( బుధవారం - పౌరాణిక ప్రశ్ణ)
:: లక్ష్మణరేఖ నిజంగా మూలరామాయణంలో ఉందా? ::
లక్ష్మణ రేఖ అనగానే మనకు సీతాదేవి అపహరణ గుర్తుకొస్తుంది. కానీ నిజంగా వాల్మీకి మహర్షి తన రామాయణంలో ఈ రేఖ గురించి రాశారా? జానపదుల కథల్లో ఇది ఎలా ప్రసిద్ధి చెందింది? మన దైనందిన జీవితంలో 'లక్ష్మణ రేఖ' అనే నానుడి వెనుక ఉన్న అంతరార్థం మరియు జీవిత సత్యం ఏమిటి? ఈ రోజు మన 'పౌరాణిక ప్రశ్నలు' శీర్షికలో దీని గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం
మహర్షి వాల్మీకి వ్రాసిన శ్రీరామాయణ మూలకథలో 'లక్ష్మణ రేఖ' విషయము నేరుగా ఉటంకించబడలేదు. అరణ్యకాండలో — మారీచుని కేక విని వ్యాకులపడిన సీతాదేవి లక్ష్మణుడిని బలవంతపెట్టి రాముని సాయానికి పంపడం, లక్ష్మణుడు వెళ్తూ వెళ్తూ వదినమ్మ రక్షణ బాధ్యతను ఆశ్రమ దేవతలకు, దిక్కులకు అప్పగించి వెళ్లడం మాత్రమే వాల్మీకం చెబుతుంది.
అయితే, తరువాతి కాలంలో ఆవిర్భవించిన వివిధ రామాయణ సంప్రదాయాలు, నాటకాలు, కంబ రామాయణం, భాసనాటకాలు, మరియు తులసీదాస్ రచించిన రామచరిత మానస్, అలాగే జానపద కళారీతుల ద్వారా ఈ నానుడి జనబాహుళ్యంలో విరివిగా వ్యాప్తిలోకి వచ్చింది. జానపదులు సీతాదేవి పవిత్రతను, లక్ష్మణుని అన్నభక్తిని, రావణాసురుని భయాన్ని మరింత ప్రభావవంతంగా చూపించడానికి ఈ 'రేఖ' అనే భావనను కథలో చేర్చారు.
ఇక ఈ సన్నివేశం వెనుక ఉన్న కథను పరిశీలిస్తే — బంగారు వన్నె కలిగిన జింక రూపంలో సంచరిస్తున్న మారీచుడి మాయను గ్రహించలేక, దానికై పట్టుబట్టిన సీతాదేవి కోరికను తీర్చడానికి శ్రీరాముడు అరణ్యంలోనికి వెళ్తాడు. ఎంతకూ చిక్కని ఆ జింకపై రాముడు బాణాన్ని ప్రయోగించగా, మాయా వేషధారణలో ఉన్న మారీచుడు చనిపోతూ శ్రీరాముని గొంతుతో 'హా సీతా! హా లక్ష్మణా!' అని బిగ్గరగా కేక వేస్తాడు.
ఆ కేక వినగానే సీతాదేవి రామునికి ఏదో కీడు జరిగిందని శంకించి, లక్ష్మణుని అన్న చెంతకు పోయిరమ్మని బలవంతపెడుతుంది. అందుకు లక్ష్మణుడు శ్రీరాముని మహోన్నత పరాక్రమమును వివరించి, 'అన్నయ్యకు ఏ ఆపదా రాదు, ఇది రాక్షస మాయ' అని ఎంత చెప్పినా సీతాదేవి వినక తీవ్రమైన మాటలు అంటుంది. దాంతో లక్ష్మణునకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది.
అప్పుడు లక్ష్మణుడు చేయునది లేక, తన ధనుస్సు కొనతో ఆశ్రమము చుట్టూ ఒక రేఖ గీసి, 'అమ్మా! ఈ రేఖను దాటి వెలుపలికి అడుగు పెట్టవద్దు' అని మనవి చేసి వెళ్తాడు. ఆ రేఖ లక్ష్మణుని తపోబలానికి, నిష్ఠకు ప్రతిరూపం. ఆ తర్వాత మోసపూరిత సాధువుగా వచ్చిన రావణాసురుడు, రేఖ ప్రభావం వల్ల లోపలికి రాలేక, భిక్ష నెపంతో మాయమాటలు చెప్పి సీతాదేవిని గీత వెలుపలికి రప్పించి అపహరిస్తాడు.
నేడు 'లక్ష్మణ రేఖ' అనునది కేవలం ఒక పౌరాణిక సన్నివేశానికే పరిమితమవ్వక, మానవ జీవితంలోని నైతిక, సామాజిక, వ్యక్తిగత పరిధులకు గొప్ప చిహ్నమై నిలిచింది. దైనందిన వ్యవహారములలో ఒక వ్యక్తి విధిగా పాటించవలసిన హద్దు, పరిమితి, కట్టడి లేదా మర్యాదను ఇది ప్రతిబింబిస్తోంది.
మన జీవితంలో ఇది ఎలా వర్తిస్తుందంటే, కుటుంబ పెద్దలు మరియు ఆచారాలు విధించిన మర్యాదలను గౌరవించడం. నియమ నిబంధనలకు కట్టుబడి ఉండడం. తోడివారల స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను భంగపరచకుండా మన పరిధిలో మనం మెలగడం.
స్వేచ్ఛ అనేది బాధ్యతతో కూడి ఉన్నప్పుడు మాత్రమే సమాజానికి క్షేమదాయకమవుతుంది. ఏర్పరచిన హద్దులను మీరక వర్తించడమన్నది వ్యక్తి సంస్కారానికి, సమాజ సంక్షేమానికి దోహదపడుతుంది.
తన పరిధిని మరచి, ఆశ, మోహము లేదా ఆవేశమునకు లొంగి 'లక్ష్మణ రేఖ'ను దాటినప్పుడు, అలనాటి సీతాదేవి వలెనే మానవులు ఆపదలకు గురికాక తప్పదని ఈ నానుడి పరోక్షంగా హెచ్చరిస్తోంది. కనుక 'లక్ష్మణ రేఖ' అనునది స్వయం నియంత్రణను, ధర్మనిష్ఠను, సురక్షిత జీవన మార్గాన్ని ప్రబోధించే ఒక అద్భుతమైన జీవిత సత్యం!
ఈ విశేషాలు మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక, పౌరాణిక విషయాల కోసం మన MYTHOLOGICAL STORIES BY RAJA RAO KROVVIDI ఛానెల్‌ను తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేసుకోండి. సర్వేజనా సుఖినోభవంతు. స్వస్తి.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి