గోకులంలో వేడుకలు - యోగమాయ హెచ్చరిక
శ్రీకృష్ణావతారం భారతీయ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం. లోక కళ్యాణార్థం, ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు అవతరించిన దివ్య ఘట్టమిది. కంసుని చెరసాలలో దేవకీవసుదేవులకు జన్మించిన శ్రీకృష్ణుడిని, వసుదేవుడు అర్ధరాత్రి వేళ యమునను దాటించి, గోకులంలోని నందగోపుని ఇంట చేర్చాడు. యశోదమ్మ ప్రసవించిన ఆడపిల్లను తీసుకుని తిరిగి చెరసాలకు చేరుకున్నాడు. గోకులంలో నందనందనుడి జననం, ఆ ఆనందోత్సాహాలు ఒకవైపు, చెరసాలలో యోగమాయ కంసుడిని హెచ్చరించిన తీరు మరోవైపు, భాగవతంలోని అత్యంత అద్భుత ఘట్టాలు.
నందగోపుడు తెల్లవారుజామునే నిద్రలేచి, యశోదకు మగబిడ్డ జన్మించాడనే శుభవార్తను విన్నాడు. ఆ వార్త వినగానే ఆయన ఆనందానికి అవధులు లేవు. ఉదయమే లేచి నదిలో స్నానం చేసి, తన శరీరమంతా సువర్ణాభరణాలను ధరించాడు. వేద పండితులను, బ్రాహ్మణులను పిలిపించి వారికి నమస్కరించాడు. వారికి అపారమైన ధనాన్ని, వస్త్రాలను సమర్పించి సత్కరించాడు. ఈ పుణ్య ఘట్టానికి ప్రతీకగా లక్షలాది గోవులను దానం చేశాడు. ఆ గోవుల కొమ్ములకు బంగారు తొడుగులు, గిట్టలకు వెండి ఆభరణాలు, శరీరంపై పట్టు వస్త్రాలు కప్పి, ఎంతో వైభవంగా దాన కార్యక్రమాన్ని నిర్వహించాడు. నందుని ఈ వ్యవహారం ఆయనలోని దాతృత్వాన్ని, దైవ భక్తిని చాటుతుంది.
నందనందనుడి రాకతో గోకులం మొత్తం ఒక వైకుంఠంలా మారింది. నందగోకులంలో ఉన్న గోపికలు, గోపాలురు ఈ వేడుకల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. గోకులమంతా పండుగ వాతావరణం నెలకొంది. నందగోపునికి కుమారుడు జన్మించాడనే వార్త గోకులమంతా అడవి గాలిలా వ్యాపించింది.
ఆ సందర్భాన్ని వర్ణించే పద్యం:
ఏమి నోముఫలమొ యంత ప్రొద్దొక వార్త
వింటి మబలలార! వీనులలర
మన యశోద చిన్ని మగవాని గనెనట
చూచివత్తమమ్మ! సుదతులార!
"ఓ సుదతులారా! మనం ఎటువంటి నోములు నోచుకున్నామో కానీ, ఈ రోజు మన చెవులకు ఎంతో ఆనందాన్నిచ్చే వార్త విన్నాం. మన యశోదమ్మ ఒక చిన్న మగబిడ్డను కన్నదట. పదండి, వెళ్లి ఆ చిన్ని కృష్ణుడిని చూసి వద్దాం."
గోపికలు పసుపు, కుంకుమలతో అలంకరించుకుని, కొత్త వస్త్రాలు ధరించి నందనందనుడిని చూడటానికి పరుగులు తీశారు. తమ చేతులతో వెన్న, పాలు, పెరుగు, నూనెలు తీసుకువచ్చి యశోదమ్మకు సమర్పించి, కృష్ణుడికి ఆశీస్సులు అందించారు. వీధి వీధినా మంగళ వాద్యాలు, వేణునాదాలు, భజనలు మార్మోగాయి. గోపాలురు ఆనందంతో ఒకరిపై ఒకరు పాలు, పెరుగు చల్లుకుంటూ నృత్యాలు చేశారు, పాటలు పాడారు.
యశోదమ్మ తన బిడ్డను ఎంతో ప్రేమగా లాలిస్తూ, ఆనందంతో జోలపాటలు పాడింది,
జోజో కమలదళేక్షణ!
జోజో మృగరాజమధ్య! జోజో కృష్ణా!
జోజో పల్లవకర పద!
జోజో పూర్ణేదువదన! జోజోయనుచున్
కమలముల వంటి కన్నులు గలవాడా! సింహం వంటి నడుము గలవాడా! కృష్ణా! చిగురుటాకుల వంటి చేతులు, పాదాలు గలవాడా! పూర్ణ చంద్రుని వంటి ముఖము గలవాడా! అంటూ యశోదమ్మ బాలుడిని ఎంతో ప్రేమగా లాలిస్తూ జోలపాటలు పాడింది.
నందగోకులంలో పెరిగిన శ్రీకృష్ణుని లీలలు సామాన్యుల ఊహకు కూడా అందనివి. ఆ పరమాత్మ గోపాలుని ఇంట జన్మించడం వెనుక ఉన్న గొప్పదనాన్నిపోతన కవీంద్రులు ఈ రకంగా చెప్పారు.
ఏబాము లెఱుగక యేపారుగట్టికి బసులకాపరియింట బాము కలిగె,
నేకర్మములు లేక యెనయునెక్కటికిని జాతకర్మంబులుసంభవించె,
నేతల్లి చనుబాలు నెరుగనిప్రోడ యశోదచన్నులపాలచొరవ యెఱిగె,
నేహాని వృద్ధులు నెరుగని బ్రహ్మంబు పొదిగిటిలో వృద్ధిబొందజొచ్చె,
ఆ. నే తపములనైన నెలమి బండని పంట,
వల్లవీ జనముల వాడబండె,
నే చదువులనైన మిట్టిట్టిదనరాని,
యర్థమవయవముల నందమొందె
లోకానికి ఎటువంటి బాములు (కష్టాలు) తెలియనివాడైన ఆ భగవానుడు, గోవులను కాచే నందగోపుని ఇంట్లో జన్మించి, సంపదను కలిగించాడు.ఎలాంటి పాప-పుణ్య కర్మలకు అతీతుడైన ఆ పరమాత్మకు, సాధారణ మానవుడిలాగే జాతకర్మలు (పుట్టుకతో చేసే సంస్కారాలు) జరిగాయి. ఏ తల్లి చనుబాలు ఎరుగని జ్ఞానస్వరూపుడైన ఆ శ్రీకృష్ణుడు, యశోదమ్మ చనుబాలు తాగే బాలునిగా మారిపోయాడు.చావు, పుట్టుకలు (హాని వృద్ధులు) లేని, సర్వవ్యాపి అయిన ఆ బ్రహ్మము (దేవుడు), ఒక సాధారణ ఇంటి వాతావరణంలో పెరిగి పెద్దవాడు కావడం మొదలుపెట్టాడు.ఎన్నో ఘోర తపస్సుల వల్ల కూడా సాధించలేని ఆ భగవంతుని దివ్య రూపం, సాధారణ గోపికలు ఉండే ఆ గోకులంలో సులభంగా దర్శనమిచ్చింది. ఎలాంటి చదువులకూ అంతుచిక్కని ఆ పరమ సత్యం, అందమైన అవయవాలు గల బాలుడిగా ఆ గోకులంలో వెలుగొందింది.
ఇక్కడ కథ మరో మలుపు తిరుగుతుంది. వసుదేవుడు గోకులంలో కృష్ణుడిని ఉంచి, యశోదమ్మ ప్రసవించిన ఆడపిల్లను తీసుకుని చెరసాలకు తిరిగి వచ్చాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న కంసుడు చెరసాలకు వెళ్లి, ఆ శిశువును నేలకేసి కొట్టబోయాడు. అప్పుడు ఆ శిశువు కంసుని చేతుల్లో నుంచి విడివడి, ఆకాశంలోకి ఎగిరి ఎనిమిది చేతుల దివ్య స్వరూపాన్ని (యోగమాయ) ధరించి కంసుడితో, "ఓరీ కంసా! నిన్ను చంపబోయేవాడు ఇప్పటికే పుట్టి, వేరే చోట సురక్షితంగా ఉన్నాడు. నీ ప్రయత్నాలు వ్యర్థమవుతాయి" అని హెచ్చరించింది. ఈ సంఘటన కంసుడిలో తీవ్ర భయాన్ని, ఆందోళనను కలిగించింది. తన మరణం తప్పదని గ్రహించిన కంసుడు, భయపడి దేవకీవసుదేవులను బంధవిముక్తులను చేశాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి