28, ఫిబ్రవరి 2025, శుక్రవారం

:: శిశుపాలుని చరిత్ర :: 

    శిశుపాలుడు చేది వంశంలో సాత్వతీదమఘోషులకు పుట్టాడు. పుట్టుకతోనే వానికి నాలుగు భుజాలు, నొసట కన్ను, గాడిద కంఠధ్వనితో ఏడ్పు వచ్చాయి. తల్లిదండ్రులు అదిచూచి భయపడ్డారు. ఆశ్చర్యపోయారు. అప్పుడొక అశరీరవాణి ఇలా అన్నది - ఈ బాలుణ్ణి ఇతరులెవ్వరూ చంపలేరు. ఎవరైతే ఇతణ్ణి ఎత్తుకోగానే, ఎక్కువగా ఉన్న రెండు చేతులు, కన్నూ అణగిపోతాయో అతడే ఇతడి పాలిటి యముడు. అశరీరవాణి ఆ విధంగా చెప్పేసరికి, శిశుపాలుని తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. చూడవచ్చిన వాళ్ళందరి చేతికి ఎత్తుకోవటానికి ఆ బాలుణ్ణి ఇవ్వసాగారు. 

    అద్భుత ప్రతిభావంతులైన బలరామకృష్ణులిద్దరూ వికార రూపంలో ఉన్న బాలుడు శిశుపాలుణ్ణి, మేనత్త అయిన సాత్వతిని ప్రియమార చూడాలని బంధువులతో, మంత్రులతో, మిత్రులతో కలసి ఒకనాడు చేది భూపతి పట్టణానికి వెళ్ళారు. సాత్వతి ఈ విధంగా వచ్చిన బలరామ కృష్ణులను ప్రీతితో గౌరవించి, బాలుడైన శిశుపాలుణ్ణి ఎత్తుకోవటానికి మొదట బలరాముని చేతికిచ్చింది. ఆ తరువాత శ్రీకృష్ణుని చేతికిచ్చింది. శిశుపాలుణ్ణి శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే, అందరూ చూస్తుండగా, ఆశ్చర్యకరంగా - అధికంగా ఉండే అతని చేతులు, కన్ను ఒక్కసారిగా అణగిపోయాయి. దానిని చూసి సాత్వతి ఆశ్చర్యపోయింది. అశరీరవాణి చెప్పిన మాటలను మనసులో తలచు కొన్నది. శ్రీకృష్ణుని వల్లనే తన కొడుకుకు మరణం తప్పదని తెలిసికొని శ్రీకృష్ణునితో ఇలా అన్నది. శ్రీకృష్ణా! ఈ బాలుడు చెడు మార్గంలో నడిచేవాడై అపకారం చేసి నీకు అప్రియుడైనా - నీ మరది చేసే తప్పులు నూఱింటిని దయతో క్షమించుమని ప్రార్థించింది. అప్పుడు శ్రీకృష్ణుడు దయతో ఆమె కోరిన వరాన్ని ప్రసాదించాడు. 

    ఆ తరువాత ధర్మరాజు తలపెట్టిన రాజసూయ యాగానికి శిశుపాలుడు హాజరయి, శ్రీకృష్ణుని అగ్రపూజకు ఆహ్వానించిన ధర్మరాజుని, భీష్మాచార్యుని తదితర పెద్దలను తీవ్రంగా అధిక్షేపించి, శ్రీకృష్ణునితో ముఖాముఖి ఈ విధంగా అన్నాడు. ఓ కృష్ణా! అవమానించ దగిన నిన్ను స్నేహం చేత, కురువంశపు ముదుసలి అయిన భీష్ముని ప్రేరణ చేత, నిండు సభలో గౌరవించ దగిన వాడవని ఎంచి తప్పుగా పూజించారు. కేశవా! అవివేకులైన పాండవులు,  నీ మీది మోహంతో మతి కోల్పోయిన భీష్ముడు, నీవు నాతో యుద్ధం చెయ్యటానికి సిద్ధంకండి అని మితిమీరిన గర్వంతో అన్నాడు. అప్పుడు చక్రధారి అయిన శ్రీకృష్ణుడు సమస్త రాజసమూహం వినేటట్లు ఈ విధంగా అన్నాడు. ప్రాగ్జ్యోతిషాధిపతి భగదత్తుని మీద మేము దండెత్తిన సమయంలో ఈ శిశుపాలుడు దుర్మార్గుడై బాలురకు, వృద్ధులకు భయం కలిగేటట్లు ద్వారకా నగరాన్ని తగులబెట్టాడు. వీరులైన భోజరాజులు భార్యలతో కలసి రైవతకాద్రిమీద క్రీడిస్తూ మైమరచి ఉన్న సమయంలో క్రూరుడై వారిని వధించాడు. దేవతాసమానుడైన వసుదేవుడు అశ్వమేధ యాగానికై పూజించిన గుర్రాన్ని అపహరించి, ఆ యాగానికి చెఱుపు చేశాడు. పాపాత్ముడై బభ్రుని భార్యను తన భార్యగా చేసుకొన్నాడు. అంతేగాక, మాటలకు సంబంధించి అనేక అపకారాలు కూడా చేశాడు. మా అత్త సాత్వతి ప్రార్థించటంచేత ఈ దుర్మార్గుడు చేసిన నూరు తప్పులు సహించాను. ఇప్పుడు మీరంతా చూస్తుండగా నాపట్ల దుర్మార్గ ప్రవర్తన ప్రారంభించి పరమ శత్రువయ్యాడని శ్రీకృష్ణుడనగానే, శిశుపాలుడు మహా కఠినమైన మాటలతో పురుషోత్తముణ్ణి ఇలా అన్నాడు. దుర్జనులకు ప్రియమైన వాడా! నీ స్నేహంతో, నీ కోపంతో నాకేమి పని? మొదట నా కిచ్చిన కన్యను నీ దానినిగా చేసుకొని ఈ విధంగా మాట్లాడటానికి సిగ్గులేదా? అంటూ శిశుపాలుడు ఒకదాని వెంట ఒకటిగా శ్రీకృష్ణుణ్ణి నిందా వాక్యాలతో దూషిస్తుండగా, రాక్షసాంతకుడైన శ్రీకృష్ణుని సుదర్శన చక్రం అగ్నిజ్వాలలు చలిస్తుండగా, అందరు రాజులూ భయపడుతూండగా, శిశుపాలుని శరీరం నుండి రక్తధారలు ఒక్కుమ్మడి మీదికి చిందుతుండగా అతని తలను నరికి వేసింది. నిందిస్తూ మాట్లాడిన శిశుపాలుని నోరు మూతపడింది. రాజులంతా ఆశ్చర్యంతో కళ్ళంతా పెద్దవి చేసికొని చూస్తుండగా, శిశుపాలుని శరీరం, వజ్రాయుధంతో హతమైన కొండలా క్రిందపడింది. ఆ కళేబరం నుండి ఒక కాంతి ఆకాశమంతా వెలుగులు చిమ్ముతూ వెలుపలికి వచ్చింది. శ్రీకృష్ణ పరమాత్మ శరీరంలో చేరిపోయింది. తరువాత శ్రీకృష్ణుడు శిశుపాలుని మృతదేహానికి అంత్యక్రియలు జరిపించి, అతని కుమారుణ్ణి చేది రాజ్యానికి రాజుగా చేశాడు. 

 

27, ఫిబ్రవరి 2025, గురువారం

:: వ్యాఘ్రేశ్వరలింగావిర్భూతి :: 

    పూర్వం దితి - కశ్యపుల పుత్రుడైన హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టగా చుట్టి పాతాళానికి తోసేసాడు. అప్పుడు విష్ణువు యజ్ఞవరాహ అవతారాన్ని ధరించి అతనిని చంపి భూమిని పునరుద్ధరించాడు. అయితే, కొడుకైన హిరణ్యాక్షుని మృతికి అతని తల్లి దితి అమితంగా దు:ఖించింది. అప్పుడు ప్రహ్లాదుని మేనమామ, దుష్టుడూ అయిన దుందుభి నిర్హాదుడనే రాక్షసుడు దితిని ఓదార్చి దేవతలమీద పగదీర్చుకొనటానికి ఉపాయాన్ని ఇలా ఆలోచించాడు. ఎవరికైనా బలాన్నిచ్చేది ఆహారమే కదా! దేవతలయొక్క ఆహారం బ్రాహ్మణులు యజ్ఞాలలో సమర్పించే హవిస్సులు మాత్రమే! యజ్ఞాలకు వేదములే ఆధారం. ఆ వేదాలు బ్రాహ్మణులను ఆశ్రయించి ఉంటున్నాయి. కనుక బ్రాహ్మణులు నశిస్తే, వేదాలు, వేదాలతో బాటు యజ్ఞాలూ నశిస్తాయి. ఆ తరువాత దేవతలకు హవిర్భాగాలు లభించక దుర్బలులవుతారు. అపుడు వారిని తేలికగా జయించవచ్చు. వారి అక్షయ సంపదలను కైవసం చేసికొనవచ్చు - ఇలా ఆలోచించి ఆ దుష్టుడు బ్రహ్మతేజోవిరాజమానులు, వేదాధ్యన సుసంపన్నులు అధికంగా నివసిస్తున్న వారణాసీ నగరానికి వచ్చి వారిని భక్షించటం మొదలుపెట్టాడు. 

    అతడు మాయావి అయిన కారణంగా వనంలో వనచరునిగాను, జలాలలో జలజంతువు రూపంలోనూ, పగటి భాగంలో మనుష్యుల మధ్య ముని రూపంలోనూ, ఇంకా, అనేక రూపాలలో ఉంటూ బ్రాహ్మణులను చంపి భక్షిస్తూ ఉండేవాడు. రాత్రి పెద్దపులి రూపంలో వచ్చి ఎముకలను గూడా విడిచి పెట్టకుండ తినివేసేవాడు. నిన్న కనిపించిన విప్రుడు ఈరోజున కనిపించక పోయేసరికి కాశీ నగరంలో పెద్ద గగ్గోలు పుట్టింది. అప్పటికే చాలామంది బ్రాహ్మణులు మాయావి నోట్లోపడి మాయమయ్యారు. 

    ఒకరోజున శివరాత్రినాడు శివభక్తుడైన ఒక బ్రాహ్మణుడు శివుని అర్చించి ధ్యాన నిమగ్నుడయినాడు. దుందుభినిర్హాదుడు అతనిని కబళించటానికి నిశ్చయించుకొన్నాడు కాని, అస్త్ర మంత్రన్యాసం చేసి ఏకాగ్రచిత్తంతో శివధ్యానం చేస్తూన్న విప్రుని సమీపించ లేకపోయాడు. ధ్యానం నుండి లేచి అర్చన ముగించగానే విప్రుని కబళింపబోయాడు మాయావి. వెంటనే సర్వ వ్యాపకుడైన రుద్రుడు వాని అభిప్రాయాన్నెరిగి బ్రాహ్మణుడు అర్చించిన లింగం నుండి ఆవిర్భవించి మృగరూపంలో ఉన్న రాక్షసుని బాహుబంధంలో ఇరికించి పిడికిలితో నెత్తిపై మొత్తగానే వ్యాఘ్ర రూపంలో ఉన్న రాక్షసుడు వెంటనే భయంకరంగా గర్జిస్తూ మరణించాడు. ఆ అరుపుకు అనేకమంది మునులు, ఋషులు, విప్రులు, ప్రజలు అక్కడకు చేరుకొని జయజయ ధ్వానాలతో శంకరుని స్తుతించి అక్కడనే నిత్యనివాసంగా ఉండమని ప్రార్థించారు. భక్తవత్సలుడైన శంభుడు తానావిర్భవించిన లింగము నందే లీనమయ్యాడు. అప్పటి నుండి ఆ లింగం కాశీ నగరంలో వ్యాఘ్రేశ్వర లింగమనేపేర నిత్య పూజలను అందుకుంటూ భక్తుల కొంగుబంగారమై వారిని రక్షిస్తూనే ఉంది. ఈ గాథ శివప్రీతి కరమయినది, భుక్తిముక్తి దాయకమైనదిగా ప్రఖ్యాతి చెందియున్నది. 

19, ఫిబ్రవరి 2025, బుధవారం

:: సుందోపసుందుల కథ ::  

    పూర్వం దితి కుమారుడైన హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడు అనే వానికి సుందోపసుందులనే ఇద్దరు కుమారులు జన్మించారు. వారు నిగ్రహంతో కూడిన మనసు కలవారై తపస్సుచే తప్ప సర్వాన్ని పొందటం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి వింధ్య పర్వతానికి వెళ్ళారు. ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని, వేసవికాలం అయిదు అగ్నుల మధ్య, వర్షాకాలంలో, చలికాలంలో నీటి మడుగులలో ఉండి, గాలిని భక్షిస్తూ, ఒంటి కాలి మీద నిలబడి, చేతులు పైకెత్తి తలలు వంచి చాలాకాలం తపస్సు చేయగా, వారి భయంకరమైన తపో వేడిమికి వింధ్య పర్వత గుహలలో పొగపుట్టి, ఎంతో పైకెగసి, ఆకాశం అంతా కప్పగా దేవతలు భయపడ్డారు.  అందమైన స్త్రీలచేత వాళ్ళ తపస్సుకు విఘ్నం కలిగించాలని ప్రయత్నించారు. విఫలులయి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి, ఆ రాక్షసుల తపస్సు చెడగొట్టాలని అనగా, ముల్లోకాలచే పూజింపబడిన వాడూ, పద్మం పీఠంగా గలవాడూ అయిన ఆ బ్రహ్మదేవుడు దేవతలకు మేలుచేయాలని, దయతో వరం యివ్వటానికి సుందోపసుందుల దగ్గరకు వచ్చాడు. వారి తపస్సుకు మెచ్చి, వారికి ప్రత్యక్షమై, మీకు యిష్టమైన వరం ఇస్తాను, వేడండి అనగా, వారు చేతులు జోడించి కోరిన రూపం కలిగి ఉండటాన్ని, కోరిన విధంగా వెళ్ళగలగటాన్ని, అన్ని మాయలు కలిగి ఉండటాన్ని, యితరుల చేత చావు లేకుండటాన్ని, అసలు చావే లేకుండటాన్ని అనుగ్రహించమని కోరారు. బ్రహ్మదేవుడు వారికి ' చావు లేకుండటం ' అనే వరం ఒక్కటి తప్ప తక్కిన వాటినన్నింటినీ దయతో అనుగ్రహించాడు. 

    ఈ విధంగా వారు బ్రహ్మ వలన వరాలు పొంది చెలరేగి, సాటిలేని రాజ్యవైభవంతో వెలిగి, గర్విష్టులై లోకాలను జయించాలన్న కోరికతో దేవతలు, గరుడులు, నాగులు, కిన్నరుల యొక్క పురాలను  కొల్లగొట్టుతూ, భూలోకంలోని రాజులను, ఋషులను, బ్రాహ్మణ శ్రేష్ఠులను బాధిస్తూ, బ్రాహ్మణోత్తములు చేసిన యజ్ఞాలు,, వేదాధ్యయనాలు, శ్రాద్ధాలు, హోమాలు, తపస్సులు, దానాలు, జపాల చేత పితృదేవతలు ఎల్లప్పుడూ తృప్తి పొందుతున్నారని కోపించి, పుణ్యవంతుల నిత్య నైమిత్తిక కర్మలకు ఆటంకాలు కల్గిస్తూ, సింహం, పెద్దపులి, ఏనుగు రూపాలు ధరించి అడవులలో తిరుగుతూ, మునిపల్లెల్లో ప్రవేశించి మునులకు ప్రాణభయం కలిగిస్తూ ఉండగా, మునులంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి, లోకాలకు సుందోపసుందులు కలిగించే ఉపద్రవాలను గూర్చి చెప్పారు. బ్రహ్మ మునులు చెప్పింది విని, ఆశ్చర్యపడి, వారు యితరుల చేత చావరని, ఒకరితో ఒకరు యుద్ధం చేసి మాత్రమే మరణిస్తారని చెప్పి, విశ్వకర్మను పిలిపించి అందం, కాంతి గల ఒక స్త్రీని సృజింపుమని ఆజ్ఞాపించాడు. విశ్వకర్మ వెంటనే, తన నేర్పుతో  కాంతివంతమైన  దేహంతో ప్రకాశించే నల్ల కలువల వంటి కన్నులు గల తిలోత్తమను సృజించాడు. 

    దేవేంద్రుడు మొదలైన దేవతల సమూహాలూ, మునుల సమూహాలూ కొలుస్తూ ఉన్న బ్రహ్మదేవునికి ఆ తిలోత్తమ మహాభక్తితో నమస్కరించి ' పని ఏమి? ' అని ఎదుట నిలిచింది. బ్రహ్మదేవుడు ఆ అందగత్తెను చూచి, ' సుందుడు, ఉపసుందుడు ' అనే రాక్షసి లిద్దరు పొగరెక్కి లోకాలకు కీడుచేస్తూ వింధ్యపర్వత గుహల్లో ఉన్నారు. వారిద్దరూ నీ కారణంగా తమలో తాము పోరాడుకొని మరణించేటట్లుగా చేయుమని ఆజ్ఞాపించాడు. తిలోత్తమ అలాగేనని బ్రహ్మ దగ్గర శలవు తీసుకొని దేవసభకు ప్రదక్షిణ చేసింది. అప్పుడు బ్రహ్మ ఆమె సౌందర్యాన్ని చూడటానికి తనకు నాలుగు దిక్కులలో ముఖాలు కల్పించుకొని చతుర్ముఖుడయ్యాడు. దేవేంద్రుడు తన రెండు నేత్రాలతో చూస్తే తృప్తి కలుగదని వేయికన్నులవాడయ్యాడు. దేవతలు కామమోహితులయ్యారు. ఈ విధంగా తిలోత్తమ అందరినీ మోహింపజేసి, మానవ లోకానికి మెరుపుతీగవలె ప్రకాశిస్తూ, వింధ్యపర్వత అరణ్యప్రాంతమంతా వెలుగుతూండగా వచ్చింది. 

    సుందోపసుందులు ఆ తిలోత్తమను చూచి, ఒక్కసారిగా మన్మథపీడితులై, పరస్పర స్నేహాన్ని వదలి, అనురాగంతో ఆమె మీద చూపులు నిలిపారు. ఒకే ఆసనంమీద కూర్చొంటూ, ఒకే ఆహారం భుజిస్తూ, ఒకే వాహనం ఎక్కుతూ, ఒకే ఇంట్లో ఉంటూ, ఒకే పడకమీద పడుకొంటూ, ఒకే పనిచేస్తూ, ఒకటిగా ఉన్న బలవంతులు ఆ సుందోపసుందులిద్దరూ దైవ నిర్ణయం వలన ఒకే స్త్రీని కామించారు. వారిద్దరూ మన్మథ బాధితులై మోహావేశంతో ' ఇది నా భార్య, ఇది నా భార్య ' అని ఆమె ఎడమ, కుడి చేతులను పట్టుకొని, సుందరీ! మా యిద్దరిలో నీవు ఎవ్వరిని కోరుతావో చెప్పు ' మని సుందోపసుందులడుగగా ' మీలో మీరు యుద్ధం చేసి, ఎవడు గెలుస్తాడో అతడినే కోరుతాను ' అని తిలోత్తమ చెప్పగా ఇద్దరూ తగ్గక, వజ్రసమదేహం గల వారిద్దరూ విజృంభించి కొండను కొండ ఎదుర్కొన్నట్లుగా ఒకరినొకరు ఎదుర్కొన్నారు. వ్యతిరేక బుద్ధితో కోపాత్ములై పిడుగులవంటి గట్టి పిడికిలి పోట్లతో ఒకరితో ఒకరు పోరాడినారు. ఒకరితో ఒకరు సంతోషకరంగా మాట్లాడే వారు, ఒకరి మేలు ఒకరు కోరే వారు అయిన ఆ రాక్షసులు పరాయి వారి వలె కోపంతో రెచ్చిపోయి, ఒకరినొకరు కొట్టుకొని చనిపోయారు. ధైర్యవంతులు కూడా స్త్రీల కారణంగా విరోధం పొంది తుదకు నాశనమయిపోతారు సుందోపసుందుల వలెనే. 

 

18, ఫిబ్రవరి 2025, మంగళవారం

:: పురూరవుని పుట్టుక :: 

    వైవస్వతమనువు కుమారుడైన సుద్యుమ్నుడు ఒకరోజు అశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు. మందీమార్బలం కూడా వెంట వెళ్ళింది. ఆ విధంగా అతడు ధనుర్బాణాలతో మృగాలను వేటాడుతూ చివరకు అరణ్యపు ఉత్తర భాగానికి చేరుకున్నాడు. అక్కడ   మేరుపర్వత సానువుల్లో అత్యద్భుతమైన సౌందర్యంతో విరాజిల్లే ఓ ఉద్యానవనం గోచరించింది. ఫలవృక్షాలతోనూ, సౌరభాలను వెదజల్లే పలువిధములైన పూల తరువులతోనూ నిండి, పక్షుల కిలకిలారావాలతో, తుమ్మెదల ఝంకారాలతో సందడి గొలుపుతూ సర్వాంగ సుందరంగా ఎవరో చక్కగా తీర్చి దిద్దినట్లుగా ఉంది ఆ తోట. నిజానికి అది శివుడు ఉమతో గూడి విహరించే సుకుమారమనే వనము. సుద్యుమ్నుడు ఆ వనాన్ని చూడగానే పరవశించి పోయాడు. సేవకులతో సహా  ఆ ఉద్యానవనంలోకి ప్రవేశించాడు. అందులోనికి ప్రవేశించిన వారంతా అకస్మాత్తుగా స్త్రీలుగా మారిపోయారు. సుద్యుమ్నుని గుర్రం కూడా ఆడగుర్రంగా మారిపోయింది. అందరూ ఆశ్చర్య చకితులయ్యారు. అలా ఎందుకు జరిగిందో వారికేమాత్రం బోధపడలేదు. విచారగ్రస్తులై ఖిన్న వదనాలతో చేసేదిలేక విచారించారు.  

    పూర్వమొకసారి శివపార్వతులు ఆ వనంలో విహరిస్తున్న సమయంలో వారి దర్శనార్థము   బ్రహ్మ మానస పుత్రుల్గగు సనకసనందనాది మహామునులు అక్కడకు వచ్చారు.   ఆ సమయంలో అంబిక వివస్త్రయై ఉండడం వలన హఠాత్తుగా వచ్చిన ఆ మౌనివరులను చూసి సిగ్గుపడి వెంటనే భర్త ఒడిలో నుండి దిగి వస్త్రంతో వక్షస్థలాన్ని కప్పుకొంది.    ఋషులు తమ పొరబాటుని గ్రహించిన వారై వెంటనే అక్కడి నుండి వెనుదిరిగి నరనారాయణాశ్రమానికి వెళ్ళిపోయారు. అప్పుడు శివుడు తన పత్నికి ప్రసన్నతను కలిగించగోరి ఒక వరాన్ని ఇచ్చాడు. ఆ వర ప్రభావము వలన ఏ పురుషుడు ఆ వనంలో ప్రవేశించినా వెంటనే స్త్రీ రూపాన్ని పొందుతాడు. . అప్పటినుంచి విషయం తెలిసిన వారెవరూ ఆ వనంలోకి వెళ్ళటం మానుకున్నారు. సుద్యుమ్నుడు ఇది తెలియకవెళ్ళాడు. స్త్రీగా మారిపోయాడు. అనుచరుల గతీ అంతే అయింది. స్త్రీగా మారిపోయిన సుద్యుమ్నుడు ఆ వనం విడిచి ఇవతలికి వచ్చి అరణ్యంలోనే స్థిరపడిపోయాడు. రాజ్యానికి వెళ్ళేందుకు మనసు ఒప్పలేదు. ఇళ అనే పేరుతో ఆ అడవిలోనే అలా అలా తిరుగుతున్నాడు. పరివారం మొత్తం చెలికత్తెలై సేవలు చేస్తున్నారు. 

    ఇది యిలా ఉండగా - ఒకరోజున బృహస్పతి భార్య తారకు, చంద్రునికి జన్మించిన బుధుడు యవ్వనవంతుడై ఆ అడవికి వేటకైవచ్చి అక్కడ ఇళ పేరుతో స్త్రీరూపంలో ఉన్న సుద్యుమ్నుని చూశాడు. ఇళ అందానికి మోహితుడయ్యాడు. ఆమె హావభావాలు అతణ్ణి అమితంగా ఆకర్షించాయి. ఇళ కూడా అలాగే స్పందించింది. బుధుణ్ణి పతిగా వరించింది. ఇద్దరూ గాంధర్వరీతిని వివాహం చేసుకున్నారు. తరువాత యిద్దరకూ ఒక పుత్రుడు కలిగాడు. వానికి పురూరవుడని పేరు పెట్టారు.

    తరువాత స్త్రీ రూపంలో ఉన్న సుద్యుమ్నుడు తన కులగురువైన వశిష్ఠుని స్మరించాడు. అతని దు:ఖకరస్థితికి జాలిచెందిన వశిష్ఠుడు  శివుని ప్రార్థించి సుద్యుమ్నుని స్త్రీత్వాన్ని తొలగించమని అభ్యర్థించాడు. పూర్వం తాను పెట్టిన శాపానికి భంగం కలుగకుండా మధ్యేమార్గంగా శివుడు వరం ప్రసాదించాడు. ఈ సుద్యుమ్నుడు ఇకనుంచి ఒక నెల పురుషుడుగా, ఒక నెల స్త్రీగా ఉంటాడని అభయం యిచ్చాడు. దీనికే సంబరపడ్డ సుద్యుమ్నుడు పురుషునిగా మారి రాజ్యానికి వెళ్ళాడు. వశిష్టుని అనుగ్రహంతో పరిపాలన సాగించాడు. స్త్రీ రూపాన్ని పొందిన నెల రోజులూ రాజమందిరం విడిచి బయటకు రాలేదు. పురుష రూపంలో ఉన్న మాసంలో పరిపాలన చేసేవాడు. కాని అది ప్రజలకు నచ్చలేదు. సుద్యుమ్నునికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే ధార్మికులైన పుత్రులు కలిగారు. వారంతా దక్షిణాపథానికి రాజులయ్యారు. పురూరవుడు యవ్వనంలోకి ప్రవేశించగానే రాజ్యం అతడికి అప్పగించేసి అడవులకు వెళ్ళిపోయాడు సుద్యుమ్నుడు. తరువాతి కాలంలో పురూరవుడు  ప్రతిష్ఠాన పురాన్ని చక్కగా పాలించాడు. 




















12, ఫిబ్రవరి 2025, బుధవారం

:: దిలీపచక్రవర్తి :: 

    ఇక్ష్వాకు వంశంలో పేరెన్నికగన్న రాజు దిలీపుడు. అతడు ధర్మపరుడు. పరాక్రమవంతుడు. అకుంఠిత దీక్షాదక్షతలతో అనాయాసముగా రాజ్యపరిపాలన సాగించినట్టివాడు. అతని భార్య సుదక్షణ. దాక్షిణ్యగుణం నిండుగా గలిగిన ఆమె మహాపవిత్రురాలు. ఆ రాజు అన్నివిధాలా తనకు తగిన ఆమె యందు సంతానం పొందాలని ఆశించాడు. కానీ, ఆయన కోరిక నెరవేరలేదు. ఇలా చాలాకాలం గడచిపోయింది. తుదకు సంతాన ప్రాప్తికి తగిన వ్రతం అనుష్ఠించాలని దిలీపునకు సంకల్పం కలిగింది. వెంటనే అతడు మహారాజ్య భారాన్ని మంత్రులకు అప్పగించాడు. పత్నీ సమేతుడై బ్రహ్మను పూజించాడు. పిమ్మట సంతాన కాంక్షతో వ్రతానుష్ఠానానికై ఆ రాజదంపతులు కులగురువైన వశిష్ఠుని ఆశ్రమానికి పయనమయ్యారు. 

    రాజు ఆశ్రమం చేరిన సమయానికి వశిష్ఠ మహర్షి సాయంకాలానుష్ఠానంలో ఉన్నాడు. ఆయన అనుష్ఠానం ముగిసేవరకు ఉండి పిమ్మట అరుంధతీదేవితో కలిసి ఉన్న మునీంద్రుని సందర్శించాడు. రాజదంపతులు మునిదంపతుల పాదాలంటి ప్రణామం చేశారు. మునిదంపతులు వారిని ప్రీతితో ఆశీర్వదించారు. తరువాత వశిష్ఠ మహర్షి దిలీపుని కుశల ప్రశ్నలు వేశాడు. అన్నిటికీ సమాధానాలు చెప్పి చివరకు సంతతి కలుగక పోవడం చేత సంతోషం లేకుండా పోయిందని తన చింతను మహర్షికి తెలియజెప్పి బాధపడ్డాడు దిలీపచక్రవర్తి. యజ్ఞానుష్ఠానంలో నేను పరిశుద్ధుడనయ్యాను కాని, సంతానలోపం వల్ల పరితప్తుడనవుతున్నానని చెప్పాడు. సంతానప్రాప్తి కలిగే మార్గం బోధించమని మహర్షిని వేడుకున్నాడు. దిలీపుని విన్నపం విని వశిష్ఠ మునీంద్రుడు ధ్యానంతో నిశ్చల నేత్రుడై ఆపై యోగదృష్టికి గోచరించిన విషయాన్ని ఇలా చెప్పాడు. రాజా! పూర్వం ఒకప్పుడు నీవు ఇంద్రుణ్ణి సేవించడానికై స్వర్గలోకానికి వెళ్ళావు. తిరిగి భూలోకానికి వస్తున్నప్పుడు దారిలో కల్పవృక్షం క్రింద ఉన్న కామధేనువునకు ప్రదక్షిణాది సత్కారం చేయకనే తిరిగి వచ్చావు. తనను ఆదరించకుండా వెడుతున్నావని దానికి కోపం వచ్చింది. అందువల్ల, నన్ను తిరస్కరించావు కాన నా సంతానాన్ని ఆరాధించకపోతే నీకు సంతానము కలుగదని కామధేనువు నిన్ను శపించింది. ఆ సమయానికి గంగాప్రవాహంలో మదించిన దిగ్గజం ఘీంకరిస్తూ ఉండటంవల్ల ఆ శాపం, నీకు నీ సారథికి వినబడలేదు. నీకు సంతతి కలుగక పోవడానికి కారణం ఇదే. పూజ్యులను పూజించకపోతే శ్రేయస్సుకు ఆటంకం కలగడం సహజమే కదా! ఇప్పుడు ఆ కామధేనువు వరుణుడు చేస్తున్న దీర్ఘకాలిక యాగానికి ఆజ్యం మొదలయిన హవిస్సులు చేకూర్చటానికై పాతాళానికి పోయి ఉన్నది. పాతాళ ద్వారం మహా సర్పాలతో నిరోధింపబడి ఉన్నది. అక్కడకు పోవడం సాధ్యం కాని పని. ఆ కామధేనువు పుత్రికయైన నందినీ ధేనువు ఇక్కడ నా ఆశ్రమంలోనే ఉంది. దానికి మారుగా దీనిని నీవు శుచివై, ధర్మపత్నితో గూడి భక్తి శ్రద్ధలతో పూజించు. ఇది సంతసించినా నీ కోరిక నెరవేరుతుంది అని వశిష్ఠ మహర్షి చెబుతూ ఉండగానే ఆయనకు హవిస్సు సమకూర్చే ప్రశస్తమైన నందినీ ధేనువు అడవినుండి తిరిగి వచ్చింది. పిమ్మట దిలీపుడు సుదక్షిణాదేవి చేత నందినికి పూజ చేయించాడు. దూడకు పాలుగుడిపించి కట్టివేశాడు. తరువాత ఆవును అడవికి వదలి ఎవ్వరినీ రానీయకుండా తానొక్కడె ఆ ధేనువును కాపాడుతూ వెంట వెళ్ళాడు. నందినికి రుచికరమైన పచ్చగడ్డి కబళాలు అందిస్తూ, దాని ఒడలు గోకుతూ, ఈగలు వాలకుండా నివారిస్తూ, అది పోయిన దారినే పోనిస్తూ భక్తితో ఉపచర్యలు చేసేవాడు. ఏదేమైనా, మహారాజు, రాణి  నందినికి భక్తి ప్రపత్తులతో క్రమం తప్పకుండా పూజలు చేశారు.  ధేను వ్రతాన్ని అనుష్ఠించారు. ఆ వ్రతం ఇరవైయొక్క దినాలు నిర్విఘ్నంగా కొనసాగింది. 

    తనను సేవిస్తున్న దిలీపుని భక్తిని పరీక్షించగోరి నందినీ ధేనువు ఒకరోజు చెంతనున్న ఒక కొండ గుహలోనికి ప్రవేశించింది. ఇంతలో ఒక సింహం హఠాత్తుగా అక్కడకు లంఘించి ఆవును పట్టి తినబోయింది. అది చూసిన దిలీపుడు ఆవును రక్షించే ప్రయత్నంగా సింహంపై బాణం వేయబోగా, అతని చెయ్యి పనిచెయ్యలేదు. అప్పుడు సింహం నేను నా ఆహారాన్ని భుజించ బోతూండగా నీ వెందుకు అడ్డగిస్తున్నావు అంటూ, నేను శివకింకరుడను. నామీద నీ శక్తులేవీ పనిచేయవు అని అంది. అది విన్న దిలీపుడు ఆ సింహంతో ఓ శివకింకరా! ఆ పరమేశ్వరుడు నీకు వలెనే నాకు కూడా పరమ పూజ్యుడు. కానీ, మా గురువుగారైన వశిష్ఠ మహర్షికి హోమధేనువైన ఈ గోవును కాపాడటం నా విద్యుయుక్త ధర్మం కదా! కాబట్టి నువ్వు నా ఈ శరీరాన్ని ఆహారంగా స్వీకరించి నా గురు ధనమైన ఈ నందినీ ధేనువును విడిచిపెట్టు అన్నాడు. ఇది వినగానే సింహం, ఈ భూమండలానికే ఏలికయైన నీవు ఒక్క గోవుకోసం విలువైన నీ ప్రాణం వదులుకుంటావా? ఈ ఆవు కాకపోతే, ఇలాంటివి కోటి మీ గురువుగారికి యివ్వవచ్చు. నీ పాలనలో సుఖంగా ఉన్న కోట్లాది ప్రజలను అనాథలను చేస్తావా? అంటూ దిలీపుడిని ప్రలోభపెట్ట జూచింది. కానీ అతడు ససేమిరా అన్నాడు. ఎదురుగా హింస జరుగుతున్నా కాపాడకుండా చూస్తున్న ప్రాణాలు ఎందుకంటూ దయచేసి నా ప్రార్థన మన్నించి నా శరీరాన్ని ఆహారంగా స్వీకరించమని సింహాన్ని ప్రాధేయపడ్డాడు. చివరకు ఎట్లాగో ఒప్పుకుంది సింహం. రాజు మామూలుగా కదలగలిగాడు. తనకు తాను సింహానికి అర్పించుకుందామని మోకాళ్ళపై కూర్చొని తలవంచుకొని సింహం వేటుకై ఎదురు చూస్తున్న దిలీపుడి మీద పుష్పవృష్టి కురిసింది. నందినీ ధేనువు దివ్యాకృతి దాల్చి, రాజా! వశిష్ఠ మహర్షి తపశ్శక్తివలన నన్ను ఈ సింహమే కాదు విశ్వంలో ఏ శక్తి నాకు హాని కలిగించలేదు. నిన్ను పరీక్షిద్దామనే ఇలా చేశాను. నీ భక్తితో నన్ను మెప్పించావు. దివ్యమైన నా క్షీరాన్ని స్వీకరించు సంతానవంతుడవవుతావు అని అన్నది నందినీ ధేనువు. దూడ పాలు త్రాగిన తరువాత, మునులు యజ్ఞార్థము క్షీరమును పొందిన తరువాత మిగిలిన పాలలో ఆరవ వంతు మాత్రమే తీసుకొని తృప్తి చెందాడు. ధేనువ్రత మహిమ వలన రఘుమహారాజును పుత్రునిగా పొందినాడు దిలీపుడు. 

11, ఫిబ్రవరి 2025, మంగళవారం

:: మాండవ్యోపాఖ్యానము :: 

    పూర్వం మాండవ్యుడనే బ్రహ్మర్షి ఒంటరిగా భూమండలంలో ఉన్న పుణ్యతీర్థాల నన్నిటిని తిరిగి తిరిగి సేవించి ఒక పట్టణానికి కొంత దూరంగా ఉన్న అడవిలో ఆశ్రమం కట్టుకొని, దాని ద్వారంలో ఉన్న వృక్షం మొదట్లో చేతులు పైకెత్తి ఉంచి మౌనవ్రతంతో తపస్సు చేస్తూ ఉండగా, ఆ పట్టణపు రాజుయొక్క ధనాన్ని దొంగిలించి దొంగలు, తలారులు తమను వెంటాడుతూ ఉండగా మాండవ్యుడి సమీపానికి పరుగెత్తి ఆ ఆశ్రమంలో దాక్కున్నారు. ఆ దొంగలను వెంటాడి వచ్చిన తలారులు ఆ మునిని చూచి ' రాజధనం దొంగిలించిన దొంగలు నీ దగ్గరకే పరుగెత్తి వచ్చారు. నీకు తెలిస్తే వారి జాడను చెప్పు' మని అడుగగా, ఆ ముని మౌనవ్రతంలో ఉండుటచేత మాటాడకుండ ఉండగా, కోపగించి ఆశ్రమంలో ప్రవేశించి ఆ దొంగలను పట్టుకొని. ఆ మునియే దొంగలకు సంధానం చేసే  దళారి అనీ, వేషం వేసికొని మౌనంగా తపస్సుచేస్తున్నట్లు మాటాడకుండ ఉన్నాడని నిందలుపలికి తలారులు నీతిమాలి మాండవ్యుడిని ఆ దొంగలతో కలిపి కట్టి తీసికొనివచ్చి రాజుకు చూపి ధనాన్ని ఒప్పగించగా, రాజు ఆ దొంగలను చంపించి, తపస్వి వేషంలో ఉన్న దొంగగా భావించి ఆ మాండవ్యుడిని నగరం వెలుపలి భాగంలో ఇనుప శూలానికి గ్రుచ్చబడిన వానిగా, అంటే., కొఱుతవేయబడిన వానిగా చేశాడు. మునిశ్రేష్ఠుడైన మాండవ్యుడు ఆ విధంగా కొఱుత వేయబడి కూడా తన మనస్సులో ఎటువంటి వికారంలేని శాంతభావంతో, సుఖదు:ఖాలలో కలతచెందని యోగచిత్తంతో ఆహారం తినకపోయినా చాలాకాలం ప్రాణాలతో కూడిన వాడై తపస్సు చేశాడు. 

    ఈ విధంగా దేహానికి కలిగిన బాధను పట్టించుకోక తపస్సు చేస్తున్న ఆ ముని తపస్సుయొక్క గొప్పతనానికి మెచ్చి, గొప్పవారైన ఋషులు పక్షుల ఆకారంతో రాత్రివేళ వచ్చి " ఓ ముని శ్రేష్ఠుడా! ఇటువంటి గొప్ప తపస్వివైన నీకు ఇటువంటి బాధ కలిగించినవారు ఎవ్వరు? అని అడుగగా, వారికి ఆ మాండవ్యుడు ఈ విధంగా అన్నాడు. మీ ప్రశ్నకు సమాధానం మీకు బాగా తెలిసికూడా నన్నడగటం దేనికి? నరుడు తన పూర్వ పుణ్య పాప కర్మల ఫలంగానే సుఖదు:ఖాలను పొందేటప్పుడు అనుభవిస్తూ ఉంటాడు. కాబట్టి నరుడు తన కర్మఫలాలకు తానే కారకుడవుతాడు. కాని ఇందులో ఇతరులు కారణమెందుకవుతారని అన్నాడు. ఆ విధంగా ఆ మహామునులతో మాండవ్యుడు పలికిన మాటలను ఆ నగరాన్ని రక్షించే భటులు విని వచ్చి రాజుకు తెలుపగా, ఆ రాజు వెంటనే బయలుదేరి శూలానికి గ్రుచ్చబడి కట్టబడి ఉన్న మాండవ్యుడికి మ్రొక్కి " నేను చేసిన తెలివితక్కువ తనానికి, అజ్ఞానానికి క్షమించి నన్ను అనుగ్రహించండి " అంటూ, శూలం నుండి ఆ  మునిని విడిపించబోగా తీయటానికి రాలేదు. అప్పుడు దాని మొదలును నెమ్మదిగా నరికించగా, అతని కంఠంలోని ప్రక్కభాగంలో మిగిలిన శూలభాగం శరీరంలోనే ఉండిపోయింది. దాని వలన ఆ ముని ' ఆణిమాండవ్యుడు ' అని పిలువబడినాడు. 

    ఆ మహాముని గొప్ప తపస్సుచేసి లోకాలన్నింటిని దాటి ఒకనాడు యముని నగరానికి పోయి యమధర్మరాజుతో ఈ విధంగా అన్నాడు. యమధర్మరాజా! ఇటువంటి భయంకరమైన శిక్షకు నేనేమి తప్పుచేశాను? బ్రాహ్మణుడనైన నన్ను ఇంతగా కోపించి కూడని శిక్షతో శిక్షించటం న్యాయమా? అనగా మాండవ్యుడితో యమధర్మరాజు ఈ విధంగా అన్నాడు. నీవు నీ చిన్నతనంలో తూనీగలను ఎగురనీయకుండా పట్టి ముండ్లకు గ్రుచ్చి ఉంచావు. దాని ఫలాన్నే ఇప్పుడు అనుభవించావు. హింస చేసేవారికి కష్టాలు పొందక తప్పుతుందా? అనగా విని మాండవ్యుడు కోపించి, పుట్టినది మొదలుగా పదునాలుగేండ్లు దాటేంతవరకు పురుషుడు బాలుడనబడతాడు. అతడు ఏది చేసినా పాపాన్ని పెద్దగా పొందడు. అతడికి ఇతరులు కీడుచేస్తే పాపులౌతారు. ఇది నేను చేసిన కట్టడి. నీవు ఇట్టి ధర్మాన్ని భావించక బాల్యంలో స్వల్పమైన దోషాన్ని చేసిన నాకు బ్రాహ్మణులకు యోగ్యం కాని కఠినమైన శిక్షను యిచ్చావు. కాబట్టి నీవు మానవలోకంలో శూద్ర వనితకు పుట్టుమని శాపం ఇవ్వటం చేత యముడు విదురుడై పుట్టాడు. 

8, ఫిబ్రవరి 2025, శనివారం

:: గోకర్ణక్షేత్రమహిమ ::  

     పూర్వం ఇక్ష్వాకు వంశంలో పరమ ధార్మికుడు, గొప్ప ధానుష్కుడు అయిన మిత్రసహ మహారాజు ఉండేవాడు. అతని భార్య పేరు మదయంతి. ఒకసారి ఆ మహారాజు సైన్యంతో కూడి దట్టమైన అడవిలోనికి వేటకు వెళ్ళాడు. జంతువులతోపాటు తనను సంహరించటానికి వస్తూన్న కమఠాసురుడనే దుష్టుని సంహరించాడు. ఆ దుష్టుని తమ్ముడు మహారాజుని మోసంతో జయించాలని నిశ్చయించుకొని మారువేషంతో వచ్చి రాజును ఆశ్రయించాడు. రాజు వానిని వంటశాలకు అధిపతిగా నియమించాడు. 

    ఒకరోజున మహారాజు తన తండ్రి మరణతిథి రోజున రాజగురువైన వశిష్టుని భోజనానికి ఆహ్వానించాడు. వచ్చిన వశిష్టునికి వంటవాని రూపంలో ఉన్న రాక్షసుడు కూరలో నరమాంసాన్ని కలిపి వడ్డించాడు. దానికి వశిష్టుడు కినిసి రాజును " నరమాంస భక్షుడవగు రాక్షసుడవుకమ్ము " అని శపించాడు. కాని జరిగిన దాంట్లో రాజుయొక్క తప్పిదం లేదని గ్రహించి శాపావధిని పన్నెండు సంవత్సరాలకు మాత్రమే కట్టడి చేశాడు. వశిష్టుని శాపానికి కుపితుడైన రాజు తిరిగి గురువును శపించటానికి ఉద్యుక్తుడయి శాపజలాన్ని అందుకోగా భార్య అయిన మదయంతి వారించింది. రాజు నిగ్రహించుకొని ఆ జలాన్ని తన పాదాలపై  జల్లుకోగా తక్షణం అవి నల్లగా అయ్యాయి. అప్పటినుండి ఆ మిత్రసహ మహారాజు కల్మాషపాదుడు అనే పేరుతో విఖ్యాతుడయ్యాడు. 

        గురువైన వశిష్ట మహర్షి శాపాన్ని అనుసరించి ఆ రాజు రాక్షస రూపాన్ని ధరించి అడవిలో జంతువులను, నరులను చంపి భక్షిస్తూ తిరుగుతూ, ఒక రోజున నూతన వధూవరులైన ఇద్దరు ముని దంపతులను . చూచాడు. చూచి యవ్వనంలో ఉన్న మునికుమారుని పట్టుకొన్నాడు రాక్షసుడు. అతని భార్య ఎంత బ్రతిమిలాడినా కించిత్తయినా కరుణ చూపక ఆ మునికుమారుని ఎముకలను మాత్రం మిగిల్చి తక్కిన మాంసాన్ని తినేసాడు రాక్షస రూపంలో ఉన్న రాజు. ఆ బ్రాహ్మణ స్త్రీ అస్థికలను పేర్చి చితిని ఏర్పాటుచేసికొని అందు అగ్నిప్రవేశం చేయబోతూ " యీ నాటి నుండి నువ్వు ఏ స్త్రీతో సంగమించినా వెంటనే నీకు మృత్యువు సంప్రాప్తిస్తుంది. నాకు భర్తృసుఖం లేకుండా చేసిన నీ కర్మకు ప్రతికర్మ రూపంగా లభించే ఫలాన్ని నీ వనుభవింపక తప్పదు. ఇది నా శాపం" అని  శపించి ఆ పతివ్రత అగ్నిప్రవేశం చేసింది. 

        రాజు శాపావధి పర్యంతము రాక్షస రూపంలో సంచరించి  అనంతరం తన నిజ రూపాన్ని పొంది రాజధానికి చేరుకున్నాడు. సంతానం లేని రాజు బ్రాహ్మణ యువతి శాపానికి భయపడి రాజ్యం ఉన్నా రాజ్యసుఖాలను అనుభవించలేక వైరాగ్యాన్ని ఆశ్రయించి వన సంచారానికి  వెళ్ళిపోయాడు. అతని వెనుకనే బ్రహ్మహత్యా దోషం భయపెడుతూ మహా దు:ఖాన్ని కలిగిస్తూ సంచరిస్తూ వచ్చింది. తద్దోష నివారణార్థం రాజు అనేక జపాలు, వ్రతాలు, యజ్ఞాలు చేయించాడు కాని అవన్నీ నిష్ఫలమయ్యాయి. ఒకరోజున మిథిలా నగర ప్రాంతంలో సంచరిస్తూండగా గౌతమ మహర్షి దర్శనమయింది. ఆయన ముందు తన దు:ఖాన్ని వెళ్ళబుచ్చుకున్నాడు రాజు. ఆయన కల్మాషపాదుని దుస్థితికి చింతించి గోకర్ణ క్షేత్ర మహిమను విపులంగా చెప్పి, వెళ్ళి అక్కడ శరణాగతిని పొందమన్నాడు. మహర్షి మాట చొప్పున రాజు అక్కడకు వెళ్ళి అక్కడి తీర్థాలలో  స్నాన మాచరించి, నియమ నిష్ఠలతో విధి విధానంగా మహాబలేశ్వరుని పూజించి బ్రహ్మహత్యా దోషంతోపాటు సకలమైన పాపాలనుండి విముక్తుడయి మరణానంతరం శివసాయుజ్యాన్నిపొందాడు. 

5, ఫిబ్రవరి 2025, బుధవారం

:: కండుమహర్షి ఉపాఖ్యానం :: 

    సర్వ శుభాలను ప్రసాదించే పురుషోత్తమ క్షేత్రంలో ఉన్న గోమతీనదీ తీరంలో పుణ్యాశ్రమం అనే గ్రామంలో కండుముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఎండాకాలంలో పంచాగ్నుల మధ్యలో నిలబడి, వర్షాకాలంలో తడుస్తూ, శీతాకాలంలో తడిబట్టలు కట్టుకుని  మహా కఠోరంగా దీర్ఘమైన తపస్సు కొనసాగించాడు. ఆయన తపోవేడికి ముల్లోకాలూ తలడిల్లిపోయాయి. ఇది గమనించిన ఇంద్రుడు ఎలాగైనా ఆయన తపస్సు భంగం చేయాలని భావించి , అందుకై ప్రమ్లోచ అనే అప్సరసను నియోగించి పంపాడు. రమణీయమైన పరిసరాలతో, పక్షుల కిలకిలా రావాలతో, చక్కటి సెలయేరులతో మనోహరంగా ఉన్న కండుముని ఆశ్రమ ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ అనుకూలమైన ఒక చోట కూర్చొని మధురంగా గానాలాపన చేయసాగింది. ప్రమ్లోచ మధుర గానానికి కండుముని మనస్సు చలించింది. నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. వెంటనే లేచి ఆ గానం వినిపించిన  దిశగా బయలుదేరి వచ్చి, అక్కడ దివ్య సౌందర్యంతో మెరిసిపోతున్న ప్రమ్లోచను చూచాడు. ఆమె అందానికి ఆశ్చర్యపోయాడు కండుముని. ఆమెతో సుందరీ! ఎవరు నీవు, నీ గానం నా మనసును దోచింది. నీ పేరేమిటో చెప్పు అని ప్రశ్నించాడు. నేనొక అనాథనని, తమరి సేవ చేయటానికై వచ్చానని, తమరి ఆశ్రమంలో కాస్త చోటు కల్పిస్తే, మీ ఆజ్ఞలను శిరసావహిస్తూ, మీ పాద దాసిగా ఉంటానంటూ కండుమునితో చెప్పింది ప్రమ్లోచ. ఆయన ఆమె విన్నపాన్ని మన్నించాడు. తన ఆశ్రమం లోనికి తీసుకువచ్చాడు. 

    ప్రమ్లోచతో ఆశ్రమం లోనికి అడుగుపెట్టిన కండుముని వెంటనే తన తపోశక్తితో నవయవ్వన పురుషుడిగా మారిపోయాడు. దివ్య సుందర రూపంతో ప్రకాశిస్తున్న కండుముని నూతన రూపం చూసి ప్రమ్లోచ ఆశ్చర్యపోయింది. ఇక ఆనాటి నుంచి కండుముని జపం, తపం, హోమం అన్నీ విడిచిపెట్టి, రాత్రనక, పగలనక ప్రమ్లోచతో సకల సుఖభోగాలు అనుభవించాడు. అలా వారిద్దరూ ఎన్నో సంవత్సరాలు సంభోగ సుఖాలలో మునిగిపోయారు. 

    ఒకనాడు కండుముని ఉదయాన్నే లేచి కుటీరం నుంచి బయటకు బయలుదేరాడు. ఆయన్ని చూసి, స్వామీ! ఎక్కడకు వెడుతున్నారని అడిగింది ప్రమ్లోచ. తెల్లవారింది. సంధ్య వార్చాలి కదా! అందుకే వెడుతున్నానని చెప్పాడాయన. ఆ మాటలు విని ప్రమ్లోచ ఒక్కసారి ఫక్కున నవ్వి ధర్మజ్ఞా! తమరి అనుష్ఠానం ఏనాడో గతించింది. ఇప్పుడేమిటి, కొత్తగా సంధ్యావిధి అంటున్నారని  పలికింది. ఆమె మాటలు విని ఆశ్చర్యపోతూ, ఏమిటి నువ్వంటున్నది? నిన్ననే కదా నీవు నాకు కనిపించింది. ఎందుకు పరాచికాలాడతావు? నిజం చెప్పు అని అడిగాడు. స్వామీ! నా మాటలు నిజమే. మీరు నేను కలసి సుఖభోగాలు అనుభవించి కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయాయి. సరిగ్గా చెప్పాలంటే, తొమ్మిది వందల సంవత్సరాల ఆరు మాసాల మూడు రోజులయినదని చెప్పింది ప్రమ్లోచ. 

    అది వినగానే కండుమునికి జ్ఞానోదయమయింది. తనెంత పొరపాటు చేసాడో అర్థమయింది. అయ్యో! నేనెంత మోహంలో పడిపోయాను. ఎంత ఘోరమైన అపచారాన్ని చేశాను. ఇన్ని సంవత్సరాలూ నేను చేసిన తపస్సంతా వ్యర్థమై పోయింది కదా!నా వివేకం ఏమయిపోయింది? కామ ప్రభావానికి నేనెలా లొంగిపోయాను. నేను చేసిన పుణ్య కర్మలన్నీ తుచ్ఛమైన కామం బారినపడి సర్వనాశనమై పోయాయే. ఇక ఇప్పుడేమి చేయాలి? నా గతి ఏమిటి? అని చింతించి, ఎదురుగా ఉన్న ప్రమ్లోచతో చీ! పాపాత్మురాలా! నీ వల్లనే నాకీదుర్గతి పట్టింది. తుచ్ఛుడైన ఆ ఇంద్రుడు పంపగా వచ్చి, నా తపస్సును భంగం చేసి, నన్ను సర్వభ్రష్ఠుణ్ణి చేశావు. తప్పో ఒప్పో ఇన్నాళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నిన్ను భస్మం చేయను. అయినా, ఇందులో నీ తప్పేముంది. నీ ప్రభువు చెప్పిన పని చేశావు, అంతే. నేనే ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోయి నీ వలలో చిక్కుకున్నాను. తప్పంతా నాదే. ఇక నీవిక్కడ ఉండ తగవు. నీ లోకానికి తిరిగి వెళ్ళిపో అని గర్జించాడు కండుముని. 

    తపోధనుడైన ఆయన మాటలు వినగానే వళ్ళంతా జలదరించి చెమటలు పట్టాయి ప్రమ్లోచకు. మరేమీ మాట్లాడకుండా అక్కడనుంచి బయలుదేరింది. ఆశ్రమం దాటి వనంలోకి వచ్చింది. తన వంటికి పట్టినచెమటను అక్కడున్న చెట్ల చిగుళ్ళతో తుడుచుకుంది. వెంటనే ఆమే శరీరం ఒక్కసారిగా పులకరించింది. ఆ చెమట బిందువులు గర్భాన్ని ధరించాయి. అది తెలియని ఆమె ఆకాశమార్గాన తన లోకానికి వెళ్ళిపోయింది. ఆ వనంలోని వృక్షాలు చెమట బిందువులలో ఉన్న గర్భాన్ని సంరక్షించాయి. దినదినాభివృద్ధి చెందిన ఆ గర్భంనుంచి మారిష అనే వనకన్య జన్మించింది. ఆమె కాలాంతరంలో ప్రాచేతసులకు భార్య అయింది. దక్షుడు ఆమెకు జన్మించిన పుత్రుడే. 

    కండుముని ప్రమ్లోచ వెళ్ళిపోగానే, ఎంతో పశ్చాత్తపపడి తను చేసిన పాపం నుండి విముక్తి పొందటానికి పురుషోత్తమ క్షేత్రానికి చేరుకుని, ఎలాంటి కోరికలూ లేకుండా, నిశ్చల చిత్తంతో, అహంకార మమకారాలని త్యజించి పురుషోత్తముణ్ణి ధ్యానిస్తూ, భక్తిప్రపత్తులతో ఆయన మహిమలను, లీలలను వేనోళ్ళ కీర్తిస్తూ చివరకు పునరుత్పత్తి రహితమైన ముక్తిని అందుకున్నాడు. 

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...