:: వాతాపినగరగాథ ::
విఘ్నేశ్వర శిల్పంలోని దేవతావిగ్రహాల గానానికి తన్మయుడైన అగస్త్యుడు " వాతాపి గణపతీ! నీ అద్భుతశిల్పాన్ని నీవే మలచుకొన్నావు. ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కడం ఎవరితరం? " అన్నాడు.
అప్పుడు విగ్రహంలోనుంచి " అగస్త్యమహర్షీ! నాకోసమని శిల్పం మలచుకోలేదు. నీ తృప్తికోసం నీ కోరిక నెరవేర్చాను. అంతే! అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది. అటుపిమ్మట అదృశ్యమవుతుంది. ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధయాగ సందర్భంలో, ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది " అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించాయి - అని ధౌమ్యుడు అర్జునిడితో చెప్పి, " అర్జునా! ఆ మహాశిల్పాన్నే మనం చూస్తున్నాం " అని ఆగాడు.
అర్జునుడు మహాశిల్పం చుట్టూరా పలుమార్లు ప్రదక్షిణలు చేసి, భక్తి శ్రద్ధలతో పరిశీలించాడు. మహాశిల్పం విఘ్నేశ్వరుడే! ఆ విఘ్నేశ్వరుడిని అంటిపెట్టుకొని త్రిమూర్తులు, జగదంబ, లక్ష్మీపార్వతీసరస్వతులు, నవగ్రహాలు మొదలుకొని అనేకమంది దేవతలు మనోహర శిల్పాలుగా మలచబడ్డారు. విఘ్నేశ్వరుని రెండు పాదాల ఇరుకున విఘ్నం బంధింపబడి ఉన్నది. ఎలుకరాజు తోక విగ్రహం చుట్టూరా వలయంచుట్టి ఉన్నది. శిల్పశోభ తిలకించడానికి వెయ్యి కళ్ళున్నా చాలవు అనిపిస్తున్నది. తనివితీరా చూశాక అర్జునుడు, ధౌమ్యుడుతో " ఆచార్యదేవా! ఇంతటి మహనీయ శిల్పం చుట్టూరా నెలకొన్న వాతాపినగరం మహోన్నతదశ అనుభవించి యిప్పుడెందుకిలా ఉంది? వాతాపినగర గాథ వినాలని కుతూహలపడుతున్నాను " అన్నాడు.
ధౌమ్యుడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు.
అగస్త్యుడు లోపాముద్ర ఆదేశానుసారం ఏమీ మిగుల్చుకోకుండా, ఉంచిన ధనాన్ని అందరికీ పంచేసి, ప్రజారాజ్య పాలనాబాధ్యతలను, పౌరధర్మాలను అనుసరిస్తూ సుఖజీవనం గడపండని ప్రజలకు చెప్పి, కట్టుబట్టలతో లోపాముద్రతో తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.
విఘ్నేశ్వర మహాశిల్పమే ప్రజారాజ్య మకుటంగా ఆరాధిస్తూ వాతాపినగర ప్రజలు చిరకాలం క్రమబద్ధంగా సుఖజీవనం చేశారు. తరాలు మారాయి. ఆదర్శరాజ్యంగా, ప్రజారాజ్య మార్గదర్శకంగా దినదిన ప్రవర్థమానమై విస్తరించిన వాతాపినగరం దేశదేశాంతరాల్లో పేరుపొందింది.
అగస్త్యుడు తనను కూడా హతమారుస్తాడనే ఛావు భయంతో పారిపోయి, వింధ్యాటవుల్లో ఊరూపేరూ లేని చీకటి బ్రతుకు బ్రతుకుతున్న ఇల్వలుడు వాతాపినగరం పేరు ప్రఖ్యాతులు విని, అగస్త్యుడు అక్కడ లేడని తెలుసుకున్న మీదట, నయవంచనతో సాధించాలనే తలంపుతో, ప్రజాసేవనే జీవిత పరమార్థంగా పెట్టుకొన్న వాడిలాగ రూపుమార్చుకొని, వాతాపినగర ప్రజలమధ్యకు చేరాడు. అప్పటి పరిస్థితి కూడా ఇల్వలుడికి అనుకూలంగా ఉంది.
క్రమక్రమంగా కాలమహిమవల్ల, వాతాపినగర ప్రజల్లో స్వార్థచింత అంకురించి పెరగసాగింది. కలిమిలేములు ప్రారంభమయ్యాయి. ప్రజల్లో భేదాభిప్రాయాలు, పొరపొచ్చాలు తలదాల్చాయి. తెలివితేటలు తెలివితక్కువ వారిని వంచించడానికి పనికివచ్చాయి.
అలాంటి పతనదశ ప్రారంభంలో, ఇల్వలుడు ఒక ప్రజానాయకుడిగా తయారై, ఇంద్రజాల విద్యలతో ఒక మహాపురుషుడుగా ప్రజలను ఆకట్టుకొన్నాడు.
నగర మధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పంమీద ప్రజలకు గురి ఉన్నంతకాలం అగస్త్యుణ్ణి, అగస్త్యుడు చెప్పిన నైతిక సూత్రాలను మరచిపోరనే విషయం గుర్తించాడు. తాంత్రికవిద్యలు, మద్యపానీయాలు ప్రజలకు రుచి చూపించాడు. అగస్త్యుడు నాటించిన ప్రజారాజ్య సూత్రాల శిలాఫలకాలను ఊడబెరికించి, క్రొత్త క్రొత్త సూత్రాలు నూరిపోశాడు. ఒకరినొకరు దోచుకోవడంలో ఉన్న ఆనంద విశేషాన్ని ప్రచారం చేశాడు. గిరిగీసుకుని కూర్చోవడం మనిషి లక్షణం కాదనీ, క్రొత్తక్రొత్త సుఖాలు తెలుసుకోవడానికే బ్రతకడం అనే సిద్ధాంతానికి ప్రజలను మళ్ళించాడు. ప్రచ్ఛన్న వేషాలతో చాలామంది రాక్షసులు ఇల్వలుడికి తోడైనారు. ప్రజాసేవకుడిగా అవతరించి, ప్రజానాయకుడిగా తయారైన ఇల్వలుడు మహానాయకుడై, ప్రజలపై అంకుశంగా మారాడు. అంత:కలహాలను రేపాడు. వాతాపినగరం కొట్లాటలతో నిండిపోయింది. దుర్మార్గులు అమాయకులను వేటాడుతున్నారు. నగరం అల్లకల్లోలమై పోయింది. చాలామంది ప్రజలు నగరం విడిచి వెళ్ళిపోయారు.
ఇల్వలుడు నగరమధ్యంలో ఉన్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని నేలమట్టం చేయాలని ప్రయత్నాలు ఆరంభించాడు. శతఘ్నులు చుట్టూరా గురిపెట్టించాడు. శిల్పంఅడుగు నేలలో ప్రేలుడుమందు దట్టింపించి, అగ్గిముట్టించటమే తరువాయిగా ఉన్న సమయంలో, అతివిచిత్రంగా అద్భుతం జరిగింది. నిప్పు తగిలించకుండానే మందుగుండు ప్రేలింది. శతఘ్ని శకటాలు అటునుంచి ఇటు వెనక్కు తిరిగి ప్రేలి గుండ్ల వర్షం కురిపించాయి. ఆ అగ్ని వర్షంలో దుర్మార్గులంతా మరణించారు. చాలామంది వికలాంగులయ్యారు. వారిలో ఇల్వలుడు కూడా ఒకడు. ఇల్వలుడి ఒక కాలు, ఒక చేయి పోయింది. రక్తసిక్తమైన దేహంతో నేలదొర్లుతూన్న సమయంలో, ఇల్వలుడికి విగ్రహంనుంచి మాటలు వినిపించాయి.
" ఓరీ! ఇల్వలా! అంగవైకల్యంతో, ముసలితనంతో చివికి చివికి కుళ్ళుతూ చిరకాలం జీవించు. నీకు అదే సరియైన శిక్ష " అని విఘ్నేశ్వరుడు శపించాడు.
వాతాపినగరం క్రమంగా తన పూర్వవైభవాన్ని కోల్పోయి, కొద్దిమంది మనుష్యులతో మాత్రమే ఇప్పుడిలా బీడుపడిపోయింది " అని ధౌమ్యుడు చెప్పడం ముగించాడు.
అర్జునుడు అంతావిని అటుతిరిగి చూసి, ఆశ్చర్యంతో నోట మాటరాక అలా ఉండిపోయాడు. విఘ్నేశ్వర మహాశిల్పం కనిపించలేదు.
" అర్జునా! ఆశ్చర్యపడకు. మహాశిల్పం అదృశ్యమై పోతుందని యిదివరకే వింటివి కదా! " అని ధౌమ్యుడు అంటూండగా ఆ చుట్టుప్రక్కల ఉన్న ఒక ముళ్ళపొదలో, ఒక పండుముసలి వికృతరూపుడు ఒకచేయి, ఒక కాలుతో శరీరాన్ని యీడ్చుకొనివస్తూ కెవ్వున అరచి మహాశిల్పం ఉండినవేపు చేతులుచాచి జోడించి గిలగిల లాడుతూ చనిపోయాడు.
అర్జునుడు అదిచూసి ఆశ్చర్యపోతూ, " గురుదేవా! వాడేకదా ఇల్వలుడు " అన్నాడు.
ధౌమ్యుడు " ఔను. ఎప్పటికైనా దుర్మార్గులు అలాగే నశిస్తారు " అన్నాడు.
వార్తాహరులచేత వాతాపినగరానికి బయలుదేరి రమ్మని అర్జునుడు ధర్మరాజుకు కబురు పంపాడు.
హస్తినాపురం నుండి ధర్మరాజు భీమ, నకుల, సహదేవులతో వాతాపి నగరానికి వచ్చాడు.
ఆరాత్రి ధర్మరాజు విఘ్నేశ్వర మహాశిల్పం అంతర్థానమైన ప్రదేశానికి ఎదురుగా కూర్చొని " నా తమ్ముడు నీ మహాశిల్పం దర్శించాడు. దేవా! నాకూ ఆ భాగ్యం కలిగించవా? నీ మహనీయ శిల్పాన్ని ఎవరు చెక్కుతారు? సత్వరమే నీ విగ్రహ ప్రతిష్ఠ జరిపించే మహాభాగ్యాన్ని నాకు కల్పించు " అని కన్నులుమూసి విఘ్నేశ్వరుని ధ్యానిస్తూ వేడుకొన్నాడు.
అప్పుడు అతని చెవుల్లో " ధర్మజా! దేవశిల్పి విశ్వకర్మ, దానవశిల్పి మయుడు కలసి శిల్పులుగా వచ్చి విగ్రహాన్ని చెక్కుతారు. విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే యాగాశ్వం కదలి వెడుతుంది. నీ అశ్వమేధయాగం జయప్రదంగా జరుగుతుంది. వాతాపి నగరాన్ని పునరుద్ధరణ చెయ్యి. మీ పాండవ సంతతివారైన చంద్రవంశరాజులు చిరకాలం ఈ నగరాన్ని పాలిస్తారు " అనే వాక్కులు వినిపించాయి.
ధర్మరాజు కళ్ళు తెరచేసరికి ఎదురుగా మహోన్నతంగా విఘ్నేశ్వర మహాశిల్పం దేదీప్యమానంగా కనిపించి అంతర్థానమయింది.
మరునాటి ఉదయం ఒక తెల్లనివాడు, ఒక నల్లనివాడు ఆ దరిదాపుల్లో పొదలమధ్య ఉన్న పెద్ద స్ఫటికశిలను పరిక్షిస్తూ కనిపించారు. వారెవరైనదీ గ్రహించి ధర్మరాజు వారికి మ్రొక్కి మర్యాదలు జరిపాడు.
ఆ శిలను పెకలించడానికి తవ్వుతున్నప్పుడు, అక్కడ గొప్ప నిధి దొరికింది. ఆ బంగారాన్ని ఇల్వలుడు నిక్షిప్తపరిచాడు. ఆచోటు వదల్లేక చివికి చివికి వాడు చివరకు మరణం పాలయింది కూడా అక్కడే.
ధర్మరాజు ఆ నిధిని వాతాపినగర అభివృద్ధికి వినియోగించాడు.
ఇద్దరు మహాశిల్పుల చేతులమీదుగా విఘ్నేశ్వరుని విగ్రహం, మహాశిల్పం అదృశ్యమైన చోటనే గొప్ప ఆలయం, పెద్ద మంటపం తయారయినాయి. విశ్వకర్మ మయుల శిల్పరీతుల అద్భుత సమ్మెళనంతో ఒక గొప్ప శిల్ప సాంప్రదాయానికి నాంది అయింది. భరతవంశం వారిచే నెలకొల్పబడి నందువల్ల అది భారతీయ శిల్పంగా పేరొంది, కాలాల తరబడి గొప్ప ప్రఖ్యాతి పొంది చిరస్థాయిగా వర్ద్ధిల్లింది.
ఆ విధంగా, విఘ్నేశ్వరశిల్పం పూర్తిచేసి శిల్పులిద్దరూ ఎలాగ వచ్చారో అలాగే మాయమయ్యారు.
ఆలయంలో ధర్మరాజుచే విఘ్నేశ్వర విగ్రహ ప్రతిష్ఠ జరిగిన వెంటనే గుర్రం దౌడుతీసి పరుగెత్తింది. అర్జునుడు, భీముడు సైన్య సమేతంగా దాని వెనుక బయలుదేరారు.
ధర్మరాజు అగస్త్యుడు ఏర్పరచిన ప్రజారాజ్య పద్ధతులతో వాతాపినగర పాలన సాగేలా పాలనా దక్షత ఏర్పాటుచేసి, తరువాత నకుల సహదేవులతో హస్తినాపురానికి తిరిగి వెళ్ళాడు.
ప్రజారాజ్య పర్యాయపదంగా ఆ ప్రాంతం అగస్త్యరాజ్యమనీ, నగరం అగస్త్యనగరమనీ కొంతకాలం పేర్కొనబడినవి. కాలక్రమేణా, వాతాపినగరమనే పేరే స్థిరంగా నిలిచిపోయింది.
అర్జునుడు దిగ్విజయాన్ని ముగించుకొని గుర్రంతో హస్తినాపురం చేరాడు. అశ్వమేధయాగం జరిగింది. ధర్మరాజు యాగభాగాలను విశ్వకర్మకు, మయుడికి ప్రత్యేకంగా అర్పించాడు. శిల్పులకు, శిల్పానికి గౌరవ ప్రపత్తులు చేకూర్చాడు.
ధర్మరాజు తరువాత పరీక్షిత్తు, పరీక్షిత్తు తరువాత జనమేజయుడు పాలించారు. జనమేజయుని సంతతివారైన రాజులు వాతాపి నగరాన్ని పాలించసాగారు.
వాతాపి నగరాన్ని పాలించిన చంద్రవంశ రాజులలో శత్రుంజయుడు గొప్ప సామ్రాజ్యపిపాసి. వాతాపినగరం రాజధానిగా వాతాపి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. సైన్యాలను పెంచడానికి ప్రజలమీద విపరీతంగా పన్నులు వేశాడు. నిరంకుశపాలన సాగిస్తూ, ఇల్వలుడు మళ్ళీపుట్టాడు అని అనిపించుకున్నాడు.
అతని కుమారుల్లో కడపటి వాడైన చళుకవర్మ చాలా మంచివాడు. అగస్త్యుడి ప్రజారాజ్య సూత్రాలపై గురికలవాడు. విఘ్నేశ్వరుణ్ణి భక్తితో ఆరాధిస్తూ, విద్యపట్ల, కళలపట్ల ఆసక్తితో ఉండేవాడు. అగస్త్యుడి అంశ అతనిలో ఉన్నదని ప్రజలు అనుకునే విధంగా ప్రజాభిమానాన్ని సంపాదించాడు.
సామ్రాజ్య విస్తరణకు శత్రుంజయుడు కుమారులను ఆయత్తం కమ్మన్నాడు. చళకుడు తండ్రితో " జనహింస, పరపీడనతో కూడిన సామ్రాజ్య విస్తరణ, కసాయి వృత్తికంటే ఏం గొప్ప? " అని అన్నలతో కలిసి దండయాత్రకు వెళ్ళడం మానేసాడు.
శత్రుంజయుడు మండిపడుతూ " ఔరా! సింహం కడుపున ఎలుక పుట్టినట్లు రాజవంశంలో తప్పపుట్టావు. నీకు తగిన శాస్తి జరగాలి " అని అంటూ ఒక ఎలుకను పట్టి తెప్పించి, దానికి చుళుక అని పేరుపెట్టి దానితో చళుకవర్మకు పెళ్ళి అని చాటించాడు.
చుళుక అసలుపేరు కళ్యాణకింకిణి. ఒక అప్సరస. ఇంద్రుడి శాపంవల్ల ఎలుకగా భూమిమీద పడింది.
కళ్యాణ వేదికపై ఉన్న పెళ్ళిపీటలపై, రాకుమారుణ్ణి ఎలుకను చూసి, వచ్చేవారు చేసే కోలాహల పరిహాసానికి చళుకుడు సిగ్గుతో క్రుంగిపోవాలని శత్రుంజయుడు, ఆ విచిత్ర వివాహానికి రాజులనూ, ప్రజలను ఆహ్వానించాడు. కాని చళుకవర్మ మందహాసంతో " ఎలుకను మహారాజు కోడలుగా చేయించగల విఘ్నేశ్వరుడు, ఎలుకను చిలుకల కొలికిగా చేసినా చేయవచ్చు - అని మీరంతా నమ్మకపోవచ్చును గాని, నేను నమ్మగలను అన్నాడు.
( సశేషం. ఆసక్తికరమైన ఈ కథాభాగం వచ్చే వారం. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! )