత్కారుడు. వారికి ఆస్తీకుడనే బిడ్డ నాగజాతి రక్షణార్థం కారణజన్ముడై జనించాడు. అది తెలిసిన మిగిలిన నాగముఖ్యులు వాసుకితో సహా వచ్చి సర్పయాగాన్ని మాన్పించమని ఆస్తీకుని ప్రార్థించారు. సరిగా తక్షకుడు మంటలలో పడబోయే సమయానికి ఆస్తీకుడు అక్కడకు వెళ్ళి సముచితమైన స్తుతులను చేసి జనమేజయుని మెప్పించి దక్షిణగా యాగాన్ని నిలుపుచేయమని కోరాడు. సత్యదీక్షాపరుడైన జనమేజయుడు ఆ విప్రుని కోరిక మేరకు సర్పయాగాన్ని ఆపించేశాడు. .

    

15, జనవరి 2025, బుధవారం

 :: నరకాసుర వధ ::

    నరకాసురుని వధించడానికి శ్రీకృష్ణుడు ఆయత్తమయ్యే సమయంలో సత్యభామ కృష్ణుని దరిచేరి "దేవా! నీవు రాక్షస సంహారం చేస్తుంటే నీ నైపుణ్యం చూడాలని ఉంది. నన్నుకూడా యుద్ధానికి నీతోబాటు తీసుకొని వెళ్ళకూడదా" అని కోరింది. అంతట కృష్ణుడు "నువ్వా! యుద్ధానికా! యుద్ధం అంటే ఏవనుకుంటున్నావు? అవి తుమ్మెదల ఝంకారాలు కావు. ఏనుగుల ఘీంకారాలు. అక్కడ పద్మాల పుప్పొడి ఉండదు. గుర్రాల కాలిగిట్టల దుమ్ము మాత్రమే ఉంటుంది. నీటితరగల మీద నురుగు కాదు. శత్రువుల బాణాలు. అవి సరోవరాలు కావు. సైన్యసమూహాలు. నేను త్వరలో వస్తాను. నువ్వు ఇక్కడే ఉండు". అనగా, అప్పుడు, కృష్ణుడితో సత్యభామ "నీ బాహువుల దగ్గర ఉంటే అవతలి వారు దానవులయితే నేమి, దైత్యులయితే నేమిటి?" అంటూ నేను వస్తానని మెత్తగా చెప్పింది. చేతులు జోడించింది. కృష్ణుడు ఆమెను కరకమలాలతోగుచ్చి ఎత్తాడు. గరుత్మంతుణ్ణి అధిరోహించాడు. ప్రాగ్జోతిషపురాన్ని సమీపించాడు. గిరిదుర్గం, శస్త్రదుర్గం, జలదుర్గం, అగ్నిదుర్గం, వాయు దుర్గాలతో అభేద్యంగా ఉంది ఆ పురం. కృష్ణుడు ముందుగా ఆ దుర్గాల్ని ముక్కలుజేసి క్రమంగా రూపుమాపాడు. మురుణ్ణి కప్పిన మురాశరుని పాశాలు ఛేదించాడు. ఆ పట్టణ ప్రాకారాల్ని గదా ఘాతాలతో కూల్చివేశాడు. పాంచజన్యం పూరించాడు. ఆ ధ్వనికి పంచశిరుడయిన మురాసురుడు ఆవులిస్తూ నీటినుండి బయటకు వచ్చాడు. అగ్నిజ్వాలలతో కూడిన శూలాన్ని గరుత్మంతుని మీద ప్రయోగించాడు. భూమ్యాకాశాలు దద్దరిల్లేలా గర్జించాడు. గరుడుని మీద పడవచ్చిన శూలాన్ని కృష్ణుడు ఒడిసి పట్టుకొని మూడుముక్కలుగా చేశాడు. వాడు చేతులు చాచి ముందుకు వచ్చాడు. అంతలోనే కృష్ణుడు వాని తలలను ఖండించాడు. మురుడు నీటిలో కూలిపోయాడు. అతని కొడుకులు ఏడుగురు పీఠడు అనే దండనాథుణ్ణి ముందుంచుకొని హరిని ఎదిరించారు. ఎన్నో బాణాలు గుప్పించారు. వాటినన్నింటినీ నేలకూల్చాడు కృష్ణుడు. వారి చేతులను, ముఖాలను, కంఠాలను నరికివేశాడు. వారందరూ చనిపోవడం నరకునికే ఆశ్చర్యం కలిగించింది. యుద్ధానికి సిద్ధమై వచ్చాడు నరకుడు. సత్యభామతో కూడిన కృష్ణుణ్ణి చూశాడు. పోరుకు సిద్ధమయ్యాడు. అతనిని చూచి సత్యభామ తన జడ ముడిచుట్టింది. కోక సరిచేసుకుంది. నగలు సవరించుకుంది. పయ్యెద బిగించింది. తన భర్త ముందట లేచి నిలబడింది. 

    ఆ సత్యభామను చూచి కృష్ణుడు "ఈ విల్లందుకో" అని సత్యభామకొక విల్లు అందించాడు. వెంటనే ఒక తేజోవిశేషం పుట్టింది. ఆమె ఆ వింటినారిని సంధించింది. ధనుష్టంకారం చేసింది. వీరశృంగారాలు, భయరౌద్రవిస్మయాలు రూపుదాల్చినట్లుగా ఉంది. ఎప్పుడు వింటికి బాణం తొడుగుతోందో, ఎప్పుడు విడుస్తోందో తెలియటం లేదు. బొమలు ముడిపడ్డాయి. అనురాగమందహాసాలు, వీరశృంగారరసాలు వ్యక్తమవుతూ, అవలీలగా శత్రువును నొప్పిస్తూ, భర్తను అలరిస్తోంది. ఒక పాదం ముందుకు, ఒక పాదం వెనుకకూ పెట్టి నిలబడింది. లక్ష్యాన్ని మాత్రమే చూస్తోంది. ధనుస్సు వలయాకారంగా ఉంది. బాణాలు పుంఖానుపుంఖాలుగా ప్రయోగిస్తోంది. నిజానికి సత్యభామ సుకుమారి. అలా యుద్ధం చేయడం ఆశ్చర్యంగా ఉంది చూచేవారికి. చెలికత్తెల కోలాహల ధ్వనినే ఓర్చుకోలేని ఆమె భేరీభాంకారాలను ఎలా ఓర్చుకొంటోందో తెలియడంలేదు. సత్యభామను ప్రశంసిస్తూ కృష్ణుడు విల్లందుకున్నాడు. అపుడు నరకాసురుడు కృష్ణునితో ఇలా అన్నాడు. "ఆడుది యుద్ధం చేస్తోంది నీకు మగతనం  లేదా, దనుజులు ఆడువారితో యుద్ధం చెయ్యరు" అంటూండగానే శతఘ్ని అనే దివ్యాస్త్రాన్ని ప్రయోగించాడు కృష్ణుడు. శత్రుసైన్యమంతా హాహాకారాలు చేస్తూ పారిపోయింది. సత్యాకృష్ణులను మోస్తూనే గరుత్మంతుడు కాలి గోళ్ళతో, ముక్కుతో, రెక్కలతో శత్రువుల గజసమూహాన్ని ఛిన్నాభిన్నం చేశాడు. ఆ గాలివేగం సహించలేక చావగా మిగిలిన సైన్యం పారిపోయింది. అదే సమయంలో నరకాసురుడు ఏనుగుమీద విహరిస్తున్నాడు. కృష్ణునిపైకి విసరడానికి శూలం చేతిలో పట్టుకున్నాడు. కృష్ణుడు తన చక్రంతో నరకుని తల నరికాడు. చప్పుడు చేస్తూ ఆ తల నేలపై పడింది. దేవతలు మునులు ఆకాశంనుండి పూలవాన కురిపించారు. 

12, జనవరి 2025, ఆదివారం

 :: గోకర్ణొపాఖ్యానము ::

    తుంగభద్రానదీ తీరంలో ఒక పట్టణముంది. ఆ పట్టణంలో సకల వేదాలను చదివిన ఆత్మదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు భిక్షావృత్తితో ధనవంతుడయ్యాడు. అతని భార్య దుందులీ. ఆమె గయ్యాలి. వారికి సంతానం కలుగలేదు. ఆత్మదేవుడు ఒకరోజు అడవికి వెళ్ళాడు. అక్కడ ఒక సన్యాసి కనిపించాడు. ఆత్మదేవుడు సన్యాసి కాళ్ళపై పడి నమస్కరించి " అయ్యా! నాకు సంతానం లేదు. నేనొక గోవును పెంచుకుంటున్నాను. ఆ గోవుకూడా గొడ్డుదయింది. నేను చెట్టును పెంచినాకూడా అది ఫలాలనివ్వడంలేదు. సంతానంలేని నిర్భాగ్యుని జీవితం వ్యర్థమే కదా! నాకు సంతానం కలిగే ఉపాయం చెప్పండి." అని ప్రార్థించాడు. ఆ సన్యాసి " ఓ విప్రోత్తమా! నీకు ఒక పండిస్తాను. దాన్ని నీ భార్యతో తినిపించు. కుమారుడు తప్పక జన్మిస్తాడు" అని పండునిచ్చి వెళ్ళిపోయాడు. ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తెచ్చి భార్యకిచ్చాడు. ఆమె తన మనస్సులో "ఈ పండు తింటే నాకు గర్భం వస్తుంది. పొట్ట పెద్దదవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ పెరిగినకొద్దీ అనేక దు:ఖాలు కలుగుతాయి. పురుడు వచ్చినప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే బాధ భరించలేక చావాల్సి వస్తుంది " అని అనుకుంటూ ఆ పండును తన చెల్లెలికి ఇచ్చింది. ఆ చెల్లెలు " ఇప్పుడు నేను గర్భవతిని. నాకు పుట్టిన బిడ్డను నీకే ఇచ్చేస్తాను " అని చెప్పింది. వారిద్దరూ కలిసి ఆ పండును ఇంట్లో ఉన్న ఆవుకు పెట్టారు. చెల్లెలికి బిడ్డ పుట్టగానే ఆమె దుందులికి ఇచ్చేసింది. దుందులి ఆ బిడ్డను భర్తకు చూపి వీడు నాకు పుట్టిన కుమారుడని చెప్పింది. ఆత్మదేవుడు ఆ కుమారునికి ' ధుంధుకారి ' అని పేరు పెట్టాడు. ఆ పండు తిన్న గోవుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు. ఆత్మదేవుడు ఆ పిల్లవానికి ' గోకర్ణుడు ' అని పేరు పెట్టాడు. ఇద్దరు బిడ్డలను ప్రేమతో పెంచసాగాడు. గోకర్ణుడు పండితుడు, జ్ఞాని అయ్యాడు. ధుంధుకారి చదువులేని మూర్ఖుడు దుష్టుడు అయ్యాడు. గోకర్ణుడు సత్కార్యాలు చేయసాగాడు. ధుంధుకారి దొంగ అయి, హింసాపరుడై, దీనులను హింసిస్తూ, దుర్మార్గులతో స్నేహంచేసి, కుక్కలను పెంచుతూ వేశ్యాలోలుడయ్యాడు. ఆత్మదేవుడు చెడుమార్గాల్లో వెళ్తున్న తన కొడుకుని చూసి బాధపడసాగాడు. ఆత్మదేవుడు చావడానికి సిద్ధమై అడవికి బయలుదేరాడు. అప్పుడు గోకర్ణుడు వచ్చి తండ్రికి సంసారం నిస్సారమని చెప్పి జ్ఞానాన్ని ఉపదేశించాడు. " తండ్రీ! నీవు భాగవతాన్ని పారాయణంచెయ్యి ముక్తిని పొందుతావు " అని ఉపదేశించాడు. ఆత్మదేవుడు అడవుల్లో నివశిస్తూ నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ భాగవతంలోని దశమస్కంధం పారాయణం చేయసాగాడు. ఆ పుణ్యంవల్ల ఆత్మదేవుడు శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడు. 

    ధుంధుకారి తల్లిని కొట్టి బావిలో పడేశాడు. ఆమె మరణించింది. ధుంధుకారి ఐదు భోగకాంతలను ఇంట్లో ఉంచుకున్నాడు. దొంగతనం చేసి బట్టలు, నగలు, ధనం తెచ్చి ఇచ్చేవాడు. ఒకసారి ఆ వేశ్యలు బలవంతంగా ధుంధుకారిని చంపి గోతిలో పూడ్చిపెట్టారు. వాడు ప్రేతమై గాల్లో తిరుగసాగాడు. అది గోకర్ణుడికి తెలిసింది. సోదరునికి గయాశ్రాద్ధాన్ని పెట్టి తీర్థయాత్రలు చేశాడు. ఒకనాడు గోకర్ణుడు పడుకొని ఉండగా ధుంధుకారి భయంకరమైన ప్రేతరూపంతో కనబడ్డాడు. గోకర్ణుడు వానిపై నీళ్ళు చల్లాడు. వాడి పాపాలు నశించిపోయాయి. కాని, ప్రేతత్వం పోలేదు. గోకర్ణుడు ఎందరో పండితులను ప్రేతత్వ ముక్తికి ఉపాయాన్ని అడిగాడు. ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు. అప్పుడు గోకర్ణుడు తన యోగ మహిమతో సూర్యవేగాన్ని ఆపి, సూర్యునికి భక్తితో నమస్కరించి " ఓ జగత్సాక్షీ! నీకు నమస్కారం. మోక్ష ఉపాయాన్ని చెప్పు " అని అడిగాడు. అదివిన్న సూర్యుడు గోకర్ణా! నీవు ఏడురోజులు భాగవతాన్ని దీక్షతో పఠించు అని చెప్పాడు. గోకర్ణుడు భాగవత సప్తాహ పారాయణం మొదలుపెట్టాడు. ఆ కథ వినడానికి ధుంధుకారి వచ్చాడు. అక్కడ ఏడు కణుపులతో ఒక వెదురు చెట్టు ఉండగా దాని రంధ్రంలో ధుంధుకారి ప్రవేశించి భాగవత కథ వినసాగాడు. మొదటిరోజు సాయంకాలానికి భాగవతకథ ముగిసింది. ఆ వెదురుగడ కణుపొకటి బద్ధలై పెద్ద శబ్దం వచ్చింది. ఇలా ఒక్కోరోజు ఒక్కో కణుపు బద్ధలవసాగింది. గోకర్ణుడు పన్నెండు స్కంధాల కథను వినిపించి భాగవత సప్తాహాన్ని పూర్తిచేయగానే ధుంధుకారి ప్రేతత్వం తొలగిపోయి దివ్యరూపంతో తులసీమాలను, పీతాంబరాన్ని ధరించి నీలమేఘశ్యాముడై, కవచకుండలాలను ధరించి గోకర్ణునికి నమస్కరించాడు. సోదరా! నీవు చెప్పిన భాగవత కథలను వినడంవల్ల నా ప్రేతత్వం పోయింది. వైష్ణవతత్త్వం వచ్చింది. భాగవత సప్తాహంవల్ల వైకుంఠలోకం ప్రాప్తించిందని చెప్పి విష్ణువిమానమెక్కి ధుంధుకారి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. 

    భాగవత సప్తాహం అంత గొప్పది. భాద్రపద, ఆశ్వయుజ, కార్తిక, మార్గశిర, జ్యేష్ఠ, శ్రావణ మాసాలు భాగవత సప్తాహయజ్ణం చేయడానికి ప్రశస్తమైనవి. భాగవత కథాశ్రవణంవల్ల సకల రోగాలూ, పాపాలూ నశిస్తాయి. సంతానంలేని వారికి సంతానం కలుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. 

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...