14, ఆగస్టు 2026, శుక్రవారం

:: కృష్ణుడు భగవద్గీతను అర్జునిడికే ఎందుకు చెప్పాడు? ::     

 కురుక్షేత్ర సంగ్రామానికి ముందు, ఇరుపక్షాల సైన్యాల మధ్య రథాన్ని నిలిపి, సొంత బంధువులను చంపడానికి మనస్కరించక శోకసముద్రంలో మునిగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు భగవద్గీతను ఉపదేశించాడు. అయితే, యుద్ధరంగంలో భీష్ముడు, ద్రోణుడు, యుధిష్ఠిరుడు వంటి ఎందరో మహానుభావులు ఉన్నప్పటికీ, కృష్ణుడు పరమ పవిత్రమైన ఈ గీతోపదేశాన్ని అర్జునుడికే ఎందుకు చేశాడనేది అత్యంత ప్రాముఖ్యమైన ప్రశ్న.

    దీనికి ప్రధానమైన కారణాలను తెలుసుకుందాం. 

    యుద్ధంలో మోహంలో పడిన అర్జునుడు తన జ్ఞానమంతా కోల్పోయి, శ్రీకృష్ణుడిని కేవలం తన బావగానో, మిత్రుడిగానే కాక జగద్గురువుగా భావించి పూర్తిగా శరణు వేడాడు.  "నేను నీ శిష్యుడను, నిన్నే శరణువేడుతున్నాను, నాకు శ్రేయస్కరమైన మార్గాన్ని బోధించు" అని ఆత్మసమర్పణ చేసుకున్నాడు. ఒక జ్ఞానాన్ని గ్రహించడానికి కావలసిన ప్రాథమిక అర్హత 'వినయం మరియు పూర్ణ శరణాగతి'. అర్జునుడిలో అది పరిపూర్ణంగా ఉంది.

    భగవద్గీత 4వ అధ్యాయంలో శ్రీకృష్ణుడే స్వయంగా ఈ రహస్యాన్ని బయటపెట్టాడు. "నువ్వు నా ప్రియమైన మిత్రుడివి, పరమ భక్తుడివి. అందుకే అంత్యంత గూఢమైన, ఉత్తమమైన ఈ పురాతన యోగాన్ని నీకు ఉపదేశిస్తున్నాను" అని స్పష్టం చేశాడు. భగవంతుని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి పాండిత్యం కంటే 'నిష్కల్మషమైన భక్తి' ముఖ్యం.

    గీతలోని అత్యంత గూఢమైన రాజవిద్యను బోధించే ముందు కృష్ణుడు అర్జునుడిని నీవు  అసూయ లేనివాడవు గనుక నీకు ఈ పరమ రహస్యాన్ని చెప్తున్నానని అన్నాడు,  ఇతరుల  గుణాలను చూసి ఓర్వలేని మనస్తత్వం అర్జునుడికి లేదు. గురువు ఇచ్చే ఉపదేశాన్ని శంకించకుండా, యథాతథంగా గ్రహించే పవిత్రమైన హృదయం అతనిది.

    అర్జునుడు కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు, సంసార బంధాల్లో, కర్తవ్య సమ్మోహంలో చిక్కుకునే సగటు మానవుడికి ప్రతిరూపం . అర్జునుడిని నిమిత్తమాత్రుడిగా చేసుకుని, రాబోయే తరాల మానవాళి అంతటికీ జీవిత కర్తవ్యాన్ని, కర్మయోగాన్ని బోధించడమే భగవంతుని సంకల్పం.

    అర్జునుడిలోని పట్టుదల, ధర్మనిష్ఠ, వినయం, ఉపాసనా బలమే ఆయనను భగవద్గీత అనే అమృత జ్ఞానాన్ని స్వీకరించడానికి అత్యంత అర్హుడిగా చేశాయి.

12, ఆగస్టు 2026, బుధవారం

 

మహాభారత యుద్ధం 18 రోజులే ఎందుకు జరిగింది? 18 సంఖ్య వెనుక ఉన్న రహస్యమేమిటి?

     మహాభారత యుద్ధం సరిగ్గా 18 రోజులు మాత్రమే జరిగింది. అంతేకాదు, భారతంలో 18 పర్వాలు ఉన్నాయి, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి, అక్షౌహిణుల సేన కూడా 18 మాత్రమే! అసలు మహాభారతంలో ఈ "18" అనే సంఖ్య వెనుక ఉన్న పౌరాణిక మరియు తాత్విక రహస్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

    మహాభారత ఇతిహాసంలో '18' అనే సంఖ్యకు అత్యంత దివ్యమైన, లోతైన ప్రాధాన్యత ఉంది.

    కురుక్షేత్ర సంగ్రామంలో పాండవుల వైపు 7 అక్షౌహిణుల సేన, కౌరవుల వైపు 11 అక్షౌహిణుల సేన కలిపి మొత్తం 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొంది. ధర్మసంస్థాపన కోసం జరిగిన ఈ మహాసంగ్రామం సరిగ్గా 18 రోజుల పాటు సాగి, పద్దెనిమిదవ రోజు సాయంత్రానికి దుర్యోధన వధతో పూర్తయింది.

    మహర్షి వేదవ్యాసుడు ఈ ఇతిహాసాన్ని 18 పర్వాలుగా విభజించారు. యుద్ధభూమిలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ ఉపదేశించిన భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలు ఉన్నాయి.

    సంస్కృత సంఖ్యా శాస్త్రం (అక్షర సంఖ్యల నియమం) ప్రకారం '18' అనే సంఖ్య "జయ" అనే శబ్దానికి ప్రతీక. 'జ' అంటే 8, 'య' అంటే 1. వెనుక నుండి లెక్కిస్తే (18) 'జయ' అనే పదం వస్తుంది. అందుకే విజయాన్ని, ధర్మ జయాన్నీ సూచించడానికి ఈ సంఖ్యను ప్రామాణికంగా తీసుకున్నారు.

    వేదవ్యాసుడు రచించిన ప్రధాన పురాణాలు కూడా 18 మాత్రమే.

    ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే... మానవునిలో 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 తన్మాత్రలు (శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు), మరియు మనస్సు, బుద్ధి, అహంకారాలు అనే 3 అంతఃకరణాలు కలిపి మొత్తం 18 తత్త్వాలు ఉంటాయి. మానవుడు తనలోని ఈ 18 వికారాలపై విజయం సాధించినప్పుడే మోక్షం లభిస్తుందనే తాత్విక సత్యానికి ఈ 18 సంఖ్య ప్రతీక.

     అందుకే మహాభారతంలో 18 అనేది కేవలం ఒక సంఖ్య కాదు; అది అధర్మంపై ధర్మం సాధించిన "జయ" సంకేతం, మానవ వికారాలను జయించి ఆధ్యాత్మిక విజయాన్ని పొందే దివ్య మార్గదర్శి!

 రామాయణం అనగానే మనకు లంకాధిపతిగా రావణాసురుడే గుర్తుకొస్తాడు. కానీ, లంకను నిర్మించింది, మొదట పాలించింది రావణాసురుడు కాదు! మరి స్వర్ణ లంకను అసలు ఎవరు నిర్మించారు? రావణాసురుడి కంటే ముందు లంకను పాలించిన ఆ ధనవంతుడైన రాజు ఎవరు?

    సాధారణంగా లంక అంటే రావణాసురుడి రాజ్యం అనే అందరూ అనుకుంటారు. కానీ పౌరాణిక కథనం ప్రకారం స్వర్ణ లంకకు అసలు యజమాని రావణాసురుడు కాదు!

    ముందుగా లంకా నగరాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ నిర్మించాడు. రాక్షస సోదరులైన మాల్యవంతుడు, సుమాలి, మాలి అనేవారు అక్కడ నివసించేవారు. అయితే విష్ణుమూర్తితో జరిగిన యుద్ధంలో వారు ఓడిపోయి లంకను వదిలి పాతాళ లోకానికి పారిపోయారు.

    ఆ తర్వాత, విశ్రవస మహర్షి మరియు దేవవర్ణిణిల కుమారుడైన "కుబేరుడు" ఆ నిర్మానుష్యంగా ఉన్న లంకా నగరాన్ని తన నివాసంగా మార్చుకుని, లంకాధిపతి అయ్యాడు. సముద్రం మధ్యలో ఉన్న లంకను అత్యంత ఐశ్వర్యవంతమైన నగరంగా తీర్చిదిద్ది పాలించసాగాడు. అంతేకాదు, పరమశివుని అనుగ్రహంతో లభించిన దివ్యమైన పుష్పక విమానం కూడా కుబేరుడి వద్దనే ఉండేది.

    కానీ, విశ్రవస మహర్షికి రెండో భార్య అయిన కైకసికి జన్మించినవాడు రావణాసురుడు. అంటే కుబేరుడు, రావణాసురుడు వరసకు అన్నదమ్ములు.

    రావణాసురుడు బ్రహ్మదేవుని గురించి ఘోర తపస్సు చేసి అపారమైన వరాలు పొందిన తర్వాత, అతనిలో అహంకారం పెరిగింది. తల్లి కైకసి ప్రేరణతో, రాక్షస వంశానికి పూర్వ వైభవం తేవాలని భావించాడు. తన సవతి అన్న అయిన కుబేరుడిపైకి దండెత్తి, అతనిని బెదిరించి, బలవంతంగా లంకా నగరాన్ని ఆక్రమించుకున్నాడు. అంతేకాదు, కుబేరుడి దివ్య పుష్పక విమానాన్ని కూడా ఆక్రమించుకుని అతడిని లంక నుండి తరిమేసాడు.

    ఆ తర్వాత కుబేరుడు ఉత్తర దిక్కుకు వెళ్లి, హిమాలయాలలో 'అలకాపురి' అనే నూతన నగరాన్ని నిర్మించుకుని, అక్కడ యక్షులకు రాజుగా, ధనానికి అధిపతిగా స్థిరపడ్డాడు.

     అంటే, రావణాసురుడు తన స్వంత అన్న అయిన కుబేరుడిని అక్రమంగా వెళ్లగొట్టి లంకను, పుష్పక విమానాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అందుకే అధర్మంతో సంపాదించిన ఐశ్వర్యం ఎప్పటికీ శాశ్వతంగా నిలవదని రావణాసురుడి అంతం మనకు నిరూపిస్తుంది!

?

11, ఆగస్టు 2026, మంగళవారం

 :: శ్రీమహావిష్ణువుకు నారదుని శాపం :: 

    నారద మహర్షి హిమాలయాలలో తీవ్రమైన తపస్సు చేసినప్పుడు, అతనిని లొంగదీసుకోవడానికి మన్మథుడు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో నారదునికి తన కామ విజయం పట్ల తీవ్రమైన అహంకారం కలిగింది. తనను మన్మథుడు కూడా జయించలేకపోయాడని బ్రహ్మ, ఈశ్వరుడు మరియు విష్ణువుల వద్ద గొప్పగా ప్రగల్భాలు పలికాడు. నారదునిలో మేల్కొన్న ఆ అహంకారాన్ని తుడిచిపెట్టడానికి శ్రీమహావిష్ణువు ఒక దివ్యలీలను రచించాడు.

    నారదుడు వెళ్లే మార్గంలో వైకుంఠనాథుడు ఒక సుందరమైన మాయానగరాన్ని, 'శ్రీమతి' అనే రాచకన్య స్వయంవరాన్ని సృష్టించాడు. ఆ కన్యను చూడగానే నారదుడు తీవ్రమైన మోహంలో పడిపోయాడు. ఆమెను వివాహం చేసుకోవాలనే తపనతో విష్ణుమూర్తి వద్దకు వెళ్లి, తనపై దయఉంచి 'హరి' రూపాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. 'హరి' అంటే విష్ణు రూపమని నారదుడి భావన అయినప్పటికీ, 'హరి' అంటే కోతి అని కూడా అర్థం ఉంది.

    నారదుని అహంకారాన్ని పోగొట్టడానికి విష్ణువు అతనికి కోతి ముఖాన్ని ప్రసాదించాడు. స్వయంవరంలో రాజకన్య నారదుడి కోతి రూపాన్ని చూసి నవ్వి, విష్ణుమూర్తి మెడలో పూలమాల వేసింది. ఆ తర్వాత నీటిలో తన కోతి రూపాన్ని చూసుకున్న నారదుడు తీవ్రమైన క్రోధంతో విష్ణుమూర్తిని చూసి... "నన్ను కాంతామాయలో పడేసి అవమానించావు. కాబట్టి నువ్వు భూమిపై మానవుడిగా జన్మించి భార్యా వియోగంతో అడవుల్లో ఏడుస్తావు! నన్ను ఏ కోతి రూపంతో అవమానించావో, ఆ కోతుల సహాయంతోనే నీ భార్యను వెతుక్కుంటావు" అని శపించాడు. ఆ శాపాన్ని విష్ణుమూర్తి చిరునవ్వుతో స్వీకరించాడు, అదే శ్రీరామావతారానికి మార్గంగా మారింది.

    ఈ కథ మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే... ఎంతటి జ్ఞానికైనా అహంకారం వస్తే బుద్ధి నశిస్తుంది. భగవంతుడు తన భక్తుల అహంకారాన్ని తుడిచిపెట్టడానికి ఎంతటి లీలనైనా రచిస్తాడు, చివరికి ఆ శాపాన్ని సైతం జగత్కల్యాణార్థం శ్రీరామావతారానికి శ్రీకారంగా మలిచాడు.

10, ఆగస్టు 2026, సోమవారం

 శివునికి మారేడు (బిల్వ) పత్రాలతో పూజ ఎందుకు చేయాలి? మారేడు దళానికి అంత ప్రాధాన్యత ఎందుకుంది?

    దేవతలందరిలోకి భోళాశంకరుడైన పరమశివుడు అత్యంత సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు. రంగురంగుల పుష్పాలు, గొప్ప నైవేద్యాలు లేకపోయినా, కేవలం ఒక మారేడు దళంతో అభిషేకం చేస్తే చాలు మురిసిపోతాడని శాస్త్రాలు చెబుతున్నాయి. దీని వెనుక అత్యంత ఆసక్తికరమైన పౌరాణిక గాథ మరియు అంతరార్థం దాగి ఉన్నాయి.

    పూర్వం ఒక బోయేవాడు (వేటగాడు) అడవిలో జంతువుల కోసం వెతుకుతూ రాత్రి వేళ ఒక పెద్ద చెట్టు ఎక్కి కూర్చుంటాడు. రాత్రి క్రూర జంతువుల భయంతో నిద్రపోకుండా ఉండేందుకు, ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తెంచి కిందకు వేస్తూ ఉంటాడు. అతనికి తెలియకుండానే ఆ చెట్టు ఒక మారేడు చెట్టు (బిల్వ వృక్షం), కింద ఒక శివలింగం ఉంటుంది. అతడు అలా ఆకులను కిందకు వేస్తూ, జాగరణ చేస్తూ శివలింగాన్ని మారేడు దళాలతో పూజించాడు. అది మహాశివరాత్రి రాత్రి కావడం విశేషం. ఏ ఉద్దేశం లేకుండా, అజ్ఞానంతో చేసినప్పటికీ — ఆ బిల్వ పత్రాల సమర్పణకు, శివరాత్రి జాగరణకు పరమశివుడు తీవ్రంగా ప్రీతి చెంది, ఆ వేటగాడికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు. కేవలం అజ్ఞానంతో సమర్పించిన మారేడు ఆకుకే పరమేశ్వరుడు అంతటి పవిత్రమైన ఫలాన్ని ఇస్తే, భక్తితో అర్పిస్తే ఇంకెంత పుణ్యం లభిస్తుందో ఈ కథ నిరూపిస్తుంది.

    ఈ పౌరాణిక గాథతో పాటు ఈ పూజ వెనుక ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం అత్యంత లోతైనది. మారేడు దళంలో మూడు ఆకులు కలిసి ఉంటాయి. ఈ మూడాకులు:

  1. ముక్కంటి (శివుని) మూడు నేత్రాలకు సంకేతం.

  2. సత్వ, రజో, తమో గుణాలకు సంకేతం.

  3. సృష్టి, స్థితి, లయ కారణాలైన త్రిమూర్తులకు సంకేతం.

    మనలోని కామ, క్రోధ, లోభాలనే ముడులను శివుని పాదాల చెంత సమర్పించడమే ఈ మూడు ఆకుల సమర్పణకు నిజమైన అర్థం. అంతేకాకుండా, మారేడు చెట్టుకి వాతావరణాన్ని శుద్ధి చేసే అద్భుతమైన మూలికా శక్తి ఉంది. మారేడు దళం శివుని తల మీది అగ్ని తత్వాన్ని (ఉష్ణాన్ని) శాంతింపజేసి చలువ చేస్తుందని నమ్ముతారు.


8, ఆగస్టు 2026, శనివారం

:: నందగోపుని వరుణపాశ విమోచనము :: 

     శ్రీమద్భాగవతంలోని దశమస్కంధంలో నందగోపుని వరుణపాశ విమోచన ఘట్టం అత్యంత భక్తిరసపూరితమైనది. ఆశ్వయుజ శుద్ధ ఏకాదశీ వ్రతాన్ని నందగోపుడు విధివిధానంగా ఆచరించాడు. మర్నాడు ద్వాదశి పారాయణ ఘడియలు స్వల్పంగానే ఉన్నాయి. పారణ సమయం దాటిపోతే వ్రతభంగం అవుతుందనే ఆరాటంతో, సురాసుర సంధ్య వేళ అని గమనించకుండా నందగోపుడు పవిత్ర యమునా నదిలోకి దిగి స్నానమాచరించడం ప్రారంభించాడు.

    శాస్త్ర నియమం ప్రకారం అసుర వేళల్లో రాత్రి సమయాన జలాశయాల్లో స్నానం చేయడం నిషిద్ధం. ఆ సమయం రాక్షసులు, నదీ పరిపాలకులైన వరుణుడి భృత్యుల సంచార కాలం. యమునలో స్నానంచేస్తున్న నందుడిని చూసి వరుణుడి భృత్యుడైన ఒక రాక్షసుడు సురభానుడనేవాడు  నియమాన్ని ధిక్కరంచాడనే కోపంతో ఆయనను బంధించి నేరుగా వరుణదేవుని నగరానికి తీసుకుపోయాడు.

    తెల్లవారుజామున నందగోపుడు నది నుండి తిరిగి రాకపోవడంతో గోపాలురందరూ ఆందోళనకు గురయ్యారు. నీటిలో మునిగిపోయాడో లేక ఏ అసురుడైనా అపహరించాడో తెలియక భయంతో శ్రీకృష్ణుడిని, బలరాముడిని శరణు వేడారు. తన తండ్రికి ఎదురైన ఆపదను యోగదృష్టితో గ్రహించిన భగవానుడు, తండ్రిని విడిపించి తీసుకురావడానికి స్వయంగా వరుణపురానికి పయనమయ్యాడు.

    సకల లోకేశ్వరుడు, సచ్చిదానంద స్వరూపుడైన శ్రీకృష్ణభగవానుడు తన నగరంలో పాదం మోపడం చూసి వరుణదేవుడు మైమరచిపోయాడు. తన సేవకుడు చేసిన అపరాధానికి పశ్చాత్తాపపడుతూ, అత్యంత వైభవంగా అర్ఘ్యపాద్యాలతో, నవరత్న ఖచిత ఆసనంతో స్వాగతం పలికాడు. శ్రీకృష్ణుడి పాదపద్మాలకు నమస్కరించి, జగన్నాథుని దివ్యమంగళ రూపాన్ని స్మరిస్తూ ఈ విధంగా స్తుతించడం ప్రారంభించాడు:

ఏ పరమేశ్వరున్ జగములిన్నిటి గప్పిన మాయగప్పగా 

నోపక పారతంత్ర్యమున నుండు మహాత్మక! యట్టి నీకు ను 

ద్దీపిత భద్రమూర్తికి సుధీజనరక్షణవర్తికిం దనూ 

తాపము వాయ మ్రొక్కెద నుదార తపోధన చక్రవర్తికిన్

    "ఓ మహాత్మా! ఏ పరమేశ్వరుని మహామాయ ఈ విశ్వమంతటినీ కప్పివేస్తుందో, ఆ మాయ సైతం ఏ పరమాత్మను ఆవరించలేక ఆయన అధీనంలోనే దాసిగా ఉంటుందో... అటువంటి లక్ష్మీ సమేతుడవు, ప్రకాశవంతమైన మంగళ స్వరూపుడవు, పండితులను, సజ్జనులను రక్షించే వ్రతము కలవాడవు అయిన నీకు నమస్కరిస్తున్నాను. ఉదార స్వభావము కలిగి, తపోధనులకు చక్రవర్తివైన ఓ కృష్ణదేవా! నా సంసార తాపములు, శరీర తాపములు నశించేలా నీ పాదపద్మములకు ప్రణమిల్లుతున్నాను" అని ఆత్మనివేదన చేసుకున్నాడు.

     వరుణుడు అంతటితో ఆగక, పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీకృష్ణుడు తన వద్దకు రావడం వల్ల తన నగరము, తన సమస్త సంపదలు ఏ విధంగా ధన్యమయ్యాయో వివరిస్తూ ఆనందబాష్పాలతో ఇలా కీర్తించాడు:

ఏ విభు పాదపద్మరతు లెన్నడు నెవ్వరు బొందలేని పెం 

ద్రోవ జరింతురట్టి బుధతోషక! నీ వరుదెంచుటం బ్రమో 

దావృతమయ్యె జిత్తము; గృతార్థతనొందె మనోరథంబు; నీ 

సేవ బవిత్రభావమును జెందె శరీరము నేడు మాధవా!

    "ఓ మాధవా! జ్ఞానులను, సజ్జనులను ఆనందింపజేసే ఓ ప్రభూ! ఏ దేవుని పాదపద్మాల యందు స్థిరమైన భక్తి కలిగిన యోగులు, ఇతరులెవ్వరూ పొందని అత్యున్నతమైన ముక్తిమార్గాన (మోక్షమార్గంలో) విహరిస్తారో... అటువంటి జగన్నాథుడవైన నీవు నేడు స్వయంగా నా లోకానికి విచ్చేయడం వల్ల నా హృదయమంతా పరమానందంతో నిండిపోయింది. నా మనోరథం నెరవేరి నా జన్మ ధన్యమైంది. నీ దివ్యపాద సేవతో నేడు నా శరీరం, నా సమస్త లోకం పవిత్రతను సంతరించుకున్నాయి" అని పరవశించాడు.

     అనంతరం వరుణుడు తన భృత్యుడి అజ్ఞానాన్ని క్షమించమని వేడుకుంటూ, మహా సంతోషంతో నందమహారాజును రత్నాభరణాలతో సత్కరించి శ్రీకృష్ణుడికి అప్పగించాడు:

ఎఱుగడు వీడు నాభటుడొకించుకయైన మనంబులోపలం 

దెఱకువ లేక నీజనకు దెచ్చె; దయంగొనిపొమ్ము; ద్రోహమున్ 

మఱవుము; నన్ను నీభటుని మన్నన సేయుము; నీదు సైరణన్ 

వఱలుదుగాదె యోజనక వత్సల! నిర్మల భక్తవత్సలా!

    "ఓ తండ్రీ! నిర్మలమైన భక్తవత్సలుడవు, జనక వత్సలుడవు అయిన ఓ కృష్ణా! వివేకం లేని నా సేవకుడు నీ దివ్యమహిమను ఎరుగక, అజ్ఞానంతో నీ తండ్రిని ఇక్కడికి తీసుకువచ్చే సాహసం చేశాడు. ఈ పెద్ద అపరాధాన్ని నీ ఉదార హృదయంతో క్షమించు. నీ దాసుడనైన నన్ను మన్నించి, నీ ఓర్పు అనే గుణంతో నన్ను కాపాడుము. నీ తండ్రిగారైన నందగోపుడిని సగౌరవంగా దయతో స్వీకరించి తీసుకువెళ్ళు" అని వేడుకున్నాడు.

     వరుణుని భక్తిప్రపత్తులకు సంతోషించిన శ్రీకృష్ణుడు, తన తండ్రి నందగోపుడితో కలిసి తిరిగి వ్రజభూమికి చేరుకున్నాడు. వరుణలోకంలో వరుణదేవుడు, ఆయన దివ్యపరివారం శ్రీకృష్ణుడికి చేసిన పూజలను, ఆయన పాదాల చెంత మోకరిల్లిన తీరును ప్రత్యక్షంగా చూసిన నందుడు అచ్చెరువొందాడు. వ్రజానికి తిరిగి రాగానే, తన కుమారుడు కేవలం గోపబాలుడు కాడని, సకల లోకాలకు అధిపతి అయిన పరమేశ్వరుడని గ్రహించి, జరిగిన విషయమంతా ఇతర గోపాలురకు పూసగుచ్చినట్లు చెప్పాడు.

    నందుని మాటలు విన్న గోపాలురంతా ఆశ్చర్యపోయి, తమకు కూడా ఆ పరమాత్మ దివ్యధామాన్ని (వైకుంఠాన్ని) దర్శింపజేయమని ప్రార్థించారు. కరుణామయుడైన శ్రీకృష్ణుడు వారికి బ్రహ్మహృదయమనే దివ్య సరోవరాన్ని చూపించి, వైకుంఠ లోక వైభవాన్ని, తన దివ్యస్వరూపాన్ని సాక్షాత్కరింపజేశాడు.

    ఆ సమయంలో వ్రజభూమిలో శరదృతువు వికసించి ప్రకృతనంతా రమణీయంగా మార్చివేసింది. పోతన మహాకవి ఆ రాత్రుల తీవ్రతను, విరహవేదనను ఈ క్రింది విధంగా వర్ణించారు:

కలువల మేలు కందువలు, కాముని కయ్యపు బాళెముల్, వియో 

గులదలడించు వేళలు, చకోరకపంక్తుల భోగకాలముల్, 

సెలువలు సైరణల్ విడిచి చిక్కు తఱుల్, ఘనచంద్రచంద్రికా 

జ్వలితదిశల్ శరన్నిశలు జారక దుర్దశలయ్యె నయ్యెడన్

    కలువ పువ్వులకు మేలు చేకూర్చేవి, మన్మథుని యుద్ధ శిబిరాల వంటివి, ఎడబాటుతో ఉన్న వియోగుల హృదయాలను కలచివేసేవి, చకోర పక్షులకు వెన్నెల తేనెలు గ్రోలే భోగ సమయాలు, విరహంతో ఉన్న కాంతలు ఓర్పును కోల్పోయి చిక్కుల్లో పడే సమయాలు, పూర్ణచంద్రుని వెన్నెల వెలుగులతో దిక్కులన్నింటినీ ప్రజ్వలింపజేసేవి అయిన ఆ శరదృతువు రాత్రులు... శ్రీకృష్ణుని దివ్యప్రేమలో తేలిపోయే గోపికలకు, కాముకులకు జారవిడుచుకోలేని కష్టకాలంగా (దుర్దశలుగా) పరిణమించాయి.

    ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తన తండ్రిని వరుణపాశం నుండి విడిపించి, వరుణుడికి భక్తిభావాన్ని, గోపాలురకు ఆత్మజ్ఞానాన్ని, వైకుంఠ దర్శనాన్ని ప్రసాదించి, శరద్రాత్రుల రసక్రీడకు రంగాన్ని సిద్ధం చేశాడు.

లంకాదహనానికి ముందు సముద్రలంఘనం చేస్తున్న హనుమంతుడికి ఎదురైన మూడు ప్రధాన అడ్డంకులు ఏమిటి?

సీతాదేవి అన్వేషణలో భాగంగా హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు ఆయనకు మార్గమధ్యంలో మైనాకుడు, సురస, సింహికల రూపంలో మూడు రకాల అడ్డంకులు ఎదురయ్యాయి. మైనాక పర్వతం హనుమంతుడికి ఆతిథ్యమిచ్చి విశ్రాంతి తీసుకోమని ప్రలోభపెట్టింది. కానీ, శ్రీరామ కార్యం పూర్తయ్యే వరకు విశ్రాంతి లేదని హనుమంతుడు దానిని వినయంగా తిరస్కరించి ముందుకు సాగాడు. ఇది ఎంతటి మహత్కార్యంలోనైనా మార్గమధ్యంలో వచ్చే ప్రలోభాలకు లొంగకూడదనే సందేశాన్ని ఇస్తుంది.

ఆ తర్వాత దేవతల ప్రేరణతో హనుమంతుడి బలబుద్ధులను పరీక్షించడానికి సురస అనే నాగమాత వచ్చి, తన నోటి గుండా వెళితేనే ముందుకు వెళ్లనిస్తానని అడ్డుపడింది. హనుమంతుడు తన శరీరాన్ని పెంచుకుంటూ పోయి, ఆమె కూడా నోటిని విప్పి పెద్దది చేసిన వెంటనే అత్యంత చిన్నరూపం ధరించి, ఆమె నోటిలోకి వెళ్లి చటుక్కున బయటకు వచ్చేశాడు. బలం కంటే సమయస్ఫూర్తి, చతురతే గొప్పవని ఈ ఘట్టం నిరూపిస్తుంది.

చివరగా, నీడను పట్టుకుని లాగే శక్తి ఉన్న సింహిక అనే రాక్షసి హనుమంతుడి పురోగతిని అడ్డుకుంది. హనుమంతుడు ఆలస్యం చేయకుండా ఆమె శరీరం లోపలికి వెళ్లి దానిని చీల్చి సంహరించాడు. మన లక్ష్యానికి అడ్డుపడే దుష్టశక్తులను, ప్రతికూలతలను నిర్దాక్షిణ్యంగా ఎదుర్కొని అంతం చేయాలని ఇది చూపుతుంది. ఈ విధంగా హనుమంతుడు ప్రలోభాన్ని వినయంతో, పరీక్షను యుక్తితో, అడ్డంకిని పరాక్రమంతో జయించి విజయం సాధించాడు.

:: జరాసంధుని దండయాత్ర - మధుర రక్షణ ::       శ్రీకృష్ణ లీలలలో అత్యంత ప్రాముఖ్యమైనది, సాహసోపేతమైనది జరాసంధుడి దండయాత్రల వృత్తాంతం మరియు మధుర ...