27, అక్టోబర్ 2026, మంగళవారం

 :: సీతాపహరణం ::

     - శ్రీరామాయణ కథనందు అత్యంత విషాదకరమైన కీలకాంశము " సీతాపహరణం ". ఈ జాతీయమును వినిన తోడనే మనకు రావణాసురుడు మాయా సన్యాసి వేషములో వచ్చి సీతామహాదేవిని అపహరించి లంకకు తీసుకువెళ్ళిన విషయము జ్ఞప్తికి వస్తుంది. ఒక వ్యక్తిని కుట్రపూరితముగా అతనికి చెందిన వారినుండి దూరము చేయుటను, ఒకరి చెంతనున్న విలువైన వస్తువును మోసముచేసి దొంగిలించుట వంటి సందర్భములందు ఈ " సీతాపహరణం " అన్న పదప్రయోగాన్ని నానుడిగా చెబుతూండడము జరుగుతుంది. 

     అరణ్యవాసం నిర్వహిస్తున్న సీతారామలక్ష్మణులు దండకారణయంలోని పర్ణశాలయందు ప్రశాంతముగా నివశిస్తున్న సమయమందు జరిగిన సంఘటన యిది. రావణాసురుని పథకము ప్రకారము మారీచుడు స్వర్ణజింకగా అవతరించి, సీతాదేవిని ఆకర్షితురాలుగా చేయుట, ఆ తదుపరి సీత కోరిక మేర రాముడు ఆ మాయా స్వర్ణజింకను పట్టి తెచ్చుటకు అరణ్యమున కేగి, ఎంతకూ చిక్కని ఆ జింకపై కోపగించి బాణ ప్రయోగము జరుపుట, చనిపోతున్న జింక రూపంలోని మారీచుడు " హా! సీతా!, హా! లక్ష్మణా! " అని రాముని స్వరముతో కేకలు పెట్టుట, ఆ కేకలు వినిన సీత భయము చెంది లక్ష్మణుని వెంటనే రాని చెంతకు వెళ్ళిరమ్మనుట, వెళ్ళుటకు ముందు లక్ష్మణుడు ఆశ్రమం చుట్టూ గీతగీసి, గీత దాటి బయటకు వెళ్ళవద్దని మనవి చేసి అడవికరగుట,, అదే సమయమని యెంచి, కపట సన్యాసి వేషములో రావణుడు వచ్చి సీతను లక్ష్మణుడు గీసిన గీతను దాటి వెలుపలకు రప్పించి, ఆ పిమ్మట ఆమెను అపహరించి లంకకరుగుట మనకు సంక్షిప్తంగా తెలిసిన కథ. /

     సీతాపహరణ మన్నది ఒక స్త్రీని అపహరించిన సంఘటన మాత్రమే కాదు, పరస్త్రీ వ్యామోహమునకు, అత్యాశకు, అధికార గర్వమునకు, అధర్మ ప్రవృత్తి కలిగించే అనర్థములకు గూడా అది ప్రతీక.  

    మాయా మృగమును చూసి ఆకర్షితులమయినప్పుడు మనకు గల రక్షణ నుండి లభిస్తున్న ప్రశాంతతను కోల్పోవుదమని ఈ సంఘటన తెలియ బరుస్తుంది. సమాజము గీసిన లక్ష్మణ రేఖవంటి నైతిక హద్దులను దాటితే ఆపదలు సంభవించునన్న సత్యము బోధకమవుతుంది. రావణుడు మహా జ్ఞాని, శివభక్తుడు, మహాబలశాలి అయినప్పటికీ మోహమును, అత్యాశను అదుపులో పెట్టుకోలేక సర్వనాశనమయ్యాడు. పరుల స్వేచ్ఛ స్వాతంత్య్రములను హరించినప్పుడు ఎంతటి వినాశన ముద్భవించునో నన్నది ఈ ఘట్టం స్పష్టపరుస్తున్నది. నేటి సమాజమందు కూడా మోసపూరితమైన వాక్కులతో ఒకనిని వాని కుటుంబమునుండి వేరుచేయడము, ఇతరుల హక్కులను అన్యాయముగా స్వాధీన పరచుకోవడము వంటి సందర్భములందు " సీతాపహరణం " ప్రయోగమును అన్వయించవచ్చు. అయితే " సీతాపహరణం " అనేది ప్రధానంగా రామాయణ ఘట్టాన్ని సూచించే ప్రయోగం కాబట్టి ప్రతి సాధారణ అపహరణ సందర్భానికి దీనిని స్థిరమైన నానుడిగా వాడకూడదు. 

     " సీతాపహరణం " ఘట్టం మనకు ఒక శాశ్వత సందేశమును అందిస్తున్నది. పరుల సొత్తుపట్ల ఆశకూడదు. పరుల స్వేచ్ఛను భంగపరచరాదు. కామక్రోధాదులకు వశమై అధర్మ మార్గమందు పయనించరాదు. ధర్మము నతిక్రమించిన వాడు ఎంతటి శక్తి సంపన్నుడయినను చివరకు పతనం కాక తప్పదని రావణుని చరిత్ర నిరూపిస్తున్నది. అందువలన " సీతాపహరణం " ఘట్టం అధర్మ ప్రవృత్తియొక్క భయంకర పరిణామములను బోధించు ఒక ప్రధానమైన మానవతా పాఠముగా చిరస్మరణీయమై యున్నది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

:: జరాసంధుని దండయాత్ర - మధుర రక్షణ ::       శ్రీకృష్ణ లీలలలో అత్యంత ప్రాముఖ్యమైనది, సాహసోపేతమైనది జరాసంధుడి దండయాత్రల వృత్తాంతం మరియు మధుర ...