13, జులై 2025, ఆదివారం

 :: సక్తుప్రస్థుడు :: 

    పంచపాండవులలో మొదటి వాడైన ధర్మరాజు 'అశ్వమేధయాగం' అనే యజ్ఞం ఒకటి చేశాడు. ఆ యజ్ఞం జరిగినన్నాళ్ళూ ఆయన గొప్ప సంతర్పణలు చేయించాడు. ఎక్కడెక్కడ ఉన్న బ్రాహ్మలూ, ఋషులూ, మునులూ, సాధులూ, సన్యాసులూ, భిక్షువులూ వచ్చి పంచభక్ష్య పరమాన్నాలతో భోంచేసి వెళ్ళేవారు. ధర్మరాజు వాళ్ళందరికీ బంగారపు పాత్రలలో భోజనం పెట్టించి, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆ పాత్రలనుకూడా బహుమానం కింద పట్టుకు పొమ్మనేవాడు. ఆయన అన్నదానానికీ, దాతృత్వానికీ వచ్చిన వాళ్ళంతా అనేక విధాల మెచ్చుకున్నారు. ఆ స్తోత్రాలు చెవినిబడ్డ ధర్మరాజు సంతోషంతో ఉబ్బిపోయాడు. ఆ తర్వాత అతిథులలో ఒక్కొక్కడికీ రెండేసి, మూడేసి బంగారపు గిన్నెలు ఇచ్చేయటం మొదలెట్టేడు. 

    దగ్గర ఉండి యజ్ఞం అంతా నడిపిస్తున్న శ్రీకృష్ణుడికి " ఏమిటి చెప్మా, ధర్మరాజు ఇలా వళ్ళు తెలియకుండా ఖర్చుపెడుతున్నాడు? " అనిపించింది. " ఏమిటి బావా! చాలా జోరుగా దానాలిచ్చేస్తున్నావు? " అని అడిగేడు కూడాను. 

    అప్పుడు ధర్మరాజు దర్జాగా " జోరుకాక మనకేమిటోయ్! వచ్చిన వాళ్ళు మనల్ని గురించి ఎలా చెప్పుకుంటున్నారో వినపట్టంలేదూ? ధర్మరాజువంటి అన్నదాత ఇదివరలో లేడు, ఇకముందు పుట్టబోడు అనుకుంటున్నారు " అన్నాడు. 

    శ్రీకృష్ణుడు ఏదో చెప్పబోయాడు. కాని, ధర్మరాజు వినిపించుకోలేదు. ఎందుకు వినిపించుకుంటాడు? 'మహాన్నదాతనైపోయాను' అనే అహంభావం అతన్ని కమ్ముకుపోయింది. 

    శ్రీకృష్ణుడు తన భక్తులన్నా, బంధువులన్నా, మిత్రులన్నా ఎక్కువ ప్రేమ చూపుతాడు. కాని, వాళ్ళలో ఏమాత్రం గర్వం బయల్దేరినా ఆయన సహించడు. ఆ గర్వాన్ని భంగపరిస్తేగాని ఆయనకు నిద్రపట్టదు. మహాన్నదాత ననుకుంటున్న ధర్మరాజుకి గర్వభంగం చెయ్యాలని ఆలోచించి, అతణ్ణి భోజనశాల కవతల అతిథులు చేతులు కడుక్కునే చోటికి తీసుకెళ్ళేడు. కోట్లకొలది అతిథులు భోంచేసి అక్కడ చేతులు కడుక్కుంటూండంవల్ల, ఆ నీరంతా ఒక నదిలా ప్రవహించటం మొదలెట్టింది. 

    ధర్మరాజు శ్రీకృష్ణుడితో " బావా! చూశావా, ఈ నదిని? " అన్నాడు. 

    అందుకు కృష్ణుడు " నదికేంగాని ఆ బురదలో అటూ ఇటూ దొర్లుతూ ఓ ముంగిస ఉంది చూశావా? " అన్నాడు. 

   " ఆ చూశాను. బురదలోంచి ఇవతలికి వచ్చి నిలబడి, తన ఎడంవైపు చూసుకుంటోంది. అదిగో, మళ్ళీ బురదలోకెళ్ళి దొర్లుతోంది చూడు " అన్నాడు ధర్మరాజు. 

    ఆ ముంగి మళ్ళీ బయటకొచ్చేసింది. అదిచూచి ధర్మరాజు " ఇందాకట్లాగే తన ఎడమవైపు చూసుకుంటోంది. ఎందుకు చెప్మా, బురదలో దొర్లివచ్చి అలా చూసుకుంటోంది " అని కృష్ణుడ్ని అడిగాడు. 

    కృష్ణుడు జవాబు చెప్పేలోగా ఆ ముంగి ధర్మరాజు ఎదుటికి వచ్చి మనిషికి మల్లే మాట్లాడటం మొదలెట్టింది. 

    " మహారాజా! విను. కొన్ని సంవత్సరాలకి పూర్వం ఇక్కడకు కొన్ని యోజనాల దూరంలో సక్తుప్రస్థుడనే పేద బ్రాహ్మడొకడుండేవాడు. ఆయన పూరిగుడిసె పక్కన ఓ అతిథి చెయ్యి కడుక్కున్న చోట బురదలో దొర్లితే నా కుడిప్రక్క బంగారమయింది. నా ఎడమ పక్కగూడా బంగారం చేసుకోవాలన్న ఆశతో దొర్లబోతే అక్కడ చాలినంత బురద లేక, ఆ ప్రక్క మామూలుగానే ఉండిపోయింది. " అన్నది ముంగి. 

    ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. " బురదలో దొర్లితే వళ్ళు బంగారమవుతుందా ఎక్కడన్నా? " అన్నాడు. 

    " మీకు సందేహంగా ఉంటే చూడండి మహారాజా" అంటూ ముంగిస ఆ నీళ్ళల్లోకి పరుగెత్తి వెళ్ళి తన వంటి బురద కడుగేసికొచ్చి, ధర్మరాజుకు తన కుడివైపు చూపించింది. 

    " నిజమే! ఈ వైపు అంతా బంగారమే! ఇదెలా సాధ్యమైంది? " అని ఆశ్చర్యంగా అడిగాడు ధర్మరాజు. 

    " సక్తుప్రస్థుడు మహాన్నదాత. అందువల్లనే ఆయన గుడిసె వద్ద అతిథులు చేతులు కడుక్కున్న నీటికి ఆ మహిమ కలిగింది " అన్నది ముంగి. 

    " నాకంటే ఎక్కువ అన్నదాతా, ఆ పేద బ్రాహ్మడు? ఇక్కడ చేతులు కడుక్కున్న నీరు ఏరై పారుతోంది. సక్తుప్రస్థుడి పర్ణశాల ప్రక్క బురద నీ కుడిప్రక్కకు మాత్రమే సరిపోయి, ఎడమ పక్కకు లేకపోయిందన్నావు! " అన్నాడు ధర్మరాజు. 

    " నిజమే కానీ, ఆ కాస్త బురద, అంతటినే నాకు ఒక పక్క బంగారమయింది. నీవు చాలా గొప్పగా అన్నదానం చేస్తున్నావని విని ఇక్కడకు వచ్చి ప్రొద్దుటినుంచీ ఈ బురదలో దొర్లుతూ శ్రమపడుతున్నాను. కాని, ఒక్క పెసరగింజంత మేర అయినా నా ఎడం ప్రక్కని బంగారమవలేదు. సక్తుప్రస్థుడు పూటకు ఠికాణా లేని పేదవాడే గాని ఆయన అన్నదానం ముందు నీ సంతర్పణ ఏ లెక్కకీ రాదని తేలిపోయింది " అన్నది ముంగి. 

    ఆ ముంగి ఇలా ధర్మరాజుతో చెప్పేసి తన దారిని వెళ్ళిపోయింది. ధర్మరాజు సిగ్గుతో కుమిలిపోయాడు. శ్రీకృష్ణుడు తానేమీ ఎరగనట్లు దిక్కులు చూడటం మొదలెట్టాడు. ధర్మరాజు ఆయనతో, " బావా! ఈ సక్తుప్రస్థుడు ఎవరు? " అని అడిగాడు. 

    అప్పుడు కృష్ణుడు సక్తుప్రస్థుని గురించి యిలా చెప్పసాగాడు. 

        " ఆ ముంగి చెప్పిందిగా అతడొక పేద బ్రాహ్మడని. పేదవాళ్ళల్లోకల్లా పేదవాడతను. అయితేనేం? అతను, అతని కుటుంబం కూడా 'దేహీ' అని ఒకళ్ళని యాచించకుండానే జీవితం గడిపేరు. అతను, అతని భార్య, కొడుకూ, కోడలు ఈ నలుగురూ కూడా పొలాలలో రాలిపడ్డ ధాన్యం యేరి తెచ్చుకుని దంచి బియ్యం చేసి, ఆ బియ్యంతో పొట్టపోసుకునే వారు. ఆ అన్నమే కొంత అతిథులకు పెట్టి మిగిలినది తాము తినేవారు. 

    ఇలా రోజులు గడిచిపోతూంటే, ఉన్నట్టుండి కరువొచ్చింది. పేదవాళ్ళ సంఖ్య ఎక్కువై, పొలాలలో రాలిన గింజలు ఏరుకు పొయ్యేవాళ్ళు ఎక్కువయ్యారు. అంచేత సక్తుప్రస్థుని కుటుంబానికి చాలా ఇబ్బంది వచ్చింది. వాళ్ళు నలుగురూ వెళ్ళి వరుసగా నాలుగు రోజులు ఏరితెస్తే తప్ప ఒక పూటకు సరిపడే గింజలు దొరికేవికావు. అంచేత నాలుగేసి రోజులకోమాటు భోజనంచేసి, తక్కిన రోజులలో పస్తులుండేవారు. 

    ఇలా ఓ మాటు నాలుగు రోజులూ ఉపవాసాలుండి, కూడబెట్టుకున్న బియ్యాన్ని వండి, ఆ అన్నం నాలుగు వాటాలు చేసుకుని, విస్తళ్ళలో వడ్డించుకుని తిందామనుకుంటుంటే ఎక్కడినుంచి వచ్చాడో ఓ అతిథి వచ్చాడు. మరెవరైనా ఔతే ఆ సందర్భంలో, " అయ్యా! నాలుగు రోజులనుంచి మాకు తిండి లేదు. ఇప్పుడు వండుకున్నది మాకు పూర్తిగా కడుపు నిండదు. కనుక మరోచోటు చూసుకోండి " అని నిర్మొగమాటంగా చెప్పేద్దురు. కాని, సక్తుప్రస్థుడలా  చెయ్యలేదు. విస్తరిముందు కూర్చున్నవాడు దభీమని లేచి, ఆ వచ్చిన వృద్ధుని పాదాలు కడిగి ఆ నీళ్ళు నెత్తిమీద చల్లుకుని, ఆయనను తన విస్తరిముందు కూచోబెట్టి 'ఆరగించండి బాబూ! " అని అన్నాడు. 

    ఆ అతిథి, ఈ కాస్తా నేను తినేస్తే నీమాట ఏమిటి? అనకుండా ఒక్క మెతుకైనా మిగలకుండా విస్తట్లో అన్నం అంతా తినేశాడు. పోనీ, అంతా తినేసి లేచాడా? అదీ లేదు. పైగా, 'నాకేం కడుపు నిండలేదు' అన్నాడు. 

    అతిథి అర్ధాకలితో లేవకూడదు- అని సక్తుప్రస్థుడు బాధపడ్డాడు. " ఎందుకూ, నా వాటా వడ్డిస్తాను "  అని ఆయన భార్య తన అన్నాన్ని తెచ్చింది. ఆయన, అయ్యో! నీకు నేను తెచ్చిపెట్టవలసినది బదులు నీ వాటానే పుచ్చేసుకోవడమా? ఏ భర్తా తన భార్య కిలాంటి అన్యాయం చెయ్యడు " అని వాపోయాడు. అందుకామె, అబ్బే, ఇందులో అన్యాయమేముంది? అన్నాతురుడై వచ్చిన అతిథికి ఆకలి తీర్చడంలో నాకూ బాధ్యత ఉంది." అంటూ, తన అన్నాన్ని ఆ వృద్ధ బ్రాహ్మణునకు వడ్డించేసింది. 

    ఆ అతిథి ఆ అన్నాన్ని కూడా తినివెయ్యటానికి, వడ్డించినంత సేపైనా పట్టలేదు. తినేసి, 'ఇంకా కావాలి' అన్నాడు. 

    " మహాత్మా! ఇదిగో సిద్ధంగా ఉంది. ఆరగించండి " అంటూ సక్తుప్రస్థుని కుమారుడు తన వాటా అన్నాన్ని తెచ్చి వడ్డించాడు. 

    అతిథి అదికూడా తినేసి ' నా ఆకలి తీరలేదు. ఇంకా లేదా? " అన్నాడు. 

    ఆ మాట విని సక్తుప్రస్థుని కోడలు మహదానందంతో, " మహాత్మా! నా అత్తమామలూ, నా భర్తా ధన్యులైనట్లే, నేను కూడా ధన్యురాలినవటానికి అవకాశం వచ్చింది. ఇదిగో, ఈ అన్నం కూడా భుజించండి " అంటూ తన అన్నాన్ని కూడా తెచ్చి వడ్డించింది. అతిథి ఆ అన్నం కూడా తినేసి, 'నా కడుపు నిండింది' అంటూ లేచి, అవతలికి వెళ్ళి చెయ్యి కడుక్కున్నాడు. అతని చేతినుంచి నీళ్ళతోబాటు పడ్డ మెతుకులకోసం ఆశపడి వచ్చి ఈ ముంగి తన కుడి ప్రక్క బంగారం చేసుకుంది. 

    " అంతవరకు మసలి బ్రాహ్మడికిమల్లే ఉన్న ఆ అతిథి ఓ దివ్యపురుషునికిమల్లే మారిపోయాడు. ఆయన తేజస్సు చూసి సక్తుప్రస్థుడూ వాళ్ళు ఆశ్చర్యపోయి, " మహాత్మా! మమ్మల్ని అనుగ్రహించటానికి ఈ అతిథి రూపంలో వేంచేసిన శ్రీమహావిష్ణువే మీరు అని స్తోత్రం చేశారు. అందుకాయన , నేను మిమ్మల్ని పరిక్షిద్దామని వచ్చిన యమధర్మరాజును. మీ ఆతిధ్యానికి మెచ్చుకున్నాను. నాలుగు రోజులనుంచీ తిండిలేక, తిందామని వడ్డించుకున్న సిద్ధానాన్ని మనస్ద్ఫూర్తిగా అతిథికి ఇచ్చేశారు. మీ చిత్తశుద్ధి గొప్పది. ఈ పుణ్యానికి ఫలంగా మీరు బొందితో కైలాసానికి వెళ్ళేటట్లు వరం యిచ్చాను. అనిచెప్పి అంతర్ధానమయాడు. మరి కాసేపటికి కైలాసం నుంచి విమానం వచ్చి ఆ నలుగుర్నీ కైలాసం  తీసుకుపోయింది." 

    ఈ కథ విన్న ధర్మరాజు, పంచభక్ష్య పరమాన్నాలతో భోజనం పెట్టి, బంగారు పాత్రలు దక్షిణగా యిచ్చినా, తన అన్నదానం సక్తుప్రస్థుని అన్నదానం ముందు ఎందుకూ పనికిమాలినదైనదని తెలుసుకుని చిన్నబోయి మౌనంగా యజ్ఞశాలకు తిరిగి వచ్చాడు. 



12, జులై 2025, శనివారం

 :: వృకాసురుడు :: 

    పూర్వం వృకాసురుడని ఒక రాక్షసుడుండేవాడు. ' వృకము ' అంటే తోడేలు. అది సాధు జంతువుల్ని మ్రింగేసే క్రూరమృగం. వృకాసురుడు కూడా తోడేలుకు మల్లే లోకంలో ఉండే సాధు జనుల్ని పీడించి హడలగొడుతూండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు వాడికో దుర్బుద్ధి పుట్టింది. " చచ్చు మనుషుల్ని, చచ్చు దేవతల్ని బాధపెడితే ఏముంది? నేను ఏడిపించ దలుచుకుంటే మహాదేవుడని పిలిపించుకుని గొప్పగా తిరిగే ఆ శివుణ్ణే ఏడిపించాలి " అనుకున్నాడు.

    అదే సమయానికి నారద మహర్షి ఆ దారిని వచ్చాడు. వృకాసురుడు ఆ మహర్షికి నమస్కరించి " స్వామీ! నాకు పరమశివుణ్ణి వశం చేసుకోవాలని ఉంది. మార్గం ఏమిటి? " అని అడిగాడు. 

    నారదుడు, " భగవంతుణ్ణి వశం చేసుకోవాలని ఉంటే ఎవరికైనా ఒకటే మార్గం. అదేమిటంటే తపస్సు చెయ్యటం. చాలా శుచివై యుండి, దీక్షతో తపస్సు చెయ్యి. శివుడు ప్రత్యక్షమై నీకు వరాలిస్తాడు " అని చెప్పి తన దారిని వెళ్ళిపోయాడు. 

    వృకాసురుడు, 'సరే' అని చెప్పి, నదిలోకి వెళ్ళి స్నానంచేసి తపస్సు చేశాడు. ఎన్నాళ్ళకీ శివుడు ప్రత్యక్షం కాలేదు. ముక్కు మూసుకుని ఉత్తుత్తి తపస్సు చేస్తే లాభం లేదని తలచి, ఒక క్రొత్త పద్ధతి కనిపెట్టాడు. 

    ఒక పెద్ద హోమగుండం తయారుచేసి, తన శరీరంలోంచి మాంస ఖండాలు కోసి, ఆ గుండంలో వెయ్యటం మొదలెట్టేడు. అయినా, శివుడు ప్రత్యక్షం కాలేదు. తన శరీరంలో మాంసం అంతా కోసి గుండంలో వేసినా, శివుడు ప్రత్యక్షం కాకపోవటం చూసి, వృకాసురుడికి ఇంకా పట్టుదల ఎక్కువై ఒక సాహసం చెయ్యబోయాడు. ఏమిటంటే, తన తలనే నరుక్కుని హోమం చెయ్యాలని. అందుకు సిద్ధపడ్డాడు కూడా! 

    ఇదంతా కనిపెడుతున్న శివుడు యిక ఆలశ్యం చెయ్యలేదు. తక్షణం ప్రత్యక్షమై " వృకాసురా! నీ సాహసానికి మెచ్చుకున్నాను. లేవయ్యా యింక. అయ్యో పాపం శరీరంలో ఉన్న మాంసమంతా కోసి హోమం చేసేశావే! నేను అనవసరంగా ఆలశ్యం చేశాను. అయితేనేమిలే, వచ్చానుగా ఇప్పుడు. ఏం వరం కావాలో కోరుకో " అన్నాడు. 

    ఏం వరం కావాలో వృకాసురుడు మొదటే ఆలోచించుకున్నాడు. " స్వామీ! మీరు నాకు దర్శనం యివ్వటమే చాలు. నాకు వరాలెందుకు? అయినా, మీరు కోరుకొమ్మన్నారు కనుక, కోరుకుంటున్నాను. చూడండీ, నా చెయ్యి తీసుకెళ్ళి ఎవడి నెత్తిమీద పెడతానో వాడి తల వెయ్యి వ్రక్కలై వాడు చచ్చిపోయేటట్లుగా నాకు వరం అనుగ్రహించండి " అన్నాడు. 

    వాడి కోర్కె వినేటప్పటికి శివునికి ఆశ్చర్యం వేసింది. " ఇదేమిటి వెర్రివాడు, ఇంత శ్రమపడి తపస్సుచేసి చివరకు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఇలాంటి వరమడిగాడేమిటి? " అనుకున్నాడు శివుడు. ఉండబట్టలేక, " ఇదేమిటోయ్! ఇలా కోరేవు? " అని కూడా అడిగి చూశాడు. 

    అందుకు వృకాసురుడు, " వరం అడగమన్నావు కనుక అడిగేను. ఇవ్వటం ఇష్టం లేకపోతే, ఇవ్వలేనని చెప్పి పోరాదా? " అన్నాడు. 

    " నేను వరం ఇవ్వలేక పోవడమేమిటి? ఇచ్చాను. పుచ్చుకో. నీ ఖర్మం ఎలా ఉంటే అలా అవుతుంది. " అని చెప్పి,  శివుడు వాడు కోరిన వరం ఇచ్చేసి, వెళ్ళిపోబోయాడు. 

    తక్షణమే వృకాసురుడు వెకిలి నవ్వు నవ్వుతూ " ఏమయ్యోయ్! మహాదేవా! ఆగు. ఈ వరం నీ ఖర్మం కాలే యిచ్చావు. నిన్ను ఏడిపించటానికే ఈ వరం కోరుకున్నాను. ఆగు. నా చెయ్యి మొదట నీ నెత్తిమీద పెట్టి, ఈ వర ప్రభావం ఎలాంటిదో పరీక్షచేస్తాను " అంటూ శివుడి మీదికి దుమికేడు. 

    ఇది చూచి శివుడు హడిలి పోయాడు. ఆయన చటుక్కున తప్పించుకున్నాడు కాని, లేకపోతే వృకాసురుడి చెయ్యి ఆయన తలమీద పడి, నాశనమై పోవలసినవాడే! 

    " ఎంత కృతఘ్నుడు " అనుకుంటూ శివుడు పరుగెత్తడం మొదలెట్టేడు. వృకాసురుడూ శివుడి వెంట పడ్డాడు. మాంసపు కండలన్నీ కోసి యిచ్చేయటం వల్లా, ఉపవాసాలు చేసి శుష్కించి  ఉండటం వల్లా కొంత నీరసంగా ఉన్నాడు కాని, లేకపోతే వృకాసురుడు శివుణ్ణి అందుకోగలిగేవాడే. " 
    ముందు శివుడూ, వెనుక వృకాసురుడూ పరుగెత్తి పోతూండడం, ఆకాశం మీది నుంచి విష్ణులోకానికి వెడుతున్న నారద మహర్షి చూశాడు. 

    ఆయన తన దివ్య దృష్టివల్ల జరిగిన సంగతంతా తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. " వీడికి తపస్సు చెయ్యవలసిందని ఆలోచన చెప్పింది నేనే కదా! కాని ఈ దుర్మార్గుడు తపస్సు అందుకోసం చేసేడన్నమాట! మంచివాళ్ళు పరోపకారం కోసం తమ శక్తులు వినియోగిస్తే, దుర్మార్గులు తమ శక్తుల్ని ఇలా దుర్వినియోగం చేస్తారు " అనుకుంటూ నారదుడు ఆపదలో ఉన్న ఆ పరమశివుణ్ణి ఏదోవిధంగా రక్షించాలనుకున్నాడు. 

    పరమశివుణ్ణి రక్షించాలంటే, మహావిష్ణువే ఏదో ఉపాయం చూపాలనుకుని నారదుడు తక్షణం వైకుంఠానికెళ్ళి విష్ణుమూర్తితో సంగతంతా చెప్పేశాడు. 

    విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న సమయం అది. అయితేనేం, నారదుడా సంగతి చెప్పటంతో చటుక్కుని లేచాడు. ఏమంటే, తన తోటివాడు శివుడు. త్రిమూర్తులలోనూ ఒకడు. బ్రహ్మదేవుని చేత సృష్టిచేయబడ్డ ఈ లోకాలన్నీ విష్ణుమూర్తి కాపాడతాడు. ఈ లోకాల పని అయిపోయాక, శివుడు వాటిని " ఇంక పనికి రావు " అని నాశనం చేస్తాడు. ప్రళయకాలంలో లోకాలని ఇలా నాశనం చెయ్యవలసిన శివుడే ఇప్పుడు తలవని తలంపుగా ఒక కృతఘ్నుడి చేతిలో నాశనమైపోతే ఎలాగ? విష్ణుమూర్తి ఒక్క క్షణం కూడా ఆలశ్యం చెయ్యకుండా బయల్దేరాడు. 

    ఒక పొట్టి బడుగు వేషం వేసుకుని, వృకాసురుడు శివుణ్ణి వెదుక్కుంటూ వెడుతూన్న చోటికి వచ్చాడు. 

    ఆ కపట బ్రహ్మచారిని వృకాసురుడు చూచి, ఆయాసంచేత రోజుకుంటూ ఆగి, " ఏమబ్బాయ్! నీకు శివుడెక్కడైనా కనబడ్డాడా? పిరికిపంద! ప్రాణాలు అరచేతిలో పట్టుకు పారిపోతున్నాడు! " అన్నాడు. 

    అందుకా బ్రహ్మచారి, " శివుడా! కనపడ్డాడు. ఆ కొండమాటున ఎదురయ్యాడు. ఎందుకయ్యా! ఎవరో తరుముకొచ్చినట్లు పరుగెత్తుతున్నావ్? " అని అడిగాను కూడాను. అందుకు ఆయన " నా భక్తుడు వృకుడు నన్ను ముట్టుకుంటానని తరుముకొస్తున్నాడు. కాస్త ముట్టుకుంటానంటే నాకేం పోయింది గనక? ముట్టుకోనిచ్చేవాణ్ణి. కాని వాడి ఒళ్ళంతా మాంసపు కండలు కోసేసిన పుళ్ళతోటి కంపుగొడుతూ అసహ్యంగా ఉంది. ఆ పళాన్ని ముట్టుకుంటానని పట్టుపట్టకపోతే, దగ్గరగా నది ఉందికదా! ఆ నదిలోకెళ్ళి శుభ్రంగా ఒళ్ళంతా ఒకమాటు కడిగేసుకొని స్నానం చేసి శుచిగా రాకూడదూ? అలా వచ్చి ముట్టుకుంటానంటే నే మాత్రం వద్దంటానా?  అన్నాడు. ఔనుగాని, నీకు ఈ మాత్రం తోచింది కాదేమిటోయ్! ఎంత లేదన్నా, దేవుడాయెనుగదా! శివుడు? అతణ్ణి స్నానం చెయ్యకుండా ముట్టుకుంటారటోయ్? " అన్నాడు బ్రహ్మచారి. 

    వృకాసురుడికి ఆ మాట వినేటప్పటికి, తాను నీళ్ళు పోసుకోకుండా శివుణ్ణి ముట్టుకుంటాననటం పొరబాటే అనిపించింది. " ఇదేమిటి? శాస్త్రాలూ, వేదాలూ చదివిన నాకు ఈ మాత్రం తోచింది కాదేమిటి? ఏటికి వెళ్ళి స్నానం చేసి, సంధ్య వార్చి, సూర్యుని కర్ఘ్యమిచ్చి, శుచినై వస్తాను. అప్పుడు శివుడు తనంత తానే వచ్చి, ముట్టుకోవోయ్! అంటాడు. గోళ్ళతో తీరిపోయే దానికి గొడ్డళ్ళు తేవటం ఎందుకు? " అని ఆలోచించి, నదికి వెళ్ళి, కంఠం లోతువరకూ దిగి, మునగటానికి ముందు జుట్టుముడి విప్పుకుందామని, చెయ్యి తలపైకి పోనిచ్చాడు. 

    ఇంకేముంది? శివుడా దుర్మార్గుడి కిచ్చిన వరం ఇట్టే పని చేసింది. తక్షణం వృకాసురుడి తల వెయ్యి వ్రక్కలై వాడు నాశనమైపోయాడు. 

    తాను చేసిన ఉపాయం ఫలించినందుకు విష్ణుమూర్తి సంతోషించి, ఈ సంగతేమీ తెలియక ఇంకా పరుగెడుతూనే ఉన్న శివుణ్ణి కలుసుకుని, " ఆగవయ్యా! ఇంక పరవాలేదు. " అని జరిగినదంతా చెప్పేడు. 

    శివుడంతా విని " రక్షించావు బాబూ! నన్నేకాదు. లోకాలనన్నింటినీ రక్షించావు. లేకపోతే, ఈ దుర్మార్గుడు కనపడ్డ వాడినల్లా నాశనం చేసేవాడే " అన్నాడు. 

    అందుకు విష్ణువు " నిజమే. కనుకనే నువ్వు దుర్మార్గులకు అలాంటి వరాలు వీలైనంత వరకూ ఇవ్వకుండా ఉండాలి " అని చెప్పి, శివుణ్ణి కైలాసానికి పంపేసి, తాను వైకుంఠానికి వెళ్ళిపోయాడు. 

5, జులై 2025, శనివారం

:: ఉస్తికాయ :: 

    రామ రావణయుద్ధం అయిందీ అన్నారు. అంటే, లోకకంటకుడైన పదితలల రావణాసురుడూ, అతని పరివారమూ నాశనమయ్యారన్నమాట. అవునా? - అవతార పురుషుడైన శ్రీరాముడూ, ఆయన పరివారమూ జేజేల మధ్యన సంతోషాంతరంగులై ఉన్నారు. అయితే, శ్రీరాముడి పరివారమెవరూ?- కపివీరులు. ఈ మాట మనం మరవనే కూడదు. 

    " వచ్చిన పని తీరిన తర్వాత ఇంకా ఎందుకు లంకలో? అయోధ్యకు వెళ్ళిపోదామా? " అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. వెంటనే వెళ్ళి విభీషణుడు పుష్పక విమానం తీసుకువచ్చాడు. అన్నట్టు, పుష్పక విమానమంటే తెలుసుగా? అది ఒక చిత్రమైన విమానం. దానిమీద ఎందరు ఎక్కి కూర్చున్నా, ఇంకా ఒకరికి సరిపడే చోటు ఉంటూనే ఉంటుందట. 

    రాముడూ, సీతా, లక్ష్మణుడూ, ఇంకా ముఖ్యులు విమానం ఎక్కారు. వారితో పాటు హనుమంతుడూ ఎక్కాడు. కపిసేనకు నాయకులైన అంగద సుగ్రీవాదులు అలా రంగంమీద నుంచునే ఉన్నారు. వారి శిక్షణ క్రింద కపివీరులంతా తోకలు నడుముకి చుట్టేసుకుని, చేతులు నులుముకుంటూ బారులు తీర్చి నిలబడ్డారు. 

    " పోయివస్తా "మన్నట్టుగా శ్రీరాముడు ఒక శాంతయుతమైన చల్లను చూపు విసిరాడు. చెప్పలేక చెప్పలేక, లాంఛన ప్రాయంగా " దయ ఉంచండి " అన్నారు నాయకులు. ఈ సమయంలో రాముడు కపివీరులందరి వేపూ కలయ జూచాడు. రామప్రభువుతో ఏదో విన్నవించుకోవాలనే ఆత్రం వారి ముఖాలలో గోచరించింది. కపివీరులు గుసగుసలాడ జొచ్చారు. " హుష్! " అని వారిని అదమాయించారు నాయకులు. 

    పెల్లుబికిన ఉత్సాహంతో కపివీరులంతా ఒక్కసారిగా కిచకిచ మన్నారు. " మా ఎదుటనే అంత ఆగడమా? " అన్నట్టు నాయకులు వారివేపు గద్దింపుతో చూచారు. 

    ఈపాటి తెలుసుకోలేడా ఆ సుగుణాభిరాముడు! " అంగదా!, సుగ్రీవా! కపివీరులను మీరు భయపెట్టకండి. వారి మనసులో కోరికలు నిర్భయంగా చెప్పనీయండి. వారు సామాన్యులు కారు. మనకు యుద్ధంలో జయలక్ష్మిని చేకూర్చిన శోభన దేవతలు. ఇంతకూ అదికారం చలాయించవలసిన ఘట్టం దాటిపోయింది. అనురాగం చూపవలసిన సమయం యిది " అన్నాడు శ్రీరాముడు. ఈ అభయానికి సంతోషం పట్టలేక, కపివీరులు తోకలు సద్దుకుని మరొక్కసారి కిచకిచ లాడారు. 

    అప్పుడు వాలయ్య అనే కపివీరుడు ఝడుపు వదిలి ముందుకు వచ్చి " స్వామీ! చనవిచ్చారు కనుక కడుపులో ఉద్దేశం మనవి చేసుకుంటున్నాము. రామసేవ కోసం పుట్టిన వీరులం మేము. వచ్చిన పని అయింది. ఇప్పుడు మమ్మల్ని ఇలా వదిలేస్తే, మమ్మల్ని విమానం ఎక్కించేది ఎవరు? ఈ మాటలో పొరపాటుంటే మన్నించండి " అన్నాడు. 

    " అదికాదండీ, ఎంతమందినైనా భరించి తీసుకుపోవటానికి మహిమగల పుష్పక విమానం ఉండగా, మనందరినీ ఎక్కించుకోవటానికి సందేహమెందుకో? ఎవళ్ళది ఏమి పోవాలి అంట " అని ప్రశ్నించాడు ఇంకొక వీరుడు. 

    ఇలా వాళ్ళు వాదించుకునే సరికి లక్ష్మణుడికి చీకాకెత్తింది. " చూచావా అన్నయ్యా! ఇప్పుడే వీళ్ళల్లో వీళ్ళకు పడటంలేదు. ఈ కోతిమూకను వెంటబెట్టుకు వెళితే నలుగురూ నవ్విపోతారు కూడాను " అన్నాడు. 

    తమ్ముణ్ణి మందలించాడు శ్రీరాముడు. " వాలయ్యా! నీవేమీ ఆత్రపడకు. మనలో ఒక్కొళ్ళమూ ఇక్కడ దిగపడి పోనక్కరలేదు. అందరమూ కలిసి అయోధ్యకు వెళ్ళి పోదాము. దివ్యమైన పుష్పక విమానం ఉండగా మనకేం లోటోయ్! ఈ సంగతి ముందే చెప్పవలసింది మీతో. మరిచా, పొరపాటు..." అంటూ తన మందమతికి చిన్నపుచ్చుకున్నాడు. 

    " అవునవును. ఎంత పొరపాటు జరిగింది? మన కపివీరుల కోరికలు ఇంకా ఏమున్నాయో ఇప్పుడైనా కనుక్కోండి " అని సలహా పూర్వకంగా హెచ్చరించింది జనని జానకి. 

    అంతట తిండిపోతు తిమ్మయ్య జంకుతూ వచ్చి, " రామప్రభూ! ఎవరేమి కోరుకున్నా లేదనకుండా అనుగ్రహిస్తారనే బిరుదు ఉందటకదా నీకు? కాయా కసురూ, దుంపాధూళీ నమిలి నమిలి విసుగెత్తిపోయింది. మీ వంటి రాజాధిరాజులు రుచికరమైన లాడూలూ అవ్వీ ఆరగిస్తారని చెప్పుకుంటారే, మేం మాత్రం వాటిని కాస్త రుచి చూడకూడదా? " అని తనకు గల అపేక్షను వెల్లడించాడు. 

    అమాయకమైన ఈ కోరిక విని సీతారాములు నవ్వుకున్నారు. " అసలే కోతిమూక, అందులో ఇది యుద్ధ జయం కలిగిన సంతోష సమయం. పైగా దయామయుడైన రామచంద్రుడు " కావలసినదల్లా అడగండి " అని అభయమిచ్చి ఉన్నాడు. వళ్ళూ పై తెలియకుండా వీళ్ళు ఇంకా పిచ్చి కోరికలు ఏమేమి కోరుకుంటారో? అని తలచి, హనుమంతుడు హుంకరించాడు వాళ్ళ వైపు తిరిగి. కపివీరులు తలలు వంచారు. 

    తిమ్మయ్య కోరిక విన్న వెంటనే శ్రీరాముడు " అలాగేనోయ్ నా తండ్రీ! లాడూలు తప్పక తిందువుకాని. అయోధ్యకు చేరుకోగానే అన్నీ చేసుకోవచ్చు జాగెందుకు రండి " అన్నాడు. 

    గిరగిరమని తోకలు ఊపుకుంటూ, బిలబిలమని కపి వీరులంతా విమానం ఎక్కేశారు. జాంమని ఝంకారం పెడుతూ పుష్పకం గగన మార్గాన ఎగిరిపోయి, కొంచెం సేపటికల్లా అయోధ్య నగరంలో వాలింది. అయోధ్యలో దిగీదిగటంతోనే ముందు సీతారాములు కపివీరులకు విందు ఏర్పాటు చేశారు. హనుమంతుడు పెద్దరికం వహించాడు. 

    ఒక్క గంటలో వస్తు సంబారాలన్నీ సమకూడి పోయినై. మరొక్క గంటసేపటికల్లా పంచభక్ష్య పరమాన్నాలతో భోజనాదికాలు సిద్ధమైనాయి. హనుమంతుడు వచ్చి " బారులు తీర్చి అందరూ బుద్ధిగా కూర్చోండి. వడ్డన జరుగుతుంది " అని చెప్పాడు. 

    ఎలా అయితేనేం, ఆంజనేయుని మాటవిని, అందరూ కుదురుగా కూర్చున్నారు. క్షణమైనా అయిందో లేదో, ఒక ఉస్తికాయ వచ్చి బంతిమధ్యన కూర్చున్న ఒక కపివీరుని ఒడిలో పడింది. వీరుడు ఆ కాయకేసి తదేక దీక్షతో చూచి చూచి, లోపల ఏమిటి ఉంటుందోననే ఆత్రంతో రెండు వ్రేళ్ళతోనూ నొక్కాడు. పుసుక్కుమని ఒక గింజ కాయలోనుంచి బయటకు జారివచ్చి పైకి ఎగిరింది. 

    " ఓసీ, నలుసంతలేవే, నాకంటే ఎత్తుగా ఎగురుదామనా నీ ఉద్దేశం " అంటూ వీరుడు ఆ గింజతో పాటే ఒక్క ఎగురు ఎగిరాడు. తమ్ముడు ఎందుకు ఎగురుతున్నాడో, ఏమి ప్రమాదం వచ్చిందో, మనం వెళ్ళి సాయపడకపోతే ఎలాగా? " అని అనుకొని, ప్రక్కనున్న వీరుడూ ఎగిరాడు. ఈ ఇద్దరూ ఎగిరేసరికల్లా,  కారణం తెలుసుకోకుండానే ఇంకొకరు, మరొకరూ వచ్చి వాళ్ళతోపాటు గెంతులేశారు. అంతలోనే పంక్తులన్నీ చెదిరిపోయి, అందరూ ఒక్కచోట మూగేసి, ఒక్కలా ఎగర జొచ్చారు. 

    ఇది చూసి హనుమంతుడు " ఏమర్రా! మీగోలకూల! ఇంతట్లోనే మీ బుద్ధి గడ్డితిన్నదే! మన చేష్టలు చూచే అందరూ మనల్ని కోతుల భాగోతం అంటారు. భోజనాల వేళ ఎంత గొడవ చేశారే! మీ వాలకం చూస్తే, ఆ రామయతండ్రికి మాత్రం ఎంతకని ఓరిమి నిలుస్తుంది? " అంటూ మందలించ బోయాడు.

    ఇంతలో విస్తళ్ళు వేయడం, ఆ వెంటనే లాడూల బుట్టలు చేతపట్టుకుని సీతారాములు స్వయంగా వడ్డించ రావటం జరిగింది. " హనుమా! మన వీరులమీద విసుక్కుంటున్నావెందుకు? చూడు, పాపం, ఎంత బుద్ధిగా కూర్చుంటున్నారో! ఏది, ఎక్కువగా అల్లరి చేశాడంటున్నారే, ఆ వీరుడేడి? అతనికి రెండు లాడూలు. అంతే శాస్తి. " అనేసరికల్లా ఎక్కడివాళ్ళక్కడ సర్దుకున్నారు. వీళ్ళకి బుద్ధి వచ్చింది. ఫరవాలేదని హనుమంతుడు ధైర్యం చెందాడు. 

    జానకీ రాములు వడ్డన చేస్తూండగా, ఉన్నట్టే ఉండి ఒక కపివీరుడు శ్రీరాముని భుజం ఎక్కి కూర్చున్నాడు. మరొకడు బుట్టలో లాడూలు బలవంతంగా లాక్కొన్నాడు. ఇంకొక కపివీరుడు ఊరుకోక జానకమ్మ మెడలో హారం తీసి పరీక్ష చేయబోయాడు. ఏదో మహా తెలిసినట్టుగా. 

    ఇన్ని చేసినా ఆ దంపతులు ఆనందంతోనే ఉన్నారు. నిజానికి, కపివీరుల చేష్టలు చూచినకొద్దీ వారికి సంతోషం ఎక్కువయింది. కాని, వారు పడే యాతన చూడలేక హనుమంతుడూ, లక్ష్మణుడూ కపివీరులను కోపదృష్టితో చూడసాగారు. " హనుమా! లక్ష్మణా! మన బిడ్డల అల్లరి మనకు ముద్దుకాదటోయ్! అయినా, వారు చేసేది అల్లరికాదు. అది నిష్కపటమైన ఆనందం " అన్నాడు రాముడు మందహాసంతో. 

    విందు పూర్తయింది. ఒక్కొక్క కపివీరుణ్ణి ఒడిలోనికి తీసుకుని శ్రీరామచంద్రమూర్తి నిమిరేసరికి, వాళ్ళకు యుద్ధపు బడలిక ఎక్కడిదక్కడనే ఎగిరిపోయింది. 

    తరువాత శ్రీరామ పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు జరిగినై. ఆ సమయమందు శ్రీరాముడు ప్రత్యేకించి కపిసేననూ, వాళ్ళ ప్రజ్ఞనూ ప్రస్తుతించాడు. పైగా నిండు దర్బారులో " ఓ మహావీరులారా! భూలోకంలో రామకథతోపాటు రామసేవకు అంకితమైన కపివీరుల కథనాలు కూడా నడుస్తూనే ఉంటాయి. కపివీరుడు కంటబడితే చాలు మానవులకు రామాయణ కథ జ్ఞాపకం వస్తుంది. అటువంటి అవినాభావ సంబంధమున్నది రెండింటికీ. మీ సంతోషమే నా సంతోషమే అని తెలియటం చేత, మానవులు మిమ్మల్ని గౌరవిస్తే నన్ను పూజించినట్టుగానే భావిస్తారు. ఇంతటినుండి మీరు దేశమందుండే పుణ్యక్షేత్రాలు చేరుకుని ఉనికి ఏర్పరుచుకోండి. అక్కడకు వచ్చే భక్తులు మిమ్మల్ని చూడగానే రామకథ గురుతువచ్చి ధన్యులవుతారు. మీరు చేసిన సాయానికి ఇదే నేనీయగల కానుక. " అంటూ ఆప్యాతతో వారిని దీవించాడు. 

    శ్రీరామమూర్తి ఇలా చెబుతూ ఉంటే జయదుందుభులు మ్రోగినై. కపివీరులమీద పుష్పవర్షం కురిసింది. కపివీరులు వాలములు ఊపుకుంటూ, సీతారాములకు, హనుమంతునికి నమస్కరించి, సెలవు తీసుకొని , కితకితలాడుతూ పోయి దివ్యక్షేత్రాలు చేరుకున్నారు. 

3, జులై 2025, గురువారం

:: శ్రీరామదర్శనం :: 

       అక్బరు చక్రవర్తి కాలమందు హస్తినాపురంలో తులసీదాసు అనే రామ భక్తుడు ఉండేవాడు. ఆయన రోజూ సమీప గ్రామానికి వెళ్ళి అక్కడి వాళ్ళకి వాల్మీకీ రామాయణం చదివి వినిపిస్తూండేవాడు. ఆయన గొప్ప పండితుడూ, కవి, మహాభక్తుడున్నూ. అందువల్ల పురాణం చెబుతుంటే, గ్రామస్థులందరికీ రామాయణం కళ్ళకు కట్టినట్టుండేది. 

    ఆ వినటానికి వచ్చే వాళ్ళలో ముసిలి బ్రహ్మచారి ఒకాయన అందరికంటే ముందే హాజరయ్యేవాడు. ఆయన చాలీచాలని చిరుగుల అంగవస్త్రంలో వచ్చి, ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉండేవాడు. 

    తులసీదాసు అందరికీ వినపడేటట్లు కంఠం ఎత్తి శ్లోకాలు చదివి, అర్థం చెబుతూ ఉంటే మాటిమాటికీ గొంతుక అర్చుకు పోతూ ఉండేది. అటువంటప్పుడు ఆ ముసలి బ్రహ్మచారి మంచినీరు తెచ్చి ఆయన లోటాలో పోసి, " దాహం పుచ్చుకోండి బాబూ! " అని అంటూ ఉండేవాడు. 

    రోజూ రాత్రి పురాణం అయిపోవటంతోనే తులసీదాసు తన రామాయణ పుస్తకమూ, చెంబు పుచ్చుకొని హస్తినాపురం వచ్చేస్తూ, చెంబులో మిగిలిన నీటిని దారిలో ఒక రావిచెట్టు మొదట్లో పోసి పోతూ ఉండటం మామూలు. ఇలా చాలా కాలం గడిచింది. 

    ఒకనాటి రాత్రి ఆయన మామూలు ప్రకారం ఆ చెట్టు మొదట నీళ్ళు పోసి తన దారిని పోతూంటే " అబ్బాయ్! ఆగు " అని ఎవరో అన్నట్టు వినిపించింది. 

    " మనుష్య సంచారం లేని ఈ ప్రదేశంలో ఎవరు చెప్మా పిలుస్త! " అని ఆశ్చర్యపోతూ తులసీదాసు నిలబడి పోయే సరికి బ్రహ్మరాక్షసుడొకడు చెట్టు దిగివచ్చి ఆయనకు ప్రత్యక్షమయాడు. వానిని చూచి తులసీదాసు భయపడేసరికి, " నన్ను చూసి నీవేమి భయపడకు. నేను నీకుమల్లె ఒక పండితుణ్ణే. అయితే దుర్మార్గంగా ప్రవర్తించి, సాధుజనుల్ని హింసించటంవల్ల ఈ ఘోర రూపం వచ్చింది. సరే, నా కథకేమిలే, నీకేమి వరం కావాలో కోరుకో " అన్నాడు. 

    తులసీదాసు ఆశ్చర్యంతో, " అయ్యో, ఎంతమాట! నాకే వరమూ వద్దు. కాని, నామీద మీకీ దయ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పండి, సంతోషిస్తాను " అన్నాడు. 

    " దయ ఊరికే పుట్టుకురాలేదోయ్. దాహంతో పీక ఎండిపోతూ ఉన్న నాకు రోజూ నువ్వు ఇన్ని నీళ్ళు పోసి పోతున్నావు. ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చెయ్యాలనిపించి, వరం ఇస్తున్నాను " అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. 

    అందుకు తులసీదాసు, " మహాత్మా! నాకు ఏ కోరికా లేదు. నేను రామ భక్తుణ్ణి. చిరకాలమై రామాయణం పురాణం చెపుతూ, రామనామమే జపిస్తూ జీవితం గడుపుకొస్తున్నాను. కాని యింకా ఆ శ్రీరాముని దర్శనం కాలేదు. ఆయన దర్శనం కలిగేటట్లు అనుగ్రహిస్తే చాలు, అంతకంటే నాకు కావల్సింది ఏమీ లేదు " అంటూ తన మనసులోని కోరిక వెల్లడించాడు. 

    బ్రహ్మరాక్షసుడికి కాస్సేపటివరకూ నోట మాట రాలేదు. " అబ్బాయ్! నీవంటి మహా భక్తుడు కోరదగిన వరమే యిది. కాని, ఆ వరం సిద్ధింపచేసే శక్తి నాకు లేదు. అంతమాత్రాన నిరుత్సాహ పడకు. నేను నీకు రామదర్శనం చేయించ లేకపోయినా, చేయించగల మహానుభావుణ్ణి చూపెడతాను. ఆయన్ను నువ్వు రోజూ చూస్తూనే ఉన్నావు సుమా! " అన్నాడు. 

    " ఎవరు బాబూ! ఆయన? " అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు. 

    " నువ్వు పురాణం చెబుతూ ఉంటే రోజూ భక్తి శ్రద్ధలతో వచ్చి వింటూ మధ్య మధ్య నీకు మంచినీరు తెచ్చిపోసే ఆ వృద్ధ బ్రహ్మచారి ఎవరని నీ ఉద్దేశం? రామ భక్తాగ్రేసరుడైన హనుమంతుడే ఆయన " అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. 

    ఈ మాట వినటంతోనే తులసీదాసు బ్రహ్మానందభరితుడై, ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు ముట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడికి ఆ ఘోరరూపం పోయి, దివ్యమైన తేజస్సుతో ప్రకాశించే ఒక గంధర్వుడై నిలబడ్డాడు. 

    " మహాత్మా! నీ స్పర్శవల్ల నా పూర్వరూపం వచ్చింది నాకు. నేనెంత అదృష్టవంతుణ్ణి. నీ మేలు ఎన్నటికీ మరువను. కొద్దికాలంలోనే నీకు శ్రీరామ కటాక్షం కలుగుతుంది. నాకు సెలవియ్యి " అని వేనోళ్ళ స్తోత్రం చేసి అదృశ్యమయ్యాడు. 

    మరునాడు తులసీదాసు పురాణం చెబుతున్నా ధ్యానమంతా మామూలుగా వచ్చి కూచుని వింటూన్న ఆ వృద్ధ బ్రహ్మచారి మీదనే ఉంది. త్వరగా ముగించేశాడు ఆ రాత్రి. అందరూ వెళ్ళిపోయారు. ముసలి బ్రహ్మచారి కూడా పోబోతూ, " ఏం దాసూ! రాచకార్యం ఏదైనా వచ్చిందా, ముందుగా ముగించేశావు ఇవాళ? " అని అడిగాడు. 

    తులసీదాసు ఆయనకు పాదాక్రాంతుడై " అన్నా! రాచకార్యమే ఉంది. నీకూ నాకూ ప్రభువైన ఆ శ్రీరామచంద్రుని దర్శనం నీవు నాకు చేయించాలి. నీ నిత్య దర్శనంతో ఇన్నాళ్ళూ నన్ను కటాక్షించావు. నువ్వు ఎంత చెబితే అంత రాముడికి. ఆయన్ను నాకు చూపించు. " అని పరి పరి విధాల వేడుకున్నాడు. 

     ఆంజనేయుడు చిరునవ్వుతో, " ఏ వేషం వేసినా నా సంగతి తెలిసిపోయిందే వీనికి  అనుకుని  సరే, వెళ్ళు స్వామి దర్శనం అవుతుందిలే " అని చెప్పి అంతర్ధానమయాడు.

    ఆ రాత్రి తులసీదాసు ఇంటికి వెళ్ళి శ్రీరామచంద్రుణ్ణి ధ్యానిస్తూ కూర్చునేప్పటికి చిన్న కునుకు వచ్చింది. ఆ కునుకులో ఒక  కల వచ్చి, ఆయనకు శ్రీరామచంద్రుడు సీతాలక్ష్మణ భరతశత్రుఘ్నులతో సహా ప్రత్యక్షమయాడు. తులసీదాసు ఆనందానికి మేరలేకపోయింది. 

    అలా ఎంతో సేపుగా నిలబడిపోయి ఉన్న శ్రీరాముడు తులసీదాసుని " ఏమోయ్! ఇంక నేను వెళ్ళవచ్చునా ? " అని ప్రశ్నించినాడు. 

    ఈ ప్రశ్నకు సీతాదేవి, " ఏమండీ! ఇతనితో మనం చెప్పదలుచుకున్న మాట మరిచే పోయినట్టున్నారే? " అని జ్ఞాపకం చేసింది. 

    " ఏమిటి శలవు తల్లీ! " అని ఆతృతతో అడిగాడు తులసీదాసు. 

    అందుకు సీతాదేవి " తులసీదాసూ! వాల్మీకి రాసిన రామాయణం సంస్కృతంలో ఉంది. ఆ భాష ఇప్పుడు అందరికీ అర్ధం కావటం లేదు. కనుక నువ్వు రామాయణాన్ని హిందీలో రాస్తే బాగుంటుందని మా ఉద్దేశం " అని అనటం, ఆ దంపతులు అదృశ్యం కావటం, తులసీదాసుకు మెలకువ రావటం ఒక్కమాటుగా జరిగినై. 

    సీతారాముల ఆజ్ఞ తలదాల్చి, తులసీదాసు వెంటనే తాటాకులూ, గంటమూ తెచ్చి హిందీభాషలో రామాయణం రాయటం ఆరంభించాడు. 

    రామాయణం వంటి మహాగ్రంథం దీక్షగా రాయటానికి ప్రశాంతత అవసరమని తలచి, ఆ ఊరు వదిలి తులసీదాసు సరాసరి కాశీలో మకాం పెట్టాడు. కాశీలో గొప్ప గొప్ప పండితులెందరో ఉన్నారు. వాళ్ళతో స్నేహం చేసి, తను రాసినంత వరకు ఏరోజు కారోజు చూపెట్టేవాడు. కొందరు, " ఇలా అందరికీ అర్థమయే భాషలో రాసి లోకోపకారం చేస్తున్నావు తులసీదాసూ, ధన్యుడవోయ్! " అని మెచ్చుకున్నారు. 

    మరికొందరు " రామాయణం సంస్కృతంలోనే ఉండాలి కాని మరొక భాషలో రాస్తే అపవిత్రం అయిపోతుంది " అంటూ దూషించారు. ఏమైతేనేం, తులసీదాసు పేరు ప్రఖ్యాతులు దశదిశలా ఇట్టే వ్యాపించినై. 

    ఒకనాడు తులసీదాసు ఆశ్రమంలోకి ఒక స్త్రీ వచ్చి ఆయనకు నమస్కరించింది. ఆయన తన వ్రాత ధోరణిలో ఉండి, " దీర్ఘ సుమంగళీభవ! పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు! " అని ఆమెను దీవించి, మళ్ళీ తన మానాన తను రాసుకుంటున్నాడు. 

    ఆమె సంతోషించటానికి బదులు వెక్కి వెక్కి యేడవటం మొదలుపెట్టింది. ఆయన వంచిన తలయెత్తి " ఏమి తల్లీ, ఎందుకు దు:ఖిస్తున్నావు? " అని అడిగేడు. 

    అందుకు ఆమె, " స్వామీ! నాభర్త ఈ ఉదయమే మరణించాడు. శవాన్ని గంగ ఒడ్డుకి తీసుకెళ్ళారు. నేను ఆయనతో సహగమనం చెయ్యటానికి వెడుతూ మహాత్ములైన మీకు నమస్కరించి పోదామని ఇలా వచ్చాను " అంది. 

    ఆయన నిర్ఘాంత పోయాడు. " తల్లీ! శ్రీరామచంద్రుడే నా నోటివెంట అలా పలికించాడు. కనుక నీవు అదృష్టవంతురాలవన్నమాట. రాముడెన్నడూ ఆడి తప్పలేదు. నా నోట ఆయన పలికించిన  ఈ మాటలుకూడా అబద్ధం కావటానికి వీలులేదు. నీవు గంగ ఒడ్డుకు పోయి, శవాన్ని యిక్కడకు రప్పించు చూదాం " అన్నాడు. 

    ఆమె గబగబా పరుగెత్తికెళ్ళి, భర్త శవాన్ని వెంటబెట్టుకు వచ్చింది. 

    తులసీదాసు శ్రీరాముణ్ణి ధ్యానించి, " స్వామీ! బండరాయిని లావణ్యవతిగా మార్చిన మహానుభావుడవు. నీకు అసాధ్య మేమున్నది? ఈయనను పునరుజ్జీవితుని చేసి, నామాట నిలబెట్టు తండ్రీ " అంటూ ప్రార్థించాడు. 

    అతడలా ప్రార్థించుతూ ఉండగానే ఆ శవం నిద్రలోంచి మేలుకున్న వాడికిమల్లే లేచి కూర్చొనేసరికి ఆ స్త్రీ చెప్పలేని ఆనందంతో పరిపరివిధాల తులసీదాసుకి కృతజ్ఞత కనబరుస్తూ వెళ్ళిపోయింది. 

    ఈ సంగతి అక్బరుచక్రవర్తికి కూడా తెలిసి ఆయన దర్బారులో పండితుల యెదుట తులసీదాసు మహాత్మ్యాన్ని గురించి మెచ్చుకోసాగాడు. 

    తులసీదాసంటే కిట్టని ఆ పండితులు " ప్రభూ! ఆయనకు మహాత్మ్యం ఏమీ లేదు. అంతా ఉత్తది. పైగా ఇప్పుడు సంస్కృత రామాయణాన్ని హిందీలో రాసి అపవిత్రం కూడా చేస్తున్నాడు. దీనివల్ల దేశానికి ఏమి ఉపద్రవం వస్తుందో ఏమో! " అంటూ అసూయ వెలిగక్కారు. 

    వెంటనే పాదుషా తులసీదాసుని రప్పించి " ఏమిటయ్యా, నువ్వు కాశీలో ఏదో గమ్మత్తులు చేస్తున్నావుట. చచ్చిన వాణ్ణి బతికించావుట, నిజమేనా? " అని గద్దించి అడిగాడు. 

    తులసీదాసు " అయ్యా! నేను కాదు, శ్రీరామచంద్రుడే బ్రతికించాడు " అన్నాడు. 

    " శ్రీరామచంద్రుడా? ఏడీ, అతణ్ణి నాకు చూపించు. చూపలేక బూటకం మాటలు చెప్పావంటే శిక్ష వేయిస్తా సుమా! " అని బెదిరించాడు పాదుషా. 

    తులసీదాసు ఏమో చెప్పబోతుంటే వినిపించుకోక పాదుషా భటుల్ని పిలిచి, " ఆ రామచంద్రుడెవరో నాకు చూపేవరకు ఇతనిని ఎక్కడికీ కదలనివ్వవద్దు " అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. 

    కాస్సేపటికి వృద్ధబ్రహ్మచారి వేషంలో హనుమంతుడు అక్కడికి వచ్చి, కూడా తెచ్చిన తాటాకులూ, గంటం ఆయనకిచ్చి " దాసూ! నువ్వేమీ బాధపడక, నీ రామాయణం రాసుకుంటూ కూచో, పాదుషా పని నే చూస్తానులే " అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. 

    తెల్లవారేసరికల్లా, పాదుషా పట్టణమంతా ఎక్కడ చూసినా కోతులతోటి కోడముచ్చులతోటి నిండిపోయింది. ఏ యింటి మీద చూసినా ఒక్క పెంకు కూడా లేదు. ఏ చెట్టుని చూసినా ఒక్క కాయకూడా మిగలలేదు. వీథులమ్మటా వెళ్ళేవాళ్ళను ఒక్కొక్కళ్ళనే పట్టుకుని పీకి వదిలి పెట్టాయి కోతులు. ఎవరేమి ఎక్కడ పెట్టుకున్నా ఉండనియ్యక ఎత్తుకుపోయాయి. ఎక్కడ నలుగురు చేరినా వాళ్ళమీద ఏ కొండముచ్చో దభీమని ఉరికి హడలగొట్టేది. ఆనాడు పాదుషా అంత:పురంలోనూ కోతులే. నాలుగు మహా వానరాలు వచ్చి, ఆయన పడుకున్న మంచాన్ని మోసుకుపోయి, దొడ్లో ఉబ్బెత్తుగా పడవేశాయి. ఆయనకు మెలకువ వచ్చి చూసుకునేటప్పటికి ఏముంది? ఎక్కడ చూసినా కోతుల మయమే. ఎవరిని చూసినా రక్కులూ, రక్తమే. 

    ఏమిటిదంతా? అని వాకబు చేసేసరికి, మంత్రివచ్చి " ప్రభూ! సాధురూపుడైన తులసీదాసుని నిర్బంధించినందుకు శ్రీరామచంద్రుడు కోపగించి ఈ కోతుల మూకని పంపాడేమో అని నాకు తోస్తోంది " అన్నాడు. 

    అక్బరు చక్రవర్తి యెకాయెకిని తులసీదాసు ఉన్న చోటుకి వెళ్ళి " మహాత్మా! నా వల్ల అపరాధం జరిగింది. ఈ కోతుల్ని ఎక్కణ్ణుంచి రప్పించావో అక్కడికి పంపెయ్యి " అని పరిపరి విధాల ప్రాధేయపడ్డాడు. 

    తులసీదాసుకి కోతులొచ్చాయన్న సంగతే తెలీదు. ఏమంటే ఆయన తన వ్రాత ధోరణిలో ఉన్నాడు. అంతేకాకుండా కోతులు ఆ దరికి రాలేదు. " కోతులేమిటి? " అంటూ ఆయన బయటకొచ్చి చూచేటప్పటికి, వానరసేన అంతా బుద్ధిమంతులకు మల్లే తలలు వంచుకుని కూర్చుని ఉంది. 

    ఆనందభరితుడైన తులసీదాసు అక్బరుతో " ప్రభూ! నీవెంత అదృష్టవంతుడివయ్యా! శ్రీరామచంద్రుని దర్శనం నీకు కాబోతోంది. వారి రాకను తెలుపుతూ ఈ కోతులు వచ్చాయి. శ్రీరామచంద్రుడికి ఇలాంటి సేనలు డైబ్భై రెండున్నాయి. అందులో ఇప్పుడు ఒక్కటే వచ్చింది. ఆ డెబ్భై రెండూ వచ్చిన పిమ్మట, శ్రీరాములవారు సీతాదేవినీ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల్నీ, హనుమంతుణ్ణీ, సుగ్రీవ, విభీషణుల్నీ వెంటబెట్టుకుని వస్తారు. ఏ చక్రవర్తికీ పట్టని అదృష్టం పట్టింది నీకు " అంటూ, పాదుషా నిమిత్తాన తనకు కూడా శ్రీరామదర్శనం కలుగబోతోందన్న సంతోషంతో పొంగిపోయాడు. 

    అక్బరు మాత్రం హడలిపోయాడు. ఒక్క సేన వల్లనే ఇంత అల్లకల్లోలం జరిగిందే, మిగతా డెబ్భై యొక్క వానర సేనలు వస్తే ఇంకేమైనా ఉండా? అని ఆయన భయం. 

    పాదుషా తులసీదాసు కాళ్ళమీద పడి, " మహాత్మా! ఆ సేనలూ వద్దు. రాముడూ రావద్దు. ఈ కోతుల్ని పొమ్మను. నీకు పుణ్యం ఉంటుంది. " అంటూ గోలపెట్టాడు. 

    తులసీదాసు హనుమంతుణ్ణి తలుచుకునేసరికి కోతులూ, కొండముచ్చులూ ఎక్కడి వక్కడ మాయమయ్యాయి. 

    పాదుషా నాటి నుంచి సాధువులను బాధించకూడదని నిశ్చయించుకుని, తులసీదాసుని అనేక విధాల సత్కరించి, సురక్షితంగా మళ్ళీ కాశీకి పంపేశాడు. 

    మరికొంత కాలానికి తులసీదాసు తన హిందీ రామాయణాన్ని పూర్తిచేసి జన్మ చాలించి శ్రీరామునిలో ఐక్యమయ్యాడు. ఆయన దేశానికి అర్పించి వెళ్ళిన హిందీ రామాయణం వల్ల తులసీదాసు కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది.  



    

  ద్రౌపది నవ్వు       శ్రీమహాభారత కథాగమనమును మలుపు త్రిప్పిన సంఘటనలందు " ద్రౌపది నవ్వు" ప్రముఖమైనదిగా చెప్పబడుతుంది. మన కెదురుగ ను...