31, జనవరి 2026, శనివారం

 31-01-2026 - శనివారం 


:: భాగవతసుధ - 3 :: 


    పరీక్షిన్మహారాజు వృత్తాంతము కేవలం ఒక రాజు కథ మాత్రమే కాదు. అది మనకందరికీ ఒక జీవన పాఠం. మరణం ఖాయమని తెలిసినప్పుడు మనిషి క్రుంగిపోకుండా, ఆ మరణాన్ని ఒక పండుగలాగా ఎలా మార్చుకోవచ్చో ఆయన నిరూపించారు. 

    సాధారణంగా మనసును నియంత్రించడం చాలా కష్టం. కానీ, పరీక్షిత్తుకు రెండు బలమైన ఆయుధాలు తోడయ్యాయి. ఒకటి వైరాగ్యం. శమీకమహర్షి కుమారుడు శృంగి శాపంవల్ల తక్షకుడి వల్ల తన మరణం ఏడో రోజున అని తెలిసిన వెంటనే, ఆయన తన రాజ్యాన్ని, సుఖాలను ఒక చిరిగిన వస్త్రంలా వదిలేశాడు. " నాది " అనే మమకారం పోయినప్పుడే మనసు భగవంతుని వైపు వేగంగా వెడుతుంది. రెండవది శ్రవణం. సాక్షాత్తు శుకమహర్షి బోధిస్తుంటే, పరీక్షిత్తు కనీసం మంచినీరు కూడా ముట్టుకోకుండా ఏకాగ్రతతో విన్నాడు. ఆ తీవ్రత వల్ల ఏడురోజులు ఏడు జన్మల సాధనతో సమానమయ్యాయి. 

    శుకమహర్షి భాగవత ప్రోక్తం చేస్తూ ప్రధానంగా వివరించిన విషయాలలో మొదటిది విశ్వరూపం. ఈ సృష్టి అంతా భగవంతుని శరీరమే. నదులు ఆయన నాడులు. పర్వతాలు ఆయన ఎముకలు అని చెప్పడం ద్వారా ప్రకృతిలో దైవత్వాన్ని చూడటం నేర్పారు. రెండవది మాయాశక్తి.  భగవంతుడు తన మాయద్వారా ఎలా సృష్టిని చేస్తాడు? ఎలా స్థితిని కాపాడతాడు? మరల ఎలా ఉపసంహరించుకుంటాడొ వివరించారు. చివరగా మూడవది తత్త్వవిచారణ. దేహం నాశనమవుతుంది. కానీ, లోపల ఉన్న " ఆత్మ " కు చావులేదు. సృష్టిలోని ప్రతి అణువులోనూ పరమాత్మ వ్యాపించి ఉన్నాడనే అద్వైత సత్యాన్ని బోధించారు. 

    తక్షకుడు కరచినప్పుడు పరీక్షిత్తు ఎందుకు నవ్వాడు? ఇక్కడే పరీక్షిత్తు ఒక విజేతగా నిలిచాడు. శుకమహర్షి బోధనల వల్ల పరీక్షిత్తు " దేహభావన " నుండి బయటపడి ఆత్మస్థితికి చేరుకున్నాడు. తక్షకుడు కరిచే సమయానికి పరీక్షిత్తు ధ్యానసమాధిలో ఉన్నాడు. ఆయన దృష్టిలో తక్షకుడు ఒక పాము కాదు, అదికూడా భగవంతుని రూపమే. " చచ్చేది శరీరం మాత్రమే, నేను కాదు " అనే జ్ఞానం కలిగినప్పుడు మరణం భయం కలిగించదు. అందుకే, మరణాన్ని ఆహ్వానిస్తూ ఆయన నవ్వుతూ ప్రాణాలు వదిలాడు. 

    మరణాన్ని పండుగలా ఎలా మార్చుకోవాలి? పరీక్షిత్తు చరిత్ర మనకు ఇచ్చే సందేశం ఇదే. మరణం అనివార్యం అని ముందే గుర్తించడం. చివరి క్షణంలో వస్తువుల మీద, బంధువుల మీద మమకారం వదిలేయడం. మనసును ఉన్నతమైన శక్తిపై దైవం లేదా జ్ఞానం మీద లగ్నం చేయడం. మరణం అంటే అంతం కాదు. అది ఒక మార్పు మాత్రమే అని గ్రహించడం. 

    మరణం అనేది దేహానికి వచ్చే విరామం మాత్రమే. ఆత్మకు అది క్రొత్త ప్రయాణం. 

    పరీక్షిత్తులాగా మనం కూడా జీవించి ఉన్నప్పుడే ఈ సత్యాన్ని తెలుసుకుంటే, మరణం భయపెట్టే భూతంలా కాక, పరమాత్మలో కలిసే ఒక పండుగలా కనిపిస్తుంది. 

    పరీక్షిత్తు మరణించాక, ఆయన కుమారుడు జనమేజయుడు ఏం చేశాడు? తన తండ్రిని చంపిన పాముజాతి మీద ఆయన పెంచుకున్న పగ, ఆ పగ తీర్చుకోవడానికి ఆయన చేసిన దేమిటి? వచ్చే బుధవారం ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఛానల్ ను తప్పక అనుసరించండి. జై శ్రీకృష్ణ! 

    

30, జనవరి 2026, శుక్రవారం

 30-01-2026 - శుక్రవారం

:: భాగవతసుధ-2 ::


    నమస్తే!  వ్యాసమహర్షి రచించిన శ్రీమద్భాగవతం కేవలం ఒక పురాణం మాత్రమే కాదు, అది మోక్ష మార్గాన్ని చూపే ఒక దివ్యౌషధం. పరీక్షిన్మహారాజుకు, భాగవతానికి మధ్య ఉన్న ఆ అసక్తికరమైన నేపథ్యం వెనుక ఒక పెద్ద కథే ఉంది. 

    పాండవుల వారసుడైన పరీక్షిన్మహారాజు ఒకసారి వేటకై అడవికి వెళ్ళాడు. తీవ్రమైన దప్పికతో శమీక మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు. అప్పుడు ఆ మహర్షి గాఢమైన ధ్యానంలో ఉన్నారు. రాజు ఎన్నిసార్లు పిలిచినా పలకకపోవడంతో, ఆకలిదప్పుల వల్ల విచక్షణ కోల్పోయిన పరీక్షిత్తు, ప్రక్కనే పడి ఉన్న ఒక చనిపోయిన పామును తన ధనస్సుతో తీసి మహర్షి మెడలో వేశాడు. 

    శమీక మహర్షి కుమారుడు శృంగికి ఈ విషయం తెలిసింది. తన తండ్రిని అవమానించినందుకు కోపంతో ఊగిపోయిన ఆ బాలుడు " నా తండ్రి మెడలో మృతసర్పమును వేసిన ఆ వ్యక్తి, సరిగ్గా ఈరోజునుండి ఏడవ రోజున తక్షకుడు అనే పాముకాటుకు గురై మరణించుగాక! " అని శపించాడు. 

    శమీక మహర్షి తన ధ్యానం ముగిసాక జరిగిన విషయాన్ని తెలుసుకొని బాధపడ్డారు. పరీక్షిత్తువంటి ధర్మాత్ముడైన రాజుకు ఇలాంటి శిక్ష పడకూడదని భావించినా, బ్రాహ్మణ వాక్కు అమోఘం కాబట్టి, ఆ విషయాన్ని శిష్యుల ద్వారా రాజుకు వర్తమానం పంపారు. 

    తనకు ఇంకా ఏడురోజులే ఆయుష్షు ఉందని తెలుసుకున్న పరీక్షిత్తు భయపడలేదు. తన తప్పును తెలుసుకొని, రాజ్యాన్ని తన కుమారుడైన జనమేజయుడికి అప్పగించి, గంగానదీ తీరానికి చేరుకున్నాడు. మరణం ఆసన్నమైన వ్యక్తి ఏం చేయాలి? దేనిని వినాలి? అని అక్కడ ఉన్న మహర్షులను అడిగాడు. సరిగ్గా అదే సమయంలో వ్యాసమహర్షి కుమారుడైన శుకబ్రహ్మ అక్కడకు వచ్చారు. 

    అత్యంత పవిత్రమైన భక్తిరసంతో కూడిన శ్రీమద్భాగవతాన్ని శుకమహర్షి ఆ ఏడు రోజుల్లో పరీక్షిత్తుకు వినిపించారు. ఇది వినడం వల్ల మరణం పట్ల భయం పోయి, పరీక్షిత్తు చివరకు మోక్షాన్ని పొందాడు. 

    శ్రీమద్భాగవతం వినడం అంటే భగవంతుని తత్త్వాన్ని తెలుసుకోవడమే కాదు, అది మృత్యు భయాన్ని సైతం పోగొడుతుంది. 

    పరీక్షిన్మహారాజు రాజ్యత్యాగం చేసి, కొడుకును రాజును చేసి అడవికి వెళ్ళిపోయారు సరే, కానీ ఒక చక్రవర్తిగా ఉన్న వ్యక్తి, కేవలం ఏడు రోజుల్లో తన మనసును పూర్తిగా భగవంతునిపై ఎలా లగ్నం చేయగలిగారు? ఆ ఏడు రోజుల్లో శుకమహర్షి ఆయనకు చెప్పిన సృష్టి రహస్యాలు ఏమిటి? తక్షకుడు వచ్చి కరచినప్పుడు పరీక్షిత్తు ఎందుకు ఏడవలేదు? పైగా, ఎందుకు నవ్వుతూ ప్రాణాలు వదిలాడు? మరణాన్ని ఒక పండుగలాగా ఎలా మార్చుకోవచ్చో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం. జై శ్రీకృష్ణ! 


29, జనవరి 2026, గురువారం

29-01-2026 - గురువారం 


:: భాగవతసుధ - 1 ::  


    అందరకూ నమస్సులు! ఈ రోజునుండి మన షార్ట్స్ విభాగంలో " భాగవతసుధ " సీరియల్ ప్రారంభమవుతోంది. పవిత్రమైన భాగవత కథలనుండి ప్రతిరోజూ ఒక చిన్న స్ఫూర్తిదాయకమైన ఘట్టాన్ని మీ ముందుకు తీసుకువస్తాను. దైవత్వం, ధర్మం, ప్రేమ మరియు భక్తితో నిండిన ఆ సుధను ఆస్వాదించండి. ఈ అధ్యాత్మిక ప్రయాణంలో నాతో కలిసి సాగండి. శ్రీమద్భాగవత ఆవిర్భావానికి దారితీసిన ఆసక్తికరమైన మొదటి కథ యిప్పుడు. ఇది వ్యాస మహర్షికి కలిగిన అలౌకిక అనుభవం. 

    మహాభారతం వంటి కావ్యాన్ని, అష్టాదశ పురాణాలను రచించి, వేదాలను నాలుగు భాగాలుగా విభజించిన పరమజ్ఞాని వేదవ్యాస మహర్షి. అంతటి మహత్కార్యాలు చేసినా, ఆయన మనసులో ఏదో తెలియని వెలితి, తీవ్రమైన అశాంతి కలిగింది. 

    ఒకరోజు సరస్వతీ నదీ తీరాన కూర్చొని చింతిస్తున్న వ్యాసుని వద్దకు దేవర్షి నారదుడు విచ్చేశాడు. వ్యాసుని అశాంతిని గమనించిన నారదుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు " వ్యాసా! నీవు ధర్మం గురించి, సమాజ నీతి గురించి, యుద్ధాల గురించి ఎంతో అద్భుతంగా వ్రాసావు. కానీ, సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలలను, ఆయన భక్తుల గొప్పతనాన్ని పరిపూర్ణంగా వర్ణించలేదు. భగవంతుని గుణగానం చేయని ఏ జ్ఞానమైనా పరిపూర్ణం కాదు. అదే నీ అశాంతికి కారణ " మన్నాడు. 

    నారదుడి బోధనతో వ్యాసుడికి జ్ఞానోదయం కలిగింది. ఆయన ధ్యాన సమాధిలోకి వెళ్ళి, తన యోగశక్తితో శ్రీకృష్ణుని లీలలు దర్శించాడు. ఆ దివ్య దర్శనానికి అక్షర రూపమే శ్రీమద్భాగవతం. తరువాత వ్యాసుడు ఈ భాగవతాన్ని తన కుమారుడైన శుక మహర్షికి నేర్పించాడు. ఆ శుకమహర్షి ద్వారానే ఈ జ్ఞానం పరీక్షిన్మహరాజుకు, తద్వారా లోకమంతటకూ అందింది. 

    మనం ఎన్ని పనులు చేసినా, ఎంత సంపాదించినా, భగవంతుని స్మరణ లేనిదే మనసుకు సంపూర్ణమైన శాంతి లభించదు. 

    వ్యాసమహర్షి తన దివ్యదృష్టితో రచించిన ఈ భాగవతాన్ని, మరణానికి సిద్ధంగా ఉన్న పరీక్షిన్మహారాజు ఎందుకు వినాల్సి వచ్చింది? ఆయనకు ఏడురోజులే సమయం ఉందని ఎవరు చెప్పారు? ఈ ఆసక్తికరమైన విశేషాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాము. మరిన్ని భాగవత విశేషాలకోసం ఇప్పుడే ఫాలో అవండి. జై శ్రీకృష్ణ!


25, జనవరి 2026, ఆదివారం

:: అత్తాకోడళ్ళ పరివర్తన ::  


    శ్రోతక మహాశయులకు క్రొవ్విడి వెంకట రాజారావు అనేక నమస్కారములు. విఘ్నేశ్వర వైభవ లీలలకు సంబంధించిన కథలలో భాగంగా ఈ వారం అత్తాకోడళ్ళను బాధించిన " పిశాచాల భరతం పట్టిన ఏనుగు "  నకు సంబంధించిన వృత్తాంతం విందాం. విన్న తరువాత బాగుంటే  లైక్ చెయ్యండి. తప్పకుండా ఛానల్ ను ఫాలో అవండి. 

    పావనమిశ్రుడు సాయంత్రం వేళల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలోని గోడలపై చిత్రితమై ఉన్న విఘ్నేశ్వరుని గాథలు పిల్లలకు చెబుతూండేవాడన్న విషయం మనకు తెలిసిందే కదా! మరొక సాయంత్రం ఒక బాలిక మంటపం గోడలపైగల ఒక చిత్రాన్ని చూపించి అడిగిన కథను ఆయన ప్రారంభించి ఇలా చెప్పసాగాడు. 

    కళ్యాణి నగరంలో కలహకంఠి అనే ధనికురాలు, కోడలు పుట్టింటినుంచి ఎక్కువగా నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెటి పెట్టి, చివరకు నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టింది. 

    కలకంఠి అని నామకరణం చేయబడినప్పటికీ, కలహకంఠి గా పేరుపొందిన ఆ ధనిక అత్త కోడలు సౌదామిని, పుట్టెడు దు:ఖంతో పుట్టింటికి బయలుదేరి దారితప్పి అరణ్యంలో పడి, ఆకలితో అటమటించి పోతూ ఒక వెలగచెట్టు దగ్గర పడిపోయింది. 

    తను పుట్టింటికెళ్ళి కూడా ప్రయోజనంలేదు. తన పెళ్ళికి చేయించిన నగలకే  తండ్రి అప్పుల పాలయ్యాడు. మరి నగలు పెట్టలేడు. అంచేత ఆ కీకారణ్యంలో చావడమే మేలు అనుకుంటూండగా చెట్టునుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్లుగా ఆమె చేతి దగ్గర ఆగిపోయింది. దాన్ని పట్టుకుని సౌదామిని లేచి కూర్చుంటుండగా  భూమి అదిరేలాగ ఒక పెద్ద ఏనుగు పరుగున రావడం కనిపించింది. 

    సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరుడిపై భక్తివిశ్వాసాలు కలది. విఘ్నేశ్వరుణ్ణి తలచుకొని ఏనుగు పాదాల క్రింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఏనుగు ఠక్కున ఆగిపోయింది. 

    ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండుని తొండంతో తీసుకొని నోటవేసుకొని, దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామని తల నిమిరి తొండంతో చేయి పట్టుకొని తిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరికి తీసుకువెళ్ళింది. 

    గుహ ద్వారాన్ని మూసి ఉన్న కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి, గజరాజు లోపలికెళ్ళి కొంతసేపయ్యాక రత్నాల నగలను కట్టలు కట్టలుగా తొండంతో తీసుకువచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాల్ని, కంఠాభరణాల్ని ఆమె మెడనిండా వేసి, తండ్రి బిడ్డను బుజ్జగించి చెప్పినట్లుగా వీపు నిమిరి, మిగతా నగలను ధరించినన్ని ధరించి, తక్కినవి మూటకట్టుకొని  తీసుకెళ్ళమని సైగచేసి చెప్పింది. 

    సౌదామిని అలాగే చేశాక, ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. 

    బంగారు విగ్రహంలాగా నగలుతో తళుక్కు తళుక్కున దేదీప్యమానంగా మెరుస్తున్న కోడలిని చూసి కలహకంఠి నిర్ఘాంతపోయి, సంబాళించుకొని, మెల్లమెల్లగా ఆ నగలన్నీ ఎలాగ వచ్చాయో చెప్పేవరకు వేధించి, సౌదామిని చెప్పినదంతా విని, " ఏనుగుకు వెలగపళ్ళు అంత ఇష్టమన్నమాట " అని తల పంకించి వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా  వెలగపళ్ళు కొనుక్కు వచ్చింది. 

    నగలు నింపుకుని రావడానికి ఒక గట్టి గోతాన్ని భుజాన వేసుకొని , వెలగపళ్ళ సంచితో కలహకంఠి బయలుదేరింది. 

    అరణ్యం ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగచెట్టు కనబడక విసిగి, ఒక చింతచెట్టు క్రింద చతికిలపడి, తినాలని వెలగపండు తీసింది. 

    తినాలనే తీసినా ఎలాగో నిగ్రహించుకొని, వెలగపండు చేత్తో ఎత్తిపట్టుకొని గొంతు సవరించుకొని ఏనుగును రమ్మంటూ గట్టిగా భజన పాట మొదలెట్టింది. పాట సాగుతున్నది. ఏనుగు రాలేదు కాని, అడవి దద్దరిల్లేలాగా గాండ్రు మనే అరుపు వినిపించింది. అది ఏనుగు ఘీంకారము కాబోలు అనుకొని కలహకంఠి సంతోషపడుతూ మెడచాచి చూడగా పెద్దపులి దూకుతూ రావడం కనిపించింది. 

    భుజంమీది గోతాన్ని వదలకుండా కలహకంఠి తిరిగి చూడకుండా పరుగెత్తి, పరుగెత్తి రొప్పుతూ పడిపోయింది. ఆ పడడం సరిగా గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. తన అదృష్టానికి కలహకంఠి పొంగిపోతూ గుహలోకి వెళ్ళింది. 

    గుహలో కుప్పలు తెప్పలుగా ఉన్న నగలు చూచి పిచ్చెత్తిన దానిలాగా తల మునిగేలాగ నగలన్నీ వేసుకొని, గోతంనిండా నగలు కుక్కి మూతికట్టి, ఎత్తలేక ఎత్తి, మోయలేక మోస్తూ, నడవలేక నడుస్తూ గుహ మొదటికి వచ్చేసరికి గుహ మూతబడి ఉంది. ఎదురుగా చీకటిలో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో, తెల్లగా మెరుస్తున్న కోరపళ్ళతో పగలబడి నవ్వుతున్న పెద్ద బ్రహ్మరాక్షసి చీకటిలో చీకటిలాగ కనిపించింది. 

    ఆ భూతం ప్రతిధ్వనితో గుహ కంపించిపోయేలాగ " ఓహో కలహకంఠీ! నువ్వు కోడల్ని కాల్చుకుతినే అత్తవైతే, అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని. నా చరిత్ర విను " అంటూ చెప్పడం ప్రారంభించింది. 

    వెనుకటికి నేను చురకత్తిలాంటి అందగత్తెను. అమ్మ, నాన్న పెట్టినపేరు కలహంసి. కాపురానికి వెళ్ళాక, నా నోటి ప్రతాపానికి ఆ పేటంతటికీ నేను సంపాదించుకొని సార్థకపరుచుకున్న పేరు కలహదుందుభి. 

    నువ్వెంత చెడ్డ అత్తవో, కలహంఠీ! నా అత్త అంత ఉత్తమురాలు. పరమ సాధువు. 

    నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరక్కుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాల పాలయ్యాడు. అంటే, నేనెంత ఉత్తమ ఇల్లాలునో ఊహించుకో! నాకు నగల పిచ్చి అంతా ఇంతా కాదు. బంగారు పంటలు పండే భూములు పుట్రలు అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కుపుల్ల నుంచి అన్నీ నాకే యిచ్చేసింది. 

    అటువంటి అమాయకురాలైన అత్తను, ఒకపూటైనా సరిగా తిననిచ్చేదానను కాను. చిక్కి శల్యమైన వృద్ధురాలిచేత ఇంటి చాకిరీ అంతా చేయించేదాన్ని.

    చివరికి నా అత్తమామలు విసిగిపోయి వాతాపి క్షేత్రంలోని విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్నుమూద్దామని బయలుదేరారు. నా అత్త చేతుల్లో ఉన్న చిన్న మూట చూసి అదేమిటని దూకుడుగా లాక్కోవటంతో, ఆవిడ తూలిపడిపోయి, ఆయాసంతో రొప్పుతూ కనుమూసింది. 

    అంతవరకూ ఎంతో సహనంతో నా అత్యాచారాలన్నీ చూస్తూ  పల్లెత్తు మాట అనని నా మామగారు, ఆపలేని దు:ఖంతో, పైకుబికిన కోపంతో " పాపిష్ఠిదానా! నువ్వు మా కోడలివయిపోయినావు. లేకుంటే శపించేవాణ్ణి. ఎప్పటికైనా, మా ఒక్కగాని ఒక్క కొడుకు తిరిగివస్తాడనీ, నువ్వు వాణ్ణి సుఖపెట్టగలవనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను. వాడొస్తే సరిగా చూడు " అని చెబుతూ అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు. తపశ్శాలి. 

    అదేసమయంలో ఒక సన్యాసి అక్కడకు వచ్చాడు. నా అత్తమామల మృతదేహాలపై రోదిస్తూ, నేను లాక్కోబోయేటప్పుడు  క్రిందపడిన మూటను తీసి విప్పాడు. అందులో రెండు చిరుగుల బట్టలు తప్ప మరేమీ లేవు. 

    ఆ సన్యాసి నన్ను వజ్రాల్లాంటి కళ్ళతో కాల్చేస్తున్నట్లు చూస్తూ, " నువ్వు బ్రహ్మరాక్షసివిగా పుట్టవలసిన దానవు " అని అన్నాడు. అంతే, తరువాత వృద్ధ దంపతుల ఉత్తరక్రియలు జరిపి వెళ్ళిపోయాడు. 

    ఆ సన్యాసి ఎవరో కాదు, నా రూప విలాసాలకు పరవశించి కోరి చేసుకున్న నా భర్తే " అని బ్రహ్మరాక్షసి చెప్పి, కాసేపాగి, మరల చెప్పసాగింది. 

    నా నగల పిచ్చి, ధన వ్యామోహం నన్ను ఎంతవరకూ ఈడ్చుకు వచ్చాయంటే, నేను కొంతమంది గజదొంగలను చేరదీసాను. దొంగల రాణిని అనిపించుకున్నాను. ఈ గుహలోనే దొంగలు గొప్ప గొప్ప నగలను, ధనరాశులను పోగు పోస్తూండేవారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విష భోజనం పెట్టాను.  వాళ్ళు చచ్చేముందు ఛావు తెగింపుతో కసిగా నన్ను ఇందులో ఉంచి గుహను పెనుబండతో కప్పేశారు. 

    కలహకంఠీ! ఇదే గుహలో ఆ నగల్నీ, ధనరాసుల్నీ చూసుకుంటూ అలాగే మాడి మాడి కన్నుమూసి, ఇలాగ భూతాన్నయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే, నా పిశాచజన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వలన తెలిసింది. 

    ఏనుగు నీ కోడలికి ఇచ్చినవన్నీ అసలు నగలే. ఇప్పుడు నువ్వు పెట్టుకున్నవీ, అత్యాశకొద్దీ పోగుచేసి గోతాం నిండా కట్టుకున్నవీ ఏమిటో చూసుకో అన్నది బ్రహ్మరాక్షసి. 

    కలహకంఠి భుజానికెత్తుకున్న గోతం కట్టువిడి దాంట్లోంచి పాములు, జెర్రులు, కొండతేళ్ళు, ఊడిపడుతూ జరజరా గుహ నలుమూలలకూ ప్రాకాయి. 

    ఒంటిమీద పాములూ, తేళ్ళు ప్రాకుతూంటే బెంబేలు పడిపోతున్న కలహకంఠిని చూసి గుహ మారుమ్రోగుతుండగా బ్రహ్మరాక్షసి వికవికా నవ్వుతూ " నువ్వు కోడల్ని కాల్చుకుతినే కలహకంఠివి. నేను అత్తమామల ఉసురు పోసుకున్న కలహదుందుభిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరేసరి, లేదా ఈ గుహలో నాలాగా బ్రహ్మరాక్షసివై పడిఉండటం ఇక నీ వంతు అవుతుంది. విన్నావా కలహకంఠీ! " అని చెప్పింది. 

    కలహకంఠి లెంపలు వేసుకొని, రాక్షసికి దండం పెట్టి  " బుద్ధి వచ్చింది. కోడల్ని పువ్వులాగా చూసుకుంటాను. గుహనుండి నన్ను బయటకు పడనిచ్చి అరణ్యం దాటించు అని మొర పెట్టింది. 

    బ్రహ్మరాక్షసి కలహకంఠిని అడవి దాటించి, కళ్యాణి నగర పొలిమేరకు చేర్చి, " మాట తప్పావో, బ్రహ్మ పిశాచివై గుహలో ఉంటావు. జాగ్రత్త " అని హెచ్చరించి భగ్గుమని మండిపోయి అదృశ్యమైంది. 

    కలహకంఠి బ్రతుకు జీవుడా అని ఇంటికి బిరబిరా వెళ్ళి, సౌదామిని ముందు మోకరిల్లి , మోకాళ్ళు పట్టుకుని " అమ్మా! సౌదామినీ! నన్ను మన్నించు. కొడుకు,  కోడలు  చిలకా గోరింకల్లాగా ఉంటే చూసి సంతోషించడం కంటే నాకు కావలసిందేమీ లేదు " అన్నది. 

    అత్త పరివర్తనానికి కారణం విఘ్నేశ్వరుని కటాక్షం అని సౌదామిని సంతోషించింది. కలహకంఠి తిరిగి కలకంఠి అనిపించుకున్నది. 

    పావనమిశ్రుడు కథను ముగించి " ఏనుగు ఎవరో చెప్పుకోండి చూద్దాం " అన్నాడు. 

    పిల్లలే కాకుండా పెద్దలుకూడా ఆనందోత్సాహాలతో గొంతెత్తి " విఘ్నేశ్వరుడు , మన విఘ్నేశ్వరుడే " అంటూ గొల్లున లేచి ప్రసాదం తీసుకొని ఇళ్ళకు వెళ్ళారు. సశేషం. 

    వచ్చేవారం మరొక ఆసక్తికరమైన కథ విందాం. సర్వేజనా సుఖినోభవన్తు! స్వస్తి!! 

18, జనవరి 2026, ఆదివారం

:: విఘ్నేశ్వరుడి తొండం ఎంతపనిచేసింది? :: 


    శ్రోతలందరకూ క్రొవ్విడి వెంకట రాజారావు నమస్సులు. మనం సీరీస్ గా  ప్రతిరోజూ షార్ట్సులో మహాభారత రహస్యాలను, ప్రతిసోమవారం స్పెషల్ వీడియోలుగా విఘ్నేశ్వర వైభవ లీలలను చెప్పుకుంటున్నాం. ఆయా కథలనుండి మనకు తెలియని చాలా విషయాలను గ్రహిస్తున్నాం. సరే, ఈ సోమవారం నుండి విఘ్నేశ్వర వినోద గాథలను కొన్ని చెప్పుకొని త్వరలో కొన్నివారాల్లో ఈ సీరియల్ ను ముగింపు చేసుకుని మరొక సీరీస్ ను ప్రారంభించుకుందాం.  మిమ్ములను నే కోరుకునేది ఒక్కటే.  ఛానలును సబ్ స్క్రైబ్ చేసుకొని విన్న కథలు బాగుంటే లైక్ చెయ్యమని. చేస్తారుకదూ! సరే, ఇప్పుడు విఘ్నేశ్వరుడి తొండం ఎంతపని చేసిందో ఓ కథ ద్వారా విందాం. 

    వాతాపి గణపతిగా విఘ్నేశ్వరుడూ, విఘ్నేశ్వర క్షేత్రంగా వాతాపి నగరం దేశాంతరాల్లో పేరుమ్రోగుతున్న కాలంలో, పావనమిశ్రుడు అనే పండితుడు సాయంకాలాల్లో వాతాపి గణపతి ఆలయ మంటపంలో పిల్లలకు విఘ్నేశ్వరుడికి సంబంధించిన కథలను చెబుతూండేవాడు. 

    మంటపం గోడలపై విఘ్నేశ్వరుడి గాథలు చిత్రాలుగా చిత్రితమై ఉన్నాయి. ఆ చిత్తరువుల్లో వినోదకరమైన ఒక చిత్రాన్ని ఒక పిల్లవాడు గురువుకు చూపించి ఆ కథ చెప్పమన్నాడు. 

    పావనమిశ్రుడు కథ ప్రారంభించాడు. 

    ఒక నగరంలో సత్యశర్మ, లోభగుప్త ఇరుగు పొరుగున ఉండేవారు. లోభగుప్తుడి అసలుపేరు లాభగుప్త. కానీ, అతని లోభితనానికీ, అత్యాశకూ  ఊరిలోని వారంతా లోభగుప్త అనే స్థిరపరిచారు. 

    సత్యశర్మ, లోభగుప్త రోజూ శివాలయానికి వెళ్ళేవారు. సత్యశర్మ గర్భగుడిలోనికి వెళ్ళేదారిలోనే ఉన్న విఘ్నేశ్వర విగ్రహం ముందు ప్రణమిల్లి స్తోత్రగానం చేశాక శివదర్శనం చేసుకుని వెళ్ళేవాడు. 

    లోభగుప్తుడు గర్భాలయం ప్రవేశిస్తూనే శివలింగం ముందు సాగిలపడి కోటి లాభాలు చేకూర్చమని చాలాసేపు అలాగే ధ్యానిస్తూ ఉండేవాడు. 

    ఒకనాడు సత్యశర్మ శివదర్శనం చేసుకొని వెడుతూండగా, లోభగుప్తుడు వస్తూన్న సమయంలో నంది విఘ్నేశ్వరుడితో " విఘ్నేశ్వరా! నీ భక్తుడు సత్యశర్మ చాలా డబ్బు అవసరంలో ఉన్నాడు. అతడిని ఆదుకోవలసిన అవసరం లేదా? " అన్నాడు. 

    " ఔనోయి నందీ! ఈ సాయంకాలానికి అతనికి వెయ్యి వరహాలు అందిస్తున్నాను " అని విఘ్నేశ్వరుడు అన్నాడు. 

    రాతివిగ్రహాలు మాట్లాడుకుంటున్న మాటలు ఆశ్చర్యంతో లోభగుప్తుడు విని, క్షణం ఆలశ్యం చేయకుండా  సత్యశర్మ ఇంటికి వెళ్ళి " శర్మా! నువ్వేదో అవసరంలో ఉన్నట్టుంది. అయిదువందల వరహాలు ఇస్తాను. తీసుకో! " అని చెప్పి వెళ్ళి డబ్బు తీసుకొచ్చాడు. 

    సత్యశర్మ " అయ్యా! గుప్తాగారూ! నిన్ననే కదా అసలు వడ్డీలతో మీరిచ్చిన ఋణం తీర్చకపోతే ఇల్లు ఖాళీ చేయమని చెప్పారు. ఈ అయిదువందలు ఎలాగ తీర్చగలను? " అన్నాడు. 

    లోభగుప్తుడు, " అదా! నీ సందేహం? ఈ అయిదు వందలు తీసుకొని సాయంకాలానికి నీకు లభించిన మొత్తం ఎంత అయితే అంత నాకు ఇస్తే చాలు " అన్నాడు. 

    సత్యశర్మ తటపటాయిస్తుంటే, అతని భార్య " ముందు ఆ ద్రవ్యాన్ని తీసుకోండి. అవతల పెళ్ళివారు చాలాసేపై కూర్చొని ఉన్నారు " అని ప్రోత్సహించింది. 

    సత్యశర్మ కుమార్తెకు అప్పుడే పెళ్ళి కుదిరింది. వరుడి తల్లి, దండ్రి అయిదువందల వరహాల విలువచేసే నగలు పిల్లవానికి పెట్టాలని పట్టుబట్టారు 

    సత్యశర్మ లోభగుప్తుడితో " అయ్యా! సాయంకాలానికి నాకు లబించింది యివ్వటానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు కాని, అలా లభించే ఆస్కారం ఏదీ లేదు..." అంటూ నసుగుతుంటే, లోభగుప్తుడు " అదంతా వదిలెయ్యి. మనం ఇరుగు పొరుగు వారం. ఇప్పుడు నేనిస్తే తరువాత నువ్విస్తావు. యీ మాత్రం దానికి మొహమాటపడకు " అంటూ అయిదు వందల వరహాలమూట సత్యశర్మ చేత పెట్టాడు. 

    సత్యశర్మ సత్యసంధుడని లోభగుప్తుడికి బాగా తెలుసు. 

    సాయంత్రం అవుతున్నది కాని, సత్యశర్మకు ఏ వరహాలు అందిన సూచన కనిపించలేదు. లోభగుప్తుడు కంగారుపడుతూ దేవాలయానికి పరుగెత్తి, విఘ్నేశ్వర విగ్రహం తొండం పట్టుకుని లాగుతూ, " ఏమయ్యా విఘ్నేశ్వరా! సత్యశర్మకు వెయ్యివరహాలు త్వరగా యిప్పించు మరి .." అని అంటూండగా అతని అరచేయి తొండం సందున యిరుక్కుపోయి తీస్తే రాకుండా తొండం మరింత గట్టిగా బిగించి నొక్కిపట్టింది. 

    నొప్పితో లోభగుప్తుడు కిరకిరలాడి పోతుంటే, " సత్యశర్మకు వెయ్యివరహాలు ఎంత త్వరగా నువ్వు ఇప్పిస్తే, అంత త్వరగా నీకు విడుదల " అని విగ్రహం నుండి వినిపించింది. 

    లోభగుప్తుడు రెండో చేత్తో నెత్తీనోరూ బాదుకొంటూ " అన్యాయం దేవుడా, అన్యాయం . అయిదువందలు ముందే యిస్తినిగదా! " అని పెడబొబ్బలు పెట్టాడు. 

    " అదా సంగతి అయిదు వందలు ఇచ్చి వెయ్యి పుచ్చుకొని సునాయాసంగా అయిదు వందల వరహాలు కాజేద్దామని ఎత్తువేసావన్నమాట. ఆశపాతకుడా! నీ దురాశకు ప్రాయశ్చిత్తంగా సత్యశర్మకు మిగతా అయిదువందలు యివ్వడమే కాకుండా, అతడికిచ్చిన ఋణాన్ని చెల్లుపెట్టి, అతని కుమార్తె వివాహం నీ స్వంత ఇంటి పెళ్ళిలాగా జరిపించు " అని విఘ్నేశ్వరుడి విగ్రహం నుండి గంభీర గర్జన వినిపించింది. 

    లోభగుప్తుడు క్షణాలమీద తనవారిని పిలిపించి, సత్యశర్మకు మిగతా అయిదువందల వరహాలు ఇప్పించి, అతని ఋణానికి చెల్లుపెట్టించి, అతని కూతురు పెళ్ళి ఖర్చంతా పెట్టుకుంటానని ప్రమాణం చేసాకనే అతని చెయ్యి ఇవతలికి వచ్చింది. 

    లోభికి మంచి శాస్తి జరిగిందని ఊరుఊరంతా చెప్పుకొన్నారు. 

    లోభగుప్తుడు సత్యశర్మ కుమార్తె వివాహాన్ని స్వంత కూతురి వివాహంలాగా వైభవంగా జరిపించాడు. అప్పటినుండి బుద్ధి తెచ్చుకొని లోభగుణాన్ని విసర్జించి, అన్యాయంగా ఆర్జించిన ఆస్తిని ధర్మకార్యాలకు వినియోగించి, విఘ్నేశ్వరుడి దయకు పాత్రుడై, గొప్ప ధార్మికుడనిపించుకున్నాడు. 

     కథ ముగించి పావనమిశ్రుడు విఘ్నేశ్వర ప్రసాదాన్ని తెచ్చి పిల్లలకు పంచాడు. పిల్లలు ప్రసాదాన్ని నోట్లో వేసుకొని ఆనందంగా కేరింతలు కొడుతూ ఇళ్ళకు పరిగెత్తారు. 

    వచ్చే సోమవారం మరొక ఆసక్తికరమైన కథ. సర్వేజనా సుఖినోభవంతు! స్వస్తి!! 

16, జనవరి 2026, శుక్రవారం

:: మహాభారత రహస్యాలు-7 :: 


    మహాభారతంలో  భీష్మపితామహుడి మరణానికి పునాదివేసిన ఆ స్త్రీ అంబ. ఒక చిన్న పొరపాటు, ఒకరి మొండితనం చివరకు భీష్ముడి పతనానికి ఎలా దారితీసింది? ఆ చిన్న పొరపాటు ఏమిటి? తన తమ్ముడైన విచిత్రవీర్యుడి కోసం భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువస్తాడు. అయితే, అంబ అప్పటికే సాల్వరాజుని ప్రేమిస్తున్నానని చెప్పడంతో, భీష్ముడు ఆమెను గౌరవించి పంపేస్తాడు. కానీ, మరొకరు తీసుకువెళ్ళిన స్త్రీని తాను స్వీకరించనని సాల్వరాజు ఆమెను తిరస్కరిస్తాడు. తిరిగి భీష్ముడి వద్దకు వస్తే, విచిత్రవీర్యుడు కూడా ఆమెను వద్దంటాడు. భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞ బ్రహ్మచర్యం వల్ల ఆమెను పెళ్ళిచేసుకోలేనని చెబుతాడు. ఇరువైపుల న్యాయం జరగక, తన జీవితం నాశనమవడానికి భీష్ముడే కారణమని అంబ రగిలిపోతుంది. భీష్ముడిని చంపటమే లక్ష్యంగా శివుడి కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు " వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణ మవుతావు " అని వరం ఇస్తాడు. ఆ వరంతో అంబ మరుజన్మలో ద్రుపద మహారాజుకు శిఖండిగా జన్మిస్తుంది. పుట్టుకతో స్త్రీ అయినప్పటికీ, తరువాత పురుషుడిగా మారుతుంది. అయితే, భీష్ముడి అంతం ఎలా జరిగింది? కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని ఓడించటం ఎవరికీ సాధ్యం కాదు. అప్పుడు కృష్ణుడు శిఖండిని అర్జునుడి రథం ముందు నిలబెడతాడు. భీష్ముడికి  ఆడవారిపై గానీ, పూర్వం ఆడదిగా పుట్టిన వారిపై గానీ ఆయుధం పట్టనన్న ధర్మ నియమం ఉంది. శిఖండి పూర్వజన్మలో అంబ అని భీష్ముడికి తెలుసు. అందుకే శిఖండిని చూడగానే భీష్ముడు తన విల్లును క్రింద పడేశాడు. అదే సమయంకోసం ఎదురుచూస్తున్న అర్జునుడు శిఖండి చాటునుండి భీష్ముడిపై బాణాలవర్షం కురిపించి అతడిని అంపశయ్యపై పడేశాడు. అంబ పగ శిఖండి రూపంలో భీష్ముడి నైతిక ధర్మాన్నే ఆయుధంగా మార్చుకుని ఆయన మరణానికి కారణమయింది. 

    భీష్ముడు అంపశయ్యపైకి చేరాక, కౌరవ సైన్యం బాధ్యత ద్రోణాచార్యుడి చేతికి వచ్చింది. కానీ, తనను ఎవరూ ఓడించలేరని తెసిన ద్రోణుడు యుద్ధభూమిలో అకస్మాత్తుగా ఆయుధం ఎందుకు క్రిందపడేశాడు? ధర్మరాజు చెప్పిన ఒక్క అబద్ధం ద్రోణుడి మరణానికి ఎలా కారణమయింది? వచ్చే భాగంలో తెలుసుకుందాం. 

15, జనవరి 2026, గురువారం

:: మహాభారత రహస్యాలు - 6

భీష్ముని 'భీషణ' ప్రతిజ్ఞ హస్తినాపుర చరిత్రను, కురువంశ భవిష్యత్తును పూర్తిగా మార్చివేసింది. దీని వల్ల జరిగిన ప్రధాన మార్పులు నాలుగు. మొదటిది వారసత్వ సంక్షోభం. భీష్ముడు రాజ్యత్యాగం చేసి, పెళ్ళి చేసుకోనని శపథం చేయడంతో, సమర్థుడైన పాలకుడు ఉన్నప్పటికీ సింహాసనం బలహీనపడింది. తదుపరి వారసులైన చిత్రాంగద, విచిత్రవీర్యులు అల్పాయుష్కులు కావడం వలన రాజ్యం అస్థిరతకు లోనయింది. రెండవది ధర్మ సంకటం పైపెచ్చు అశక్తత. భీష్ముడు కేవలం హస్తినాపుర సింహాసనానికి కట్టుబడతానని ప్రతిజ్ఞ చేశాడు. దీనివల్ల ద్రౌపదీ వస్త్రాపహరణం వంటి అధర్మాలు జరుగుతున్నా, తను చక్రవర్తి కానందున కేవలం చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. ఆయన మౌనం కురువంశ నాశనానికి ఒక కారణమయింది. మూడవది కురుక్షేత్ర యుద్ధానికి పునాది పడటం. భీష్ముడు సింహాసనం అదిష్టించి ఉంటే, ధృతరాష్ట్రుడు లేదా పాండురాజు మధ్య వారసత్వ పోరు వచ్చేది కాదు. ఆయన తప్పుకోవడం వల్లే కౌరవ పాండవుల మధ్య విభేదాలు తలెత్తి, చివరకు అది ప్రపంచాన్నే మార్చిన కురుక్షేత్ర మహా సంగ్రామానికి దారి తీసింది. ఇంకొక ముఖ్యమైనది నాలుగవది వంశవృక్షం మార్పు అనేది. భీష్ముడి ప్రతిజ్ఞ కారణంగానే కురువంశాన్ని నిలబెట్టడానికి ' నియోగ పద్ధతి ' ద్వారా వ్యాస మహర్షిని పిలవాల్సి వచ్చింది. దీనివల్ల కురువంశ రక్తసంబంధం తీరు మారిపోయింది. 

భీష్ముడి ప్రతిజ్ఞ ఆయన పితృభక్తికి నిదర్శనం అయినప్పటికీ, అది హస్తినాపురానికి రక్షణ కవచంలా కాకుండా, ఆ వంశం అంతరించి పోవడానికి ఒక పరోక్ష కారణంగా మిగిలిపోయింది. అందుకే అంటారు - కొన్ని త్యాగాలు చరిత్రను కాపాడితే, మరికొన్ని చరిత్రను మార్చి వేస్తాయని. 

సరే! భీష్ముడి త్యాగం హస్తినాపురాన్ని అనాథను చేస్తే , అదే భీష్ముడు చేసిన ఒక చిన్నపొరపాటు , ఒక స్త్రీ ఆగ్రహానికి కారణమయింది. ఆ ఆగ్రహమే భీష్ముడి మరణానికి ఎలా దారితీసింది? భీష్ముడిని అంతం చెయ్యడానికి పుట్టిన ఆ శక్తి ఎవరు? వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మహాభారత రహస్యాలకోసం లైక్ చేయండి మరియు సబ్ స్క్రైబ్ చేసుకోండి. 
  

  :: శ్రీకృష్ణుడు గోపబాలురతో కలిసి చల్దులారగించుట ::       శ్రీమద్భావతంలో దశమస్కంధంలోని అత్యంత రమణీయమైన ఘట్టాలలో వనభోజన వృత్తాంతం ఒకటి. అది ...