28, మార్చి 2023, మంగళవారం

 చరణ శరణాగతి తత్వం  - ఒక కథ

అది అడవి.  మేకలు, గొర్రెలు మేతకు వెళ్ళాయి. ఒక మేక మేత మేస్తూ ఒక తీగలో చిక్కుకుంది.  దాని లోంచి బయట పడలేకపోయింది.  చీకటి పడింది.  అన్ని మేకలూ తలోదిక్కూ వెళ్ళిపోయాయి.  ఈ మేక చిన్నగా తీగలోంచి బయటపడింది. చిన్నగా అటూ ఇటూ తిరిగి ఒక సరస్సు ఒడ్డుకు చేరింది.  చాలా భయపడుతోంది.  అనాథ అయింది.  దానికి అక్కడ తడి మట్టిపై, సింహపు కాలిముద్ర కన్పించింది.  దాన్ని పట్టుకుని కూర్చుంది.  దాన్నే శరణువేడుకుంటోంది. (చరణ శరణాగతి)


ఇంతలో నక్కలు, తోడేళ్ళూ తినడానికి ముందుకు vachchaayi.  వాటితో మేక " నేను ఎవరిని శరణు పోందానో చూడండి... తరువాత నన్ను తినండి " అన్నది.  అవి సింహం కాలిగుర్తు బాగా చూసాయి.  ' దీని వెనుక రక్షగా సింహం ఉంది.  అమ్మబాబోయ్' అని పారిపోయాయి. 


చివరిగా ఈ కాలిగుర్తుగల సింహమే వచ్చి, తినబోయింది.  ఒంటరిగా ఏం చేస్తున్నావని మేకను అడిగింది.  " నా ప్రభువును ధ్యానిస్తున్నా, ఈ ముద్ర చూడు.  వీరు నా ప్రభువు.  వీరి శరణు జొచ్చాను, చూడు  " అంది.  సింహం ఆ గుర్తును చూసి, ఆ కాలి గుర్తు తనదేనని, తనను శరణుజొచ్చిందని తలచి, " నీవిక నిర్భయంగా ఉండు " అని అభయమిచ్చింది. 


ఆ ప్రాంతానికి ఏనుగు వస్తే, సింహం పిలిచింది... " రోజూ ఈ మేకను వీపుపై ఎక్కించుకుని అడవికి తీసికెళ్ళు.  మేపుకొని రా " అని ఆదేశించింది.  ఏనుగు అలాగే చేసింది.  " చరణ శరణాగతి పొందిన మేక జీవితం ఆనందంగా గడిచింది.  ఇది చరణ శరణాగతితత్వం అంటే.  కనుక ఏకాగ్ర చిత్తంతో భగవంతుని పాదపద్మాలపై మనస్సు లగ్నం చేస్తే, మోక్షం లభిస్తుంది.  ఇదే చరణ శరణాగతి.

26, మార్చి 2023, ఆదివారం

 తెలుగుమాసాలు - విలాసాలు:

పౌర్ణమి నాటి నక్షత్ర నామమే మాస నామము 

1. చిత్తా నక్షత్ర యుక్త పౌర్ణమి                                        ..                చైత్రమాసం 

2. విశాఖా నక్షత్ర యుక్త పౌర్ణమి                                    ..                 వైశాఖమాసం 

3. జ్యేష్టా నక్షత్ర యుక్త పౌర్ణమి                                      ..                 జ్యేష్టమాసం 

4. ఉత్తరాషాఢా నక్షత్ర యుక్త పౌర్ణమి                           ..                 ఆషాఢమాసం 

5. శ్రవణా నక్షత్ర యుక్త పౌర్ణమి                                    ..                 శ్రావణమాసం 

6. పూర్వాభాద్రా నక్షత్ర యుక్త పౌర్ణమి                         ..                  భాద్రపదమాసం 

7. అశ్వనీ నక్షత్ర యుక్త పౌర్ణమి                                   ..                  ఆశ్వయుజమాసం 

8. కృత్తికా నక్షత్ర యుక్త పౌర్ణమి                                   ..                   కార్తీకమాసం 

9. మృగశిరా నక్షత్ర యుక్త పౌర్ణమి                              ..                   మార్గశిరమాసం 

10.పుష్యమీ నక్షత్ర  పౌర్ణమి                                         ..                    పుష్యమాసం 

11.మఖా నక్షత్ర యుక్త పౌర్ణమి                                   ..                    మాఘమాసం 

12.పూర్వఫలుణీ నక్షత్ర యుక్త పౌర్ణమి                     ..                     ఫాల్గుణమాసం 

13, మార్చి 2023, సోమవారం

 అష్టవిధనాయికలు: 

(6). కలహాంతరిత

ఉ.   కోపకషాయితాక్షి యగు కోమలి మూర్ఖత ప్రాణనాథునిన్ 

        ప్రోపరియైన వాని తన పొత్తును కోరెడువాని ధూర్తయై 

         దాపట నిల్పగా పరులు తామసమున్ నిరసించు బిట్టు సం 

         తాపము చెందు నాతియె కదా కలహాంతరితాఖ్యయౌ దగున్. 

(7). ప్రోషితభర్తృక

ఉ.    కాంతుడు దూరదేశమున కార్యభరంబున గల్గు నొత్తిడిన్ 

         సుంతయు పత్నిపై మనసు జూపక నింటికిరాని హేతువై 

         యింతికి నెంతయున్ దిగులె యేర్పడి యాతనికై తపించుచున్ 

         పొంతయు గోరు భామినిని ప్రోషితభర్తృక యండ్రు ధారుణిన్. 

(8). అభిసారిక 

ఉ.    ప్రేమకు లొంగి చంద్రముఖి ప్రేయము శ్రేయము నుజ్జగించుచున్ 

          నేమము లేని శీలమున నెమ్మది ప్రేమికుడెన్ను తావుకున్ 

          కామినియై రహస్యముగ గమ్యము జేరునె వారి నెంచకే 

          ధామము వీడిపోవు వనితన్ అభిసారిక యందు రెల్లరున్. 

                                                                 రచన: క్రొవ్విడి వేంకట రాజారావు 

 అష్టవిధనాయికలు:

(3). విరహోత్కంఠిత

ఉ.   నాథుడు దూరదేశముల నాశ్రయమొందగ పోవగా మదిన్ 

        బాధితయై మనోహరి యపార వియోగ విలక్షణాకృతిన్ 

        వేధను దూరుచున్ విరహవేదన తాళక నశ్రుసారసాం 

        బోధిని మున్గి తేలుచును బోరన నేడ్చెడు నాతి యీమెయే. 

(4). విప్రలబ్ధ  

ఉ.   కూరిమితోడ కూడెదము కొంచెమునైనని జాగుసేయకో 

        వారిజలోచనా యనుచు బాళిగ పల్కిన యిష్టుడాయమన్ 

        చేరక యుండుటన్ తరుణి చిందఱవోవుచు రేతిరంతయున్ 

        కోరికమేర నారయుచు కోమలి బేల్పడె విప్రలబ్ధగా! 

(5). ఖండిత

ఉ.   నిండగు గారమున్ సరదు ప్రేమికుడాయెడ మోజు గూడగా 

        మెండుగ రాతిరంతయును మీఱుచు వేరొక కాంతతోడ తా 

        నుండియు వేడ్కగా తిరుగ నుగ్మలి కాగ్రహముప్పతిల్లగన్ 

        ఖండితయౌచు క్రుంగినది కాలమహత్వపు కేళిలో నటన్. 

                                                                       రచన: క్రొవ్విడి వేంకట రాజారావు  

7, మార్చి 2023, మంగళవారం

 సుజనా శతకము - కందపద్యములు: 


1.  పలికెడి వాచకములకును / చలిపెడి పనులకు పొరపులు సంభవమగుచో 

     పలుకులవి పలుకు వానిని / ఇలను వసించెడి జనమ్ము లెంచరు సుజనా! 


2.  తెల్లబడెడి కురులెప్పుడు / వెల్లడి జేయును నిరతము పెరిగెడి వయసున్ 

     ఉల్లమున బెర్గు దెలివిడి / తెల్లనగు నెఱకల వలన తెలియదు సుజనా! 


3.  ఎప్పుడు శంకలు గలిగిన / నప్పుడె పరిజనము తోడ ననువున దానిన్ 

     చప్పున సమీక్ష జేసిన / తప్పక సందిగ్ధమంత తఱుగును సుజనా! 


4.  జోకను గూడిన గుణములు / తేకువ నొందుచు పొదలెడి తీరున నిలుపన్ 

     వీకను నెక్కొన జేయుచు / తాకించును మిసిమి నెపుడు ధరణిని సుజనా! 


5.  మాటల నుంచిన కోపము / చాటున నుంచుము చలిపెడి చర్యల లోనన్ 

     మాటల చేతల నుంచుము / నీటుగ ననురతి వలపులు నిరతము సుజనా! 

                                                      

                                                                 రచన: క్రొవ్విడి వేంకట రాజారావు 

అష్టవిధ నాయికలు:

(1). స్వాధీనపతిక/స్వాధీన భర్తృక

ఉ.   సౌరగు రూపునన్ పతి వశంవదు జేసియు సంతసించుచున్ 

        నేరిమితో మనోహరుని నెమ్మది సుస్థితయౌచు నిచ్చలున్ 

        మారుని తీరునన్ తనదు మాటను మీరక జేయు నింతి నే 

        పారు నధీనమౌ పతిని పట్టిన భార్యగ లోకమందునన్. 


(2). వాసవసజ్జిక

 ఉ.   రూపసియైన నబ్జముఖి రోచి సురత్న సువర్ణ భూషణల్ 

         కోపుగ దాల్చి వల్లభుని కూర్మిని పొందెడు లక్ష్యసిద్ధికై 

        యోపికతోడ ధామమున నొమ్మిక గూడగ వేచి చూచుచున్

        వ్యాపకదూరయౌ సతియె వాసవసజ్జిక నాయికాఖ్యయౌ. 

                                                                    రచన: క్రొవ్విడి వేంకట రాజారావు 


6, మార్చి 2023, సోమవారం

 కాలయానం: 

    సాధారణంగా సూర్యోదయం తూర్పున, సూర్యాస్తమయం పడమరన జరుగుతుందని అందరూ అనుకొంటారు. 

ఉత్తరాయణం - సూర్యగమనం 

మకర సంక్రమణం - జనవరి నుండి జూలై వరకు 

    జనవరి నుండి జూలై మధ్య కాలంలో భూపరిభ్రమణం వలన సూర్యగమనం తూర్పు నుండి ఆగ్నేయం వరకు మారి తిరిగి ఆగ్నేయం నుండి తూర్పుకు వచ్చును. ఫలితంగా సూర్యోదయ దిశలు మారుచుండును. ఈ కాలంలో సూర్యోదయం, మొదటి మూడు మాసములు తూర్పునుండి దినదినం అగ్నేయం వైపు మారుతూ మూడవ మాసాంతమున, ఆగ్నేయాన్ని చేరుకుని, తిరిగి అగ్నేయము నుండి క్రమక్రమంగా తూర్పుకు మారును. 

దక్షిణాయనం - సూర్యగమనం 

కర్కాటక సంక్రమణం - జూలై నుండి జనవరి వరకు 

    జూలై నుండి జనవరి మధ్య కాలంలో భూపరిభ్రమణం వలన సూర్యగమనము తూర్పు నుండి ఈశాన్యదిశగా మారి తిరిగి ఈశాన్యం నుండి తూర్పుకు వచ్చును. ఫలితంగా సూర్యోదయ దిశలు మారుచుండును. ఈ కాలంలో, సూర్యోదయం మొదటి మూడు మాసములు తూర్పునుండి దినదినం ఈశాన్యం వైపు మారుతూ మూడవ మాసాంతమున ఈశాన్యాన్ని చేరుకుని, తిరిగి ఈశాన్యం నుండి క్రమక్రమంగా తూర్పుకు మారును. 

                                                                                సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...