28, మార్చి 2023, మంగళవారం

 చరణ శరణాగతి తత్వం  - ఒక కథ

అది అడవి.  మేకలు, గొర్రెలు మేతకు వెళ్ళాయి. ఒక మేక మేత మేస్తూ ఒక తీగలో చిక్కుకుంది.  దాని లోంచి బయట పడలేకపోయింది.  చీకటి పడింది.  అన్ని మేకలూ తలోదిక్కూ వెళ్ళిపోయాయి.  ఈ మేక చిన్నగా తీగలోంచి బయటపడింది. చిన్నగా అటూ ఇటూ తిరిగి ఒక సరస్సు ఒడ్డుకు చేరింది.  చాలా భయపడుతోంది.  అనాథ అయింది.  దానికి అక్కడ తడి మట్టిపై, సింహపు కాలిముద్ర కన్పించింది.  దాన్ని పట్టుకుని కూర్చుంది.  దాన్నే శరణువేడుకుంటోంది. (చరణ శరణాగతి)


ఇంతలో నక్కలు, తోడేళ్ళూ తినడానికి ముందుకు vachchaayi.  వాటితో మేక " నేను ఎవరిని శరణు పోందానో చూడండి... తరువాత నన్ను తినండి " అన్నది.  అవి సింహం కాలిగుర్తు బాగా చూసాయి.  ' దీని వెనుక రక్షగా సింహం ఉంది.  అమ్మబాబోయ్' అని పారిపోయాయి. 


చివరిగా ఈ కాలిగుర్తుగల సింహమే వచ్చి, తినబోయింది.  ఒంటరిగా ఏం చేస్తున్నావని మేకను అడిగింది.  " నా ప్రభువును ధ్యానిస్తున్నా, ఈ ముద్ర చూడు.  వీరు నా ప్రభువు.  వీరి శరణు జొచ్చాను, చూడు  " అంది.  సింహం ఆ గుర్తును చూసి, ఆ కాలి గుర్తు తనదేనని, తనను శరణుజొచ్చిందని తలచి, " నీవిక నిర్భయంగా ఉండు " అని అభయమిచ్చింది. 


ఆ ప్రాంతానికి ఏనుగు వస్తే, సింహం పిలిచింది... " రోజూ ఈ మేకను వీపుపై ఎక్కించుకుని అడవికి తీసికెళ్ళు.  మేపుకొని రా " అని ఆదేశించింది.  ఏనుగు అలాగే చేసింది.  " చరణ శరణాగతి పొందిన మేక జీవితం ఆనందంగా గడిచింది.  ఇది చరణ శరణాగతితత్వం అంటే.  కనుక ఏకాగ్ర చిత్తంతో భగవంతుని పాదపద్మాలపై మనస్సు లగ్నం చేస్తే, మోక్షం లభిస్తుంది.  ఇదే చరణ శరణాగతి.

26, మార్చి 2023, ఆదివారం

 తెలుగుమాసాలు - విలాసాలు:

పౌర్ణమి నాటి నక్షత్ర నామమే మాస నామము 

1. చిత్తా నక్షత్ర యుక్త పౌర్ణమి                                        ..                చైత్రమాసం 

2. విశాఖా నక్షత్ర యుక్త పౌర్ణమి                                    ..                 వైశాఖమాసం 

3. జ్యేష్టా నక్షత్ర యుక్త పౌర్ణమి                                      ..                 జ్యేష్టమాసం 

4. ఉత్తరాషాఢా నక్షత్ర యుక్త పౌర్ణమి                           ..                 ఆషాఢమాసం 

5. శ్రవణా నక్షత్ర యుక్త పౌర్ణమి                                    ..                 శ్రావణమాసం 

6. పూర్వాభాద్రా నక్షత్ర యుక్త పౌర్ణమి                         ..                  భాద్రపదమాసం 

7. అశ్వనీ నక్షత్ర యుక్త పౌర్ణమి                                   ..                  ఆశ్వయుజమాసం 

8. కృత్తికా నక్షత్ర యుక్త పౌర్ణమి                                   ..                   కార్తీకమాసం 

9. మృగశిరా నక్షత్ర యుక్త పౌర్ణమి                              ..                   మార్గశిరమాసం 

10.పుష్యమీ నక్షత్ర  పౌర్ణమి                                         ..                    పుష్యమాసం 

11.మఖా నక్షత్ర యుక్త పౌర్ణమి                                   ..                    మాఘమాసం 

12.పూర్వఫలుణీ నక్షత్ర యుక్త పౌర్ణమి                     ..                     ఫాల్గుణమాసం 

13, మార్చి 2023, సోమవారం

 అష్టవిధనాయికలు: 

(6). కలహాంతరిత

ఉ.   కోపకషాయితాక్షి యగు కోమలి మూర్ఖత ప్రాణనాథునిన్ 

        ప్రోపరియైన వాని తన పొత్తును కోరెడువాని ధూర్తయై 

         దాపట నిల్పగా పరులు తామసమున్ నిరసించు బిట్టు సం 

         తాపము చెందు నాతియె కదా కలహాంతరితాఖ్యయౌ దగున్. 

(7). ప్రోషితభర్తృక

ఉ.    కాంతుడు దూరదేశమున కార్యభరంబున గల్గు నొత్తిడిన్ 

         సుంతయు పత్నిపై మనసు జూపక నింటికిరాని హేతువై 

         యింతికి నెంతయున్ దిగులె యేర్పడి యాతనికై తపించుచున్ 

         పొంతయు గోరు భామినిని ప్రోషితభర్తృక యండ్రు ధారుణిన్. 

(8). అభిసారిక 

ఉ.    ప్రేమకు లొంగి చంద్రముఖి ప్రేయము శ్రేయము నుజ్జగించుచున్ 

          నేమము లేని శీలమున నెమ్మది ప్రేమికుడెన్ను తావుకున్ 

          కామినియై రహస్యముగ గమ్యము జేరునె వారి నెంచకే 

          ధామము వీడిపోవు వనితన్ అభిసారిక యందు రెల్లరున్. 

                                                                 రచన: క్రొవ్విడి వేంకట రాజారావు 

 అష్టవిధనాయికలు:

(3). విరహోత్కంఠిత

ఉ.   నాథుడు దూరదేశముల నాశ్రయమొందగ పోవగా మదిన్ 

        బాధితయై మనోహరి యపార వియోగ విలక్షణాకృతిన్ 

        వేధను దూరుచున్ విరహవేదన తాళక నశ్రుసారసాం 

        బోధిని మున్గి తేలుచును బోరన నేడ్చెడు నాతి యీమెయే. 

(4). విప్రలబ్ధ  

ఉ.   కూరిమితోడ కూడెదము కొంచెమునైనని జాగుసేయకో 

        వారిజలోచనా యనుచు బాళిగ పల్కిన యిష్టుడాయమన్ 

        చేరక యుండుటన్ తరుణి చిందఱవోవుచు రేతిరంతయున్ 

        కోరికమేర నారయుచు కోమలి బేల్పడె విప్రలబ్ధగా! 

(5). ఖండిత

ఉ.   నిండగు గారమున్ సరదు ప్రేమికుడాయెడ మోజు గూడగా 

        మెండుగ రాతిరంతయును మీఱుచు వేరొక కాంతతోడ తా 

        నుండియు వేడ్కగా తిరుగ నుగ్మలి కాగ్రహముప్పతిల్లగన్ 

        ఖండితయౌచు క్రుంగినది కాలమహత్వపు కేళిలో నటన్. 

                                                                       రచన: క్రొవ్విడి వేంకట రాజారావు  

7, మార్చి 2023, మంగళవారం

 సుజనా శతకము - కందపద్యములు: 


1.  పలికెడి వాచకములకును / చలిపెడి పనులకు పొరపులు సంభవమగుచో 

     పలుకులవి పలుకు వానిని / ఇలను వసించెడి జనమ్ము లెంచరు సుజనా! 


2.  తెల్లబడెడి కురులెప్పుడు / వెల్లడి జేయును నిరతము పెరిగెడి వయసున్ 

     ఉల్లమున బెర్గు దెలివిడి / తెల్లనగు నెఱకల వలన తెలియదు సుజనా! 


3.  ఎప్పుడు శంకలు గలిగిన / నప్పుడె పరిజనము తోడ ననువున దానిన్ 

     చప్పున సమీక్ష జేసిన / తప్పక సందిగ్ధమంత తఱుగును సుజనా! 


4.  జోకను గూడిన గుణములు / తేకువ నొందుచు పొదలెడి తీరున నిలుపన్ 

     వీకను నెక్కొన జేయుచు / తాకించును మిసిమి నెపుడు ధరణిని సుజనా! 


5.  మాటల నుంచిన కోపము / చాటున నుంచుము చలిపెడి చర్యల లోనన్ 

     మాటల చేతల నుంచుము / నీటుగ ననురతి వలపులు నిరతము సుజనా! 

                                                      

                                                                 రచన: క్రొవ్విడి వేంకట రాజారావు 

అష్టవిధ నాయికలు:

(1). స్వాధీనపతిక/స్వాధీన భర్తృక

ఉ.   సౌరగు రూపునన్ పతి వశంవదు జేసియు సంతసించుచున్ 

        నేరిమితో మనోహరుని నెమ్మది సుస్థితయౌచు నిచ్చలున్ 

        మారుని తీరునన్ తనదు మాటను మీరక జేయు నింతి నే 

        పారు నధీనమౌ పతిని పట్టిన భార్యగ లోకమందునన్. 


(2). వాసవసజ్జిక

 ఉ.   రూపసియైన నబ్జముఖి రోచి సురత్న సువర్ణ భూషణల్ 

         కోపుగ దాల్చి వల్లభుని కూర్మిని పొందెడు లక్ష్యసిద్ధికై 

        యోపికతోడ ధామమున నొమ్మిక గూడగ వేచి చూచుచున్

        వ్యాపకదూరయౌ సతియె వాసవసజ్జిక నాయికాఖ్యయౌ. 

                                                                    రచన: క్రొవ్విడి వేంకట రాజారావు 


6, మార్చి 2023, సోమవారం

 కాలయానం: 

    సాధారణంగా సూర్యోదయం తూర్పున, సూర్యాస్తమయం పడమరన జరుగుతుందని అందరూ అనుకొంటారు. 

ఉత్తరాయణం - సూర్యగమనం 

మకర సంక్రమణం - జనవరి నుండి జూలై వరకు 

    జనవరి నుండి జూలై మధ్య కాలంలో భూపరిభ్రమణం వలన సూర్యగమనం తూర్పు నుండి ఆగ్నేయం వరకు మారి తిరిగి ఆగ్నేయం నుండి తూర్పుకు వచ్చును. ఫలితంగా సూర్యోదయ దిశలు మారుచుండును. ఈ కాలంలో సూర్యోదయం, మొదటి మూడు మాసములు తూర్పునుండి దినదినం అగ్నేయం వైపు మారుతూ మూడవ మాసాంతమున, ఆగ్నేయాన్ని చేరుకుని, తిరిగి అగ్నేయము నుండి క్రమక్రమంగా తూర్పుకు మారును. 

దక్షిణాయనం - సూర్యగమనం 

కర్కాటక సంక్రమణం - జూలై నుండి జనవరి వరకు 

    జూలై నుండి జనవరి మధ్య కాలంలో భూపరిభ్రమణం వలన సూర్యగమనము తూర్పు నుండి ఈశాన్యదిశగా మారి తిరిగి ఈశాన్యం నుండి తూర్పుకు వచ్చును. ఫలితంగా సూర్యోదయ దిశలు మారుచుండును. ఈ కాలంలో, సూర్యోదయం మొదటి మూడు మాసములు తూర్పునుండి దినదినం ఈశాన్యం వైపు మారుతూ మూడవ మాసాంతమున ఈశాన్యాన్ని చేరుకుని, తిరిగి ఈశాన్యం నుండి క్రమక్రమంగా తూర్పుకు మారును. 

                                                                                సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

 జీవనస్రవంతి: 

" దంతసిరితోనే గుండె పదిలం " 

    ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తోన్న మరణాల్లో మూడింట ఒక వంతు హృద్రోగాల వల్లేనని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే హృద్రోగ కారణాలను అనేక కోణాల్లో పరిశీలించినప్పుడు - వాటికీ నోటిలోని బాక్టీరియాకీ సంబంధం ఉందని చెబుతున్నారు స్విట్జర్లాండుకు చెందిన నిపుణులు. ఇందుకోసం వీళ్ళు రక్త ప్రసరణకు అడ్డుపడుతున్న క్లాట్సును సేకరించి పరిశీలించారట. జన్యువులు, కాలుష్యం, ధూమపానం, బిపి, మధుమేహం, కొవ్వులు... ఇలా యెన్నో గుండె జబ్బులకు కారణ మవుతున్నాయి. వీటితోబాటు కొన్ని రకాల బాక్టీరియా, వైరస్ ల వల్ల తలెత్తే ఇన్ ఫ్లమేషన్ కూడా హృద్రోగాలకు దారితీస్తున్నట్లు గుర్తించారు. దాంతో గుండె సమస్యలున్న నాలుగువేల మందిని పన్నెండేళ్ళపాటు పరిశీలించినప్పుడు - అందులో చిగుళ్ళ వ్యాధుల్ని కలిగించే 'ప్యుసాబాక్టీరియం న్యూక్లియాటం ' అనే బాక్టీరియా వల్ల గుండె జబ్బుల ప్రమాదం మరింత ఎక్కువవుతున్నట్లు తేలిందిట. ఇది ముందుగా దంతాల్లో ఇన్ ఫెక్షన్ కు కారణమై అక్కడినుంచి నేరుగా గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడడానికి కారణమవుతున్నట్లు గుర్తించారు. కాబట్టి దంత సమస్యలున్న వాళ్ళకి హృద్రోగం వచ్చే ప్రమాదం మరింత ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త! 

                                                                                            సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

 :: అహం ::

    త్రికాలవేది, మహాజ్ఞాని అయిన ఒక అద్భుత శిల్పికి అంతిమసమయం దగ్గర పడింది. తన ప్రాణాలను హరించడానికి యమదూతలు ఏ క్షణంలోనైనా రావచ్చని తెలిసింది. 

    ప్రాణతీపితో...ఆ శిల్పి...యమదూతల్ని తికమకపెట్టి ఉట్టి చేతులతో పంపడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. మైనంతో అచ్చం తనలాగే ఉండే తొమ్మిది బొమ్మల్ని చేసి, యమదూతలు వచ్చే సమయానికి వాటిలో ఒకడుగా నిలబడ్డాడు. యమదూతలు వచ్చారు. బొమ్మల్ని చూశారు. ఆకారంలో...పోలికలలో ఏమాత్రం తేడా లేకుండా ఉండే ఆ బొమ్మలలో ప్రాణం తీయవలసిన శిల్పిని ఎలా గుర్తించాలో అర్థం కాలేదు. వాళ్ళు వెనుదిరిగి వెళ్ళి యముడికి చెప్పారు. యమధర్మరాజు మారువేషంలో స్వయంగా వచ్చాడు. శిల్పి నైపుణ్యానికి అబ్బురపడ్డాడు. ఎలా శిల్పిని గుర్తించడం? ఏ బొమ్మమీద పాశం విసిరినా ...అది శిల్పి కాకపోతే ...శిల్పికి మరణం తప్పే అవకాశం ఉంది. అది తన ధర్మశాస్త్రానికే విరుద్ధం. అందుకని ఎలాగైనా శిల్పిని బయటకు లాగాలని ప్రయత్నించాడు. 

    బ్రాహ్మణ వేషంలోని యముడు శిల్పాలను పరిశీలనగా చూస్తూ ..." ఆహా! ఏమీ! ఈ కళానైపుణ్యం!ఏ దేవ, గరుడ, గంధర్వ కిన్నెర కింపురుషాదులో శాపవశాన ఏకరూపులో ఇక్కడ నిలబడ్డారా అనిపిస్తుంది. అతి సూక్ష్మమైన తేడా ఏమాత్రం లేకుండా అచ్చుగుద్దినట్లుగా అన్నీ ఒకే రకంగా...జీవం ఉట్టిపడేలా ఉన్నవి. వీటిని విశ్వకర్మనో, మయుడో నిర్మించి ఉండాలి తప్ప మానవ మాత్రునికి సాధ్యమయ్యే పనికాదు" అన్నాడు. 

    అనగానే...శిల్పికి చర్రున కోపం వచ్చింది. కోపం ఏమాత్రం ఆపుకోలేక పోయాడు. " ఓ పిచ్చి బ్రాహ్మడా! చేసింది నేనైతే...వాళ్ళెవరో చేశావంటావేమిటి? పైగా మనిషికి అసాధ్యం అంటావేమిటి? ...ఇదిగో...నేను మనిషినే...నేనే చేశాను... వీటిని " అన్నాడు. 

    యముడు ఫకాల్న నవ్వి నిజరూపం దాల్చి పాశం వేసి శిల్పి ప్రాణాలు హరించాడు. 

                                                                                   సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 


5, మార్చి 2023, ఆదివారం

 2వ తేదీన పుట్టినవారు: 

    ఏ నెలలోనైనా 2వ తేదీన పుట్టినవారు చాతుర్యము, సహకారము, రాజకీయతంత్రజ్ఞత, సహజసిద్ధమైన శాంతిస్థాపకత్వాలు కలిగి ఉంటారు. వ్యక్తిగతమైన హోదాలో కంటే సమూహంలో వీరెక్కువగా పనిచేయగలరు. వీరికి సంగీతము, జంత్ర తాళ గానములందు ప్రేమ, వీటిలో చెప్పుకొనదగినంత పాండిత్యము కూడా ఉంటుంది. కళాత్మకము, సౌందర్యాత్మకములగు వస్తువుల పట్ల వీరు స్వభావసిద్ధమైన గ్రహణశక్తి కలిగి ఉంటారు. ఉద్రేకస్వభావము గలవారు గాన పరిసరముల పరిస్థితుల ననుసరించి ఒడిదుడుకులకు లోనగుచుందురు. 

    వీరు సులభంగా యితరులతో స్నేహం చేసుకోగలరు. వీరిని అందరూ మెచ్చుకొనుచుందురు. అవకాశం ఉన్నంతవరకు అప్పుడప్పుడు కలుగుచుండెడి నిరాశ నిస్పృహలనుండి వీరు తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేయాలి. వీరికి లోతుగా ప్రేమించే స్వభావం ఉన్నందువల్ల యితరుల ప్రేమను వాంఛించుచుందురు. అది వీరికి అవసరము కూడాను. వీరిని గురించి, వీరి శక్తి సామర్థ్యములను గురించి, వీరు తక్కువ వెలకట్టుకొనుటకు యిష్టపడుటే గాక, ఒక్కొక్కప్పుడు అతి సామాన్య వ్యక్తిగా ఉండిపోయే ప్రమాదం కూడా కలదు. వీరు యితరులకు భాగస్వాములుగా ఉండుటకు సర్వవిధములా ఉత్తములు. 

    రాజకీయవేత్త, రాజ్యాంగవేత్త, కలక్టరు, జమాఖర్చు లెక్కలు వ్రాయుట, స్టెనోగ్రాఫరు, లోకస్థితి గణనము చేయు పరిశోధకుడు, పోలీసు అధికారి మొదలైన వృత్తులలో విజయము గాంచగలరు. సంగీతము, నటన, శిల్పము, కవిత్వము మొదలగు లలిత కళలను వీరు అభ్యసించవచ్చును. 

                                                                      సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 


 సమస్యాపూరణలు:

(1).  " వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్ " 

కం.  వెధవయె రాజ్యము నేలుచు 

        అధికాధికముగ మకురుల నడరగ జేయన్ 

        అధమపు పాలన వెలయుచు 

        వెధవలు సెలరేగిరంట వేలకొలదిగన్. 


(2).  " వెధవలు పెచ్చురేగిరట వేలకొలంది శకార రూపులై " 

చం.   వెధవయె రాజ్యమేలుచు ప్రవీణత జూపగలేక తోడుగా 

           నధమమునౌ క్రియల్ నడపి నాగడమెంచెడి మూర్ఖులందరిన్ 

           నధికుల జేసి దేశమున నల్దిశలన్ వెలిగింపజేయగా 

           వెధవలు పెచ్చురేగిరట వేలకొలంది శకార రూపులై. 


                                                       పూరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 


4, మార్చి 2023, శనివారం

 మీకు తెలుసా?

మాతృత్వం: 

    చెడు చేసే తండ్రి ఉండవచ్చు. చెడు చేసే అన్నదమ్ములు ఉండవచ్చు. అక్కచెల్లెళ్ళు ఉండవచ్చు. కానీ సృష్టిలో చెడు చేసే అమ్మ మాత్రం ఉండదు. వేల సంవత్సరాల మానవ మనుగడ సంస్కృతిలో అన్ని యుగాలలోనూ అందరూ ముక్తకంఠంగా అంగీకరించిన వాస్తవం. ఎందుకంటే అది అనుభవైక వేద్యం కాబట్టి. సృష్టిలో ప్రతిదానికి పర్యాయం ఉన్నది. ఒక్క అమ్మ ప్రేమకు తప్ప. అందుకే ఒక కవి అన్నాడు- 

అమృతానికి, అర్పణకు అసలు పేరు అమ్మ

                                              అనుభూతికి ఆర్ధ్రతకు ఆనవాలు అమ్మ 

                                             ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ 

                                             ఈ లోకమనే గుడి చేరగ తొలి వాకిలి అమ్మ 

    మాతృత్వానికి మధురమైన, మరపురాని, మనోహరమైన నిర్వచనమనదగిన జీవి ఈ సృష్టిలో ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఆ జీవి తేలు. తేలు సంతానోత్పత్తి ప్రక్రియ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దాని గర్భాశయంలో వందలాది అండాలు ఫలదీకరణ చెంది పూర్తి రూపాన్ని సంతరించుకున్న అనంతరం ... అవి....తల్లి ఉదరాన్ని చీల్చుకుని బయటకు వస్తాయి. అంటే, ప్రసవానంతరం తల్లి తేలుకు జీవితం లేనట్లే. 

    ప్రతి జీవికి మధురాతి మధురమైన మాతృత్వం తేలుకు మాత్రం మాతృ శాపం. "మాతృత్వం" పద నిర్వచనానికి తేలు జీవితం పరాకాష్ఠ అని చెప్పవచ్చు. 

                                                                 సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 



 శ్రీ వేంకటేశ్వరస్వామిపై ఒక సీసపద్యం: 

'ఉత్తారణా' యంచు నుగ్గడించగ నిన్ను / వర్తకమ్మున లబ్ది వశము చెందు 

'అచ్యుతా' యంచు నిన్నామతించిన యంత / ఆరోగ్యమెంతయు నడరు చెందు 

'బలభద్ర' యని నిన్ను బాగుగా పిలిచిన / ధనముతో మనుగడ తళుకు చెందు 

'నరసింహ' యను నీదు నామమ్ము జపియించ / భీతి పోవగ మది బిట్టు చెందు 


పేరుకొక్క మేలిమి గూర్చి వెలుగు చుండి / భక్తులందరి బ్రోచుచు పరగు వాడ 

విశ్వ రక్షణ దక్షాయ! విమల చరిత / వేంకటేశాయ తే! నమో వేదవేద్య! 

                                                                  రచన: క్రొవ్విడి వేంకట రాజారావు 


3, మార్చి 2023, శుక్రవారం

మనసులో అనుకున్న అంకెను చెప్పడం:

మీరు పైకి చెప్పకుండా మనసులో ఒక అంకెను అనుకోండి. దానిని 2 తో హెచ్చవేయండి. వచ్చినదానికి 2 కలపండి. ఆ మొత్తాన్ని 5 తో హెచ్చవేయండి. వచ్చిన విలువకు మరల 5 కలపండి. ఆ మొత్తాన్ని 10 తో హెచ్చించండి. తరువాత 10 కలిపి వచ్చిన అంకెను నాకు చెబితే మీరు మనసులో అనుకున్న అంకెను నేను చెప్పగలను. ఎట్లా అంటారా?

ఉదాహరణ చూడండి: నేను మనసులో 2 అనుకున్నాను. దానిని 2 తో హెచ్చించండి. 4 వచ్చింది. దానికి 2 కలపండి. 6 అయింది. దానిని 5 తో హెచ్చవేయండి. 30 వచ్చింది. దానికి 5 కలపండి. 35 అయింది. దానిని 10 తో హెచ్చించండి. 350వచ్చింది. (వచ్చిన మొత్తానికి పక్కన 0 పెడితే 10 తో గుణించిన ఫలితం వస్తుంది కదా!) దానికి 10 కలిపితే 360.

( 2 X 2 = 4 + 2 = 6 X 5 = 30 + 5 = 35 X 10 = 350 + 10 = 360 ) ఇది లెక్క. మీరు కళ్ళుమూసుకుని ఒక్క క్షణం ఆలోచించినట్లు నటించి వెంటనే 2 అని చెప్పండి.

ఇందులో ఉన్న రహస్యం:

  1. ఎవరు ఏ అంకెను కోరుకున్నా, పైవిధంగా లెక్కించినప్పుడు చివరి రెండు అంకెలు తప్పనిసరిగా 60 తో అంతమవుతాయి. వారు చెప్పిన దాంట్లో చివరకు 60 రాకపోతే వాళ్ళు లెక్కించడంలో తప్పుచేసినట్లే!
  2. మీరు చేయవలసింది - ఆ చివరి 60 ని వదిలి మిగిలి యున్న అంకెలో నుండి 1 తీసివేస్తే ఎదుటి వారు అనుకున్న అంకె వస్తుంది.
  3. పై ఉదాహరణలో - చివరకు వచ్చినది 360. ఇందులో చివరి 60 ను వదిలివేసి మిగిలిన 3 నుండి 1 తీసివేయగా మనసులో అనుకున్న 2 వస్తుంది. ( 3(60) = 3-1=2 )
  4. అలాగే 460 కు 3; 560 కు 4; 1060 కు 9; 5660 కు 55; -అలా అన్నమాట.
  5. ఈ విధంగా మీరు కూడా చేసి ఎదుటి వారిని ఆశ్చర్యపరచండి.

 సమస్యాపూరణలు:  దత్తపదులు: 

(1). " పేపరు - పెన్ను - బుక్ - ఇంకు " - పదాలను ఉపయోగిస్తూ భారతార్థంలో నచ్చిన

          ఛందస్సులో పద్యం.

ఉ.     బుక్కుపేపరున్ తెఱచి పొందగు రీతిని నింకు పెన్నునన్ 

          చక్కగ నింపి యర్జునుని సాహసకృత్యము లేర్చి కూర్చుచున్

          చొక్కమునైన పద్ధతిని సూతసుతుండగు కర్ణు నాజిలో

          చక్కడగించు ఘట్టమును చందుగ వ్రాసె నతండు జూడుమా! 


(2).  " అల - కల - వల - నెల " - పదాలను అన్యార్థంలో ఉపయోగిస్తూ రామయణార్థంలో 

          నచ్చిన ఛందస్సులో పద్యం. 

చం.   వలపును వీడి దాశరథి పత్నిని వేగమె పంపకుండుచో 

           అలకను జెంది రాముడు వినాశమొనర్చును లంకకెంతయున్ 

           కలహమునందు నీక్షణమె గావున యా నెలతన్ త్యజించుచున్ 

           నిలుపుము శాంతి నో యనుజ! నీవుగ నంచు విభీషణుండనెన్. 

                                                                      పూరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 



2, మార్చి 2023, గురువారం

సమస్యాపూరణలు: 


(1).  " ఏన్గు చంపనోప దెలుకనైన "

ఆ.వె.   కాలుడు పొలయుచు మృకండు కుమారుని 
            పట్టబోయి వచ్చి భంగ పడెను 
            బాలుడైన నేమి భగుని భక్తుడు గదా! 
            యేన్గు చంపనోపదెలుకనైన. 

(2).  " ఏనుగు చంపజాలదు గదే యెలుకన్ గడు విక్రమించినన్ " 

ఉ.       పూనిన భక్తి నాహరుని పుల్కలు జెందెడి తీరు నాదటన్ 
            థ్యానమొనర్చుచున్ సతము దాస్యము జేయు మృకండు సూనునిన్ 
            జానుగ పట్టబోయి శని స్రగ్గిన తెన్నును జూడ నెంచుచో 
            నేనుగు చంపజాలదుగదే యెలుకన్ గడు విక్రమించినన్. 

                                                              పూరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

 తెలివి ఒకరి సొత్తా.........? 

    ఒక ఊరిలో ఒక పేద పండితుడు ఉండేవాడు. ఒకసారి ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు సంచారం చేస్తూ ఆ పండితుడు ఉన్న గ్రామం వచ్చాడు. పండితుడు తన పాండిత్యంతో ఆ రాజుని మెప్పించాడు. ఆయన వెంటనే ఆ ఊరి కరణంతో ఆ పండితుడికి ఊరి సమీపంలో ప్రవహిస్తున్న వాగు ఒడ్డున సాగు చేసుకోవడానికి భూమిని ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ కరణానికి తనను ఏమాత్రం లెక్కచేయని పండితుడంటే ఒళ్ళుమంట.  అతడు వాగు వెంబడి ఉన్న భూమిని మొత్తం పరికించి సాగుకు ఏమాత్రం అనుకూలంగా లేని పనికిమాలిన అయిదెకరాల భూమిని ఎన్నిక చేసి సాగు చేసుకొమ్మని ఆ పండితుడి పేర ఇనాం రాయించి యిచ్చేశాడు.  

    ఇనాం పట్టా పుచ్చుకొని పొలం లోనికి అడుగు పెట్టిన పండితుడికి, ఆ భూమిని చూడగానే ఏడుపు వచ్చినంత పనైంది. అది తొండలు సైతం గుడ్లు పెట్టని భూమి. ఎందుకూ పనికి రానిది. కరణం చేసిన మోసానికి లోలోపల కృంగి పోయాడు. వాగుకు అటువైపు చూశాడు. చక్కని సారవంతమైన నేల. తనకిచ్చిన ఇనాం పట్టాలో హద్దులు చూశాడు. "ఉత్తరం వాగు" అని రాసి ఉంది. అదిచూడగానే మెరుపు మెరిసినట్లుగా అతనికొక ఆలోచన వచ్చింది. దానిని వెంటనే అమలుపెట్టి, వాగుకు అటు వైపున్న సారవంతమైన భూమిని సాగుచేయడం మొదలుపెట్టాడు. 

    కరణానికి అది తెలిసి ఒళ్ళు మండిపోయింది. వెంటనే రాజు సముఖానికి వెళ్ళి " ఆ పండితుని పొగరుబోతుతనం తమరే వచ్చి స్వయంగా చూడండి " అని ఫిర్యాదు చేశాడు. వెంటనే రాజుగారు హుటాహుటిని కదలి వచ్చారు. పండితుడు సాగుచేస్తున్న భూమిని చూసి కారణం అడిగాడు. 

    పండితుడు అమాయకంగా మొహం పెట్టి " ప్రభూ! పట్టాలో 'ఉత్తరం వాగు' అని రాసి ఉంది. వాగుకు ఉత్తరంగా ఉన్న భూమి అనుకొని దీనిని సాగుచేసుకున్నాను. తప్పయితే మన్నించండి " అన్నాడు. రాజు వాస్తవంగా పండితుడికిచ్చిన భూమిని చూశాడు. అది వ్యర్థమైనదని ఆయనకు అర్థమయింది. అంతలో కరణం చావు తెలివినీ, దానిని చక్కని సమయస్ఫూర్తితో తిప్పికొట్టిన పండితుడి తెలివినీ, అర్థంచేసుకొని, నవ్వుతూ " అదీ...ఇదీ...రెండూ నీకే! దున్నుకో " అన్నాడు ఆనందంగా. కరణానికి నోట మాట రాలేదు. 

                                                                  సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

1, మార్చి 2023, బుధవారం

 1వ తేదీన పుట్టినవారు: 


    ఏ నెలలోనైనా 1వ తేదీన పుట్టిన వారికి దృఢమైన ఇచ్ఛాశక్తి, స్వతంత్రమైన కల్పనాశక్తి, స్వతంత్ర స్వభావం, సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ తేదీలో పుట్టినవారు ప్రతి పనినీ ప్రారంభిస్తారేగాని, దానిని తుదముట్టించేందుకు యిష్టపడరు. వీరు తమ మనోభావములను బయటపెట్టరు. కానీ, సానుభూతి, ప్రశంస, ప్రోత్సాహములను అభిలషిస్తారు.  వీరికి తెలివితేటలు మిక్కుటంగా ఉంటాయి. కాబట్టి, వీరు ఏదో ఒక విషయంలో ప్రత్యేకమైన కృషి చేయడం కంటే పెక్కు విషయాలలో కృషిచేయుట లాభదాయకము. ఏదో ఒక వృత్తితో బాటు ఒక వ్యాపారాన్ని గూడా చేస్తూ ఉండాలి. అనుమానము, అధికారం చెలాయించే స్వభావాలను విడనాడాలి. మనోవికారాలకు వశపడని సునిశితమైన వివేచనాశక్తి గలిగిన వారు వీరు. వీరి వ్యక్తిత్వము ఆదర్శవంతమైనదిగా ఉంటుంది. వీరు ఆచరణతో గూడిన శక్తి సామర్థ్యములు కలిగిన వారుగా ఉంటారు. చూపులకు వీరు ప్రేమగలవారుగా కనిపించరు. కానీ వీరు యితరుల సహవాసమును అభిలషింతురు. వీరికి దయారసము మెండు. ధైర్యము, చొరవ, నాయకత్వ లక్షణములు వీరికి సమృద్ధిగా ఉంటాయి. ఉపాధ్యాయులుగను, పరిశోధకులుగను, వస్తు విక్రేతలుగను, ఇంజనీరులుగను, నూతన కల్పనలు చేయువారిగాను లేదా సృజనాత్మకమగు కల్పనాశక్తితో కూడిన ఏ వృత్తిలోనైననూ వీరు రాణించగలరు. 

                                                                                  సేకరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 


 సమస్యా పూరణలు: 

(1).  " హారము గొలిచిన నది పది యామడ లుండెన్ " 

కం.  శ్రీరాముని నర్చించుచు 

          పారమ్యముగా జరిగిన పౌషము నందున్ 

          పోరామిని నిలిచిన జన 

          హారము గొలిచిన నది పది యామడ లుండెన్. 

(2).  " కవియే మఱి పతనమునకు కారణమగురా " 

కం.   పవిదిని నీతిని జెప్పెడు 

          కవియే మనుజుల పెనుపుకు కారణమగుచో 

          అవినీతిని బోధించెడు 

          కవియే మఱి పతనమునకు కారణమగురా! 

                                                              పూరణ: క్రొవ్విడి వేంకట రాజారావు 

:: రామనవమి ::        లోకకంటకుడై, లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు...