4, మార్చి 2026, బుధవారం

:: కుచేలుని చిటికెడు అటుకులు - అంతరార్థం ::


     నమస్కారం! భాగవత సుధకు స్వాగతం. కృష్ణ పరమాత్మకు ఆయన బాల్య మిత్రుడు కుచేలుడు అటుకులు ఇచ్చాడని మనందరికీ తెలుసు. కానీ, ఆ అటుకుల వెనుక ఉన్న అసలు రహస్యం, కుచేలుడు ఎందుకు అన్ని కష్టాలు అనుభవించాడో మీకు తెలుసా? చాలామందికి తెలియని ఆ అద్భుతమైన కథను ఇప్పుడు విందాం.

    సాందీప మహర్షి ఆశ్రమంలో కృష్ణుడు, కుచేలుడు చదువుకునే రోజుల్లో ఒకరోజు.. గురుపత్ని వారిద్దరినీ అడవికి వెళ్ళి సమిధలు (కట్టెలు) తీసుకురమ్మని పంపిస్తుంది. దారిలో ఆకలి వేస్తే తినమని కొంచెం అటుకులు మూటగట్టి ఇస్తుంది.

    అడవిలో అకస్మాత్తుగా పెద్ద వాన పడుతుంది. కృష్ణుడు ఒక చెట్టు పైన, కుచేలుడు మరో చెట్టు పైన తలదాచుకుంటారు. ఆ చలికి, ఆకలికి తట్టుకోలేక కుచేలుడు తన దగ్గర ఉన్న అటుకులను కృష్ణుడికి చెప్పకుండా ఒక్కడే తినేస్తాడు. కృష్ణుడు "మిత్రమా! ఏదో నములుతున్న శబ్దం వస్తోంది, ఏమిటది?" అని అడిగితే, "ఏం లేదు కృష్ణా.. చలికి నా దవడలు కొట్టుకుంటున్నాయి" అని అబద్ధం చెబుతాడు.

     పరమాత్మకు భాగం ఇవ్వకుండా, ఆయనను మోసం చేసి తిన్న ఆ అటుకులే కుచేలుడికి దారిద్ర్యాన్ని మిగిల్చాయి. అందుకే కుచేలుడు జీవితాంతం పేదరికంలో మగ్గిపోయాడు.

    కానీ, ఏళ్ల తర్వాత కుచేలుడు మళ్ళీ అదే అటుకులను పట్టుకుని ద్వారకకు వెళ్ళినప్పుడు.. కృష్ణుడు ఆ అటుకులను ఎంతో ఇష్టంగా తింటాడు. ఎందుకు? అక్కడ కుచేలుడు "దాచి" తినలేదు, తన దగ్గర ఉన్నది ఏమీ లేకపోయినా కృష్ణుడి మీద "ప్రేమతో" పట్టుకొచ్చాడు. ఒక్క గుప్పెడు అటుకులు తినగానే కుచేలుడికి ఐశ్వర్యాన్ని ఇచ్చాడు కృష్ణుడు.

     ఈ కథ ఇచ్చే సందేశం ఒక్కటే, భగవంతుడికి మనం ఏమి ఇస్తున్నామన్నది ముఖ్యం కాదు, ఎంత నిజాయితీతో, ఎంత ప్రేమతో ఇస్తున్నామన్నదే ముఖ్యం. లోభత్వం దారిద్ర్యానికి దారి తీస్తే, అర్పణ భావం అనంతమైన సంపదను ఇస్తుంది.

:: మాయమైపోయే నది - డెవిల్స్ కెటిల్ మిస్టరీ! ::


    నమస్కారం! ప్రకృతిలో ఎన్నో వింతలు ఉన్నాయి, కానీ అమెరికాలోని మిన్నెసోటాలో ఉన్న ఈ జలపాతం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు! దీని పేరు 'డెవిల్స్ కెటిల్' (Devil's Kettle).

    సాధారణంగా ఏదైనా నది ప్రవహిస్తూ కొండ పైనుంచి కిందకు పడితే అది జలపాతం అవుతుంది. కానీ ఇక్కడ 'బ్రూల్ నది' ప్రవహిస్తూ ఒక రాయి దగ్గర రెండు పాయలుగా విడిపోతుంది.

    కుడి వైపు ఉన్న పాయ మామూలుగానే కిందకు పడి నదిలో కలుస్తుంది. కానీ.. అసలైన వింత ఎడమ వైపు పాయలోనే ఉంది! ఈ నీరు ఒక లోతైన రాతి గుంతలోకి పడి.. అక్కడితో మాయమైపోతుంది!

    అవును, మీరు విన్నది నిజమే! ఆ గుంతలోకి వెళ్ళిన నీరు మళ్ళీ ఎక్కడా బయటకు రాదు. దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ఈ నీరు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.

    చివరకు ఆ నీటిలో రంగులు కలిపారు, పింగ్-పాంగ్ బంతులు వేశారు, రేడియో ట్రాకర్లు కూడా వేశారు. ఒకవేళ ఆ నీరు భూగర్భం గుండా ప్రవహించి పక్కనే ఉన్న సుపీరియర్ సరస్సులో కలిస్తే, ఈ వస్తువులు అక్కడ ఎక్కడో ఒకచోట బయటపడాలి కదా? కానీ ఒక్కటంటే ఒక్క వస్తువు కూడా మళ్ళీ బయట ప్రపంచానికి కనిపించలేదు!

    కొందరైతే ఇది వేరే ప్రపంచానికి వెళ్లే ద్వారం అని కూడా నమ్ముతారు. కానీ ఇటీవల కొందరు హైడ్రోలాజిస్టులు.. ఆ నీరు భూగర్భ మార్గాల ద్వారా మళ్ళీ నదిలోనే కలుస్తుందని అంచనా వేశారు. అయితే, ఆ నీరు ప్రవహించే ఖచ్చితమైన మార్గం ఏమిటి? అంత వేగంగా వెళ్లే నీరు ఎందుకు కనపడకుండా పోతోంది? అన్నది ఇప్పటికీ ఒక అపరిష్కృత రహస్యమే!

    ప్రకృతి చేసిన ఈ వింత మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన 'జీవన స్రవంతి' ఛానల్‌ని ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి!"

3, మార్చి 2026, మంగళవారం

:: నిరాశే నిశ్శ్రేయసం - ఆశే దుఃఖానికి మూలం :: 


     నమస్కారం. భాగవతంలో యదు మహారాజుకు, ఒక అవధూతకు మధ్య జరిగిన సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. అవధూత తనకు 24 మంది గురువులు ఉన్నారని చెబుతూ, అందులో ఒక గురువుగా 'పింగళ' అనే స్త్రీని పేర్కొంటారు. ఎవరీ పింగళ? ఒక సామాన్య స్త్రీ గురువు ఎలా అయ్యింది? విదేహ నగరంలో పింగళ అనే ఒక వేశ్య ఉండేది. ఆమె ప్రతిరోజూ రాత్రి వేళ అలంకరించుకుని, ధనవంతులైన విటుల కోసం ఇంటి గుమ్మం వద్ద వేచి చూసేది.

    ఒకరోజు రాత్రి ఎంతసేపు ఎదురుచూసినా ఎవ్వరూ రాలేదు. లోపలికి వెళ్లడం, మళ్ళీ ఆశతో బయటకు రావడం.. ఇలా అర్థరాత్రి దాటిపోయింది. ఆమె మనసులో ఆశ చావలేదు. "ఇంకొక్క నిముషం ఉంటే ఎవరైనా వస్తారేమో, నాకు ధనం ఇస్తారేమో" అని ఆశపడింది. కానీ సమయం గడిచేకొద్దీ ఆమెకు విసుగు, అలసట వచ్చాయి. సరిగ్గా ఆ క్షణంలో ఆమెలో ఒక గొప్ప మార్పు మొదలైంది. "ఛీ! అస్థిరమైన ఈ శరీరాన్ని నమ్ముకుని, ఎక్కడి నుంచో ఎవరో వస్తారని ఆశపడి ఇంతలా తపిస్తున్నానే! నా హృదయంలోనే ఉండి, నాకు శాశ్వత ఆనందాన్నిచ్చే ఆ శ్రీహరిని ఎందుకు నమ్మలేదు?" అని ఆలోచించింది.

     ఆ క్షణమే ఆమె మనసులోని 'ఆశ' అనే పిశాచి చచ్చిపోయింది. ఆమెకు తీవ్రమైన వైరాగ్యం కలిగింది. "ఆశే పరమ దుఃఖం, నిరాశే పరమ సుఖం" అని గ్రహించింది. వెంటనే తన అలంకారాలన్నీ తీసివేసి, ప్రశాంతంగా నిద్రపోయింది. ఆ మరుసటి రోజు నుండి ఆమె పరమ భక్తురాలిగా మారిపోయింది. కేవలం బాహ్య ప్రపంచంపై ఆశను వదిలేయడం ద్వారా ఆమెకు లభించిన ఆ ప్రశాంతతను చూసి, అవధూత ఆమెను తన గురువుగా స్వీకరించారు.

     భాగవతం మనకు నేర్పే పాఠం ఇదే.. మనం మన సంతోషం కోసం ఇతరుల మీదో, వస్తువుల మీదో ఆధారపడినంత కాలం దుఃఖం వెన్నంటే ఉంటుంది. ఎప్పుడైతే ఆశను వదిలి మన అంతరాత్మలో ఉన్న భగవంతుడిని నమ్ముతామో, అప్పుడే నిజమైన శాంతి లభిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 

 

:: బలరాముడి హలాయుధం - యమున గర్వభంగం ::


    నమస్కారం. శ్రీమద్భాగవత పురాణంలో భగవంతుడి లీలలు అనంతం. మనం సాధారణంగా శ్రీకృష్ణుడి చిలిపి చేష్టలు, రాసలీలల గురించి వింటూ ఉంటాం. కానీ, కృష్ణుడికి అన్నయ్య, సాక్షాత్తు ఆదిశేషుడి అవతారమైన బలరాముడి శక్తి అపారమైనది. ఆయన శాంతంగా ఉన్నప్పుడు హిమవంతుడిలా ఉంటారు, కానీ ఆగ్రహం వస్తే ప్రళయకాల రుద్రుడిలా మారిపోతారు.

    ఒకానొక సమయంలో, బలరాముడు ద్వారక నుండి తన చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్న బృందావనానికి తిరిగి వచ్చారు. అక్కడ తన పాత స్నేహితులతో, గోపికలతో కలిసి వనవిహారం చేస్తూ, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ యమునా నదీ తీరానికి చేరుకున్నారు. ఆ సమయం చాలా ఆహ్లాదకరంగా ఉంది.

    ఆ వనవిహారంలో అలసిపోయిన బలరాముడికి, యమునా నది చల్లని నీటిలో జలకాలాడాలని (స్నానం చేయాలని) కోరిక కలిగింది. ఆయన నది గట్టున నిలబడి, యమునా దేవిని ఉద్దేశించి ఇలా అన్నారు.. "ఓ యమునా దేవి! నేను ఇక్కడికి వచ్చాను, నీ ప్రవాహాన్ని నా వైపుకు మళ్ళించి, నా చెంతకు రా. నేను నీలో స్నానం చేసి సేద తీరాలనుకుంటున్నాను" అని ఆజ్ఞాపించారు.

    అయితే, ఆ సమయంలో యమునా నదికి ఒక రకమైన అహంకారం కలిగింది. "నేను సూర్యపుత్రికను, నిరంతరం ప్రవహించే శక్తిని.. ఎవరో పిలిచారని నేను నా దారిని ఎందుకు మార్చుకోవాలి?" అని తలచింది. బలరాముడిని ఒక సామాన్య మానవుడిగా భావించి, ఆయన పిలుపును విననట్లుగా నటిస్తూ, తన ధోరణిలో తాను వేగంగా ప్రవహిస్తూ వెళ్ళిపోయింది. యమున చేసిన ఈ నిర్లక్ష్యం బలరాముడికి ఆగ్రహాన్ని తెప్పించింది.

    బలరాముడి కళ్ళు ఎర్రబడ్డాయి. ఆయన తన భుజంపై నిరంతరం ఉండే 'హలాయుధాన్ని' (నాగలిని) చేతిలోకి తీసుకున్నారు. "ఓ గర్విష్టి దేవీ! నా మాటనే ధిక్కరిస్తావా? నీ ప్రవాహ వేగం చూసుకుని గర్వపడుతున్నావా? ఇప్పుడే చూడు.. నీ గర్వాన్ని అణచి, నిన్ను వేల ముక్కలుగా చీల్చి, నువ్వు వెళ్లకూడదు అనుకున్న చోటికే నిన్ను లాక్కు వస్తాను" అంటూ గర్జించారు.

    వెంటనే తన నాగలి కొనను యమునా నది ప్రవాహంలోకి బలంగా గుచ్చారు. ఆ నాగలితో నదిని తన వైపుకు లాగడం మొదలుపెట్టారు. అప్పుడు జరిగినది సామాన్యమైన విషయం కాదు! బలరాముడి అసాధారణ బలంతో భూమి కంపించింది. నాగలి లాగుతున్న వైపు భూమి చీలుకుంటూ పెద్ద పెద్ద కాలువలు ఏర్పడ్డాయి. యమునా నది తన సహజ మార్గాన్ని కోల్పోయి, బలరాముడి శక్తికి తలవంచి, ఆయన పాదాల చెంతకు కొట్టుకు రావడం మొదలైంది.

    నదిలోని జీవరాశులు విలవిలలాడాయి. తన ఉనికికే ప్రమాదం ఏర్పడిందని గ్రహించిన యమునా దేవి, వెంటనే ఒక సుందరమైన స్త్రీ రూపంలో ప్రత్యక్షమైంది. గడగడ వణుకుతూ బలరాముడి పాదాలపై పడి క్షమాపణ వేడుకుంది. "స్వామీ! నన్ను క్షమించండి. మీరు సాక్షాత్తు అనంత శేషులని, ఈ జగత్తును మోస్తున్న మహానుభావులని మర్చిపోయాను. నా అజ్ఞానాన్ని మన్నించి, నన్ను రక్షించండి" అని ప్రార్థించింది.

    బలరాముడు శాంతించి, ఆ నదిని విడిచిపెట్టారు. అప్పుడు యమునా నదిలో స్నానం చేసి తన కోరికను తీర్చుకున్నారు. నేటికీ బృందావనంలో 'రామ ఘాట్' అనే ప్రదేశంలో యమునా నది ఒకచోట వంకరగా ప్రవహిస్తుంది. అది బలరాముడు నాగలితో లాగిన గుర్తే అని భక్తుల నమ్మకం.

     భగవంతుడి ఆజ్ఞను, ప్రకృతిని ఎవరూ ధిక్కరించలేరు. మన దగ్గర ఎంత శక్తి ఉన్నా, భగవంతుడి ముందు అది తృణప్రాయమే. అహంకారాన్ని వదిలి శరణు వేడితేనే భగవంతుని కృప లభిస్తుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.

    

2, మార్చి 2026, సోమవారం

:: మనిషి మెదడు మరియు విశ్వానికి ఉన్న వింత పోలిక ::  (The Cosmic Brain Theory) 


    నమస్కారం! " జీవనస్రవంతి " కి స్వాగతం! మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మనకు తెలియని వింతలు ఎన్నో ఉన్నాయి. కానీ, ఈరోజు నేను మీకు చెప్పబోయే విషయం వింటే మీరు ఒక్క నిముషం షాక్ అవుతారు. మనం రోజూ ఆకాశం వైపు చూస్తూ " ఈ విశ్వం ఎంత పెద్దదో కదా " అనుకుంటాం. కానీ మీకు తెలుసా? కోట్లాది నక్షత్రాలు, గ్రహాలు ఉన్న ఆ అనంత విశ్వానికి, మన తలలో ఉండే  మెదడుకు ఒక వింతైన పోలిక ఉంది. ఇది ఏదో ఊహించి చెబుతున్న మాట కాదు. సైన్సు కూడా ఆశ్చర్యపోతున్న ఒక పరమ రహస్యం. 

    ఈ విషయమై కొంతమంది శాస్త్రవేత్తలు ఒక ప్రయోగం చేశారు. విశ్వంలోని గెలాక్సీల నెట్ వర్కును మరియు మనిషి మెదడులోని న్యూరాన్ల నెట్ వర్కును పక్కపక్కన పెట్టి చూశారు. ఆ రిజల్టు చూసి వారు బిత్తర పోయారు. ఎందుకంటే ఆ రెండూ అచ్చం ఒకేలా ఉన్నాయి. అంతేకాదు, మన విశ్వంలో కేవలం 30% మాత్రమే నక్షత్రాలు, గ్రహాలు ఉంటే, మిగిలిన 70 శాతం అంతా డార్క్ మేటర్. విచిత్రంగా మన మెదడులో కూడా కేవలం 30% మాత్రమే నరాలు ఉంటే మిగిలిన 70% నీరు మరియు ఇతర ద్రవాలు ఉంటాయి. అంటే, మనం బయట చూసే బ్రహ్మాండం ఎంతటిదో, మన లోపల ఉన్న పిండ బ్రహ్మాండం కూడా సరిగ్గా అంతే పెద్దది. బహుశ: అందుకేనేమో, మన పెద్దలు " య్దద్భావం తద్భవతి " అని ఊరికే అనలేదు. మన ఆలోచనలకు అంత శక్తి ఎందుకు ఉంటుందో ఇప్పుడు అర్థమవుతోంది కదా! 

    ఒక్కసారి ఆలోచించండి, మనం ఈ అనంత విశ్వంలో ఒక భాగమా? లేక మన లోపలే ఒక అనంత విశ్వం ఉందా? ఈ రహస్యం గురించి మీరేమనుకుంటున్నారో క్రింద కామెంట్లలో నాతో పంచుకోండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లోతైన విషయాలకోసం మన జీవనస్రవంతి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు మరిన్ని విషయాలు చెప్పడానికి బలాన్నిస్తుంది. మరల మరొక వింత రహస్యంతో కలుద్దాం. స్వస్తి! 

:: ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన ప్రదేశం - ఎక్కడా ఆగని నిప్పు :: 


    శ్రోతలకు క్రొవ్విడి వెంకట రాజారావు నమస్కారం.  జీవనస్రవంతికి స్వాగతం. 

    ప్రకృతి ఒక అంతుచిక్కని రహస్యం. మనం సైన్సుతో ఎన్నో విషయాలను ఛేదించాం అనుకుంటాం కాని, ప్రకృతి కొన్ని చోట్ల సైన్స్ కు కూడా సవాలు విసురుతుంది. ఈరోజు మనం తెలుసుకోబోయే వింత  " నీటి ధారల మధ్య వెలుగుతున్న ఒక ఆరిపోని దీపం " గురించి.

    విషయంలోకి వెడితే, అమెరికాలోని న్యూయార్క్ నగరానికి సమీపంలో " చెల్బెన్ హామ్ ఫాల్స్ " అనే ఒక జలపాతం ఉంది. సాధారణంగా నీళ్ళు పడితే మంటలు ఆరిపోతాయికదా! కానీ, యిక్కడ విశేషం ఏమిటంటే, ఆ జలపాతం వెనుక ఒక చిన్న గుహలాంటి ప్రదేశంలో ఒక మంట నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. 

    దీనిని " ఎటర్నల్ ఫ్లేమ్ ఫాల్స్ " అని పిలుస్తారు. వందల యేళ్ళుగా ఈ మంట ఆరిపోకుండా ఎలా వెలుగుతోందన్న విషయమై శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు కావించారు. చివరకు వారు భూమి అంతర్భాగం నుండి వెలువడుతున్న సహజ వాయువు ( నాచురల్ గ్యాస్) వల్ల ఈ మంట వెలుగుతోందని గుర్తించారు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన నిజం ఏమిటంటే, ఆ వాయువునుంచి వెలువడే వేడి ఈ మంటను వెలిగించేంత ఎక్కువగా లేదు. మరి, ఆ మంట ఎలా నిలబడుతోందన్నది ఇప్పటికీ ఒక రహస్యమే! 

    పర్యాటకులు అక్కడకు వెళ్ళినప్పుడు, అప్పుడప్పుడు ఆ గాలికి మంట ఆరిపోయినా ఎవరో ఒకరు మరల వెలిగిస్తూనే ఉంటారు. నీరు, నిప్పు ప్రక్కప్రక్కనే ఉంటూ ప్రకృతి వింతను చాటిచెప్పే ఈ ప్రదేశం గురించి మీరేమనుకుంటున్నారు? కామెంటు రూపంలో తెలియ జేయండి. ఇలాంటి మరిన్ని వింతలకోసం మన " జీవనస్రవంతి " ఛానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. స్వస్తి! 


1, మార్చి 2026, ఆదివారం

:: పిడికెడు గింజలకే పెన్నిధినిచ్చిన పరమాత్ముడు ::  


    నమస్కారం. భాగవత సుధకు స్వాగతం. 

    ఈరోజు మనం ఒక మధురమైన ఘట్టం గురించి తెలుసుకుందాం. బాలకృష్ణుడు బృందావనంలో ఉన్నప్పుడు, ఒక పండ్లమ్మే ఆవిడ " పండ్లు కావాలా పండ్లు " అని పిలుస్తూ వెడుతోంది. ఆ పిలుపు విన్న చిన్నికృష్ణుడు, తనకు పండ్లు కావాలని ఆశపడ్డాడు. కానీ, ఆ పసివాడికి లోకజ్ఞానం తెలియదుకదా! ఇంట్లో ఉన్న ధాన్యాన్ని తన చిన్ని దోసిట్లోకి తీసుకొని, ఆ పండ్లమ్మ దగ్గరకు పరుగు తీసాడు. ఆ గింజలు తన చిన్ని చేతులనుండి కింద జారిపోతున్నా లెక్క చేయకుండా తడబడే అడుగులతో ఆవిడ ముందుకు వెళ్ళి నిలబడ్డాడు. ఆ పండ్లమ్మ ఆ బాలుడి ముగ్ధ రూపానికి, ఆ అమాయకత్వానికి మురిసిపోయింది. ఆ పిడికెడు గింజలకోసం చూడకుండా, తన బుట్టలో ఉన్న పండ్లన్నీ ఆ కృష్ణయ్యకు ఇచ్చేసింది. ఆశ్చర్యం ఏమిటంటే, ఆ లోకరక్షకుడు పండ్లు తీసుకొని వెళ్ళిన వెంటనే ఆ పండ్లమ్మ ఖాళీ బుట్ట రత్నాలతో నిండి పోయింది. భగవంతుడు మన దగ్గర నుండి ఆశించేది మనం ఇచ్చే వస్తువు విలువను కాదు. ఆ వెనుక ఉన్న స్వచ్ఛమైన భక్తిని మాత్రమే!  ఈ కథాంశాన్ని శ్రీమద్భాగవతం దశమస్కంధం నుండి గ్రహించాను. 

  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...