శరదృతువు వెన్నెల రాత్రి మురళీరవం గోపికల హృదయాలను పరవశింపజేసింది. ఆ మధుర నాదానికి లీనమై, సంసార బంధాలను, దేహాభిమానాన్ని వీడి భగవంతుని చేరడానికి గోపికలు ఆరాటం, పొందిన పరమాత్మానుభవం శ్రీమద్భాగవతంలో మహాకావ్య ఘట్టంగా నిలిచింది.
శరద్రాత్రి పూట బృందావనంలో శ్రీకృష్ణుడు వేణుగానం చేయగానే ఆ నాదముగ్ధులైన గోపికలంతా తమ పనులను, సంసారాన్ని వదిలిపెట్టి స్వామి వద్దకు పరుగెత్తారు. అయితే, కొందరు గోపికలను వారి కుటుంబసభ్యులు ఇళ్లలోనే బంధించారు. బయటకు రాలేని ఆ తరుణులు హృదయపీఠంపైనే మాధవుని నిలుపుకున్నారు. విరహతాపంతో తమ పాపాలను, ధ్యానపరవశత్వంతో పుణ్యాలను క్షయం చేసుకున్నారు. శ్రీకృష్ణుడిని లౌకికమైన ప్రియుడిగా భావించినప్పటికీ, మనస్సును ఆయనలోనే లీనం చేయడం వల్ల వారు సమస్త బంధాల నుండి విముక్తులై ముక్తిని పొందారు.
తరుణుల్ గొందఱు మూలగేహముల నుద్దండించి రారాక త
ద్విరహాగ్నిం బరితాపమొందుచు మనోవీథిన్ విభున్ మాదవుం
బరిరంభంబు సేసి జారుడనుచున్ భావించియుం జొక్కి పొం
దిరి ముక్తిన్ గుణదేహముల్ విడిచి ప్రీతిన్ బంధ నిర్ముక్తలై
కొందరు యువతులు ఇళ్లలోనే బంధించబడి బయటకు రాలేకపోయారు. శ్రీకృష్ణుని విరహమనే అగ్నితో తీవ్ర పరితాపం పొందుతూ, తమ మనస్సులోనే మాధవుని ఆలింగనం చేసుకున్నారు. ఆయనను జారుడు (ప్రియుడు) అని భావించినప్పటికీ, ఆయనలోనే తన్మయత్వాన్ని పొంది, గుణమయమైన దేహాలను వీడి, సర్వబంధాల నుంచి విముక్తులై ముక్తిని పొంది పరమాత్మలో ఐక్యమయ్యారు.
తమ సర్వస్వాన్నీ త్యజించి అర్ధరాత్రి వేళ తన వద్దకు చేరిన గోపికలను చూసి స్వామి మందహాసంతో ఎదురేగాడు. వారి నిష్కామ ప్రేమను లోకానికి చాటడానికై, వారిని పరీక్షించదలచి ధర్మబోధ చేయడం ప్రారంభించాడు.
మేలా మీకు? భయంబు పుట్టదు గదా! మీ మందకున్? సింహశా
ర్దూలానేకప ముఖ్యముల్ దిరిగెడిన్ దూరంబు లేతెంతురే?
యేలా వచ్చితిరీ నిశాసమయమం? దిచ్చోట వర్తింతురే?
చాలుంజాలు లతాంగులార! చనుడీ సంప్రీతితో మందకున్
ఓ లతాంగులారా! మీకు క్షేమమేనా? మీ రేపల్లెలో ఎటువంటి భయమూ లేదు కదా! సింహాలు, పులులు, ఏనుగులు తిరిగే ఈ అడవిలోకి అంత దూరం నుండి ఎందుకు వచ్చారు? ఈ అర్ధరాత్రి వేళ ఇక్కడ ఉండడం తగునా? చాలు చాలు, ఇక సంతోషంగా మీ ఇళ్లకు తిరిగి వెళ్ళండి" అని కృష్ణుడు పలికాడు. ముందూ వెనుకా రక్షణ లేని అడవిని చూపించి, కులస్త్రీలకు పతిసేవే పరమధర్మమని, కాబట్టి తిరిగి మందకే వెళ్ళమని హితవు పలికాడు.
శ్రీకృష్ణుని కఠిన వాక్యాలకు గోపికలు దిగ్భ్రాంతి చెందారు. ఆ క్షణంలో వారిలో 'స్వామి మా కోసమే వేణుగానం చేశాడు' అనే చిన్న అహంకారం తలనెత్తింది. అది గుర్తించిన కృష్ణుడు వెంటనే అంతర్ధానమయ్యాడు. స్వామి విరహంతో గోపికలు మైమరిచి, ప్రకృతిలోని ప్రతి చెట్టునూ, లతనూ దీనంగా వేడుకోసాగారు.
పున్నాగ! కానవే పున్నాగ వందితు; దిలకంబ! కానవే తిలకనిటలు
ఘనసార! కానవే ఘనసార శోభితు; బంధూక! కానవే బంధుమిత్రు;
మన్మథ! కానవే మన్మథాకారుని; వంశంబ ! కానవే వంశధరుని;
జందన! కానవే చందన శీతలు; గుందంబ! కానవే కుందరదను;
నింద్రభూజమ! కానవే యింద్రవిభువు, గువల వృక్షమ! కానవే కువలయేశు
బ్రియకపాదప! కానవే ప్రియవిహారు; ననుచుగృష్ణుని వెదకిరయ్యబ్జముఖులు
ఆ పద్మముఖులు శ్రీకృష్ణుని అన్వేషిస్తూ ప్రకృతిని ఇలా అడిగారు: "ఓ పున్నాగ వృక్షమా! పురుషోత్తములచే పూజలందుకునే కృష్ణుడిని చూశావా? ఓ తిలక వృక్షమా! సుందరమైన తిలకం దిద్దిన నుదురు గల స్వామిని చూశావా? ఓ కర్పూర వృక్షమా! శోభిల్లువాడిని చూశావా? ఓ బంధూకమా! బంధుమిత్వుడైన కృష్ణుడిని చూశావా? ఓ మన్మథ చెట్టా! మన్మథుని వంటి రూపు గలవాడిని చూశావా? ఓ వెదురు వృక్షమా! వంశధరుడైన మురళీధరుని చూశావా? ఓ చందన వృక్షమా! గంధమువలె చల్లనైనవాడిని చూశావా? ఓ మొల్లచెట్టా! మల్లెమొగ్గల వంటి దంతాలు గలవాడిని చూశావా? ఓ పారిజాతమా! ఇంద్రునికి కూడా ప్రభువైనవాడిని చూశావా? ఓ నల్లమద్ది చెట్టా! భూమికి ప్రభువైనవాడిని చూశావా? ఓ ప్రియక వృక్షమా! ప్రియముగా విహరించే నల్లనయ్యను చూశావా?" అంటూ అడవిలోని ప్రతీ మొక్కను అర్ధించారు.
కృష్ణుని దివ్య రూపాన్ని తమ హృదయాల్లో నింపుకున్న గోపికలు, ఆ రూపాన్నే ప్రకృతి సిద్ధమైన పొదలలో వెతుక్కుంటూ మల్లెపొదలను వేడుకున్నారు.
నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై
జల్లెడువాడు మౌళిపరిసర్పిత పింఛమువాడు నవ్వు రా
జిల్లెడు మోమువాడొకడు చెల్వల మానధనంబు దెచ్చెనో
మల్లియలార! మీ పొదలమాటున లేడుగదమ్మ చెప్పరే?
"ఓ మల్లెలారా! ఆయన నల్లని మేనిఛాయ కలవాడు, తామర రేకుల వంటి కన్నులు ఉన్నవాడు, దయా రసాన్ని కురిపించేవాడు, శిరస్సుపై నెమలిపింఛం అలంకరించుకున్నవాడు, చిరునవ్వులు చిందించే ముఖము కలవాడు. మనోహరమైన ఆ చోరుడు మా మానధనాన్ని దోచుకుని వచ్చి మీ పొదల మాటున దాక్కున్నాడేమో చూడండి, నిజం చెప్పండి అమ్మలారా!" అని ప్రార్థించారు. ఈ విధంగా గోపికలు తమ అహంకారాన్ని పూర్తిగా వీడి, శరణాగతి పొంది విరహ వేదనలో మునిగిపోయారు.
గోపికల అహంకారం తొలగి, వారిలో సర్వస్వం కృష్ణార్పణమనే నిష్కామ భక్తి ప్రకాశించిన క్షణాన, కరుణామయుడైన శ్రీకృష్ణుడు వారి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. వారి నిర్మలమైన ప్రేమకు దాసుడై, వారిని ఓదారుస్తూ ఈ విధంగా పలికాడు.
బాయని గేహ శృంఖలలబాసి నిరంతర మత్పరత్వముం
జేయుచునున్న మీకు బ్రతిసేయ యుగంబులనేర; నన్
బాయక కొల్చు మానసము ప్రత్యుపకారముగా దలంచి నా
పాయుట దప్పుగా గొనక భామినులార! కృపన్ శమింపరే!
"ఓ భామినులారా! వీడని సంసారమనే బంధాలను తెంచుకుని, నిరంతరం నాపైనే మనస్సు నిలిపిన మీకు నేను యుగాల తరబడి సేవ చేసినా ప్రత్యుపకారం చేయలేను. నన్ను విడువక కొలిచే మీ పవిత్ర హృదయమే నాకు గొప్ప బహుమతి. నేను మిమ్మల్ని వదిలి అంతర్ధానమవడం మీ భక్తిని పరీక్షించడానికే తప్ప వేరు కాదు. నా చిన్న తప్పును క్షమించి, మీ దయాగుణంతో శాంతించండి" అని శ్రీకృష్ణుడు ప్రార్థించాడు.
ఈ విధంగా, జీవాత్మలైన గోపికలు తమ దేహాభిమానాన్ని, అహంకారాన్ని వదిలి పరమాత్మయైన శ్రీకృష్ణునితో ఐక్యమై ముక్తిని పొందారు. శరద్రాత్రి వేళ సాగిన ఈ పవిత్ర ఘట్టం భక్తిరస అమృతవర్షిణిగా నిలిచింది.