:: భరతుని భక్తి ::
శ్రీరామాయణమునందు భరతుని అనన్య సోదర భక్తిని, ధర్మనిష్ఠను, నిస్వార్థ ప్రేమతత్త్వమును స్ఫురింపచేయు నానుడి " భరతుని భక్తి ". లభ్యపడిన రాజ్యాధికారమును తృణప్రాయముగా తలంచి అన్నయైన శ్రీరాముని పాదకమలముల సేవయే పరమావధిగా తలదాల్చిన భరతుని ఉదాత్త వ్యక్తిత్వమును సాక్షాత్కరింపజేయు నానుడి ఇది. శ్రీ మహాభాగవతమునందు పేర్కొనబడిన నవవిధ భక్తి మార్గములలో ఒకటైన దాస్యభక్తికి, ఆత్మనివేదనకు భరతుని జీవితమే ఉదాహరణగా నిలుస్తుంది.
మంధర దుర్బోధనలకు లోనైన కైకేయి దశరథుని కోరిన వరముల కారణముగా శ్రీరాముడు పదునాలుగు వత్సరములు అరణ్యవాసము నాచరించవలసి వచ్చిన సమయమందు భరతుడు మేనమామ గృహము నందుండెను. అయోధ్యకు తిరిగి వచ్చిన తదుపరి విషయమును గ్రహించిన భరతుడు అపరిమితమైన వేదనకు లోనయినాడు. తండ్రి మరణము, అన్నయైన శ్రీరాముని వనవాసము ఈ రెండు ఉపద్రవములు అతని మనస్సును తీవ్రముగా కలచివేసెను. తల్లి చర్యలను ఘాటుగా నిరసించి, సంక్రమించిన అనంత సామ్రాజ్యమును పాలన చేయుటయన్నది పాపకార్యముగా నూహించి రాజ్యమును స్వీకరించుటకు ఏ మాత్రము సమ్మతించ లేదు. //
తిరిగి అన్న శ్రీరాముని అయోధ్యకు తోడ్కొని వచ్చుటకు సంకల్పించి సమస్త ప్రజలను, గురువులను వెంటనిడుకొని చిత్రకూటమునకు చేరి అన్న చరణములకు మ్రొక్కి రాజ్యమును గైకొనుమని ప్రార్థించెను. అంతట రాముడు పితృవాక్య పాలనమే ధర్మబద్ధమని తేల్చి చెప్పి అయోధ్యకు తిరిగి వచ్చుటకు నిరాకరింప, చేయునది లేక భరతుడు రాముని పాదుకలను కోరి తీసుకొని వాటిని శిరసున నిడుకొని అయోధ్యా సింహాసనమందు ప్రతిష్ఠచేసి తాను రామునికి రాజప్రతినిధినని ప్రకటించుకొని రాజ్యము నెఱపెను.
రాజభోగములను వీడి నందిగ్రామము వద్ద ఒక పర్ణశాలను నిర్మింప చేసుకుని, జటలను పెంచి, నార వస్త్రములను ధరించి సాధుజీవనమును సాగించెను. ప్రతి నిముష కాలమును జాగ్రత్తగా గణన చేయుచు, శ్రీరాముని రాక కొరకు పదునాలుగు వత్సరములు నిరీక్షించెను. ఆ కాలము ముగిసిన మరుక్షణమే ప్రాయోపవేశ మొనర్చుటకు సిద్ధపడిన భరతుని అవ్యాజమైన సోదరభక్తికి శ్రీరాముడు బహుధా పులకించినాడు.
" భరతుని భక్తి " అనునది సోదరుల నడుమ నుండు అనుబంధమునకు, అనురాగమునకు సూచిక మాత్రమే గాక, అది స్వార్థరహితమైన ప్రేమకు, అధికార విముఖతకు, ధర్మనిబద్ధతకు, అన్నపట్లగల అచంచల విశ్వాసమునకు శాశ్వత ఉదాహరణము. నేటి సమాజమునందు స్వప్రయోజనములను త్యజించి, తమకు ప్రియమైన వారి పట్ల నిష్కల్మషమైన భక్తి ప్రపత్తులతో ప్రేమను, విశ్వాసమును, విధేయతను కనబరచు వారలను ప్రస్తుతించుటకు ఈ నానుడిని ఉపయోగింతురు. భోగము కంటె త్యాగము గొప్పదని నిరూపించిన " భరతుని భక్తి " భారతీయ సంస్కృతిలో చిరస్మరణీయమై, మానవాళికి నిత్య ఆదర్శముగా భాసిల్లుచున్నది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి