16, జనవరి 2026, శుక్రవారం

:: మహాభారత రహస్యాలు-7 :: 


    మహాభారతంలో  భీష్మపితామహుడి మరణానికి పునాదివేసిన ఆ స్త్రీ అంబ. ఒక చిన్న పొరపాటు, ఒకరి మొండితనం చివరకు భీష్ముడి పతనానికి ఎలా దారితీసింది? ఆ చిన్న పొరపాటు ఏమిటి? తన తమ్ముడైన విచిత్రవీర్యుడి కోసం భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువస్తాడు. అయితే, అంబ అప్పటికే సాల్వరాజుని ప్రేమిస్తున్నానని చెప్పడంతో, భీష్ముడు ఆమెను గౌరవించి పంపేస్తాడు. కానీ, మరొకరు తీసుకువెళ్ళిన స్త్రీని తాను స్వీకరించనని సాల్వరాజు ఆమెను తిరస్కరిస్తాడు. తిరిగి భీష్ముడి వద్దకు వస్తే, విచిత్రవీర్యుడు కూడా ఆమెను వద్దంటాడు. భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞ బ్రహ్మచర్యం వల్ల ఆమెను పెళ్ళిచేసుకోలేనని చెబుతాడు. ఇరువైపుల న్యాయం జరగక, తన జీవితం నాశనమవడానికి భీష్ముడే కారణమని అంబ రగిలిపోతుంది. భీష్ముడిని చంపటమే లక్ష్యంగా శివుడి కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు " వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణ మవుతావు " అని వరం ఇస్తాడు. ఆ వరంతో అంబ మరుజన్మలో ద్రుపద మహారాజుకు శిఖండిగా జన్మిస్తుంది. పుట్టుకతో స్త్రీ అయినప్పటికీ, తరువాత పురుషుడిగా మారుతుంది. అయితే, భీష్ముడి అంతం ఎలా జరిగింది? కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని ఓడించటం ఎవరికీ సాధ్యం కాదు. అప్పుడు కృష్ణుడు శిఖండిని అర్జునుడి రథం ముందు నిలబెడతాడు. భీష్ముడికి  ఆడవారిపై గానీ, పూర్వం ఆడదిగా పుట్టిన వారిపై గానీ ఆయుధం పట్టనన్న ధర్మ నియమం ఉంది. శిఖండి పూర్వజన్మలో అంబ అని భీష్ముడికి తెలుసు. అందుకే శిఖండిని చూడగానే భీష్ముడు తన విల్లును క్రింద పడేశాడు. అదే సమయంకోసం ఎదురుచూస్తున్న అర్జునుడు శిఖండి చాటునుండి భీష్ముడిపై బాణాలవర్షం కురిపించి అతడిని అంపశయ్యపై పడేశాడు. అంబ పగ శిఖండి రూపంలో భీష్ముడి నైతిక ధర్మాన్నే ఆయుధంగా మార్చుకుని ఆయన మరణానికి కారణమయింది. 

    భీష్ముడు అంపశయ్యపైకి చేరాక, కౌరవ సైన్యం బాధ్యత ద్రోణాచార్యుడి చేతికి వచ్చింది. కానీ, తనను ఎవరూ ఓడించలేరని తెసిన ద్రోణుడు యుద్ధభూమిలో అకస్మాత్తుగా ఆయుధం ఎందుకు క్రిందపడేశాడు? ధర్మరాజు చెప్పిన ఒక్క అబద్ధం ద్రోణుడి మరణానికి ఎలా కారణమయింది? వచ్చే భాగంలో తెలుసుకుందాం. 

15, జనవరి 2026, గురువారం

:: మహాభారత రహస్యాలు - 6

భీష్ముని 'భీషణ' ప్రతిజ్ఞ హస్తినాపుర చరిత్రను, కురువంశ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. దీని వల్ల జరిగిన ప్రధాన మార్పులు నాలుగు. మొదటిది వారసత్వ సంక్షోభం. భీష్ముడు రాజ్యత్యాగం చేసి, పెళ్ళి చేసుకోనని శపథం చేయడంతో, సమర్థుడైన పాలకుడు ఉన్నప్పటికీ సింహాసనం బలహీనపడింది. తదుపరి వారసులైన చిత్రాంగద, విచిత్రవీర్యులు అల్పాయుష్కులు కావడం వలన రాజ్యం అస్థిరతకు లోనయింది. రెండవది ధర్మ సంకటం పైపెచ్చు అశక్తత. భీష్ముడు కేవలం హస్తినాపుర సింహాసనానికి కట్టుబడతానని ప్రతిజ్ఞ చేశాడు. దీనివల్ల ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి అధర్మాలు జరుగుతున్నా, తను చక్రవర్తి కానందున కేవలం చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆయన మౌనం కురువంశ నాశనానికి ఒక కారణమయింది. మూడవది కురుక్షేత్ర యుద్ధానికి పునాది పడటం. భీష్ముడు సింహాసనం అదిష్టించి ఉంటే, ధృతరాష్ట్రుడు లేదా పాండురాజు మధ్య వారసత్వ పోరు వచ్చేది కాదు. ఆయన తప్పుకోవడం వల్లే కౌరవ పాండవుల మధ్య విభేదాలు తలెత్తి, చివరకు అది ప్రపంచాన్నే మార్చిన కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారి తీసింది. ఇంకొక ముఖ్యమైనది నాలుగవది వంశవృక్షం మార్పు అనేది. భీష్ముడి ప్రతిజ్ఞ కారణంగానే కురువంశాన్ని నిలబెట్టడానికి ' నియోగ పద్ధతి ' ద్వారా వ్యాస మహర్షిని పిలవాల్సి వచ్చింది. దీనివల్ల కురువంశ రక్తసంబంధం తీరు మారిపోయింది. 

భీష్ముడి ప్రతిజ్ఞ ఆయన పితృభక్తికి నిదర్శనం అయినప్పటికీ, అది హస్తినాపురానికి రక్షణ కవచంలా కాకుండా, ఆ వంశం అంతరించి పోవడానికి ఒక పరోక్ష కారణంగా మిగిలిపోయింది. అందుకే అంటారు - కొన్ని త్యాగాలు చరిత్రను కాపాడితే, మరికొన్ని చరిత్రను మార్చి వేస్తాయని. 

సరే! భీష్ముడి త్యాగం హస్తినాపురాన్ని అనాథను చేస్తే , అదే భీష్ముడు చేసిన ఒక చిన్నపొరపాటు , ఒక స్త్రీ ఆగ్రహానికి కారణమయింది. ఆ ఆగ్రహమే భీష్ముడి మరణానికి ఎలా దారితీసింది? భీష్ముడిని అంతం చెయ్యడానికి పుట్టిన ఆ శక్తి ఎవరు? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మహాభారత రహస్యాలకోసం లైక్ చేయండి మరియు సబ్ స్క్రైబ్ చేసుకోండి. 
  

11, జనవరి 2026, ఆదివారం

::  వాతాపి బాదామిగా ఎలా మారింది ::


    శత్రుంజయుడు  ఎలుకతో  చళుకవర్మను దూరంగా చిన్న యింటికి తరిమి, " నువ్వు మామధ్య ఉండవలసిన వాడవు కావు. నీ ఎలుక వాహనుడైన విఘ్నేశ్వర భక్తికి తగ్గట్టు, ఆ వాహనం జాతిదే నీకు దగ్గ యిల్లాలు. నీ యిల్లాలు అసూర్యం పశ్యగా ఎవరికీ కనపడకుండా ఉండే అంత:పుర కాంతగా ఉండడానికి ఇంటినిండా ఎలుక బిలాలు ఉన్నవిలే " అంటూ ఎకసెక్కెం చేశాడు. 

    చళుకుడు తండ్రి మాటలకు ప్రశాంతంగా, " తండ్రి, కుమారులందరికీ పెళ్ళి చేయడమనేది చాలా గొప్ప విషయం. ఎవరి కెవ్వరో అది ఏనాడో రాసిపెట్టిందే అంటారు. మన చేతుల్లో ఏమీ లేదు. అంతా ఆ విఘ్నేశ్వరుని ఇచ్ఛ కదా! " అన్నాడు. 

    చళుకుడు ఉత్తమ గ్రంథాలను చదువు తున్నప్పుడు చుళుక ప్రక్కనే చేరి వింటూ ఉండేది. చళుకుడు విఘ్నేశ్వరుని అర్చిస్తూన్నప్పుడు నోటితో పువ్వులు అందించేది. చళుకుడు తిన్న తరువాత పెడితేనే తినేది. అలా కాలం గడుస్తూండగా వినాయక చవితి దగ్గరకొచ్చింది.  

    అందరూ ఇళ్ళకు వెల్లవేసి ధాన్యాలు దంచుకొంటున్నారు. చుళుక రాత్రికి రాత్రి ఎలుకలన్నింటిని పిలిచింది. ఎలుకలు తోకలు ముంచి ఇంటి గోడలకు సున్నం కొట్టాయి. పళ్ళతో పైపొట్టు ఒలిచి ధాన్యాన్ని మెరికల్లా బియ్యం చేశాయి. 

    వినాయక చవితి ఉదయాన చళుకుని వదినలు స్వయంగా బంగారు బిందెలతో నదీ జలాన్ని నెత్తి నెత్తుకొని వస్తున్నారు. అది చూచి చళుకుడు కొద్ది విచారం కనబరిచాడు. 

    చుళుక వెంటనే బిందెలో దూరి దొర్లించుకుంటూ నదీ తీరాన్ని చేరుకుని యివతలకు వచ్చి కొండంత బిందెనూ, పొంగి పొర్లి ప్రవహిస్తున్న నదినీ చూసి హతాశురాలై " బిందెనైతే దొర్లించుకొచ్చాను గాని నీళ్ళెలా ముంచగలను? బిందెతో ఎలా మోసుకెళ్ళగలను? అవివేకురాలిని. పనికిమాలిన దానిని. నేనెందుకు బ్రతికి? " అని అనుకుంటూ, తలను అక్కడున్న రాతికేసి కొట్టుకుంటూండగా విఘ్నేశ్వరుడు అక్కడ ప్రత్యక్షమై, ఎలుకను చేతితో ముద్దుగా నిమిరాడు. శాపవిమోచనమై, ఎలుకరూపు మాయమై దేవకాంత కళ్యాణ కింకిణి నిజరూపంతో విఘ్నేశ్వరుడి పాదాలమీద ప్రణమిల్లి, అనేక విధాల స్తుతించింది. విఘ్నేశ్వరుడు కళ్యాణ కింకిణిని ఆశీర్వదించి  అంతర్ధానమయ్యాడు. 

    కళ్యాణ కింకిణి నీళ్ళబిందెను తలకెత్తుకొని నడిచి వెడుతూంటే, దారిపొడవునా ప్రజలు బొమ్మలవలె నిల్చుని చూస్తూ " ఎవరీ దేవసుందరి? ఎవరింటికి వెడుతున్నది " అని విస్తుపోయారు.   

    చళుకవర్మ వదినలు కళ్యాణ కింకిణి తమ చిన్న మరది యింటిలోకి వెళ్ళడం చూసి, ముఖాలు వేలాడ దీసుకున్నారు. 

    శత్రుంజయుడు తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి, చళుకవర్మను సతీసమేతంగా రాజమందిరానికి తోడ్కొని వచ్చాడు. 

    చళుకుని అన్నలు తండ్రితో " మాకూ అలాంటి ఎలుకలతోనే ఎందుకు పెళ్ళిళ్ళు చెయ్యలేదు అలా చేసి ఉంటే మాకూ అప్సరసలే తయారై వచ్చి ఉండేవారు కదా! " అని గద్దించి అడిగారు. 

    ఇటువంటి తెలివిమాలిన కొడుకుల కోసమా నేను సామ్రాజ్యాన్ని ఆర్జించి పెట్టింది అని శత్రుంజయుడు  విరక్తి చెంది తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు పోయాడు. 

    చళుకవర్మ అన్నలు అసంతృప్తి, పరస్పర ద్వేషాలతో కలహించి యుద్ధాలు చేసి కొట్టుకు చచ్చారు. ఎంత వద్దంటున్నా వినక, ప్రజలు చళుకవర్మను తమ రాజుగా ప్రకటించుకున్నారు. చళుకవర్మ పాలనలో ప్రజలు సుఖ శాంతులతో జీవించారు. 

    చళుకవర్మ కళ్యాణి కింకిణి పేరున కళ్యాణి అనే మరో గొప్ప నగరాన్ని నిర్మించాడు. అతనికి కళ్యాణి కింకిణి వలన నలుగురు పుత్రులు కలిగారు. వారు చాళుక్యులుగా పిలువబడ్డారు. ఆ విధంగా చాళుక్య రాజవంశాలకు మూలపురుషుడైన చళుకవర్మ కాలంలో వాతాపి నగరం అనేక దేవాలయాలతో, ప్రాకారాలతో శోభిల్లింది. కళలకు కాణాచిగా, విద్వాంసులుకు, పండితులకు ఆటపట్టుగా, భూతల స్వర్గం అనిపించుకుంది. నగరాధిదేవతగా విఘ్నేశ్వరుడు ఆరాధింపబడ్డాడు. ఉత్కృష్ట శిల్పానికి ప్రామాణికమైన ఆలయ మంటప శిల్పాన్ని చూడడానికి దేశం నలుమూలలనుంచి రాజులు మొదలుకొని సామాన్య యాత్రీకుల వరకూ ఎల్లప్పుడూ వస్తూండేవారు. 

    చాళుక్యులు నాలుగు దిక్కులా రాజ్యాలు ఏర్పరచుకొని పాలించారు. చాళుక్యవంశ రాజులు శాఖోపశాఖలుగా దేశమంతటా వ్యాపించి రాజ్యాలు చేశారు. వాతాపి నేలిన వారు వాతాపి చాళుక్యులని, కళ్యాణి నగరాన్ని పాలించిన వారు కళ్యాణి చాళుక్యులని, వేంగి నేలినవారు వేంగీ చాళుక్యులని, తూర్పు చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, సౌరాష్ట్ర చాళుక్యులుగా పేరొందారు. కాలక్రమాన వాతాపిని బాదామి అనిగూడా వ్యవహరించారు. 
 
( సశేషం! వచ్చేవారం మరొక విఘ్నేశ్వర వినోద గాథ! అంతవరకూ శలవు! సర్వేజనా సుఖినోభవన్తు! స్వస్తి!! ) 

9, జనవరి 2026, శుక్రవారం

:: మహాభారత రహస్యాలు -1 :: 


    కురుక్షేత్ర మహాసంగ్రామానికి, అసలు కురువంశం భూమిపై జన్మించడానికి పునాది ఎక్కడ పడిందో మీకు తెలుసా? ఇది ఏ ఒక్కరో చేసిన తప్పుకాదు. బ్రహ్మదేవుడు ఇచ్చిన ఒక భయంకరమైన శాపం. 

    పూర్వజన్మలో మహాభిషుడు అనే ఒక శక్తివంతుడైన రాజు తన పుణ్యఫలంతో బ్రహ్మలోకానికి వెళ్తాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన గంగాదేవిని చూసి, ఆమె సౌందర్యానికి ముగ్ధుడై మోహానికి లోనవుతాడు. దేవలోకంలో ఉండి కూడా, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోలేక మర్త్యలోకపు ఆలోచనలు చేసినందుకు బ్రహ్మదేవుడు ఉగ్రుడవుతాడు. 

    " దేవతలకు ఉండాల్సిన అర్హతను మీరు కోల్పోయారు. కాబట్టి మీరిద్దరూ మనుషులుగా భూలోకంలో జన్మించి, మృత్యువు ఉన్న ఆ లోకంలో కష్టసుఖాలు అనుభవించండి " అని శపిస్తాడు. ఆ శాపం వల్లే గంగాదేవి భూమిపైకి రావడం, శంతన మహారాజును వివాహం చేసుకోవడం జరిగింది. 

    కానీ, గంగాదేవి తన బిడ్డల విషయంలో చేసిన ఒక భయంకరమైన పని శంతనుడిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అదేమిటో పార్ట్-2లో విందాం!

    తప్పకుండా సబ్ స్క్రైబ్ చేసుకోండి!

8, జనవరి 2026, గురువారం

:: తెలివైన ముని - ధర్మసంకటం ::  


    భాగవతంలో మనకు తెలియని ఎన్నో అద్భుతమైన కథలున్నాయి. అందులో ఇదొకటి. 

    ఒకానొకప్పుడు ఒక అడవిలో ఒక ముని తన ఆశ్రమంలో నివసించేవాడు. ఆయన చాలా తపస్సుచేసి ఎన్నో శక్తులు పొందాడు. ఒక రోజు ఆ ముని ధ్యానంలో ఉండగా, ఒక చిన్న పక్షి వచ్చి ఆయన ఒడిలో వాలింది. ఆ పక్షి చాలా భయపడి ఉంది. ఎందుకంటే దాన్ని ఒక వేటగాడు తరుముతున్నాడు. ముని ఆ పక్షిని చూసి జాలిపడి, దానిని కాపాడాలని అనుకున్నాడు. 

    కొద్ది సేపటికి,  ఆ వేటగాడు ముని దగ్గరకు వచ్చి, తనపక్షిని చూశారా అని అడిగాడు. ముని ధర్మ సంకటంలో పడ్డాడు. పక్షిని చూపించకపోతే అబద్ధం చెప్పినట్లవుతుంది. చూపిస్తే పక్షి ప్రాణాలకు ప్రమాదం. అప్పుడు ముని ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన వేటగాడితో " నా కళ్ళముందు ఏ ప్రాణీ లేదు " అన్నాడు. నిజానికి, పక్షి ఆయన ఒడిలో ఉంది. కానీ, ఆయన కళ్ళముందు కాదు., కింద ఉంది. 

    ఈ విధంగా ముని అబద్ధం చెప్పకుండానే పక్షిని కాపాడాడు. ఈ కథ ధర్మం, తెలివితేటలు ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. ధర్మం అంటే కేవలం నిజం చెప్పడమే కాదు, ఒక ప్రాణాన్ని కాపాడటం గూడా! 

7, జనవరి 2026, బుధవారం

:: నిమి చక్రవర్తి - దేహంలేని రాజు ::  


    మనం ప్రతిరోజూ వాడే " నిమిషం " అనే పదానికి అర్థం ఏమిటో తెలుసా? దీని వెనుక భాగవతంలో ఒక వింత కథ ఉంది. 

    ఇక్ష్వాకు వంశానికి చెందిన నిమి చక్రవర్తి ఒక యజ్ఞం చెయ్యాలనుకుంటాడు. కానీ కులగురువు వశిష్ఠుడు వేరే యజ్ఞంలో బిజీగా ఉండడంతో, నిమి మరో ఋషితో యజ్ఞం మొదలుపెడతాడు. దీనికి కోపించిన వశిష్ఠుడు " నీ దేహం పడిపోవుగాక " అని శపిస్తాడు. నిమి కూడా ప్రతిశాపం ఇస్తాడు. 

    యజ్ఞం పూర్తయ్యాక, దేవతలు ప్రత్యక్షమై నిమి చక్రవర్తిని బ్రతికించాలనుకుంటాడు. కానీ, నిమి  " దేవతలారా! ఈ శరీరం రోగాలకు, దు:ఖాలకు నిలయం. నాకు మరలా దేహబంధం వద్దు. నేను దేహం లేకుండానే ఉండాలను కుంటున్నాను " అని అంటాడు.

    దేవతలు ఆశ్చర్యపోయి, సరే అంటూ ఆయనను అందరి ప్రాణికోటి కళ్ళల్లో కనురెప్పగా ఉండమని   ఒక వింత వరాన్ని ఇచ్చి దీవించారు.

    మన కనురెప్పలు కొట్టుకోవడాన్ని సంస్కృతంలో " నిమేషము " అంటారు. నిమి చక్రవర్తి మన కనురెప్పలమీద ఉండటంవల్లే ఆ పేరు వచ్చిందని భాగవతం చెబుతున్నది. మనం కనురెప్ప వేసే కాలాన్ని ' నిమిషం ' అనడానికి మూలం ఆయనే. 

    మనం కనురెప్ప వేసే సమయాన్ని అందుకే ' నిమిషం ' అంటాం. అంటే, మన ప్రతి కనురెప్పపాటులోనూ ఆ నిమి చక్రవర్తి ఉన్నాడన్నమాట!   

4, జనవరి 2026, ఆదివారం

 :: వాతాపినగరగాథ ::


    విఘ్నేశ్వర శిల్పంలోని దేవతావిగ్రహాల గానానికి తన్మయుడైన అగస్త్యుడు " వాతాపి గణపతీ! నీ అద్భుతశిల్పాన్ని నీవే మలచుకొన్నావు. ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కడం ఎవరితరం? " అన్నాడు. 

    అప్పుడు విగ్రహంలోనుంచి " అగస్త్యమహర్షీ! నాకోసమని శిల్పం మలచుకోలేదు. నీ తృప్తికోసం నీ కోరిక నెరవేర్చాను. అంతే! అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది. అటుపిమ్మట అదృశ్యమవుతుంది. ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధయాగ సందర్భంలో, ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది " అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించాయి - అని ధౌమ్యుడు అర్జునిడితో చెప్పి, " అర్జునా! ఆ మహాశిల్పాన్నే మనం చూస్తున్నాం " అని ఆగాడు. 

    అర్జునుడు మహాశిల్పం చుట్టూరా పలుమార్లు ప్రదక్షిణలు చేసి, భక్తి శ్రద్ధలతో పరిశీలించాడు. మహాశిల్పం విఘ్నేశ్వరుడే! ఆ విఘ్నేశ్వరుడిని అంటిపెట్టుకొని త్రిమూర్తులు, జగదంబ, లక్ష్మీపార్వతీసరస్వతులు, నవగ్రహాలు మొదలుకొని అనేకమంది దేవతలు మనోహర శిల్పాలుగా మలచబడ్డారు. విఘ్నేశ్వరుని రెండు పాదాల ఇరుకున విఘ్నం బంధింపబడి ఉన్నది. ఎలుకరాజు తోక విగ్రహం చుట్టూరా వలయంచుట్టి ఉన్నది. శిల్పశోభ తిలకించడానికి వెయ్యి కళ్ళున్నా చాలవు అనిపిస్తున్నది. తనివితీరా చూశాక అర్జునుడు, ధౌమ్యుడుతో " ఆచార్యదేవా! ఇంతటి మహనీయ శిల్పం చుట్టూరా నెలకొన్న వాతాపినగరం మహోన్నతదశ అనుభవించి యిప్పుడెందుకిలా ఉంది? వాతాపినగర గాథ వినాలని కుతూహలపడుతున్నాను " అన్నాడు. 

    ధౌమ్యుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. 

    అగస్త్యుడు లోపాముద్ర ఆదేశానుసారం ఏమీ మిగుల్చుకోకుండా, ఉంచిన ధనాన్ని అందరికీ పంచేసి, ప్రజారాజ్య పాలనాబాధ్యతలను, పౌరధర్మాలను అనుసరిస్తూ సుఖజీవనం గడపండని ప్రజలకు చెప్పి, కట్టుబట్టలతో లోపాముద్రతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. 

    విఘ్నేశ్వర మహాశిల్పమే ప్రజారాజ్య మకుటంగా ఆరాధిస్తూ వాతాపినగర ప్రజలు చిరకాలం క్రమబద్ధంగా సుఖజీవనం చేశారు. తరాలు మారాయి. ఆదర్శరాజ్యంగా, ప్రజారాజ్య మార్గదర్శకంగా దినదిన ప్రవర్థమానమై విస్తరించిన వాతాపినగరం దేశదేశాంతరాల్లో పేరుపొందింది. 

    అగస్త్యుడు తనను కూడా హతమారుస్తాడనే ఛావు భయంతో పారిపోయి, వింధ్యాటవుల్లో ఊరూపేరూ లేని చీకటి బ్రతుకు బ్రతుకుతున్న ఇల్వలుడు వాతాపినగరం పేరు ప్రఖ్యాతులు విని, అగస్త్యుడు అక్కడ లేడని తెలుసుకున్న మీదట, నయవంచనతో సాధించాలనే తలంపుతో, ప్రజాసేవనే జీవిత పరమార్థంగా పెట్టుకొన్న వాడిలాగ రూపుమార్చుకొని, వాతాపినగర ప్రజలమధ్యకు చేరాడు. అప్పటి పరిస్థితి కూడా ఇల్వలుడికి అనుకూలంగా ఉంది. 

    క్రమక్రమంగా కాలమహిమవల్ల, వాతాపినగర ప్రజల్లో స్వార్థచింత అంకురించి పెరగసాగింది. కలిమిలేములు ప్రారంభమయ్యాయి. ప్రజల్లో భేదాభిప్రాయాలు, పొరపొచ్చాలు తలదాల్చాయి. తెలివితేటలు తెలివితక్కువ వారిని వంచించడానికి పనికివచ్చాయి. 

    అలాంటి పతనదశ ప్రారంభంలో, ఇల్వలుడు ఒక ప్రజానాయకుడిగా తయారై, ఇంద్రజాల విద్యలతో ఒక మహాపురుషుడుగా ప్రజలను ఆకట్టుకొన్నాడు. 

    నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పంమీద ప్రజలకు గురి ఉన్నంతకాలం అగస్త్యుణ్ణి, అగస్త్యుడు చెప్పిన నైతిక సూత్రాలను మరచిపోరనే విషయం గుర్తించాడు. తాంత్రికవిద్యలు, మద్యపానీయాలు ప్రజలకు రుచి చూపించాడు. అగస్త్యుడు నాటించిన ప్రజారాజ్య సూత్రాల శిలాఫలకాలను ఊడబెరికించి, క్రొత్త క్రొత్త సూత్రాలు నూరిపోశాడు. ఒకరినొకరు దోచుకోవడంలో ఉన్న ఆనంద విశేషాన్ని ప్రచారం చేశాడు. గిరిగీసుకుని కూర్చోవడం మనిషి లక్షణం కాదనీ, క్రొత్తక్రొత్త సుఖాలు తెలుసుకోవడానికే బ్రతకడం అనే సిద్ధాంతానికి ప్రజలను మళ్ళించాడు. ప్రచ్ఛన్న వేషాలతో చాలామంది రాక్షసులు ఇల్వలుడికి తోడైనారు. ప్రజాసేవకుడిగా అవతరించి, ప్రజానాయకుడిగా తయారైన ఇల్వలుడు మహానాయకుడై, ప్రజలపై అంకుశంగా మారాడు. అంత:కలహాలను రేపాడు. వాతాపినగరం కొట్లాటలతో నిండిపోయింది. దుర్మార్గులు అమాయకులను వేటాడుతున్నారు. నగరం అల్లకల్లోలమై పోయింది. చాలామంది ప్రజలు నగరం విడిచి వెళ్ళిపోయారు. 

    ఇల్వలుడు నగరమధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని నేలమట్టం  చేయాలని ప్రయత్నాలు ఆరంభించాడు. శతఘ్నులు చుట్టూరా గురిపెట్టించాడు. శిల్పంఅడుగు నేలలో ప్రేలుడుమందు దట్టింపించి, అగ్గిముట్టించటమే తరువాయిగా ఉన్న సమయంలో, అతివిచిత్రంగా అద్భుతం జరిగింది. నిప్పు తగిలించకుండానే మందుగుండు ప్రేలింది. శతఘ్ని శకటాలు అటునుంచి ఇటు వెనక్కు తిరిగి ప్రేలి గుండ్ల వర్షం  కురిపించాయి. ఆ అగ్ని వర్షంలో దుర్మార్గులంతా మరణించారు. చాలామంది వికలాంగులయ్యారు.  వారిలో ఇల్వలుడు కూడా ఒకడు. ఇల్వలుడి ఒక కాలు, ఒక చేయి పోయింది. రక్తసిక్తమైన దేహంతో నేలదొర్లుతూన్న సమయంలో, ఇల్వలుడికి విగ్రహంనుంచి మాటలు వినిపించాయి. 

    " ఓరీ! ఇల్వలా! అంగవైకల్యంతో, ముసలితనంతో చివికి చివికి కుళ్ళుతూ చిరకాలం జీవించు. నీకు అదే సరియైన శిక్ష " అని విఘ్నేశ్వరుడు శపించాడు. 

    వాతాపినగరం క్రమంగా తన పూర్వవైభవాన్ని కోల్పోయి, కొద్దిమంది మనుష్యులతో మాత్రమే  ఇప్పుడిలా బీడుపడిపోయింది " అని ధౌమ్యుడు చెప్పడం ముగించాడు. 

    అర్జునుడు అంతావిని అటుతిరిగి చూసి, ఆశ్చర్యంతో నోట మాటరాక అలా ఉండిపోయాడు. విఘ్నేశ్వర మహాశిల్పం కనిపించలేదు. 

    " అర్జునా! ఆశ్చర్యపడకు. మహాశిల్పం అదృశ్యమై పోతుందని యిదివరకే వింటివి కదా! " అని ధౌమ్యుడు అంటూండగా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఒక ముళ్ళపొదలో, ఒక పండుముసలి వికృతరూపుడు ఒకచేయి, ఒక కాలుతో శరీరాన్ని యీడ్చుకొనివస్తూ కెవ్వున అరచి మహాశిల్పం ఉండినవేపు చేతులుచాచి జోడించి గిలగిల లాడుతూ చనిపోయాడు. 

    అర్జునుడు అదిచూసి ఆశ్చర్యపోతూ, " గురుదేవా! వాడేకదా ఇల్వలుడు " అన్నాడు. 

    ధౌమ్యుడు " ఔను. ఎప్పటికైనా దుర్మార్గులు అలాగే నశిస్తారు " అన్నాడు. 

    వార్తాహరులచేత వాతాపినగరానికి బయలుదేరి రమ్మని అర్జునుడు ధర్మరాజుకు కబురు పంపాడు. 

    హస్తినాపురం నుండి ధర్మరాజు భీమ, నకుల, సహదేవులతో వాతాపి నగరానికి వచ్చాడు. 

    ఆరాత్రి ధర్మరాజు విఘ్నేశ్వర మహాశిల్పం అంతర్థానమైన ప్రదేశానికి ఎదురుగా కూర్చొని " నా తమ్ముడు నీ మహాశిల్పం దర్శించాడు. దేవా! నాకూ ఆ భాగ్యం కలిగించవా? నీ మహనీయ శిల్పాన్ని ఎవరు చెక్కుతారు? సత్వరమే నీ విగ్రహ ప్రతిష్ఠ జరిపించే మహాభాగ్యాన్ని నాకు కల్పించు " అని కన్నులుమూసి విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ వేడుకొన్నాడు. 

    అప్పుడు అతని చెవుల్లో " ధర్మజా! దేవశిల్పి విశ్వకర్మ, దానవశిల్పి మయుడు కలసి శిల్పులుగా వచ్చి విగ్రహాన్ని చెక్కుతారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే యాగాశ్వం కదలి వెడుతుంది. నీ అశ్వమేధయాగం జయప్రదంగా జరుగుతుంది. వాతాపి నగరాన్ని పునరుద్ధరణ చెయ్యి. మీ పాండవ సంతతివారైన చంద్రవంశరాజులు చిరకాలం ఈ నగరాన్ని పాలిస్తారు " అనే వాక్కులు వినిపించాయి. 

    ధర్మరాజు కళ్ళు తెరచేసరికి ఎదురుగా మహోన్నతంగా విఘ్నేశ్వర మహాశిల్పం దేదీప్యమానంగా కనిపించి అంతర్థానమయింది. 

    మరునాటి ఉదయం ఒక తెల్లనివాడు, ఒక నల్లనివాడు ఆ దరిదాపుల్లో పొదలమధ్య ఉన్న పెద్ద స్ఫటికశిలను పరిక్షిస్తూ కనిపించారు. వారెవరైనదీ గ్రహించి ధర్మరాజు వారికి మ్రొక్కి మర్యాదలు జరిపాడు. 

    ఆ శిలను పెకలించడానికి తవ్వుతున్నప్పుడు, అక్కడ గొప్ప నిధి దొరికింది. ఆ బంగారాన్ని ఇల్వలుడు నిక్షిప్తపరిచాడు. ఆచోటు వదల్లేక చివికి చివికి వాడు చివరకు మరణం పాలయింది కూడా అక్కడే. 

    ధర్మరాజు ఆ నిధిని వాతాపినగర అభివృద్ధికి వినియోగించాడు. 

    ఇద్దరు మహాశిల్పుల చేతులమీదుగా విఘ్నేశ్వరుని విగ్రహం,  మహాశిల్పం అదృశ్యమైన చోటనే గొప్ప ఆలయం, పెద్ద మంటపం తయారయినాయి. విశ్వకర్మ మయుల శిల్పరీతుల అద్భుత సమ్మెళనంతో ఒక గొప్ప శిల్ప సాంప్రదాయానికి నాంది అయింది. భరతవంశం వారిచే నెలకొల్పబడి నందువల్ల అది భారతీయ శిల్పంగా పేరొంది, కాలాల తరబడి గొప్ప ప్రఖ్యాతి పొంది చిరస్థాయిగా వర్ద్ధిల్లింది. 

    ఆ విధంగా, విఘ్నేశ్వరశిల్పం పూర్తిచేసి శిల్పులిద్దరూ ఎలాగ వచ్చారో అలాగే మాయమయ్యారు. 

    ఆలయంలో ధర్మరాజుచే విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే గుర్రం దౌడుతీసి పరుగెత్తింది. అర్జునుడు, భీముడు సైన్య సమేతంగా దాని వెనుక బయలుదేరారు. 

    ధర్మరాజు అగస్త్యుడు ఏర్పరచిన ప్రజారాజ్య పద్ధతులతో వాతాపినగర పాలన సాగేలా పాలనా దక్షత ఏర్పాటుచేసి, తరువాత నకుల సహదేవులతో హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు. 

    ప్రజారాజ్య పర్యాయపదంగా ఆ ప్రాంతం అగస్త్యరాజ్యమనీ, నగరం అగస్త్యనగరమనీ కొంతకాలం పేర్కొనబడినవి. కాలక్రమేణా, వాతాపినగరమనే పేరే స్థిరంగా నిలిచిపోయింది. 

    అర్జునుడు దిగ్విజయాన్ని ముగించుకొని గుర్రంతో హస్తినాపురం చేరాడు. అశ్వమేధయాగం జరిగింది. ధర్మరాజు యాగభాగాలను విశ్వకర్మకు, మయుడికి ప్రత్యేకంగా అర్పించాడు. శిల్పులకు, శిల్పానికి గౌరవ ప్రపత్తులు చేకూర్చాడు. 

    ధర్మరాజు తరువాత పరీక్షిత్తు, పరీక్షిత్తు తరువాత జనమేజయుడు పాలించారు. జనమేజయుని సంతతివారైన రాజులు వాతాపి నగరాన్ని పాలించసాగారు. 

    వాతాపి నగరాన్ని పాలించిన చంద్రవంశ రాజులలో శత్రుంజయుడు గొప్ప సామ్రాజ్యపిపాసి. వాతాపినగరం రాజధానిగా వాతాపి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సైన్యాలను పెంచడానికి ప్రజలమీద విపరీతంగా పన్నులు వేశాడు. నిరంకుశపాలన సాగిస్తూ, ఇల్వలుడు మళ్ళీపుట్టాడు అని అనిపించుకున్నాడు. 

    అతని కుమారుల్లో కడపటి వాడైన చళుకవర్మ చాలా మంచివాడు. అగస్త్యుడి ప్రజారాజ్య సూత్రాలపై గురికలవాడు. విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తూ, విద్యపట్ల, కళలపట్ల ఆసక్తితో ఉండేవాడు. అగస్త్యుడి అంశ అతనిలో ఉన్నదని ప్రజలు అనుకునే విధంగా ప్రజాభిమానాన్ని సంపాదించాడు.  

    సామ్రాజ్య విస్తరణకు శత్రుంజయుడు కుమారులను ఆయత్తం కమ్మన్నాడు. చళకుడు తండ్రితో " జనహింస, పరపీడనతో కూడిన సామ్రాజ్య విస్తరణ, కసాయి వృత్తికంటే ఏం గొప్ప? " అని అన్నలతో కలిసి దండయాత్రకు వెళ్ళడం మానేసాడు. 

    శత్రుంజయుడు మండిపడుతూ " ఔరా! సింహం కడుపున ఎలుక పుట్టినట్లు రాజవంశంలో తప్పపుట్టావు. నీకు తగిన శాస్తి జరగాలి " అని అంటూ ఒక ఎలుకను పట్టి తెప్పించి, దానికి చుళుక అని పేరుపెట్టి దానితో చళుకవర్మకు పెళ్ళి అని చాటించాడు. 

    చుళుక అసలుపేరు కళ్యాణకింకిణి. ఒక అప్సరస. ఇంద్రుడి శాపంవల్ల ఎలుకగా భూమిమీద పడింది. 

    కళ్యాణ వేదికపై ఉన్న పెళ్ళిపీటలపై, రాకుమారుణ్ణి ఎలుకను చూసి, వచ్చేవారు చేసే కోలాహల పరిహాసానికి చళుకుడు సిగ్గుతో క్రుంగిపోవాలని శత్రుంజయుడు, ఆ విచిత్ర వివాహానికి రాజులనూ, ప్రజలను ఆహ్వానించాడు. కాని చళుకవర్మ మందహాసంతో " ఎలుకను మహారాజు కోడలుగా చేయించగల విఘ్నేశ్వరుడు, ఎలుకను చిలుకల కొలికిగా చేసినా చేయవచ్చు - అని మీరంతా నమ్మకపోవచ్చును గాని, నేను నమ్మగలను అన్నాడు. 

( సశేషం. ఆసక్తికరమైన ఈ కథాభాగం వచ్చే వారం. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! ) 

    

    

    

 

  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...