:: సువర్ణ మృగం :: -
నేటి సమాజమందు బహుళ ప్రచారమందున్న నానుడులలో " సువర్ణ మృగం " ఒకటి. ఈ నానుడిని పరిశీలించినప్పుడు శ్రీరామాయణమందలి సీతారాముల అరణ్యవాస ఘట్టమందలి ఆశ్చర్యకరమైన ప్రధాన అంశం గుర్తుకు వస్తుంది. సీతశ్రమ సమీపమందు అపహరించదలచిన రావణాసురుడు పన్నిన పథక ప్రకారము మారీచుడు బంగారు రంగుగల జింకగా మారి శ్రీరామాశ్రమ సమీపమందు తచ్చాడడము, దానిని ఆశ్చర్యముతో తిలకించిన సీతాదేవి తనకు ఆ బంగారు జింక కావలయునని శ్రీరాముని అర్థించడము, అందుకు సరేనన్న రాముడు ఆ జింకను పట్టి తెచ్చుటకు దానిని వెంబడించుచు అడవిలోనికి దారితీయడము, తనకు చిక్కక తప్పించుకు తిరుగుతూ విసిగిస్తున్న ఆ జింకపై రాముడు బాణప్రయోగము జరపడము, అప్పుడు నిజరూపమును ధరించి చనిపోతూ మారీచుడు శ్రీరాముని గొంతుననుకరించుతూ, " హా!సీతా!, హా! లక్ష్మణా! " అని బిగ్గరగా కేక పెట్టడము, ఆ కేకవిన్న సీత రామునకు ఆపద సంభవించినదని భయపడి, వెటనే చెబుతున్నది ఏ మాత్రమూ వినక లక్ష్మణుని చూడరమ్మని పంపి, తాను సన్యాసి వేషములో వచ్చిన కపట రావణిని చెతిళొ అపహరణకు గురి కావడము మనమెరిగినదే! ఈరీతిగా ఒక మాయా సువర్ణ మృగము సీతాపహరణమునకు తద్వారా మహా సంగ్రామమునకు కారణమగుటయు గమనించి యున్నాము.
ఈ విధముగా శ్రీరామాయణమునుండి ప్రభవించిన ఈ " సువర్ణ మృగము " అనెడి ప్రయోగము, పైకి అత్యంత సుందరముగా గోచరమవుతూ, అంతర్గతముగా మోసమునకు లేదా ఆపదకు దారితీసే సంఘటనకు ప్రతీకగా మారినది. కేవలము బాహ్య సౌందర్యమునకు, ఆకర్షణీయమైన ఆకారమునకు ప్రాధాన్యతనిస్తూ, దాని వెనుకనున్న కుట్ర, కుతంత్రములను గూర్చి తలంచక పోవుట వల ఎంతటి ప్రమాదకరమైన పరిణామములు సంభవించునన్నది ఈ నానుడి నిరూపించుచున్నది. సాక్షాత్తు సీతా రాముల వంటి వారే ఆ మాయా మృగపు మాయలో చిక్కినారన్న, సామాన్యులమైన మన పై అసత్య ఆకర్షణల ప్రభావము ఎంతగా నుండునో ఊహించవచ్చు.
నేటి సమాజమందునను, అత్యాశను ప్రేరేపించు పథకములు, అసాధ్యమైన లాభములను ఎరచూపుతూ మోసగించు ప్రయత్నముల, ఆకర్షణీయముగా కనబడు కపట వ్యవహారములు అనేకముగా దృశ్యమవుతున్నవి. వివేకవంతులమైన మనము అట్టి బాహ్య ఆకర్షణలకు లోబడక, విషయమును ఆసాంతము పరిశీలించి నిర్ణయము తీసుకొనవలసిన అవసరమున్నది.
" సువర్ణ నృగము " అనునది రామాయణములోని ఒక కథాభాగమును గుర్తుచేయునట్టి ప్రయోగము మాత్రమే గాక, మనిషి ప్రలోభములకు లోనవక వివేచనతో మెలగవలయు ననెడి హెచ్చరికనొసగునట్టి జీవనసందేశమై యున్నది. ఆకర్షణీయమైన ప్రతి ఒక్కటియు ప్రయోజనకరమైనదిగా ఉండదు. మెరుపుల వెనుక మాయ దాగి యుండవచ్చును. కల్ల పసిడికి కాంతి మెండుగా ఉంటుంది. ఆశకు వివేకమును జోడించి, ఆలోచనకు ప్రాథాన్యతనిచ్చి ముందడుగు వేయుమని చెప్పునదియే ఈ నానుడి మనకు అందించు శుభ సందేశము.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి